Vijaya Lakshmi
Published on Aug 23 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?"కాశీ నుంచి రామేశ్వరం వరకు... ప్రయాగరాజ్ నుంచి పిఠాపురం వరకు... దేశంలోని నాలుగు దిక్కులను ఆధ్యాత్మికంగా అనుసంధానించే ఈ పంచమాధవ క్షేత్రాలు కేవలం ఆలయాలు మాత్రమే కావు... ఇవి పాపక్షయానికి, పుణ్యప్రాప్తికి, మోక్షమార్గానికి ప్రతీకలుగా భావించబడుతున్నాయి." అసలీ పంచామాధవ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి? దీనివెనక ఉన్న పురాణ కథనం ఏంటి?
"వృత్రాసురుని సంహరించిన తర్వాత ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం ఎలా వచ్చింది? ఆ దోష నివారణకు శ్రీమహావిష్ణువు ఎందుకు ఐదు మాధవ రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు? ప్రతి క్షేత్రానికి సంబంధించిన అద్భుతమైన పురాణం ఏమిటి?"
"ఈ రోజు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, కానీ చాలా తక్కువ మందికి తెలిసిన పంచ మాధవ క్షేత్రాల ఆధ్యాత్మిక యాత్రను గురించి తెలుసుకుందాం."
'మాధవ' అనేది శ్రీమహావిష్ణువు యొక్క అత్యంత పవిత్ర నామాలలో ఒకటి. "మా" అంటే మహాలక్ష్మి, "ధవ" అంటే భర్త. కాబట్టి లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమహావిష్ణువును "మాధవుడు" అని పిలుస్తారు.
పురాణ సంప్రదాయం ప్రకారం, భారతదేశంలోని ఐదు మహా పుణ్యక్షేత్రాల్లో శ్రీమహావిష్ణువు "మాధవ" నామంతో కొలువై ఉన్నాడు. ఈ ఐదు ఆలయాలనే పంచ మాధవ క్షేత్రాలు అంటారు.
ఒకప్పుడు వృత్రాసురుడు అనే మహాబలశాలి రాక్షసుడు మూడు లోకాలను వణికించాడు. దేవతలు అతన్ని జయించలేక శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. విష్ణువు ఆదేశంతో ఋషి దధీచి తన శరీరాన్ని ధర్మం కోసం త్యాగం చేశాడు. ఆయన వెన్నెముకతో విశ్వకర్మ తయారు చేసిన వజ్రాయుధం ఇంద్రునికి లభించింది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు.
కానీ వృత్రాసురుడు బ్రాహ్మణ తేజస్సు కలిగినవాడు. అతని వధవల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. ఆ దోషంతో ఇంద్రుడు తన తేజస్సు కోల్పోయి, దేవలోకాన్ని విడిచి దాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు దేవతలంతా శ్రీమహావిష్ణువును ప్రార్థించగా, "భూమిపై నా మాధవ స్వరూపాలను ప్రతిష్ఠించి భక్తితో ఆరాధించు. ఆ పుణ్యఫలంతో నీ దోషం తొలగిపోతుంది." అని చెప్పాడు శ్రీమహావిష్ణువు. ఆ విధంగా పంచమాధవ క్షేత్రాల ఆవిర్భావం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
అసలీ పంచ మాధవ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి? కాశీ క్షేత్రంలో బిందు మాధవస్వామి. ప్రయాగరాజ్ లో వేణీ మాధవస్వామి. ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం కుంతీ మాధవస్వామి. రామేశ్వరం లో సేతుమాధవస్వామి. తిరువనంతపురంలోని సుందర మాధవస్వామి. ఇప్పుడీ పంచమాధవ క్షేత్రాలలో ఒక్కొక్క క్షేత్రం చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకుందాం.
కాశీ... శివుని నగరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీమహావిష్ణువు కూడా మాధవ రూపంలో కొలువై ఉన్నాడు. గంగానది ఒడ్డున ఉన్న పంచగంగా ఘాట్ సమీపంలో బిందుమాధవ ఆలయం ఉంది. 'బిందుమాధవ' అనే పేరుకు కారణమేమంటే...
అగ్నిబిందు అనే ఋషి గురించి చెబుతారు. ఒకసారి ఆ రుషి ఈ ప్రదేశంలోనే తీవ్రమైన తపస్సు చేసాడు. అతని భక్తికి సంతోషించిన విష్ణువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఋషి, పూర్తిగా ముగ్ధుడై, ఈ పవిత్ర స్థలంలో శాశ్వతంగా ఉండమని భగవంతుని వేడుకున్నాడు. విష్ణువు అంగీకరించి, తాను ఇక్కడే బిందుమాధవుడిగా కొలువుతీరుతానని, ఇక్కడి ఘాట్‌లో స్నానం చేసి, పూజలు చేయడం మోక్షానికి దారితీస్తుందని వాగ్దానం చేశాడు. ఆ సందర్భంలో శ్రీమహావిష్ణువు ఆనందభాష్పాల నుంచి జారిన ఒక కన్నీటి బిందువు ఈ ప్రాంతాన్ని పవిత్రం చేసిందని, అందుకే ఈ స్వామిని "బిందు మాధవుడు" అని పిలుస్తారు.
ఇక్కడ బిండుమాధవ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, బిండుమాధవ స్వామి అద్భుతమైన ఆలయం గురించి, 17వ శతాబ్దపు యాత్రికుడు జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ తన రచనల్లో అద్భుతంగా వర్ణించినట్టు గ్రంధాలు చెబుతున్నాయి. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1673లో దానిని కూల్చివేసి, దాని స్థానంలో ఆలంగీర్ మసీదును నిర్మించారని చెబుతారు. ఆ సందర్భంలో పూజారులు పవిత్ర విగ్రహాన్ని ధైర్యంగా ఎలా రక్షించారో, గంగా నదిలో దాచిపెట్టి, మళ్ళీ పూజించే రోజు కోసం ఎలా వేచి ఉన్నారో భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు.
ప్రస్తుతం స్వామి, ఒక నిరాడంబరమైన మందిరంలో కొలువుతీరి ఉన్నాడు.
కాశీకి వెళ్లే భక్తులు విశ్వనాథుడి దర్శనంతో పాటు బిందుమాధవుడి దర్శనాన్ని కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. శివుడు – విష్ణువు అభేద భావానికి ఈ క్షేత్రం ఒక గొప్ప ప్రతీక.
కాశీలో శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తే.. బిందు మాధవుడు భక్తునికి భక్తి, జ్ఞానం, వైరాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.అందుకే కాశీ యాత్రను చాలామంది బిందు మాధవ దర్శనం లేకుండా పూర్తి అయినట్టు భావించరు.
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన సంగమ క్షేత్రం ప్రయాగ్ రాజ్. గంగా...యమునా... అదృశ్యాంగా ఉన్న సరస్వతి...ఈ మూడు నదులు కలిసిన త్రివేణి సంగమమే ప్రయాగరాజ్.
ఇక్కడే కొలువై ఉన్నాడు వేణీ మాధవుడు. "వేణీ" అంటే సంగమం, కలయిక. మూడు పవిత్ర నదుల సంగమంలో కొలువై ఉన్న మాధవుడికి కుంభమేళా సందర్భంగా లక్షలాదిమంది భక్తులు ముందుగా సంగమంలో స్నానంచేసి, ఆ తరువాత వేణీమాధవుని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఒకప్పుడు నిలిచి ఉన్న పన్నెండు "ద్వాదశ" మాధవ దేవాలయాల గురించి మాట్లాడినప్పటికీ, వేణి మాధవుడే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాన దైవం విష్ణువును సూచించే ఒక అందమైన శాలిగ్రామ శిల, మరియు భక్తులు తరచుగా దాని ప్రశాంతమైన మరియు ఆకర్షణీయమైన లక్షణాలకు ముగ్ధులవుతారు. ఈ క్షేత్రం దర్శనం చేస్తే పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయని విశ్వాసం.
"పంచమాధవ క్షేత్రాలలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సన్నిహితమైన క్షేత్రం ఏదైనా ఉందా?"అంటే... అది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయం. పాదగయ క్షేత్రంగా, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన పిఠాపురంలోనే ఈ అరుదైన వైష్ణవ క్షేత్రం కూడా వెలసి ఉంది.
చాలామంది పిఠాపురానికి వెళ్లినా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికా దేవి దర్శనంతోనే యాత్రను ముగిస్తారు. కానీ పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతీ మాధవుని దర్శనం కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
ఇక్కడి మాధవస్వామికి కుంతీమాధవ' అనే పేరుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటి సంప్రదాయం ప్రకారం.. మహాభారతంలోని పాండవుల తల్లి కుంతీదేవి ఈ ప్రాంతంలో శ్రీమహావిష్ణువును ఆరాధించిందని, ఆమె భక్తికి మెచ్చి భగవంతుడు ఇక్కడ వెలసాడని చెబుతారు. అందుకే స్వామికి కుంతీ మాధవుడు అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పురాతన పంచమాధవ క్షేత్రాలలో ఒకటి. స్థానిక ఋషి ఒకసారి వేదవ్యాసుడు ఈ ప్రదేశాన్ని సందర్శించి, తన దివ్యదృష్టి ద్వారా, అతను ఆలయం యొక్క పురాతన చరిత్రను చూసి, ఇంద్రుడి చేత స్థాపించబడిందని, తరువాత యుగాల్లో రాముడు, ఆపై పాండవులచేత కూడా ఈ పుణ్యక్షేత్రం పూజించబడుతుందని గ్రహించాడు.
పాండవులతో ఉన్న ఈ అనుబంధమే ఆలయానికి దాని ప్రసిద్ధ పేరును ఇచ్చింది. పురాణాల ప్రకారం, వారి వనవాస సమయంలో, పాండవుల తల్లి అయిన కుంతి, ఇదే ఆలయంలో శ్రీకృష్ణుని తీవ్రంగా ప్రార్థించింది. ఆమె శక్తివంతమైన భక్తికి గౌరవంగా, ఆ దైవం కుంతీ మాధవ స్వామిగా ప్రసిద్ధి చెందింది.
మరో సంప్రదాయం ప్రకారం ఇంద్రుడు ప్రతిష్ఠించిన పంచమాధవ క్షేత్రాలలో ఇదొకటి. ఆలయంలోని శ్రీమాధవస్వామి విగ్రహం అత్యంత ప్రశాంతమైన రూపంలో దర్శనమిస్తుంది. శంఖం, చక్రం ధరించి, అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్న స్వామివారి రూపం ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. పిఠాపురంలో శైవ, శాక్త, వైష్ణవ సంప్రదాయాలు ఒకే క్షేత్రంలో కలిసిన అపూర్వ దృశ్యం కనిపిస్తుంది. కుక్కుటేశ్వరుడు... పురుహూతికా దేవి... కుంతీ మాధవుడు... ఈ మూడు దర్శనాలు ఒకే యాత్రలో లభించడం ఈ క్షేత్రం ప్రత్యేకత.
కున్తీమాధవస్వామికి పాదగయ క్షేత్రంతో ఉన్న అనుబంధం చూస్తె, పిఠాపురం పితృకర్మలకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి, అనంతరం కుంతీ మాధవుని దర్శిస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని స్థానిక విశ్వాసం. అందువల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.
రామేశ్వరం అంటే శ్రీరాముడు నిర్మించిన సేతువు... రామనాథస్వామి ఆలయం... సముద్ర తీర్థాలు... గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడే పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన సేతుమాధవస్వామి కూడా కొలువై ఉన్నాడు.
ఇక్కడ మాధవస్వామికి 'సేతుమాధవ’ అనే పేరుకు కారణం చూద్దాం. లంకకు వెళ్లేందుకు శ్రీరాముడు వానరసేన సహాయంతో నిర్మించిన రామసేతువు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ పవిత్ర సేతువుతో అనుబంధంగా వెలసిన మాధవ స్వరూపమే సేతు మాధవుడు. సంప్రదాయం ప్రకారం శ్రీరాముడు కూడా ఈ స్వామిని ఆరాధించాడని కొన్ని స్థలపురాణాలు పేర్కొంటాయి.
ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రంలో విష్ణు పుణ్యక్షేత్రం ఎందుకు ఉంది? దీని వెనక ఒక ఆసక్తికరమైన స్థానిక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి ఒక రాజు రామేశ్వరం వచ్చాడ=డు. విష్ణుమూర్తి అతని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుని, లక్ష్మీదేవిని ఒక అనాథ బాలిక వేషంలో పంపాడు. రాజు ఆమెను కనుగొని దత్తత తీసుకున్నాడు. తరువాత, విష్ణువు ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమై, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అడిగాడు. ఆగ్రహించిన రాజు, ఆ వృద్ధుడిని చెరసాలలో బంధించాడు.
ఆ రాత్రి, విష్ణుమూర్తి రాజు కలలో కనిపించి, తన నిజ స్వరూపాన్ని చూపి ఆ అమ్మాయి లక్ష్మీదేవి అని చెప్పాడు. దాంతో నిజం తెలుసుకున్న రాజు వినయంతో క్షమాపణ వేడుకున్నాడు. విష్ణువు అతన్ని క్షమించి, లక్ష్మీదేవితో కలిసి ఆ ప్రదేశంలో నివసిస్తానని, ఎప్పటికీ శ్రీ సేతు మాధవుడిగా పూజించబడతానని వాగ్దానం చేశాడు. అలా ఇక్కడ సేతుమాధవుడు వేలిసాదని ఓ కథనం.
సేతు మాధవుని దర్శనం, రామనాథస్వామి దర్శనంతో సమానంగా పవిత్రమైనదిగా భావిస్తారు. శైవ, వైష్ణవ సంప్రదాయాల సమన్వయానికి ఇదొక గొప్ప ఉదాహరణ గా చెబుతారు. రాముడు శివుని పూజించిన క్షేత్రంలో... విష్ణువు మాధవ రూపంలో కొలువై ఉండటం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల విశాలత్వాన్ని తెలియజేస్తుంది.
రామేశ్వరం యాత్రలో ప్రధానమైనది సముద్ర స్నానం... 22 తీర్థాలలో స్నానం... రామనాథస్వామి దర్శనం...ఆ తరువాత సేతు మాధవుని దర్శనం... ఈ క్రమంలో యాత్ర చేస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
పంచ మాధవ క్షేత్రాల జాబితాలో చివరిగా చెప్పబడే మాధవ క్షేత్రం తిరువనంతపురం సుందర మాధవ స్వామి. పంచ మాధవ క్షేత్రాల జాబితాలో మొదటి నాలుగు క్షేత్రాల విషయంలో విస్తృతంగా ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, ఐదవ క్షేత్రం (సుందర మాధవ) గురించి ప్రాంతీయ సంప్రదాయాలు, స్థలపురాణాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తాయి.
కొన్ని ప్రాచీన సంప్రదాయాల్లో ఈ స్వరూపాన్ని కేరళలోని తిరువనంతపురంతో అనుసంధానిస్తారు. సుందర మాధవుడు అంటే...సౌందర్యానికి...కరుణకు...దివ్య మంగళ స్వరూపానికి ప్రతీకగా భావించే విష్ణుమూర్తి. ఈ స్వరూపాన్ని దర్శించిన భక్తులకు మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఆనందం లభిస్తాయని విశ్వాసం.
పంచ మాధవ క్షేత్రాలు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక సందేశం ఇస్తున్నాయి. ఈ ఐదు ఆలయాలు భారతదేశంలోని ఐదు దిశల్లో ఉన్నా... వాటి సందేశం మాత్రం ఒక్కటే. కాశీలో జ్ఞానం...ప్రయాగంలో పవిత్రత... పిఠాపురంలో పితృకృప... రామేశ్వరంలో ధర్మం...సుందర మాధవుని వద్ద దైవానుభూతి... ఈ ఐదు విలువలే పంచ మాధవ యాత్ర సారాంశం.
ఇప్పటికీ వేలాదిమంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ ఐదు మాధవ క్షత్రాలను దర్శించాలని సంకల్పిస్తుంటారు. ప్రతి ఆలయం ఒక చరిత్ర...ప్రతి విగ్రహం ఒక పురాణం...ప్రతి యాత్ర ఒక ఆత్మానుభూతి.ఈ కారణంగానే పంచ మాధవ యాత్ర భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది.
పంచ మాధవ యాత్ర చేయడానికి ఒక పద్దతి ఉందని చెబుతారు పెద్దలు. భక్తుల విశ్వాసం ప్రకారం, పంచ మాధవ యాత్ర అనేది కేవలం ఆలయ దర్శనం కాదు... అది ఒక ఆధ్యాత్మిక సాధన. ప్రాచీన కాలంలో యాత్రికులు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఈ ఐదు క్షేత్రాలను దర్శించేవారు. నదులను దాటేవారు... అడవులను దాటేవారు... పర్వతాలను అధిరోహించేవారు... అయినా వారి మనసులో ఒక్కటే కోరిక—శ్రీమహావిష్ణువు అనుగ్రహం.
నేడు రైలు, రోడ్డు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, యాత్ర వెనుక ఉన్న భక్తి భావం మాత్రం మారకూడదని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు.
సంప్రదాయంగా భక్తులు ఈ క్రమంలో యాత్ర చేయడానికి ప్రయత్నిస్తారు:
పురాణ సంప్రదాయం ప్రకారం...ఈ ఐదు క్షేత్రాలను భక్తిశ్రద్ధలతో దర్శించినవారికి పాపప్రక్షాళన జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మనశ్శాంతి పెరుగుతుంది. శ్రీమహాలక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.
పంచ మాధవ క్షేత్రాల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం ఉందని చెబుతారు. ఈ ఐదు ఆలయాలు భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ... వాటిని కలిపేది ఒక్కటే. శ్రీమహావిష్ణువు యొక్క మాధవ తత్వం. కాశీలో జ్ఞానానికి ప్రతీకగా... ప్రయాగలో పవిత్ర సంగమానికి ప్రతీకగా... పిఠాపురంలో మాతృభక్తి, పితృకార్యాల పవిత్రతకు ప్రతీకగా... రామేశ్వరంలో ధర్మానికి ప్రతీకగా... సుందర మాధవుని రూపంలో దివ్య సౌందర్యానికి ప్రతీకగా... మాధవుడు భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాడనే భావన భక్తులలో ఉంది.
జీవితంలో ఒక్కసారైనా ఈ ఐదు మాధవ క్షేత్రాలను దర్శించే భాగ్యం ప్రతి భక్తునికీ కలగాలని శ్రీమన్నారాయణుడిని మనసారా ప్రార్థిద్దాం.