5 ప్రసిద్ధ గుహాలయాలు | తప్పక చూడవలసిన అద్భుతాలు | 5 famous cave temples in idia

Vijaya Lakshmi

Published on Sep 08 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

భారతదేశం ఎన్నో అద్భుతమైన ప్రదేశాలకు నిలయం. శతాబ్ధాల నాటి గొప్ప శిల్పకళ, వారసత్వ నిర్మాణాలు ఈనాటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి గుహాలయాలు. కొండలను తొలిచి వాటిని గుహాలయాలుగా మలచిన తీరు అద్భుతం, అనిర్వచనీయం. శతాబ్దాల నాటి గుహాలయాలు మరికొన్ని శతాబ్ధాలు గడిచినా చరిత్రకు సాక్ష్యాలుగా చెక్కుచెదరకుండా నిలుస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు


అలాంటి అద్భుతమైన 5 గుహాలయాల గురించి చూద్దాం...


ఝర్ని నరసింహ గుహాలయం


మానసిక విశ్రాంతి కోసం, రొటీన్ లైఫ్ నుంచి ఒకింత మార్పు కోసం యాత్రలు, విహార యాత్రల పేరుతో ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాం. అలా వెళ్తున్నప్పుడు పుణ్యం పురుషార్ధం అన్నట్టుగా ఇటు దైవదర్శనం, అటు విహార యాత్రకు అవకాశాముండే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అలా రెండింటి అనుభవాన్ని మనకందించే గుహాలయం కర్నాటక రాష్రం బీదర్ లో మంగళ్ పేట్ లో వెలసిన నరసింహస్వామి గుహాలయం.


క్రీ.పూ 400 ల ఏళ్ల నుంచి స్వామి ఈ గుహాలయంలో కొలువు తీరినట్టు స్థల పురాణం చెప్తోంది. మిగిలిన గుహాలయాలకు భిన్నంగా ఉండే ఆలయం ఝార్ని నరసింహస్వామి గుహాలయం.



ఈ స్వామిని జల నరసింహుడు అని పిలుస్తారు. స్వామికి ఈ పేరు రావడానికి, స్వామి ఇక్కడ వెలియడానికి ఒక పురాణ కథనాన్ని చెప్తారు. స్వామి వెలసిన ఈ గుహలో ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్షసుడు శివుడి తపస్సుకు భంగం కలిగిస్తూ చాలా విసిగించేవాడట . అప్పటికే ప్రహ్లాదుని కాపాడడానికి ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్రరూపుడైన నరసింహస్వామి అదే ఆగ్రహముతో ఈ ప్రాంతమునకు వచ్చి శివుని కోరిక మీద లోకకంటకుడైన జలాసురుని సంహరించాడని, ఆ తరువాత జలాసురుని కోరిక మేరకు ఇక్కడి బిలములో మూర్తీభవించి ఉన్నాడని స్థల పురాణం చెప్తోంది.



నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నీరు ప్రవహిస్తూ ఆ గుహలోకి చేరుతుంది. గుహలో గుండెలోతు వరకు నీరు చేరిపోతుంది. ఆ నీటిలోనుంచే నడుస్తూ స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది.


ఈ మందిరము నాలుగు వందల సంవత్సరములకు పూర్వము నిర్మించినట్లు తెలుస్తున్నది. గుండెలోతు నీటిలో దుర్గమమైన జలమార్గము గుండా కొండగుహలో మూడువందల అడుగుల దూరము పయనించి అక్కడ వెలసిన స్వామిని దర్శించడము అద్భుతమైన అనుభవము.


బీదరు పట్టణమునకు నాలుగు కిలోమీటరుల దూరములో ఉన్న మంగళ్ పేటలో వెలసిన ఈ స్వామి సన్నిధికి బీదరు నుండి ఆటో మరియు బస్సు సౌకర్యముకలదు. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో మూడు గంటల ప్రయాణంలో ఉంది బీదర్. హైదరాబాదు నుండి నిరంతర బస్సులు నడుస్తుంటాయి. నాంపల్లి, సికిందరాబాదు స్టేషన్లనుండి రైలు సౌకర్యమున్నది.

ఒళ్ళు గగుర్పొడిచే నాగసాధువుల చరిత్ర

youtube play button



పాతాళ భువనేశ్వర్ గుహాలయం


పాతాళ భువనేశ్వర్ ఆరువేల సంవత్సరాలనాటి గుహాలయం. ఒకప్పుడు ఆ గుహలోనికి వెళ్లినవారు బయటకు వచ్చిన దాఖలాలు లేవని చెప్తారు. గుహలో అంతకంతకు పెరిగిపోతున్న శివలింగం కలియుగాంతం ఎప్పుడవుతుందో సత్యయుగం ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్తుందని భక్తులు నమ్ముతారు. ఇదే కాదు ఇంకెన్నో రహస్యాలకు నిలయం ఆ పాతాళ గుహ.

ఒక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీదేవి మందిరంలోకి వెళ్ళకుండా తనను అడ్డుకున్న బాల గణపతి శిరస్సును ఖండించినట్టు మనం పురాణ కథనాల్లో విన్నాం. అప్పుడు వినాయకుడి ఖండించబడిన శిరస్సు ఈ గుహలోనే పడిందట.



పాతాళ భువనేశ్వర్ ... పేరుకు తగ్గట్టుగానే పాతాళంలోనికి అంటే భూమి నుంచి సుమారు తొంభై అడుగుల లోతుకు వెళితే దర్శనమిస్తాడు శివభగవానుడు. సన్నటి ఇరుకుదారిలో 90 అడుగుల లోతుకి వెళితే ఉంటుంది ఈ గుహ. ఆ గుహలో ఎన్నో రహస్య మార్గాలున్నాయి. అందులో ఒక దారి పాతాళానికి దారి తీస్తే, మరొకటి శివుడి కైలాస పర్వతానికి దారి తీస్తుందని నమ్ముతారు. అతి సన్నటి దారిలో గొలుసుల సాయంతో అతి జాగ్రత్తగా ముందుకు వెళితే అక్కడ లింగరూపంలో దర్శనమిస్తాడు శివభగవానుడు.



శివదేవుడితో పాటు 33 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు కొలువుతీరిన గుహాలయం ఈ పాతాళ భువనేశ్వర్. ఉత్తరాంచల్ రాష్ట్రంలో  పితోడ్ ఘడ్ జిల్లాలో, భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాళ భువనేశ్వర్ గుహలయం ఉంది. పాతాల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీ. ఎగువన ఉన్నది. ఈ గుహలలోనికి వెళ్ళడం ఓ సాహసయాత్రే అని చెప్పొచ్చు.


ఢిల్లీ నుంచి "ఖాట్గోదాం "వరకు ట్రైన్స్ లో వెళ్లి అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. 

"ఖాటగోదాం" నుంచి పాతాళ భువనేశ్వర్ వరకు అంతా ఘాట్ రోడ్డే. ఒక వైపు ఎత్తయిన పర్వతాలు వాటి మీద పొడుగైన కోనిఫర్, దేవదారు వృక్షాలు మరో ప్రక్క అగాధాన్ని తలపించే లోతైన లోయలు.

పాతాళ భువనేశ్వర్ చాల చిన్న గ్రామం . గ్రామం నుంచి 2,3 కిమీ సన్నని కాలి బాటన ప్రయాణిస్తే పాతాళ భువనేశ్వర్ గుహ చేరుకోవచ్చు.


అతి చిన్న ద్వారం లోనుంచి ఒక మనిషి కూర్చొని ప్రక్కల వేలాడుతున్న గొలుసులు పట్టుకొని జాగ్రత్తగా ముందుకు జరుగుతూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా ఓ వంద అడుగులు లోపలికి వెళ్ళిన తరవాత 90 అడుగుల లోతులో 180 మీటర్ల పొడువు ఉన్న గుహల సముదాయం కనబడుతుంది.


భైరవకోన గుహాలయం


భైరవకోన.... అందాలకి ఆటపట్టు, అద్భుతాలకు నెలవు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులలో నల్లమల అడవుల్లో ఉన్న ఓ అద్భుతలోయ భైరవకోన. అంతుచిక్కని రహస్యాలకే కాదు అందానికి, అతిశయానికి కూడా నెలవు నల్లమల అడవులు. అలాంటి రహస్యాల నిలయం నల్లమల అడవుల్లో ఉంది అద్భుతలోయ భైరవకోన. అడవులూ, జలపాతాలేకాదు అంతకు మించిన సుందర దృశ్యాలకు నిలయం భైరవకోన. దట్టమైన చెట్లతో, గలగలా పారే సెలయేళ్ళతో, జలపాతాలతో ఆ అడవి దారుల్లో ప్రయాణం మరచిపోలేని ఓ అద్భుతమైన అనుభవం.



పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పాలించేవాడు కాబట్టి భైరవకోన అనే పేరు వచ్చిందని ఒక కథనం, పూర్వం మునులు భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి భైరవకోన అనే పేరొచ్చిందని మరో కథనం.


ఇలా ఈ క్షేత్రానికి భైరవకోన అని పేరు రావడానికి ఎన్ని కథనాలు వినబడుతున్నా ప్రధానంగా చెప్పుకునే కథనం మాత్రం కృతయుగంతో ముడిపడి ఉంది. కృతయుగంలో ఇక్కడి నృసింహాలయంలో ప్రహ్లాదుడు భైరవున్ని అర్చకుడిగా నియమించాడు. ప్రహ్లాదుడు మరణించిన తరువాత ఆ ఆలయాన్ని పట్టించుకునేవారు లేక బ్రతకడానికి దారిలేక బాధపడుతున్న భైరవుడు క్షుద్బాధభరించ లేక దారిదోపిడీలకు పాల్బడేవాడట.


దాంతో కోపగించుకున్న నృసింహాస్వామి భైరవున్ని, రాక్షసుడిలా దారిదోపిడీలు చేస్తున్న నీవు రాక్షసుడవుకమ్మని శపించాడు. అయితే ఇది తెలిసి చేసినతప్పు కాదు ఆకలి భరించలేకే అలా చేసానని తన పాపానికి పరిహారం సూచించమని భైరవుడు ప్రాదేయ పడ్డాడు. భైరవుడి ప్రార్ధనలకు కరిగిపోయిన నృసింహస్వామి, కలియుగాంతం వరకు తనకంటికి కనిపించకుండా తనభక్తులు తెచ్చినది ఏదైనా తనప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉండమనీ కలియుగనంతరం మళ్లీ తన సేవకు వినియెగించుకుంటానని వరమిచ్చాడు. అప్పటినుంచి భైరవుడు భైరవకోనలో పూజలందుకుంటున్నాడు. అలా భైరవునికి నెలవైన ఆ లోయ భైరవకోనగా పిలువబడుతోంది.

ఈ కోనకు క్షేత్రపాలకుడయిన భైరవునికి ఇక్కడో చిన్న ఆలయం వున్నది.


ఈ భైరవకోన గుహాలయంలో ప్రధానంగా చూడవలసినది రుద్రాలయం. ఇక్కడ ఒకే కొండరాతిలో చెక్కిన తొమ్మిది గుహాలయాలుంటాయి. అన్నీ శివాలయాలే. ఈ గుహాలయాలలో లింగరూపుడైన శివుడు పూజలందుకుంటుంటే, గుహాలయ ప్రవేశ గోడమీద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు చెక్కి వుంటాయి. ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి విగ్రహాలుంటాయి. 

 

ఈ శివాలయాలన్నీ పై వరసలో వుంటే కింద ఆలయంలో ముగ్గురమ్మల మూలపుటమ్మ త్రిముఖ దుర్గదేవిగా దర్శనమిస్తుంది. ఈ దుర్గమ్మ కుడివైపు ముఖం మహాకాళి, మధ్య ఉన్న ముఖం ప్రసన్నవదనంతో ఉన్న మహలక్ష్మి, ఎడమవైపు మహా సరస్వతీదేవి దర్శనమిస్తారు.

ఈ భైరవకోనలో చెప్పుకోవలసిన అద్భుతం పొర్ణమి అందాలు. ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి రోజున చంద్రబింబం, అక్కడి ఆలయాలనికి మూడు అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, ఆ తరువాత దుర్గాదేవి విగ్రహం పై పడుతుంది. అరుదైన ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి వేలాదిమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో భైరవకోనకు తరలివస్తుంటారు.

 

కేదారేశ్వర గుహాలయం


మహారాష్ట్ర లోని  అహమ్మద్ నగర్ జిల్లాలోని  పశ్చిమ కనుమల్లో ఉన్న హరిశ్చంద్రగడ్ కోట. ఆ కోటలోని భోలాశంకరుడి ఆలయం. ఆలయం అనడమే కాని నిజానికి అదొక గుహా. ఆ గుహలో వెలిసాడు పరమేశ్వరుడు లింగారూపుడుగా. సముద్ర మట్టానికి 1424 మీ. ఎత్తున ఉన్న హరిశ్చంద్రగడ్ కోట. మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణాల్లో కూడా ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్టు చెప్తారు.



కాలచూరి వంశీయులు నిర్మించిన కోటలో ఉంది  కేదారేశ్వర గుహాలయం.  ఒక గుహలో కేవలం నాలుగు స్థంబాల మీద పెద్ద బండరాయి పైకప్పు ఉంటుంది. ఆ నాలుగు స్తంభాలే యుగాంతాన్ని చెప్తాయి.


ఈ నాలుగు స్తంభాలు సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగాలకు సంకేతాలు గా నిలబడ్డాయని చెబుతుంటారు.

ఒక్కో యుగాంతానికి ఒక్కో స్తంభం అంటే సత్య యుగాంతానికి ఒక స్థంభం విరిగిపోయి మూడు స్తంభాల మీద ఆలయం నిలబడింది. త్రేతాయుగం అనటంలో ఒక స్థంభం, ద్వాపరయుగం అంతంలో ఒక స్థంభం ఇలా మూడు యుగాలు అంతమయినపుడు ఒక్కో స్తంభం విరిగిపోయి ప్రస్తుతం నాలుగవదయిన కలియుగంలో ఉన్నాం కాబట్టి ఒక్క స్థంభం మీదే ఆ ఆలయం నిలబడింది. ఈ నాలుగో స్తంభం కూడా ఎప్పుడు విరిగిపోతుందో అప్పుడే కలియుగం అంతమయిపోతుందని ఒక కథనం ప్రచారంలో ఉంది. గుహలో విరిగిన మూడు స్థంబాలు ఒక్క స్థంభం మీద నిలబడిన బండను కూడా చూడొచ్చు.


గుడి నాలుగు గోడలు నుండి ప్రతి రోజు నీరు వస్తూనే వుంటుంది. ఆ నీరు ఎక్కడినుంచి వస్తుందన్నది మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. మరో విచిత్రం శీతాకాలంలోనూ, వేసవి కాలంలోను కూడా అయిదడుగుల ఎత్తున నీరుండే ఈ గుడిలో చిత్రంగా వర్షాకాలంలో మాత్రం చుక్కనీరుండదట.


అమర్ నాథ్ గుహాలయం


గుహాలయం అనగానే ప్రముఖంగా చెప్పుకోవలసినది అమర్ నాథ్ గుహాలయం. అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం.  జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో 3,888 మీటర్ల ఎత్తులో ఉంది అమర్నాథ్ . 


40మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచ భూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జలరూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమకోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి, సందర్శనకు వీలుగా ఉంటుంది.  ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు.



అమర్నాథ్ కేవలం ఒక గుహాలయానికి సంబంధించిన కథనం విషయానికి వస్తే  ఒకానొక సందర్భంలో పార్వతి దేవి, తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని శివుణ్ణి కోరిందట. అయితే ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా, ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకని ఎవ్వరూ లేని ప్రాంతంతో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడట పరమేశ్వరుడు. అందుకని ఏ ప్రాణీ చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకొన్నాడట.


అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సమయంలో. ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నదట. అప్పటినుంచీ ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు. అమర్నాథ్ యాత్రికులు కొందరు తాము ఆ పావురాలను చూశామని కూడా చెబుతుంటారు.

ఈ భూమ్మీద నుంచి పార్వతీపరమేశ్వరులు అంతర్థానం అయ్యింది కూడా ఇక్కడే అని చెబుతారు. శ్రీనగర్కు ఓ వంద కిలోమీటర్ల దూరంలో పెహల్గావ్ అనే గ్రామం ఉంది. దీనిని ‘బైల్ గావ్’ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట.



ఇక చందన్వారీలో తన సిగలోని చంద్రుడినీ, శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములనీ, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడినీ, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలనీ విడిచారని చెబుతారు.


అమర్నాథ్ కి  చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. శ్రీనగర్ నుంచి బాల్తాల్కు చేరుకుని అక్కడి నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు చేరుకోవడం ఒక మార్గం. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. పైగా సహాయానికి ఎవ్వరూ ఉండరు.అందుకే ఈ మార్గం ద్వారా ఎవ్వరూ వెళ్లారు.


ఇక మరో దారి పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి... అక్కడి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకునేది. ఈ దారు కాస్త దూరమైనా, శివుడు ఈ మార్గం గుండానే నడిచి వెళ్ళాడు అన్న నమ్మకంతో చాలామంది యాత్రికులు ఈ మార్గం ద్వారానే వెళ్తారు.


రక్తం గడ్డకట్టించే చలిలో, కాలు జారితే ఎ అగాధపు లోయలలోకి జారిపోతామో తెలియని ఆందోళనతో ... ఎంతో శ్రమకి ఓర్చి చేయాల్సిన ఈ యాత్ర కోసం ఇన్ని కష్టాలు పడలేం అనుకునేవారికి జమ్ము, శ్రీనగర్, పెహల్గావ్ల నుంచి పంచతరణి వరకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. దాదాపు 130 అడుగులుండే ఈ గుహలో ప్రవేశించాక మంచులింగం రూపంలో మనకు దర్శనమిస్తాడు శివయ్య.


ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు. కేవలం ఎండాకాలం వచ్చేసరికే ఇక్కడి మంచు లింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటిబొట్లు ఆ సమయంలో ఓ లింగాకారంలోకి మారతాయి. ఇలా పది కాదు వందకాదు వేల సంవత్సరాల నుంచీ జరుగుతోందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది.


అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై సాధారణంగా రాఖీపౌర్ణమి రోజున ముగుస్తుంది. ఈ యాత్ర చేయాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ యాత్రను పర్యవేక్షించే Shri Amarnathji Shrine Board వెబ్సైట్ ద్వారా రిజిస్టరు చేసుకోవాలి. బోర్డు సూచించిన బ్యాంకులో తగిన దరఖాస్తు చేసుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నామన్న వైద్యపరీక్షల నివేదికను కూడా జత చేసి అమర్నాథ్ యాత్ర అధికారికి పంపాలి. ఆ పత్రాలన్నింటినీ పరిశీలించి. సదరు అధికారి అంగీకరించిన తర్వాతే, ఆయన సూచించిన రోజునే అమర్నాథ్కు ప్రవేశం లభిస్తుంది.

 

 

 

Recent Posts