హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి | హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు | Hampi visiting places & temples

Vijaya Lakshmi

Published on Sep 17 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

హంపి (Hampi) కర్నాటక రాష్ట్రంలోని హంపి నగరం. భారతదేశంలోని అత్యంత అద్భుతమైన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధానిగా వెలుగొందిన మహానగరం హంపి.

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం... విదేశీ యాత్రికులు స్వర్గంతో పోల్చిన రాజధాని... వేలాది దేవాలయాలు, అద్భుతమైన శిల్పాలు, ఆకాశాన్ని తాకే గోపురాలు, వజ్రాలు అమ్మిన బజార్లు... కానీ నేడు అక్కడ కనిపించేది నిశ్శబ్దంగా నిలిచిన రాతి శిథిలాలు మాత్రమే. అదే హంపి!

భారతదేశంలో కాలమే ఆగిపోయినట్లు అనిపించే ఒక నగరం ఉంది. వేలాది రాతి శిల్పాలు, మహా దేవాలయాలు, రాజప్రాసాదాల శిథిలాలు, అద్భుతమైన కళాఖండాలు... ఇవన్నీ ఒకే చోట చూడాలంటే మీరు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం హంపి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా పేరుగాంచిన విజయనగర సామ్రాజ్య రాజధాని నేడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచింది. ఈ వీడియోలో హంపిలో తప్పక చూడవలసిన అందమైన, అద్భుతమైన ప్రదేశాలను గురించి తెలుసుకుందాం.

విరూపాక్ష దేవాలయం

హంపిలో తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయాలలో మొట్టమొదట చెప్పుకోవలసిన ఆలయం విరూపాక్ష దేవాలయం. సాదారణంగా విరూపాక్ష ఆలయం అనగానే దీనిని విజయనగర రాజులు నిర్మించారని. అభివృద్ధి చేసారని అనుకుంటాం. కాని చారిత్రిక కథనాల ప్రకారం ఇది నిజం కాదు.

ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యానికి ముందే ఉనికిలో ఉంది. చాళుక్యుల కాలంనుంచే ఇక్కడ శివారాధన జరిగేదని శాసనాలు చెబుతున్నాయి. వారి తర్వాత హొయసల రాజులు కూడా ఆలయ అభివృద్ధికి సహకరించారు. అంటే... విజయనగర సామ్రాజ్యం పుట్టినప్పటికే ఈ హంపి విరూపాక్ష ఆలయం పవిత్ర తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలో... దక్షిణ భారతదేశంలోని అనేకమంది రాజులు... యుద్ధాలకు వెళ్లేముందు ఈ క్షేత్రానికి వచ్చి, విరూపాక్షస్వామిని దర్శించేవారని భావిస్తారు. అందుకే ఇది కేవలం దేవాలయం కాదు. రాజుల విశ్వాసానికి కేంద్రం అంటారు.

ఈ హంపి పట్టణానికి, విరూపాక్ష దేవాలయానిం, విజయనగర సామ్రాజ్యానికి ఒక విడదీయరాని బంధం ఉంది.

అది 1336 సంవత్సరం. దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హరిహరరాయలు... బుక్కరాయలు... విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కొత్త రాజధానిని ఎక్కడ నిర్మించాలి? అనే ప్రశ్న వచ్చినప్పుడు వారు ఎంచుకున్న ప్రదేశం పరమ పవిత్రమైన పంపాక్షేత్రం. అంటే... నేటి హంపి.

ఎందుకు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు? అంటే దీనికి మూడు ప్రధాన కారణాలు చెబుతారు. మొదటిది సహజ రక్షణ. చుట్టూ భారీ రాతికొండలు ఉండటంతో శత్రువులు సులభంగా ప్రవేశించలేరు. రెండవది తుంగభద్ర నది. నీటి కొరత ఉండదు. మూడవది విరూపాక్షస్వామి ఆశీస్సులు. రాజులు తమ రాజ్యానికి దైవరక్షణ లభిస్తుందని విశ్వసించారు. అందుకే విజయనగర రాజధాని ఒక దేవాలయం చుట్టూనే అభివృద్ధి చెందింది. ఇది ప్రపంచ చరిత్రలో అరుదైన ఉదాహరణ.

విజయనగర రాజుల కాలంలో విరూపాక్షస్వామి ఆలయం సామ్రాజ్య అధికారిక దేవాలయంగా మారింది. రాజ్యాభిషేకం, విజయోత్సవం, ప్రత్యేక పూజలు, దసరా ఉత్సవాలు, ఇలా ప్రతి ముఖ్య కార్యక్రమం విరూపాక్ష స్వామి ఆశీస్సులతోనే ప్రారంభమయ్యేది. రాజులు తమ విజయాలను ఈ దేవుడికే అంకితం చేసేవారు.

హేమకూట కొండ

విరూపాక్ష ఆలయం వెనుక భాగంలో ఉన్న హేమకూట కొండపై అనేక చిన్న శివాలయాలు ఉన్నాయి. ఇక్కడినుంచి చూస్తె, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో హంపి మొత్తం బంగారురంగులో మెరిసిపోతూ కనబడుతుంది. ఫోటోగ్రాఫర్లకు ఇది స్వర్గం లాంటిది.

విజయ విఠల దేవాలయం

ఇక హంపి అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది, హంపిలోని అద్భుతాల్లో అద్భుతం... విజయ విఠల దేవాలయం. హంపి అంటే గుర్తొచ్చే మొదటి ప్రదేశం ఇదే. ఇది విజయనగర సామ్రాజ్య నిర్మాణ కళకు అత్యున్నత ఉదాహరణగా భావించబడుతుంది.

         ప్రపంచ ప్రసిద్ధ రాతిరథం ఇక్కడే ఉంది. ఒకే రాతితో చేసినట్లు కనిపించినా, ఇది అనేక రాతి భాగాలతో నిర్మించబడింది. హంపి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. హంపి వెళ్ళిన ప్రతి పర్యాటకుడు ఇక్కడ ఫోటో దిగకుండా మాత్రం ఉండరు. ఇది నిజమైన రథం కాదు. గరుడుని ఆలయంగా నిర్మించిన చిన్న మందిరం. రథ ఆకారంలో ఉండటం వల్ల దీనికి "స్టోన్ చారియట్" అనే పేరు వచ్చింది.

మొదట ఈ రథానికి ముందు గుర్రాల శిల్పాలు ఉండేవని, తరువాత కాలంలో ఏనుగుల శిల్పాలను అమర్చినట్టు చెబుతారు. 1980లలో భారతదేశ 50 రూపాయిన నోటుపై ఈ రథం చిత్రాన్ని ముద్రించడం ద్వారా ఇది దేశవ్యాప్తంగా మరింత ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం విఠోబా లేదా విఠల స్వామికి అంకితం చేయబడింది. దీని నిర్మాణం అనేకమంది రాజుల కాలంలో కొనసాగి, శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరింత వైభవాన్ని సంతరించుకుంది.

దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రతి మండపం శిల్పాలతో నిండి ఉంటుంది. నర్తకులు, సంగీత విద్వాంసులు, దేవతలు, యుద్ధ దృశ్యాలు, పౌరాణిక జంతువులు... ప్రతి అంగుళం కళాత్మకంగా చెక్కబడింది.

ఈ దేవాలయంలోని 56 సంగీత స్తంభాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రధాన స్తంభం చుట్టూ ఉన్న చిన్న స్తంభాలను తట్టినప్పుడు వేర్వేరు సంగీత స్వరాలు వినిపించేవని పాత వర్ణనలు చెబుతున్నాయి. వాటి నిర్మాణ రహస్యం ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతం పురావస్తు శాఖ వాటిని తాకకుండా రక్షిస్తోంది.

బడవ లింగం – నీటిలో నిలిచిన మహాశివలింగం

విరూపాక్ష ఆలయానికి సమీపంలో ఉన్న బడవ లింగం హంపిలోని అతిపెద్ద ఏకశిలా శివలింగం. సుమారు మూడు మీటర్లకు పైగా ఎత్తు కలిగిన ఈ లింగాన్ని ఒకే రాతితో చెక్కారు.

"బడవ" అంటే పేద మహిళ. ఒక పేద భక్తురాలు తన సంపాదనతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించిందని స్థానిక కథనం. అందుకే దీనికి "బడవలింగం" అనే పేరు వచ్చింది. ఈ లింగం ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. పురాతన కాలంలో నిర్మించిన నీటి కాలువల వల్ల గర్భగుడిలో ఎల్లప్పుడూ నీరు నిలిచి ఉండేది. ఇది శివుని జలాభిషేకాన్ని నిరంతరం సూచిస్తుందని భక్తులు నమ్ముతారు. శివలింగం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

హజార రామాలయం – రాతిలో చెక్కిన రామాయణం

హంపిలోని అత్యంత అందమైన దేవాలయాలలో హజార రామాలయం ఒకటి."హజార" అంటే వెయ్యి. ఆలయంలో వెయ్యి రామచిత్రాలు ఉన్నాయని భావించి ఈ పేరు వచ్చిందని ఒక అభిప్రాయం ఉంది. ఈ ఆలయ గోడలపై బాలకాండం నుంచి యుద్ధకాండం వరకు రామాయణంలోని ప్రధాన ఘట్టాలను వరుసగా చెక్కారు. శ్రీరామ జననం, సీతాస్వయంవరం, వనవాసం, హనుమంతుడి లంక యాత్ర, రావణ సంహారం వంటి అనేక దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. గోడలపై రామాయణంతో పాటు విజయనగర రాజుల సైన్యాలు, గుర్రపు దళాలు, ఏనుగులు, నర్తకులు, ఉత్సవాల దృశ్యాలు కూడా కనిపిస్తాయి. దీంతో ఈ ఆలయంలో ఆ కాలపు సామాజిక జీవనం గురించి కూడా విలువైన సమాచారం తెలుస్తుంది.

 స్టెప్ వెల్ – ప్రాచీన ఇంజినీరింగ్ అద్భుతం

రాజప్రాసాదప్రాంతంలో ఉన్న ఈ స్టెప్ వెల్ మెట్లబావి, హంపిలోని అత్యంత ప్రత్యేక నిర్మాణాలలో ఒకటి. చతురస్రాకారంలో నిర్మించిన ఈ బావిలో నాలుగువైపులా సమానకొలతల మెట్లు ఉంటాయి. పైనుంచి చూస్తే ఇది ఒక అద్భుత ఆకారంలా కనిపిస్తుంది.

తుంగభద్ర నది నుంచి ప్రత్యేక కాలువల ద్వారా నీటిని ఇక్కడికి తీసుకువచ్చేవారరట. ఆ కాలంలోనే నీటినిర్వహణ ఎంత అభివృద్ధి చెందిందో ఈ నిర్మాణం తెలియజేస్తుంది. ఇది కేవలం తాగునీటి నిల్వ మాత్రమే కాదు. రాజప్రాసాద అవసరాలు, మతపరమైన కార్యక్రమాల కోసం కూడా ఉపయోగించేవారని పరిశోధకులు భావిస్తున్నారు.

లక్ష్మీ నరసింహ విగ్రహం

హంపిలోని అత్యంత ప్రసిద్ధ శిల్పాల్లో 22 అడుగుల ఎత్తైన ఈ లక్ష్మీనరసింహ విగ్రహం ఒకటి. మొదట ఈ విగ్రహంలో లక్ష్మీదేవి కూడా ఉండేది. కాలక్రమంలో ఆమె విగ్రహం ధ్వంసమైపోవడంతో నేడు నరసింహస్వామి మాత్రమే కనిపిస్తున్నారు.

మాతంగ కొండ

హంపిలో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో మాతంగకొండ ఒకటి. ఇక్కడి నుంచి మొత్తం హంపి ఒక చిత్రంలా అద్భుతంగా కనిపిస్తుంది.

తుంగభద్ర నది

హంపి అందానికి ఈ నది మరింత శోభను ఇస్తుంది. గుండ్రటి కొరాకిల్ పడవ ప్రయాణం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. తుంగభద్ర నది ఈ క్షేత్ర పవిత్రతను మరింత పెంచుతుంది.

కడలేకాలు గణేశుడు

సుమారు 15 అడుగుల ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహం. దీని పొట్ట శనగగింజను పోలి ఉండటంతో "కడలేకాలు" అనే పేరు వచ్చింది.

ఇవే కాదు హంపిలో... సాసివేకాలు గణేశుడు, శ్రీకృష్ణదేవరాయలు ఒడిశాపై విజయాన్ని సాధించిన తర్వాత నిర్మించిన, విజయనగర శిల్పకళకు గొప్ప ఉదాహరణగా చెప్పే కృష్ణ దేవాలయం, తామరపువ్వు ఆకారంలో, రాజమహిళల విశ్రాంతి భవనంగా ఉపయోగించబడిన లోటస్ మహల్, దసరా ఉత్సవాలను రాజులు వీక్షించిన భారీ వేదిక మహానవమి దిబ్బ, అందమైన శిల్పాలకు, ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి చెందినా లక్ష్మీ దేవి ఆలయం, కోదండరామ ఆలయం, భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఇలా ఎన్నో అద్భుత స్థలాలున్నాయి.

రివర్ రాఫ్టింగ్

ఈ దర్శనీయ ఆధ్యాత్మిక స్థలాలే కాదు, ఈ చారిత్రక నగరం హంపి మరో ప్రత్యేక అనుభవాన్ని కూడా అందిస్తుంది. అదే తుంగభద్ర నదిపై రివర్ రాఫ్టింగ్.

చరిత్రను తెలుసుకుంటూ, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ,  ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, సాహసం చేస్తూ, వీటన్నిటినీ ఒకేసారి ఆస్వాదించాలనుకునే వారికి హంపి రివర్ రాఫ్టింగ్ ఒక అద్భుతమైన అనుభవం.

"హంపి అంటే కేవలం దేవాలయాలు, శిథిలాలు మాత్రమే కాదు. తుంగభద్ర అలలపై ప్రయాణిస్తూ చరిత్రను అనుభవించే అరుదైన అవకాశం కూడా. ఒక వైపు వెయ్యేళ్ల చరిత్ర... మరోవైపు ప్రకృతి ఒడిలో సాహసం... ఇదే హంపి ప్రత్యేకత.

హంపి ప్రయాణ సూచనలు

హంపి లో ఇప్పుడు చెప్పిన ప్రదేశాల గురించి పూర్తి వీడియోలు కూడా చెయ్యాలనుకుంటున్నాను. మీరు ఏ ప్రదేశం గురించి ముందుగా చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్తే ఆ వీడియో మీకు అందిస్తాను. కాబట్టి కామెంట్స్ లో తప్పకుండా మీరు చూడాలనుకుంటున్న ప్రదేశం గురించి రాయండి.

ముగింపు

హంపి కేవలం శిథిలాల సమాహారం కాదు. అది భారతీయ శిల్పకళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, రాజవైభవం మరియు చరిత్రకు సజీవ సాక్ష్యం. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి ఆలయం ఒక అద్భుతాన్ని దాచుకుంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా హంపిని సందర్శిస్తే, ఆ అనుభవం చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.


Recent Posts
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి  |  హంపిలో చూడవలసిన 10 ప్రదేశాలు  | Hampi visiting places & temples
హంపి వెళితే ఈ ప్రదేశాలు చూడడం మిస్సవకండి...
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...