Vijaya Lakshmi
Published on Oct 10 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఆరోజు నాటకం రిహార్సల్స్ కి వెళ్లడానికి బయలుదేరుతుండగా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది అనిత. ఆమెను చూడగానే ఆనందంగా ఎదురొచ్చింది తార... “ఎన్నాళ్లకు కనిపించావే అనూ...” అంటూ.
“సరేలే! నువ్విప్పుడు ఉత్తమ నటివి కదా! నేను గుర్తుంటానో... లేదో... అనుకున్నాను.” అంది అనిత.
“అదేం మాట అను!”
“కాకపోతే ఏంటి? మన పరీక్షలు అయ్యి ఇన్నాళ్లు అయింది... ఒక్కసారైనా మా ఇంటికి వచ్చావా? అయినా నన్ను చూడాలని నీకు ఉంటే కదా!”
“అదేం లేదులే అను! ఈ నాటకాల్లో పడి టైం దొరకడం లేదు. ఇప్పుడు నేను మరో మూడు నాటకాలు నటిస్తున్నాను”
“ఓ... కంగ్రాట్స్” మనస్ఫూర్తిగా చెప్పింది అనిత.
“థాంక్యూ. ఇకనైనా నీకు కోపం పోయిందా? ఇప్పుడు చెప్పు... ఏమిటి విశేషాలు?”
“విశేషాలు ఏంటని నెమ్మదిగా అడుగుతున్నావా? మన జాతకాలు బయటపడేది రేపే. అబ్బా... అలా తెల్లమొహం వెయ్యకే బాబు! రేపు మన రిజల్ట్స్ వస్తాయట. ఇప్పుడే పేపర్లో పనిచేస్తున్న మా కజిన్ ఒకతను చెప్పాడు. సాయంత్రం ఫోన్ చేసి నెంబర్ చెప్తే, రిజల్ట్ చెప్తానన్నాడు. నీ నెంబర్ కూడా తీసుకుందామని వచ్చాను.” ఉద్వేగంగా చెప్పింది అనిత.
రిజల్ట్స్ మాట వినగానే తార గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సరిగ్గా పరీక్షల ముందే వచ్చిన నాటకాల అవకాశం గురించి ఆలోచిస్తూ చదువు మీద మనసు లగ్నం చేయలేకపోయింది. పరీక్షలు ఏదో అంతంతమాత్రంగానే రాసింది. పాస్ అవుతానని నమ్మకం ఎంత మాత్రం లేదు. అయినా ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న ఆశ. ఆ ఆశతోనే నెంబర్ ఇచ్చింది అనితకు.
మరో రెండు గంటల్లోనే మొహం వేలాడేసుకుంటూ వచ్చింది అనిత. ఆమె మొహం చూడగానే అర్థమైంది తారకు.
“అనూ... ఏంటలా ఉన్నావ్? పరీక్ష ఏమైంది?” బెరుగ్గా అడిగింది.
“పాసయ్యాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది.”
తన పరీక్ష ఏమైందో అడగాలనుంది తారకు. కానీ ఫలితం చెప్పకనేచెబుతున్నట్టుగా... విచారంగా ఉన్న అనిత మొహం చూసి ఆ ధైర్యం చేయలేకపోయింది.
“ఐయాం సారీ! నీకు... నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వు ఫెయిల్ అయ్యావు” బాధగా చెప్పింది అనిత. ఆమెలో... తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అనే సంతోషం కంటే, ప్రాణ స్నేహితురాలి పరీక్ష పోయిందే అన్న విచారమే ఎక్కువగా కనబడింది.
తార ఏం మాట్లాడలేదు. “తరుణి విద్యార్థి నాటక స్థలిన్ బడిన ముప్పు వాటిల్లును చల్ల చల్లగా” అన్న సూక్తి తన పాలిట నిజమైందన్నమాట... అనుకుంది. ‘ఈ వార్త అమ్మకి ఎలా చెప్పాలి? ‘ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకు... పెళ్లి చేసి పంపించక’ అన్న బంధువుల మాటలను కూడా పట్టించుకోకుండా, తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న ఆశతో, ఎంతో కష్టానికి, అవమానాలకు ఓర్చుకొని తనను చదివించిన అమ్మకు మొహం ఎలా చూపగలదు. అందులోనూ ఆవిడ ఇప్పుడిప్పుడే తన మీద కోపాన్ని పక్కనపెట్టి కొద్దిగా మాట్లాడుతోంది. ఇప్పుడు ఈ వార్త వింటే ఎలా రిసీవ్ చేసుకుంటుందో?’ అని భయంగా ఉంది తారకు.
ముందు ముందు తన ఎదుర్కోబోయే భయంకర పరిణామాల సంగతి తెలిస్తే ఈ చిన్న విషయానికి ఆమె అంతగా భయపడేది కాదేమో!
ఆ మర్నాడు తార భయపడ్డ క్షణం రానే వచ్చింది. పేపర్లో వచ్చిన రిజల్ట్స్ చూసి అడిగింది పార్వతి, “తారా! రిజల్ట్స్ వచ్చినట్టు ఉన్నాయి. నీ నెంబర్ చూసుకున్నావా?”
మౌనంగా ఉండిపోయింది తార. “తారా! నిన్నే! పేపర్ చూసావా?”
“నేను ఫెయిల్ అయ్యానమ్మా” తలంచుకుని మెల్లగా చెప్పింది.
తెల్లబోయింది పార్వతి. “ఫెయిల్ అయ్యావా! ఇప్పటివరకు పరీక్ష పోవడం తెలియని నువ్వు, ఫెయిల్ అయ్యావా? అయితే అపజయాల పరంపరం మొదలైందన్నమాట!” దీర్ఘంగా నిట్టూర్చింది. కూతురి నాటకాల పిచ్చే పరీక్ష పోవడానికి కారణమని ఆవిడ నమ్మకం.
ఇంతలో బయట పోస్ట్ అన్న కేక వినబడడంతో, బయటకెళ్ళి ఒక కవర్ పట్టుకొచ్చింది పార్వతి. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చదవడం మొదలుపెట్టింది. ఉత్తరం పూర్తయ్యేసరికి గుండె పట్టుకున్నట్టయి పక్కకు ఒరిగిపోయింది. ఆందోళనగా తల్లిని సమీపించింది తార.
“అమ్మ... అమ్మ... ఏమైందమ్మా!” అంటూ తల్లిని కుదుపుతూ పిలవ సాగింది.
అతి కష్టంమీద తలెత్తి చూసింది పార్వతి. కానీ ఏం మాట్లాడలేకపోతోంది. ఒళ్లంతా చెమటలు పట్టేసాయ్. శరీరం అంతా విపరీతంగా వణుకుతోంది. భరింపశక్యంకాని బాధను అనుభవిస్తున్నట్టుగా ఉంది ఆమె వదనం. కళ్ళ నుంచి ధారపాతంగా నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్లకు కారణం... ఆమె అనుభవిస్తున్న కష్టమో లేక ఉత్తరంలోని సారాంశమో అర్థం కాలేదు తారకు.
గబగబా పక్కింటామెను పిలిచి చూస్తుండమని చెప్పి, తను వెళ్లి వీధి చివరన ఉన్న డాక్టర్ ని పిలుచుకొచ్చింది. పార్వతిని పరీక్షించి ఇంజక్షన్ చేశాడు డాక్టర్. అంతగా భయపడవలసిన అవసరం లేదని, అయితే ఆమెకు శారీరకంగా... మానసికంగా కష్టం కలిగించకూడదని చెప్పి, కొన్ని మందులు రాసిచ్చి అవి ఎలా వాడాలో చెప్పి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా చూసుకోమని, అవసరమైతే తనను పిలవమని చెప్పి పక్కింటావిడ కూడా వెళ్ళిపోయింది.
తల్లి మంచం పక్కగా కుర్చీ వేసుకుని కూర్చుంది తార. డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ ప్రభావం వల్ల పార్వతికి బాధ కాస్త తగ్గినట్టుంది. ముఖం ప్రశాంతంగా ఉంది. నిద్రపోతున్న తల్లిని ఓసారి చూసి, మెల్లగా తల్లి పక్కన పడి ఉన్న ఉత్తరాన్ని అందుకుని చదివింది. కొన్ని రోజుల క్రితం తనను చూసి వెళ్ళిన పెళ్లి వారి దగ్గర నుండి వచ్చిందా సందేశం. తను నాటకాలు వేస్తున్న విషయం ఇటీవలే వాళ్లకు తెలిసిందట. ఈ సంగతి ముందుగా చెప్పనందుకు తన తల్లిని తప్పుబడుతూ, తమది చాలా గౌరవనీయమైన కుటుంబం అని, నాటకాల పిల్లను కోడలిగా చేసుకుని తమ మర్యాదకు మచ్చ తెచ్చుకోలేమని రాశారు. తల్లి అకస్మాత్తుగా అలా పడిపోవడానికి కారణం ఇప్పుడు బాగా అర్థమైంది తారకు. ఛీ... ఛీ... ఎంత సంస్కారం లేని మనుషులు! తమకి ఇష్టం లేకపోతే ఆ విషయం సున్నితంగా తెలియచెప్పొచ్చు కదా. ఎదుటి వాళ్ళ మనసులను తూట్లు పొడిచేలా... ఇంత క్రూరంగా తెలియజేయాలా! అనుకుంది. ఈ సంబంధం తప్పిపోవడం కూడా ఒక విధంగా మంచిదే అనిపించింది తారకు. వాళ్ళ కోరికల్ని తీర్చడానికి గాను తమకున్న ఒకే ఒక్క స్థిరాస్తి అయిన ఈ ఇల్లు కూడా అమ్మడానికి సిద్ధపడింది తల్లి. ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తే... ఇక తల్లి ఎక్కడ ఉంటుందని దిగులు పట్టుకుందామెకు. ఈ ఉత్తరంతో ఆ దిగులు కాస్త తీరిపోయింది.
తల్లి కొద్దిగా కదలడంతో లేచి అటు వెళ్ళింది తార. “ఇప్పుడెలా ఉందమ్మా?” తల్లి పక్కన కూర్చుంటూ అడిగింది.
బాగానే ఉందన్నట్టుగా తలాడించిందావిడ. “ఇప్పుడే వస్తానుండు...” అంటూ వంట గదిలోకి వెళ్లి హార్లిక్స్ కలిపి తెచ్చింది. తల్లి చేత తాగించి, ఆమెకివ్వాల్సిన మందులు ఇచ్చి పడుకోబెట్టింది. నిండుగా దుప్పటి కప్పి వెళ్ళబోతున్న కూతురి చెయ్యి పట్టుకుని దగ్గరగా కూర్చోబెట్టుకుంది పార్వతి. అప్పటికే ఆవిడ కళ్ళు నీటితో నిండుకున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత చూసుకుంటున్న దానిలా కూతురివైపు తదేకంగా చూడసాగింది. ఆ చూపులో, ‘తన బిడ్డ భవిష్యత్తు ఏం కానుందో?’ అన్న భయం దిగులు ప్రస్ఫుటంగా వ్యక్తం అవుతున్నాయి. పార్వతికి కూతురు మీదున్న కోపం ఈ సంఘటనతో మటుమాయమై దాని స్థానే ఆ పిల్ల జీవితం ఏమలుపు తిరుగుతుందో అన్న భయం పట్టుకుంది.
“ఏంటమ్మా... అలా చూస్తున్నావ్?” అడిగింది తల్లి చూపులను గమనించిన తార.
ఏం లేదన్నట్టు తలాడించింది పార్వతి. కూతురు చేతిని మాత్రం వదల్లేదు. అది పట్టుకునే అలా నిద్రలోకి జారిపోయింది.
******************
ఆరోజు రిహార్సల్స్ రూమ్ లోకి అడుగుపెట్టేసరికి, అక్కడి వాతావరణంలో ఏదో తేడా కనిపించింది తారకు. దేని గురించో తీవ్రంగా చర్చించుకుంటున్నారంతా. తనను చూడగానే గబగబా దగ్గరకు చేరింది తల్లి వేషాలు వేసే సుబ్బలక్ష్మి. “ఇది విన్నావా తారా?” అని అడిగింది.
“ఏంటండీ”
“నీ స్నేహితురాలు... అదే ఆ జ్యోత్స్న ఇల్లు విడిచి వెళ్లిపోయిందట”
“వ్వా..ట్! జ్యోత్స్న ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయిందా!? మీరు చెప్పేది నిజమా?”
“నిజమా? అని నెమ్మదిగా అడుగుతున్నావా? అంతగా నీకు నమ్మకం కుదరకపోతే ఇక్కడున్న ఎవరినైనా అడుగు తెలుస్తుంది. నేను చెప్పేది నిజమో... అబద్దమో...” గట్టిగా నొక్కి చెప్పింది సుబ్బలక్ష్మి.
“అవును తారా! జ్యోత్స్న మౌళి సహాయంతో చిన్న రూమ్ తీసుకుని ఉంటుందట” విషయాన్ని రూడి చేసింది సహనటి భారతి.
తల తిరిగినట్టు అయింది తారకు. ‘తల్లిదండ్రులని వదిలి వేరుగా ఉండాల్సిన అవసరం ఏం వచ్చింది జ్యోత్స్నకు? అందులోనూ... మౌళిని నమ్ముకోవడం అనేది’ తారకు మింగుడు పడని విషయంగా ఉంది. మౌళి ఎలాంటివాడనే విషయం చూచాయిగా తెలుసు తారకు. అతనికి నటుడిగా కంటే ఓ బ్రోకర్ గానే చూస్తారు చాలామంది. అతనికి చాలామంది ఆడపిల్లలతో సంబంధాలు ఉన్నాయని, జోత్స్నలాంటి అమాయకురాళ్లను వేషాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి, తర్వాత బ్లాక్ మెయిలింగ్ ద్వారా డబ్బు గుంజుకోవడం అతని ప్రవృత్తి అని చెప్పుకుంటారు. ‘అలాంటి వాడిని నమ్మి, కన్న వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరమేమొచ్చింది జ్యోత్స్నాకు?’ రకరకాల అనుమానాలు వేధించసాగాయి తారను. కానీ అవేం బయట పెట్టలేదు ఆమె.
అప్పటికే జ్యోత్స్న గురించి బాగా చర్చ జరుగుతోంది. అక్కడి వారిలో, ఆ అమ్మాయి ప్రవర్తనలో అంతవరకు కనపడని లోపాలన్నీ ఇప్పుడు పెద్ద నేరాలుగా కనబడుతున్నాయి వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో తన అనుమానాలు బయటపెట్టి, వారి చర్చలను ఇంకా ఇంకా పొడిగించే అవకాశం ఇవ్వడం ఇష్టం లేకపోయిందామెకు. అందుకే మౌనంగా ఉండిపోయింది.
జోత్స్న అడ్రస్ సంపాదించి, ఆ సాయంత్రమే ఆమె దగ్గరకు బయలుదేరింది. తారను చూడగానే జోత్స్న ముఖంలోకి సంతోషం పొంగి వచ్చింది.
“రా అక్కా!” ఆనందంగా ఆహ్వానించింది. ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఏ ఏ నాటకాల్లో వేషాలు వేస్తున్నారు... సహనటులు ఎవరు... మొదలైన విషయాల దగ్గర నుంచి, ఇంటి విషయాల వైపు మళ్ళింది సంభాషణ.
“జోత్స్న! నువ్వేం అనుకోనంటే నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. అడగనా?:
కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది జోత్స్న. తర్వాత నెమ్మదిగా అంది. “నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసక్కా! నేను ఇల్లు విడిచి వచ్చేసిన సంగతే కదా! ఊహ తెలిసినప్పటినుండి... టీవీలో నాటకాలు సినిమాలు చూస్తుంటే, నేను కూడా అందులో హీరోయిన్ లా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించేది. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళలాగే నేను నటిస్తూ సంతోషపడేదాన్ని. నా అనుకరణను, నటనను చూసి ఇంట్లో వాళ్ళు సరదా పడి మెచ్చుకునేవారు. కానీ నాలో మాత్రం ఎప్పటికైనా నటినవ్వాలన్న కోరిక స్థిరపడిపోయింది. వయసుతోపాటు ఆ కోరిక కూడా పెరిగి పెద్దదయింది. అదే ప్రధాన లక్ష్యంగా మారింది. చిన్నతనంలో నా నటనను చూసి ముచ్చటపడిన అమ్మానాన్నలు నేను పెద్దయ్యాక నటించడానికి మాత్రం ససేమిరా అన్నారు. ఏదో మొదట్లో కొంత వరకు ఒప్పించగలిగినా... అదే వృత్తిగా తీసుకోవడానికి మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. నాకేమో ఇప్పుడిప్పుడే మౌళి సహాయంతో టీవీ సీరియల్స్ లో అవకాశాలు వస్తున్నాయి. కానీ.. అమ్మా వాళ్లకు నేను మౌలితో స్నేహం చేయడం కూడా ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? నా లక్ష్యం చేరుకోవడానికి నాకు ఇంతకంటే మార్గం కనబడలేదు. అందుకే బయటకు వచ్చేసాను. నేను తప్పు చేశానా అక్కా?” అమాయకంగా అడిగింది జ్యోత్స్న అంతా చెప్పి.
“నువ్వు తొందర పడ్డావేమోనమ్మా! నీకు బంగారు భవిష్యత్తును అందించడం కోసం బాటలు వేస్తున్నారు మీ అమ్మానాన్న. అలాంటి వాళ్లను వదిలి ఇలా ఒంటరి బ్రతుకు బ్రతకడం ఎందుకు చెప్పు!” అంది తార.
“నువ్వన్నది నిజమే అకక్కా! కానీ నేను ఎంతో ఇష్టపడి, ఆశలు పెంచుకున్న రంగాన్ని పూర్తిగా వదిలేసి, వాళ్లందించే బంగారు భవిష్యత్తును అందుకోవాలన్న ఆసక్తి నాకు మాత్రం ఉండొద్దా!?”
ఆ అమ్మాయి అన్నదానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు తారకు.
“జ్యోత్స్నా! నీ వ్యక్తిగత విషయాల్లో కల్పించుకుంటున్నాను అనుకోకపోతే ఒక ప్రశ్న...” సందిగ్ధంగా ఆగిపోయింది తార.
“ఛ... అదేం మాట అక్కా! నేన్నిన్ను స్వంత అక్క లాగానే భావిస్తున్నాను. అమ్మ, నాన్నల తర్వాత నాకున్న ఒకే ఒక ఆత్మీయురాలివి నువ్వు. నువ్వేం అడగాలనుకుంటున్నా నిస్సంకోచంగా అడుగు” అంది జోత్స్న.
“నువ్వు... నువ్వు... మౌళిని ప్రేమిస్తున్నావా?”
చిన్నగా నవ్వింది జ్యోత్స్న. “నీ అనుమానం అర్థమైందక్కా! మా మధ్య అలాంటివేం లేవు. నేను కేవలం నటన మీద ఆశతో, అదీ... సినీ నటిని కావాలన్న ఆశతో ఇల్లు వదిలి వచ్చానే కానీ, మౌళిని ప్రేమించడం కారణం కాదు. కాకపోతే వేషాల విషయంలో అతను నాకు సహాయం చేస్తున్నాడు అంతే! అంతకు మించిన సంబంధం ఏది మా మధ్య లేదు” చెప్పింది జోత్స్న.
‘మా మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన స్నేహమే’ అని చెప్పిన తర్వాత కూడా మౌళి విషయంలో తనకున్న అనుమానాలు బయటపెట్టి, ఆమెను హెచ్చరించడం అనుచితమేమో! అన్న సంకోచంతో మౌనంగా ఉండిపోయింది తార.
అలా ఉండి పోవడం ఏ అనర్ధానికి దారితీస్తుందో తెలిస్తే... ఆ సమయంలో ఆమె మౌనాన్ని ఆశ్రయించేది కాదేమో!
*********************