Vijaya Lakshmi
Published on Sep 29 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?వెయ్యి సంవత్సరాలకు పైగా నిరంతర పూజలు జరుగుతున్న ఆలయం హంపి విరూపాక్ష దేవాలయం. ! ఒక సామ్రాజ్యం పుట్టకముందే ఉన్న దేవాలయం... ఒక మహాసామ్రాజ్యం పతనమైన తర్వాత కూడా చెక్కుచెదరకుండా నిలిచిన దివ్యక్షేత్రం... అదే హంపిలోని విరూపాక్ష స్వామి ఆలయం!"
ఇప్పటికీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు విరూపాక్ష ఆలయాన్ని సందర్శిస్తున్నారు. కొందరు భక్తి కోసం, మరికొందరు చరిత్ర అన్వేషణ కోసం, శిల్పకళ కోసం
ఇంకొందరు ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వస్తారు. ఎవరు, ఏ కారణంతో వచ్చినా... హంపి విరూపాక్ష ఆలయం ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
సాదారణంగా విరూపాక్ష ఆలయం అనగానే దీనిని విజయనగర రాజులు నిర్మించారని. అభివృద్ధి చేసారని అనుకుంటాం. కాని చారిత్రిక కథనాల ప్రకారం ఇది నిజం కాదు. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యానికి ముందే ఉనికిలో ఉంది.
చాళుక్యుల కాలంనుంచే ఇక్కడ శివారాధన జరిగేదని శాసనాలు చెబుతున్నాయి. వారి తర్వాత హొయసల రాజులు కూడా ఆలయ అభివృద్ధికి సహకరించారు. అంటే... విజయనగర సామ్రాజ్యం పుట్టినప్పటికే ఈ హంపి విరూపాక్ష ఆలయం పవిత్ర తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలో...దక్షిణ భారతదేశంలోని అనేకమంది రాజులు...యుద్ధాలకు వెళ్లేముందు ఈ క్షేత్రానికి వచ్చి, విరూపాక్షస్వామిని దర్శించేవారని భావిస్తారు. అందుకే ఇది కేవలం దేవాలయం కాదు. రాజుల విశ్వాసానికి కేంద్రం అంటారు.
ఈ హంపి పట్టణానికి, విరూపాక్ష దేవాలయానిం, విజయనగర సామ్రాజ్యానికి ఒక విడదీయరాని బంధం ఉంది.
అది 1336 సంవత్సరం. దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హరిహరరాయలు... బుక్కరాయలు... విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కొత్త రాజధానిని ఎక్కడ నిర్మించాలి? అనే ప్రశ్న వచ్చినప్పుడు వారు ఎంచుకున్న ప్రదేశం పరమ పవిత్రమైన పంపాక్షేత్రం. అంటే... నేటి హంపి.
ఎందుకు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు... అంటే దీనికి మూడు ప్రధాన కారణాలు చెబుతారు. మొదటిది సహజ రక్షణ. చుట్టూ భారీ రాతికొండలు ఉండటంతో శత్రువులు సులభంగా ప్రవేశించలేరు. రెండవది తుంగభద్ర నది. నీటి కొరత ఉండదు. మూడవది విరూపాక్షస్వామి ఆశీస్సులు. రాజులు తమ రాజ్యానికి దైవరక్షణ లభిస్తుందని విశ్వసించారు. అందుకే విజయనగర రాజధాని ఒక దేవాలయం చుట్టూనే అభివృద్ధి చెందింది. ఇది ప్రపంచ చరిత్రలో అరుదైన ఉదాహరణ.
విజయనగర రాజుల కాలంలో విరూపాక్షస్వామి ఆలయం సామ్రాజ్య అధికారిక దేవాలయంగా మారింది. రాజ్యాభిషేకం, విజయోత్సవం, ప్రత్యేక పూజలు, దసరా ఉత్సవాలు, ఇలా ప్రతి ముఖ్య కార్యక్రమం విరూపాక్ష స్వామి ఆశీస్సులతోనే ప్రారంభమయ్యేది. రాజులు తమ విజయాలను ఈ దేవుడికే అంకితం చేసేవారు.
విజయనగర సామ్రాజ్య చరిత్రలో అత్యంత గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కేవలం పరాక్రమశాలి మాత్రమే కాదు, అపారమైన భక్తుడు కూడా. 1510 సంవత్సరంలో పట్టాభిషేకం అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదట సందర్శించిన ప్రదేశం విరూపాక్ష స్వామి ఆలయం అని చెబుతారు. ఆయన స్వయంగా విరూపాక్షస్వామిని దర్శించి, బంగారం, వెండి ఆభరణాలు, భూములు, విలువైన కానుకలు సమర్పించారు.
ఆయన కాలంలోనే ఆలయానికి అనేక మండపాలు నిర్మించబడ్డాయి. ప్రాంగణం విస్తరించబడింది. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయని చారిత్రిక కథనాలు చెబుతున్నాయి. నేటికీ ఆలయంలో కనిపించే కొన్ని శాసనాలు... శ్రీకృష్ణదేవరాయల సేవలను గుర్తుచేస్తున్నాయి.
విరూపాక్ష ఆలయం ముందు ఉన్న విశాలమైన వీధిని నేడు "హంపి బజార్"గా పిలుస్తారు. ఒకప్పుడు ఈ వీధి వ్యాపారకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. విదేశాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ గుర్రాలు, ముత్యాలు, రత్నాలు, విలువైన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేవారని చారిత్రక వర్ణనలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఆ బజార్ నిశ్శబ్దంగా కనిపించినా, అక్కడి రాతిమండపాలు ఒక మహా వాణిజ్యనగరపు జ్ఞాపకాలకు నిలయంగా మిగిలాయి.
ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు, వందలాది ఏనుగులు, అశ్వదళాలు, నర్తకులు, సంగీత విద్వాంసులతో, ఈ ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతూ ఉండేదట. అది కేవలం పండుగ కాదు. ఒక మహాసామ్రాజ్యం తన వైభవాన్ని ప్రపంచానికి చూపించే సందర్భం.
ఇక విరూపాక్ష దేవాలయం గురించి ముందుగా చెప్పుకోవలసింది ఆజగోపురం. నేడు మనం చూస్తున్న మహా రాజగోపురం విజయనగర కాలంలోనే విస్తరించబడింది. సుమారు 50 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గోపురం దూరం నుంచే కనిపిస్తుంది. ఇది కేవలం ప్రవేశ ద్వారం కాదు. ఒక శిల్పకళా గ్రంథం. ప్రతి అంతస్తులో దేవతలు, గంధర్వులు, యక్షులు, శివుని వివిధ రూపాలు అద్భుతంగా చెక్కబడ్డాయి.
"దేవాలయాన్ని చూడటం ఒక అనుభవం. కానీ విరూపాక్ష ఆలయాన్ని అర్థం చేసుకోవడం ఒక యాత్ర. ఎందుకంటే ఇక్కడ ప్రతి రాయి మాట్లాడుతుంది. ప్రతి స్తంభం ఒక చరిత్రను చెబుతుంది. ప్రతి శిల్పం ఒక పురాణాన్ని సజీవంగా నిలబెడుతుంది."
దూరం నుంచే కనిపించే ఈ రాజగోపురం హంపి గుర్తింపుగా నిలిచింది. సుమారు 50 మీటర్ల ఎత్తు కలిగిన ఈ గోపురం విజయనగర నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణ. దిగువభాగం బలమైన గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. పై భాగాలు ఇటుక, సున్నం మోర్టార్‌తో నిర్మించారు. ఈ విధానం వల్ల ఎత్తు పెరిగినా నిర్మాణం స్థిరంగా నిలిచింది. గోపురం ప్రతి అంతస్తులో శివుడు, పార్వతి, గణేశుడు, కార్తికేయుడు, యక్షులు, గంధర్వులు, దేవగణాలు, పౌరాణిక రూపాలు కనిపిస్తాయి. గోపురం పైభాగంలో ఉన్న కలశం కేవలం అలంకారం మాత్రమే కాదు... అది దేవాలయ పరిపూర్ణతకు ప్రతీకగా భావించబడుతుంది.
గోపురం దాటి లోపలికి అడుగుపెడితే విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. పురాతన కాలంలో ఇక్కడే ఉత్సవాలు, రథయాత్రలు, నృత్యాలు, వేదపారాయణలు జరిగేవి. రాజులు కూడా ప్రజలతో కలిసి ఇక్కడే పూజల్లో పాల్గొనేవారు. ఇక్కడి ధ్వజస్తంభం విజయానికి ప్రతీకగా చెబుతారు. పురాతన కాలంలో దూరం నుంచి వచ్చిన యాత్రికులు ఈ ధ్వజస్తంభాన్ని చూసి ఆలయానికి చేరుకున్నామని తెలుసుకునేవారట.
ఇక శివాలయం అంటే నంది తప్పనిసరి. విరూపాక్ష ఆలయంలో కూడా నంది మహాదేవుని వైపు ప్రశాంతంగా దర్శనమిస్తాడు. శైవ సంప్రదాయం ప్రకారం, శివుడిని దర్శించే ముందు నందిని నమస్కరించడం శుభప్రదంగా భావిస్తారు. నంది చెవిలో మన కోరిక చెప్పితే అది శివునికి చేరుతుందని భక్తుల విశ్వాసం.
ఆలయంలో అద్భుతం రంగమండపం. ఈ మండపంలోని ప్రతి స్తంభం ఒక కళాఖండం. ఈ మండపంలో పురాతన కళారూపాలు, యాళీలు, గుర్రాలు, ఏనుగులు, నర్తకులు, సంగీత విద్వాంసులు, దేవతలు, ఋషులు, యోధుల శిల్పాలు దర్శనమిస్తాయి.
ఒకే రాతిలో ఇంత సున్నితంగా శిల్పాలు చెక్కడం విజయనగర శిల్పుల అసాధారణ ప్రతిభను తెలియజేస్తుంది. కొన్ని స్తంభాలపై నృత్య భంగిమలు కనిపిస్తాయి. ఇవి ఆ కాలపు నాట్య సంప్రదాయాలకు సంబంధించిన విలువైన సమాచారం ఇస్తాయి.
దేవాలయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం గర్భగుడి. ఇక్కడ విరూపాక్షస్వామి లింగరూపంలో కొలువై ఉన్నారు. వేలాది మంది భక్తులు ప్రతిరోజూ దర్శనం చేసుకుంటారు. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి శయనోత్సవం వరకు పూజలు కొనసాగుతాయి. హంపిలోని చాలా దేవాలయాలు ఇప్పుడు పురావస్తు కట్టడాలుగా, శిథిలాలయాలుగా మారిపోయినా, విరూపాక్ష ఆలయం మాత్రం సజీవ ఆరాధనా కేంద్రంగా నిలిచింది.
ఇక హంపి విరూపాక్ష ఆలయంలో మహాశివరాత్రి, ఫాల్గుణ రదోత్సవం అంత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా విరూపాక్ష ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, వేదపారాయణాలు, రుద్రాభిషేకాలు, రాత్రంతా భజనలు, దీపాల వెలుగులో మెరిసే ఆలయం, ఈ దృశ్యం ప్రతి భక్తుడికి అపూర్వమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఫాల్గుణ రధోత్సవం రోజు విరూపాక్షస్వామి, పంపాదేవి ఉత్సవమూర్తులను సంప్రదాయ రథంపై ఊరేగిస్తారు. వేలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ "హర హర మహాదేవ" నినాదాలతో ముందుకు సాగుతారు. ఇది హంపిలో అత్యంత ముఖ్యమైన వార్షిక ఉత్సవాల్లో ఒకటి.
హంపి విరూపాక్ష దేవాలయంలో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఒక అద్బుతం, సహజ పిన్‌హోల్ కెమెరా ప్రభావం. గోపురం ప్రతిబింబం ఒక చిన్న రంధ్రం ద్వారా లోపలి గోడపై తలకిందులుగా కనిపించే సహజ పిన్‌హోల్ కెమెరా ప్రభావం. ఆలయంలోని ఒక చిన్న చీకటి గదిలో గోడపై రాజగోపురం తలకిందులుగా కనిపిస్తుంది. ఇది అద్దం కాదు. మాయ కాదు. ఇది శాస్త్రం. గోడలోని చిన్న రంధ్రంగుండా వచ్చే కాంతి నేరుగా ఎదురుగా ఉన్న ఉపరితలంపై గోపురం ప్రతిబింబాన్ని తలకిందులుగా ఏర్పరుస్తుంది. ఈ సూత్రాన్నే నేడు పిన్‌హోల్ కెమెరా అని పిలుస్తాం. ఇది కెమెరా ఆవిష్కరణకు ముందు నుంచే తెలిసిన ఒక ప్రాథమిక ఆప్టిక్స్ సూత్రం. విరూపాక్ష ఆలయంలో కనిపించే ఈ ప్రభావం భారతీయ శిల్పులు, వాస్తుశిల్పులు కాంతి స్వభావాన్ని గమనించి ఉండవచ్చని సూచిస్తుంది. అయితే, ఈ నిర్మాణం వెనుక ఖచ్చితమైన ఉద్దేశం ఏమిటన్నది చరిత్రకారుల మధ్య ఇంకా పరిశోధనలో ఉన్న అంశమే. శతాబ్దాల క్రితమే కాంతి ప్రయాణ సూత్రాలను అర్థం చేసుకుని నిర్మించిన ఈ అద్భుతం, భారతీయుల శాస్త్రీయ అవగాహనకు నిదర్శనం.
విరూపాక్ష ఆలయంలోని మరో విశిష్టత శిల్పాలు. ఇక్కడి శిల్పాలు కేవలం అలంకరణ కోసం మాత్రమె కాదు. ప్రతి శిల్పం ఒక సందేశం ఇస్తుంది. ఒకచోట శివతాండవం. మరోచోట గణపతి. ఇంకొకచోట సప్తమాతృకలు. కొన్ని చోట్ల రామాయణ, మహాభారత ఘట్టాలు. మరికొన్ని చోట్ల రాజసభ దృశ్యాలు. ఇవి ఆ కాలపు మతం, సంస్కృతి, సామాజిక జీవనం, కళాభిరుచిని చెప్తాయి.
విరూపాక్ష ఆలయం కేవలం అందానికే కాదు, శాస్త్రీయతాక కూడా పెట్టింది పేరు. సహజ గాలి ప్రసరణకు అనుకూలంగా మండపాలు. వేసవిలో కూడా చల్లదనాన్ని నిలుపుకునే రాతి నిర్మాణం. భారీ వర్షాలను తట్టుకునే నీటిపారుదల వ్యవస్థ. శతాబ్దాలపాటు నిలిచే బలమైన గ్రానైట్ పునాదులు. ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని భారతీయ వాస్తుశిల్పంలో ఒక అద్భుతంగా నిలబెట్టాయి.
హంపి... ముఖ్యంగా హంపి వైభవాన్ని మనకు తెలియజేసే ముఖ్య ఆధారాల్లో విదేశీ యాత్రికుల రచనలు కూడా ఉన్నాయి. డొమింగో పేస్ అనే పోర్చుగీస్ యాత్రికుడు 16వ శతాబ్దంలో హంపిని సందర్శించాడు. ఆయన హంపిని చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యాడట. అతని వర్ణనలో... "ఇంత పెద్ద నగరం, ఇంత సంపద, ఇంత జనసంచారం నేను ఎక్కడా చూడలేదు" అని పేర్కొన్నాడు.
మరో పోర్చుగీస్ యాత్రికుడు ఫెర్నావ్ నూనిజ్ కూడా విజయనగర రాజధాని వైభవాన్ని, దేవాలయాల గొప్పతనాన్ని, ఉత్సవాల వైభవాన్ని తన రచనల్లో వివరించాడు. వారి వర్ణనల ద్వారా, విరూపాక్ష ఆలయం కేవలం మతపరమైన కేంద్రం మాత్రమే కాకుండా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితానికి కూడా కేంద్రబిందువుగా ఉన్నట్లు తెలుస్తుంది.
హంపి విరూపాక్ష ఆలయానికి సంబంధించి ఇదంతా ఒక ఎత్తయితే మరో కోణం కూడా ఉంది. విజయనగర సామ్రాజ్యం అంతరించిపోయింది. రాజులు చరిత్రలో కలిసిపోయారు. రాజభవనాలు, ఆలయాలు శిథిలాలుగా మారిపోయాయి. కానీ ఒకచోట మాత్రం ఇప్పటికీ ప్రతిరోజూ గంట మోగుతోంది. ప్రతి ఉదయం అభిషేకం జరుగుతోంది. అదే హంపి విరూపాక్ష స్వామి ఆలయం."
అది 1565. దక్షిణ భారతదేశ చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని సంవత్సరం. విజయనగర సామ్రాజ్యానికి చెందిన సేనలు, దక్కన్ సుల్తానుల కూటమితో తళ్లికోట యుద్ధంలో తలపడ్డాయి. ఆ యుద్ధంలో విజయనగర సేనలు ఓడిపోయాయి. ఆ తరువాత హంపి నగరం దోపిడీకి గురైంది. చరిత్రకారుల వర్ణనల ప్రకారం, అనేక దేవాలయాలు, రాజమహళ్లు, మండపాలు, బజార్లు ధ్వంసమయ్యాయి. ఒకప్పుడు వేలాది దీపాలతో వెలిగిన నగరం, కొన్ని రోజుల వ్యవధిలోనే నిశ్శబ్ద శిథిలంగా మారిపోయింది. అయితే ఈ విధ్వంసం మధ్య కూడా ఒక ఆలయం తన ఆధ్యాత్మిక జీవనాన్ని కోల్పోలేదు. అదే విరూపాక్ష ఆలయం.
ఈ ఆలయంలో పూజలు పూర్తిగా నిలిచిపోలేదు. స్థానిక భక్తుల సంప్రదాయం, పూజారుల సేవల వల్ల ఈ క్షేత్రం నిరంతర ఆరాధనా కేంద్రంగా కొనసాగిందని చరిత్ర చెబుతోంది. హంపిలో అత్యంత పురాతనమైన, నేటికీ నేటికీ నిరంతర, నిత్యపూజలు పూజలు జరుగుతున్న అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి.
విరూపాక్ష ఆలయం వెనుక భాగంలో ఉన్న హేమకూట కొండపై అనేక చిన్న శివాలయాలు ఉన్నాయి. ఇక్కడినుంచి చూస్తె, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో హంపి మొత్తం బంగారురంగులో మెరిసిపోతూ కనబడుతుంది. ఫోటోగ్రాఫర్లకు ఇది స్వర్గం లాంటిది.
వింటుంటేనే వెంటనే చూడాలనిపిస్తోంది కదూ... ఒక్క ఆలయం గురించి వింటేనే ఇలా ఉంటే హంపి లోని మిగిలిన ఆలయాలు, అందమైన ప్రదేశాలు గురించి వింటే ఎలా ఉంటుంది. అందుకే హంపిలోని మిగిలిన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాల గురించి రేపటి బ్లాగ్ లో తెలుసుకుందాం.