పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history | sirimanu festival

Vijaya Lakshmi

Published on Sep 13 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

బొబ్బిలి యుద్ధం – రాజకుటుంబం – పైడిమాంబ త్యాగం – అమ్మవారి ఆవిర్భావం – సిరిమాను సంప్రదాయం – రాజవంశంతో ఉన్న అనుబంధం అన్నీ కలగలిస్తే విజయనగరం గ్రామదేవత పైడితల్లమ్మ చరిత్ర. ఉత్తరాంధ్రలోని విజయనగరం ప్రజలకు పైడితల్లి అమ్మవారు కేవలం ఒక దేవత కాదు. ఆమె... విజయనగరం ఇలవేల్పు. ప్రజల తల్లి. గ్రామదేవత. రాజకుటుంబ ఆరాధ్యదైవం.

విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం 18వ శతాబ్దానికి చెందినదిగా జిల్లా అధికారిక సమాచారం పేర్కొంటోంది. అయితే అమ్మవారి చరిత్రలోకి చూస్తె...

అది 1757... ఉత్తరాంధ్ర నేలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవైపు... విజయనగర రాజు విజయరామరాజు సైన్యం. మరోవైపు... బొబ్బిలి కోటను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్న వీరులు. విజయనగర రాజు విజయరామరాజు, ఫ్రెంచ్ సైనిక సహకారంతో బొబ్బిలిపై యుద్ధానికి వెళ్లాడు. ఈ యుద్ధం తీవ్ర రక్తపాతానికి దారితీసింది.బొబ్బిలి కోట తీవ్రంగా ధ్వంసమైంది. ఇరువైపులా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. 

కత్తులు ఢీకొంటున్నాయి... ఫిరంగులు గర్జిస్తున్నాయి... రక్తంతో నేల తడుస్తోంది... కానీ... ఆ  యుద్ధభూమికి చాలా దూరంలో ఉన్న విజయనగరం రాజమందిరంలో మాత్రం... ఒక యువతి ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె కళ్లల్లో నిద్ర లేదు. మనసులో ఒక్కటే భయం... "నా అన్నకు ఏమైనా జరిగిందా?" అని , ఆమె పేరు... పైడిమాంబ. విజయనగర రాజు విజయరామరాజు సోదరి. ఆమె తన అన్నను యుద్ధానికి వెళ్లవద్దని ఎన్నోవిధాల ప్రాదేయపడిందని చరిత్ర చెబుతోంది.

అయినా రాజకీయం...రాజ్య గౌరవం... యుద్ధ నిర్ణయాన్ని మార్చలేకపోయాయి.

యుద్ధం భీకరంగా సాగుతోంది. ఒక వైపు సైనికులు కత్తులు పట్టుకుని పోరాడుతుంటే... మరో వైపు... పైడిమాంబ తన అన్నయ్య క్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉందని స్థలపురాణం చెబుతుంది.

విజయనగరం ఒకప్పుడు కేవలం ఒక పట్టణం మాత్రమె కాదు. ఉత్తరాంధ్రలోని ఒక ప్రముఖ రాజ్యానికి కేంద్రం. పూసపాటి గజపతి రాజవంశం... ఈ ప్రాంత రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో కీలక పాత్ర పోషించింది. ఆ రాజవంశంలో ఒక ప్రతిభావంతమైన రాజు విజయరామరాజు. ఆయన సోదరే పైడిమాంబ. కాలక్రమంలో ఆమెనే ప్రజలు భక్తితో పైడితల్లి అమ్మవారిగా ఆరాధించడం ప్రారంభించారని స్థలపురాణం చెబుతుంది. అసలు ఆ రాజకుమార్తె దేవతగా ఎలా మారింది?

చారిత్రాత్మక కథనాల ప్రకారం పైడిత‌ల్లి అమ్మ పెద్ద విజ‌య‌రామ‌రాజు చెల్లెలు. ప‌సితనం నుంచి ఆధ్యాత్మిక భావాల‌తో దేవీ ఉపాస‌నతో ఉండేది. విదేశీ పాలకుల కుట్రకు లొంగిపోయిన తన అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ స‌న్నహాలు చేయ‌డం, ఆమెను బాధ పెట్టింది. హింసవద్దని, యుద్ధం మంచిది కాదని ఎన్నో రకాలుగా చెప్పి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నించింది. కాని విజ‌య‌రామ‌రాజు చెల్లెలి యుద్ధ నివార‌ణ ప్రయ‌త్నాల్ని లెక్క చేయ‌లేదు.

1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రక‌టించాడు. బొబ్బిలి వెల‌మ వీరులు త‌మ పౌరుష ప్రతాపాల్ని ఫ‌ణంగా పెట్టి విజ‌య‌మో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విధి ముందు వెలమవీరుల వీరత్వం చిన్నబోయింది. విజ‌యం విజ‌య‌రామ‌రాజునే వ‌రించింది. పరిస్తితి  చేయి దాటి పోవడంతో ఇక నీదే భారం అంటూ పైడిమాంబ ఉపవాసంతో దేవీ ఉపాసనలో ఉండిపోయింది. ఆ రోజు రాత్రి దేవి క‌ల‌లో క‌నిపించి ఆమె అన్న ప్రాణాల‌కు ముప్పు ఏర్పదబోతోందని ముందే హెచ్చరించింది. ఉప‌వాస‌దీక్షలో ఉన్న పైదిమాంబ ప‌తివాడ అప్పల‌నాయుడు, మ‌రికొంద‌రు అనుచ‌రుల్ని వెంట‌బెట్టుకుని బొబ్బిలి బ‌య‌లుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే ఆమె అప‌స్మార‌క స్థితిలోకి జారుకుంది. ఇంతలోనే తన అన్న మరణవార్త విన్న ఆమె అలాగే ప్రాణాలు వదిలింది.

కొంతకాలానికి పైడిమాంబ పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి తాను విగ్రహం రూపంలో పెద్దచెరువు పశ్చిమ భాగంలో ఉన్నానని చెప్పి తాను ఉన్నచోటును సూచించిందని స్థలపురాణం చెబుతోంది.

ఆ సూచన మేరకు వెతకగా... పైదిమాంబ అమ్మవారి విగ్రహం లభించిందని స్థానిక సంప్రదాయం చెబుతుంది. అలా లభించిన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారని కథనం. అలా ఆమె అమ్మోరు గా మారి ఆ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవతగా మారింది.

పైదితల్లమ్మవారికి విజయనగరంలో రెండు ఆలయాలున్నాయి. ఒకే గ్రామదేవతకు ఒకే గ్రామంలో రెండు ఆలయాలు ఎందుకున్నాయి...

విజయనగరం రైల్వేస్టేషన్‌కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. అప్పట్లో ఆ ప్రాంతమంతా అరణ్యంగా ఉండేది. అరణ్యాన్ని వనం అని కూడా అంటారు కాబట్టి వనంలో ఉన్న ఆ ఆలయం వనం గుడిగా ప్రసిద్ధి చెందింది. దీన్ని అమ్మవారి పుట్టినిల్లుగా భావిస్తారు. ఈ వనంగుడి మొదటి ఆలయం.

ఇక రెండవ ఆలయం.  నగరం క్రమేపీ అభివృద్ధి చెందడంతో భక్తుల సౌకర్యం కోసం నగరం నడిబొడ్డున ఉన్న మూడు లాంతర్ల ప్రాంతంలో మరొక ఆలయాన్ని నిర్మించి ఆరు నెలల పాటు ఉత్సవాలు నిర్వహించాలని విజయనగర రాజులు, ప్రజలు నిర్ణయించారు. ‘చదురు’గుడిగా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయంలోనే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షికోత్సవాలు ఇలా అన్ని పూజలు నిర్వహిస్తారు.

వాటిలో ప్రతి సంవత్సరం జరిపే సిరిమాను సంబరం ప్రత్యేకమైనది. ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ చదురుగుడిని అమ్మవారి మెట్టినింటిగా భావిస్తారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. దీనిలోని నీటిని అమ్మవారి తీర్థంగా స్వీకరిస్తారు భక్తులు. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదట్లో పోతురాజు పూజలందుకుంటూ ఉంటాడు.

       వనంగుడిలో అంటే విజయనగరం రైల్వేస్టేషన్ కి ఎదురుగా ఉన్న గుడిలో శ్రీపైడితల్లి అమ్మవారు శోభాయమానంగా సకల కళలను చిందిస్తూ కాంతులు వర్షిస్తూ దేదీప్యమానంగా కొలువుదీరి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ముత్యాలమ్మ, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాలు దర్శనమిస్తాయి. ఇక అమ్మవారి మెట్టినిల్లుగా ఖ్యాతినొందిన చదురుగుడి ఆలయంలో పైడితల్లి అమ్మవారు చల్లని తల్లిగా, విశాలాక్షిగా దర్శనమిస్తోంది. ఆ అమ్మ దివ్య దర్శనం ఎంతో పుణ్యప్రదం.

అసలు అమ్మోరి పండుగ దసరా తరువాత వచ్చే మంగళవారమే ఎందుకు చేస్తారు...

ఇక్కడ 1758 లో అమ్మవారికి ఉత్సవాలు ప్రారంభమై ఇప్పటికి కూడా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నమ సంవత్సరం విజయదశమి సమయంలో విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. అందుకే దసరా తరువాత అమ్మవారి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.



ఉత్తరాంధ్రలో అమ్మోరి పండుగగా ప్రసిద్ధి చెందినా పైడితల్లమ్మ జాతరలో అతి ముఖ్యమైన, ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు.

ఆ పండుగ రోజున విజయనగర వీధులు ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసి ఎంతో కోలాహలంగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌‌, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.  అమ్మవారి సిరిమానోత్సవాన్ని విజయదశమి (దసరా) తరువాత వచ్చే జయవారం (మంగళవారం) నాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.వి జయనగరం జిల్లా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 2025లో జరిగిన సిరిమానోత్సవానికీ సుమారు రెండు లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు వార్తా నివేదికలు చెబుతున్నాయి.

సిరిమాను అంటే సాక్ష్టాట్టూ అమ్మవారిగానే భావిస్తారు. అంత మహిమాన్వితమైన సిరిమాను ఎలా ఎన్నుకుంటారు...

 జాతరకు కొన్నిరోజుల ముందే పైడిమాంబ.. ఆలయ ప్రధానార్చకుడి కలలో దర్శనమిస్తుంది. సిరిమానుకు కావలసిన చెట్టు ఏ దిశలో ఉందో తెలియజేస్తుంది. సిరిమాను తయారీకి చింత చెట్టునే ఉపయోగిస్తారు. అర్చకుడు ఆ సిరిమానుకు ప్రత్యేక పూజలు చేసి పట్టణానికి చేరుస్తారు. వనంగుడిలోని అమ్మవారికి దాన్ని చూపించి హుకుంపేట చేర్చి నిపుణుల సమక్షంలో అమ్మవారి ప్రతిరూపమైన సిరిమానుగా తీర్చిదిద్దుతారు. చెదురు గుడి నుంచి బయలుదేరే సిరిమాను లక్షలాది భక్తజనుల జయజయ ధ్వానాల మధ్య విజయనగరం కోట వద్దకు చేరుతుంది. దాంతో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.  ఉత్సవ సమయంలో సుమారు 50 అడుగుల ఈ సిరిమాను చివర ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి.. దానిలో అమ్మవారి ప్రతినిధిగా పూజారిని కూర్చోబెట్టి నగరంలో ఊరేగిస్తారు. ఇదే సిరిమానోత్సవంలోని అత్యంత ఉత్కంఠభరితమైన దృశ్యం.

మరి

పూజారి అంత ఎత్తులో ఎందుకు కూర్చుంటారు?

సిరిమాను పైభాగంలో... అమ్మవారి ఆలయానికి చెందిన పూజారి కూర్చుంటారు. ఆయనను సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. సిరిమాను కదలడం ప్రారంభమైనప్పుడు...

ఆ భారీ చెట్టు దుంగ ఒక వైపు నుంచి మరో వైపుకు ఊగుతూ ఉంటుంది. దాని పైభాగంలో ఉన్న పూజారి కూడా గాల్లోకి ఎగసినట్లుగా కనిపిస్తారు.

భక్తుల విశ్వాసం ప్రకారం... ఆ సమయంలో పూజారిలో అమ్మవారి శక్తి ఆవహిస్తుంది. అందుకే ఆయనను అమ్మవారి ప్రతినిధిగా భావించి ఆశీర్వాదం పొందడానికి భక్తులు ఉత్సాహపడతారు.

సిరిమాను కోటకు మూడుసార్లు ప్రదక్షిణతో ఈ ఉత్సవం ముగుస్తుంది. అసలు కోటచుట్టూ సిరిమాను ఎందుకు మూడుసార్లు తిరుగుతుంది... అంటే పాత రాజ్యవ్యవస్థలో కోట అంటే... రాజ్యం యొక్క కేంద్రం. పైడితల్లి అమ్మవారు రాజకుటుంబానికి సంబంధించిన దేవతగా భావించబడటం వల్ల... అమ్మవారు తన రాజకుటుంబాన్ని ఆశీర్వదించడానికి కోటకు వస్తున్నట్లుగా ఈ సంప్రదాయం చెబుతోంది.

అమ్మవారు ఆలయం నుంచి రాజకోటకు రావడం అనేది కేవలం ఊరేగింపు కాదు...

పాత విజయనగర రాజ్యపు జ్ఞాపకాన్ని ప్రతి ఏడాది మళ్లీ జీవింపజేసే ఒక ఆచారంగా భావిస్తారు.

ఉత్సవం ముగింపులో దేవాలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు ఈ సందర్భంగా పూజారిని సత్కరిస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇలా ప్రతీ ఏటా సిరిమాను చెట్టును తీసుకువచ్చే తంతును ఓ పెద్ద ఉత్సవంగా జరుపుతారు.

సిరిమాను ఊరేగింపు సమయంలో పూజారిపైకి అరటిపళ్లను విసురుతూ మొక్కులు తీర్చుకొనే ఆనవాయితీ కూడా అక్కడ కనిపిస్తుంది.

సిరిమాను ఉత్సవంలో సిరిమానుకు ముందు మూడు రథాల్లో అమ్మవారి పరివారం కూడా నడుస్తుంది. ఆ పరివారంలో ప్రధానంగా చెప్పుకోవలసినవి తెల్ల ఏనుగు, అంజలి రథం... గజ వాహనం...పాలధార... బేస్తవారి వల... వంటి ప్రత్యేకమైన ఆచారాలు, వాహనాలు ఊరేగింపులో ఉంటాయి. వీటన్నింటితో విజయనగరం వీధులు...ఒక భారీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదికగా మారిపోతాయి.

సిరిమానుతో పాటు తెల్ల ఏనుగు ఎందుకంటే... విజయనగరాధీశులు ఆ రోజుల్లో రథానికి ముందు తెల్ల ఏనుగు అంబారీపై పయనించేవారు. రాజ్యాలూ, రాచరికాలూ కనుమరుగైనా, ఆ సంప్రదాయాన్ని మాత్రం పాటిస్తున్నారు. ఏనుగు ఆకారంలో ఒక రథాన్ని రూపొందించి, దానిపై అమ్మవారి తోబుట్టువులుగా ఏడుగురు స్త్రీలనూ, సోదరుడిగా ఒక పురుషుడినీ ఆశీనుల్ని చేస్తారు.

ఇక బెస్తవారి వల... విషయానికి వస్తే, మొట్టమొదట పైడితల్లి అమ్మవారి విగ్రహన్ని చెరువు నుంచి తీసిన మత్స్యకారులను అప్పలనాయుడు అభినందిస్తూ, వారి సహాయానికి ప్రతిగా అమ్మవారి ఉత్సవాల్లో వారికి స్థానం కల్పించారు. దీనినే ‘పాలధార’ అని వ్యవహరిస్తారు.

ఇక అంజలి రథం అంటే... సిరిమానును పరాశక్తిగా భావన చేస్తూ ఆమె పరిచారకులుగా అయిదుగురు పురుషులకు స్త్రీ వేషధారణ చేస్తారు. వారు అమ్మవారికి అంజలి ఘటిస్తూ ఉంటారు. అంజలి రధం.  మరొక కథ ప్రకారం... పూసపాటి వంశీయుల రాజధాని విజయనగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న అయిదు శక్తులకు ప్రతీకలుగా- అయిదుగురు పుణ్యస్త్రీల వేషధారులను అంజలి రథంపై అధివసింపజేస్తారు. వారు కోట శక్తి, కోట సత్తెమ్మ, దండు మారమ్మ, ముత్యాలమ్మ, ఎల్లారమ్మ. ఇలా పరివారంతో అమ్మవారు జాతరలో విహరిస్తుంది.

 విజయనగరం పైడితల్లి అమ్మవారి కథ... కేవలం ఒక దేవత కథ కాదు. ఇది... ఒక అన్నాచెల్లెళ్ల అనుబంధం కథ. ఒక యుద్ధం కథ.ఒక విషాదం కథ.ఒక రాజవంశం కథ.ఒక ప్రజల విశ్వాసం కథ. ముఖ్యంగా...ఒక రాజకుమారి...తరతరాల తల్లిగా మారిన కథ. అందుకే... సిరిమాను కదులుతున్నప్పుడు...విజయనగరం కేవలం ఒక జాతరను చూడదు.తన చరిత్రను చూస్తుంది.తన తల్లిని చూస్తుంది.తన సంస్కృతిని చూస్తుంది.తన గతాన్ని చూస్తుంది.అందుకే... ప్రతి సంవత్సరం...విజయనగరం అమ్మోరి పండుగ కోసం ఆత్రంగా, ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరి మీరు ఎప్పుడైనా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా చూశారా?

Recent Posts
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న అసలు కథ! | Vijayanagaram pydimamba temple history  |   sirimanu festival
పైడితల్లి అమ్మవారు ఎవరు? సిరిమాను వెనుక ఉన్న...
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు | 2026 Vijayanagaram pydimamba sirimanu dates
2026 విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు...
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...