Vijaya Lakshmi
Published on Aug 18 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ధర్మస్థల... ఇప్పుడు మీడియాలో మారుమోగిపోతున్న పేరు. అందరినీ భయంతో వణికిస్తున్న పేరు. ఎంతోమంది అక్కడికెవరూ వెళ్ళకూడదు... వెళ్లొద్దు... వెళితే ఇక అంతే అని నిర్దారించుకుంటున్న పేరు. నిజానికి కర్నాటక రాష్ట్రంలోని ధర్మస్థల అన్న పేరు వినగానే మనసులో ఒక భక్తి భావం, ఒక పవిత్రత, అద్భుతమైన ఆధ్యాత్మిక పులకరింత. పరమ పవిత్రమైన పరిసరాలు, మంజునాథస్వామిగా కళ్ళముందు కదిలే శివయ్య. కథలు కథలుగా వినబడే మంజునాథుని మహిమలు, ఒక్కసారైనా ఆ పవిత్రభూమికి వెళ్లి మంజునాథుడిని దర్శించుకోవాలనే తపన.
అయితే అది గతంలో. ఇప్పుడు ధర్మస్థల అనగానే వందల శవాలు, వేల ఎముకలు, ఎన్నో దారుణాలు, మరెన్నో భయంకరమైన కథనాలు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి.
కర్నాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఆలయ పరిసరాల్లో నేత్రావతి నది ఒడ్డున లెక్కలేనన్ని దారుణాలు, తలచుకుంటేనే ఒళ్ళు జలదరించే అమానుషాలు జరిగాయి అని, ఒకటా రెండా వేల వేల వీడియోలు బయటికొస్తున్నాయి.
ఇవన్నీ నిజాలు కాదు, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారం జరుగుతోంది అని, ఆ క్షేత్ర ప్రాధాన్యతను తగ్గించడానికి జరుగుతున్న కుట్ర అని, మరికొందరి వాదన. ఈ వాద, ప్రతివాదనలు, అక్కడ జరిగాయి అని చెప్పబడుతున్న దారుణాలు నిజంగా, జరిగాయా లేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలేంటీ ధర్మస్థల చరిత్ర.
ధర్మస్థల చరిత్రలో విభిన్న కోణాలు కనబడతాయి. సంప్రదాయం, ఆధ్యాత్మికత, మానవత్వం, నిస్వార్థ సేవ అనే నాలుగు స్తంభాలపై నిలిచి ఉన్న ఒక అపూర్వ క్షేత్రంగా ధర్మస్థల క్షేత్రాన్ని చెప్తారు. ఈ క్షేత్రం వేల సంవత్సరాల చరిత్రను, అనేక అద్భుతాలను తనలో దాచుకుని ఉంది. ఈ ఆలయం ఎనిమిది శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ శివుడు 'మంజునాథ స్వామి' రూపంలో కొలువై ఉన్నాడు, అంటే ఇది ఒక శైవ క్షేత్రం. కానీ ఇక్కడ పూజలు నిర్వహించేది మధ్వ వైష్ణవ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణులు. మొట్టమొదట ఈ ఆలయానికి స్థలమిచ్చినది, ఆలయ నిర్వహణ చూస్తున్నది కూడా జైన ధర్మానికి చెందినవారే. ఈ శైవక్షేత్రంలో శివలింగం, నంది విగ్రహాలే కాకుండా నలుగురు ధర్మ దేవతలు, అలాగే జైనులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. వింటే వింతగా ఉంది కదూ. ఈ ధర్మ దేవతలేవారు. అసలు ఒక శైవ క్షేత్రానికి ఆలయ నిర్మాణానికి బీజం వేసింది ఆలయ నిర్వహణ చూసేది జైనధర్మం వారయితే, పూజలు చేసేది వైష్ణవులు చాలా విచిత్రంగా ఉంది కదా! ఇంత విభిన్న చరిత్ర కలిగిన ఈ క్షేత్ర విశేషాలేంటో చూద్దాం...
కర్నాటక రాష్ట్రంలోని నేత్రావతి నదీ తీరం ధర్మస్థలలో కొలువై ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు మంజునాథుడి రూపంలో దర్శనమిస్తారు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరిండం ఈ శైవక్షేత్రం ప్రత్యేకత.
ధర్మస్థల దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడి తాలూకాలోని మల్లార్మడి గ్రామంలో ఉంది. ప్రాచీనకాలంలో దీనిని “కుడుమ” అని పిలిచేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ జైనధర్మానికి చెందిన బిర్మన్న పెర్గాడే, అతని భార్య అమ్ము బల్లాల్తీ కుటుంబంతో కుటుంబం నెల్లియడి బీడు అనే ఇంట్లో నివసించేవారు. వీళ్లు చాలా ధర్మబద్ధంగా నడుచుకుంటూ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.
ఒక రోజు ఒక నలుగురు ధార్మిక సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని ఆచరించేందుకు తమకు కొంత స్థలం కావాలని ఆ స్థలాన్ని సమకూర్చవలసిన్డిగా బిర్మన్న పెర్గాడే కుటుంబాన్ని కోరారు. వారిని సంతోషంగా ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చారు ఆ కుటుంబం.
ఆ రాత్రి భగవంతుడు వారి కలలో దర్శనమిచ్చి, ఆ వచ్చినవారు ధర్మదేవతలైన కాళరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారి అని చెప్పి, తమ నివాసాన్ని ధర్మాఆచరణలకు అంకితం చేయమని ఆదేశించాడట. దాంతో ఆ దంపతులు నిస్వార్థంగా తమ ఇంటిని ధార్మిక కార్యకలాపాలకు సమర్పించి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు.
మరికొంతకాలానికి ధర్మదేవతలైన శ్రీ కాళ రాహువు, శ్రీ కాలర్కాయి, శ్రీ కుమార స్వామి, శ్రీ కన్యాకుమారి దేవతలకు ప్రత్యేకంగా నాలుగు మందిరాలు నిర్మించాలంటూ భగవంతుని ఆదేశం మీద ఆ జైన దంపతులు మందిరాలు నిర్మించారు.
మందిర నిర్మాణం పూర్తి కాగానే ఇక్కడ పూజలు నిర్వహించేందుకు బ్రాహ్మణులను ఆహ్వానించారు. బ్రాహ్మణులు తాము శివలింగంతో కూడిన ఆలయంలో మాత్రమే పూజలు చేస్తామని చెప్పడంతో, మంగళూరులోని కద్రి మంజునాథ స్వామి ఆలయం నుంచి శివలింగాన్ని తీసుకురావాలని అన్నప్ప స్వామిని నియమించారు. అన్నప్ప తీసుకువచ్చిన ఆ శివలింగాన్ని ధర్మస్థల మధ్యలో ప్రతిష్టించి ఆలయాన్ని అధికారికంగా ప్రారంభించారు.
శివలింగాన్ని తీసుకువచ్చిన అన్నప్ప స్వామికి స్మారకచిహ్నంగా ఆలయం సమీపంలోనే ఒక ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు, ఇది ప్రధాన ఆలయం నుంచి కిలోమీటరు దూరంలో ఉంది. ఈ ప్రాంగణంలో గణపతి ఆలయం కూడా ఉంది.
ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని రోజులకు భీర్మన్న వంశస్థుడైన దేవరాజ హెగ్గడే అనే మరో భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని కలిసి ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించాడు. ఆ వరదరాజస్వామి ఈ ఆలయానికి విచ్చేసి ఇక్కడి శివలింగానికి విశేషమైన పూజలు నిర్వహించి అక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాలను పరిశీలించి.. ఈ క్షేత్రానికి ధర్మస్థల అని పేరు పెట్టారని.. అప్పటి నుంచి ఈ క్షేత్రం ధర్మస్థలగా పేరుగాంచిందని స్థలపురాణం చెబుతోంది.
ఈ ఆలయాన్ని నిర్మించింది బీర్మన్న కావడంతో అప్పటినుంచీ ఆ వంశస్థులే ఇక్కడ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబ పెద్దను ధర్మాధికారిగా పిలుస్తారు. ఆ ధర్మాధికారి ఆలయ బాధ్యతల్ని చూసుకుంటూనే స్థానికులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించే పెద్దగానూ వ్యవహరిస్తాడు. మొట్టమొదట జైన దంపతులు ఏవిధంగా అయితే సేవా, ధార్మిక కార్యక్రమాలే ఊపిరిగా జీవించారో ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ, ఈ ధర్మస్తలకు వచ్చేవారికి లేదనకుండా అన్నదానం చెయ్యడం, ఆ ప్రాంతంలో అవసరమైన వారికి విద్య- వైద్యం-ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు నిర్వహించడం, పేద వారికి పెళ్ళిళ్లు చేయడం, గ్రామాభివృద్ధి లాంటి కార్యక్రమాలు కూఫ్స్స్ నిర్వహించడం ధర్మాధికారి బాధ్యతలుగా పరిగణిస్తారు.
కార్తికమాసంలో ఇక్కడి మంజునాథుని వైభవం చూసి తీరవలసిందే తప్ప మాటలు చాలవు. చూసేందుకు రెండు కళ్ళు చాలనంత శోభాయమానంగా ఉంటుంది ఆధ్యాత్మిక శోభ. కార్తిక మాసంలో లక్షదీపోత్సవంతోపాటు అయిదురోజులు మంజునాథ స్వామికి చేసే ప్రత్యేక పూజలనూ ఆ తరువాత సర్వధర్మ, సాహిత్య సమ్మేళనాల్నీ చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలి వస్తారు.
ఇక్కడ మరో ప్రత్యేకత తులాభారం. భక్తులు మొక్కులు మొక్కుకొని, తమ కోరికలు నెరవేరాక బియ్యం, ఉప్పు, పూలు, బెల్లం, అరటి పండు, నాణేలు ఇలా వివిధ పదార్ధాలతో తులాభారం తూగి స్వామి వారికి మొక్కుబడి చెల్లించుకుంటారు.
ఇక్కడ మరో ప్రత్యేకత అన్నదానం. వచ్చినవారికి లేదనకుండా అన్నదానం జరుగుతుంది. ఈ భోజనశాల పేరు " అన్నపూర్ణ".
ధర్మస్థలలో తప్పక చూడవలసినది మరో విశేషం బాహుబలి క్షేత్రం. ఇది రత్నగిరి కొండ మీద ఉన్నది. 39 అడుగులున్న ఈ ఏకశిలా విగ్రహం 170 టన్నుల బరువు ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి తిరిగి సాయంత్రం 6 నుండి 7 వరకు దర్శించుకోవచ్చు..
శ్రీ మంజునాథ స్వామి ఆలయం ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు తెరుచుకుంటుంది.ముందుగా ఆలయ శుద్ధి జరిగిన తరువాత ఉదయం 6:30 నుంచి 11:00 గంటల వరకూ భక్తులు స్వామిని దర్శించవచ్చు.
ఉదయం 11:30కి మంజునాథునికి నైవేద్యం సమర్పించడంతో అన్నదానం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు. మధ్యాహ్నం 2:15 వరకు దర్శనాలు కొనసాగుతాయి. తిరిగి సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 8:30 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. 8:30కి మళ్ళీ మహాపూజ జరుగుతుంది.
వినాయక చవితి, నవరాత్రులు, కార్తీక మాసం, మహాశివరాత్రి, ఉగాది వంటి పండుగలను ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఏప్రిల్ నెలలో వార్షిక జాతర ధర్మస్థల ఆలయ ప్రత్యేక అంశాల్లో ఒకటి.
ధర్మస్థల మంగళూరుకు సమీపంలో అయితే 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంగళూరు నుంచి బస్సులు లేదా టాక్సీల ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆలయం బెంగళూరు నుంచి 300 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.
రైలు మార్గం: రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే ధర్మస్తలకు సమీప రైల్వే స్టేషన్ మంగళూరు రైల్వే స్టేషన్. మంగుళూరు వరకు రైల్లో చేరుకొని అక్కడి నుంచి టాక్సీల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. బెంగళూరు నుండి 310 కి.మీ దూరంలో ఉన్న క్షేత్ర ధర్మస్థల ఆలయానికి కేబ్ లలో లేదా స్వంత వాహానాలలో కూడా వెళ్ళవచ్చు.
వాయు మార్గం: విమానం ప్రయాణం ద్వారా వెళ్ళాలంటే ధర్మస్తలకు సమీప విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ధర్మస్తలకు 65 కి.మీ దూరంలో ఉంటుంది.
ఆలయ వెబ్ సైట్ లో ఆన్లైన్‌లో వసతి బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే అక్కడ స్థానికంగా కూడా వసతి సౌకర్యం దొరుకుతుంది.