Vijaya Lakshmi
Published on Jul 17 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?“అమరావతి...” ఒకప్పటి శాతవాహనుల రాజధాని. కళలకు, శిల్పకళకు, ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. అలాంటి పవిత్ర భూమిలో, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహించే తీరంలో, కాలగమనంలో చెక్కుచెదరని ఓ అద్భుత శిల్పంలా వెలసింది అమరారామం.
జైన, బౌద్ధ మతాలు అత్యంత వైభవంగా వెలిగిపోయిన ప్రదేశం. బౌద్ధారామాలకు పెట్టింది పేరు. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను ఇక్కడే బోధించాడు. ధరణికోటగా, ధాన్యకటకం గా ప్రసిద్ధి చెందిన పట్టణం. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ కొంతకాలం నివసించి, పట్టణ వైభవాన్ని ప్రశంసించిన చరిత్ర. ఆంధ్రపాలకులలో మొదటి వారైన శాతవాహనుల రాజధాని. ఒకటా రెండా చారిత్రకంగా, పురాణ పరంగా, ఆధ్యాత్మికంగా, బౌగోళికంగా ఎన్నో ఎన్నెన్నో విశిష్టతలను నిక్షిప్తం చేసుకున్న పట్టణం... ఒకప్పటి ధాన్య కటకం... ఈనాటి అమవరావతి.
అమరావతి అమరారామం పంచారామ క్షేత్రాలలో ఒకటైన శివాలయం. దాని ప్రాచీనతతో, మహిమలతో, అద్భుతమైన నిర్మాణ శైలితో ఎందరో భక్తులను, చరిత్రకారులను ఆకర్షిస్తోంది. పౌరాణిక గాథలు, రాజుల త్యాగాలు, అసంఖ్యాకమైన భక్తుల విశ్వాసం మేళవించిన అమరావతి అమరారామం, అమరత్వం, ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా నిలుస్తోంది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీన పట్టణం. ఆధ్యాత్మికంగా నే కాదు చారిత్రకంగా కూడా అత్యంత మహిమాన్వితమైన, పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం. శైవ క్షేత్రాలలో ప్రధానంగా చెప్పుకోవలసిన క్షేత్రం. దేవేంద్రుడు స్వయంగా ప్రతిష్టించిన శివలింగం.
అమరారామం... పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన శివ క్షేత్రాలలో ఒకటి అమరారామంగా ప్రసిద్ధి చెందిన అమరావతి అమరాలిన్గేశ్వరాలయం. తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి, తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు ముక్కల్లో పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం. అమరారామంలో వెలసిన అమరేశ్వరునికే కాదు అమరావతి పట్టణానిది కూడా పెద్ద చరిత్రే... అమరావతి ఆధ్యాత్మిక ప్రాశస్త్యం తెల్సుకునేముందు అమరావతి చారిత్రక ప్రాశస్త్యం చూద్దాం.....
ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు సా.శ. పూ నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలంగా ధాన్యకటకము అత్యంత ప్రసిద్ధిచెందినదని చరిత్ర కథనాలు చెప్తున్నాయి.
ఈ తెలుగు రాష్ట్రానికి తెలుగు భాషకు ఒక అవినాభావ సంబంధముంది. ఈ అమరావతి ప్రాంతాన్ని మొదట నాగులు అనే వంశం వారు పరిపాలించారని, తెలుగు వారైన వీరి కాలంలోనే అప్పటివరకూ కేవలం మాట్లాడుకోవడం వరకూ ఉన్న తెలుగు భాషకు రూపురేఖలు ఏర్పడ్డాయని, లిపి కూడా సృష్టించబడిందని చరిత్ర కథనాలు చెప్తున్నాయి. ఇలా తెలుగులిపిలో ఉన్న మొట్టమొదటి పదం ‘నాగబు’ గా ప్రసిద్ధి చెందింది. ఈ ‘నాగబు’ అనే పదం చెక్కివున్న పలక ఈ ఆమరావతిలోనే దొరికిందని కూడా చరిత్ర చెప్తోంది.
నాగులు వంశం వారి తర్వాత ఈ ప్రాంతాన్ని శాతవాహన వంశస్థులు పరిపాలించారు. వీరి పాలన సుమారు సాధారణ శకానికి .పూ. మూడో శతాబ్దంలో ప్రారంభమై నాలుగు వందల ఏళ్ళ వరకు కొనసాగింది. వీరి రాజధాని ఈ అమరావతి పట్టణమే. కాకపొతే అప్పట్లో ఈ ప్రాంతాన్ని దాన్యకటకం అని, ధరణికోట అని పిలిచేవారు.
శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకు వంశస్థులు ఈ ప్రాంతానికి చక్రవర్తులయ్యారు. వీరి కాలంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆచార్య నాగార్జునుడు అమరావతిలో ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం నడిపేవాడని చరిత్ర. ఈ విశ్వవిద్యాలయం అప్పట్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిందని చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. బుద్ధ భగవానుని పవిత్రధాతువును ఇక్కడ పెట్టి, దానిపై నాగార్జునుడు ఒక స్థూపం నిర్మించారు. ఆ స్థూపం ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు.
వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం ఇటు హిందువులతో పాటు బౌద్ధులకు, జైనులకు కూడా అతి ముఖ్యమైన పుణ్యస్థలం. ఇంత చరిత్ర ఒకప్పటి ధాన్యకటకం ఇప్పటి అమరావతి.
కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు. 16 అడుగుల ఎత్తుతో ఉన్న స్పటిక లింగం ఈ అమరేశ్వరుడు. నిజానికి ఈ శివలింగం 36 అడుగుల ఎత్తు ఉంటుందని, 20 అడుగులు భూమి లోనికి ఉంటుందని 16 అడుగులు మాత్రమె బయటకు కనబడుతుంది. అందుకే లింగం చుట్టూ రెండు అంతస్తులుగా గుడిని నిర్మించారు. పై అంతస్తుకి ఎక్కి అక్కడినుంచి స్వామికి అభిషేకాలు, పూజలు చేస్తారు.
ఈ శివలింగం మీద ఎరుపురంగులో ఉన్న ఒక చారలాంటి మరక కనబడుతుంది. తారకాసుర సంహారం సమయంలో శకలాలుగా మారిన లింగం ఆగకుండా విపరీతంగా ఎత్తు పెరిగిపోతుండటంతో దాన్ని ఆపేందుకు ఆ లింగం మీద ఇంద్రుడు గోటితో గుచ్చాడట. అలా గుచ్చాడంతో లింగంలోంచి రక్తం వచ్చి అలా మరక పడిందని చెబుతారు.
మూడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపురసుందరీ దేవి, కాల భైరవుడు, కుమారస్వామి, శ్రీశైల మల్లేశ్వరుడు మొదలైన ఎంతోమంది దేవతలూ కొలువై ఉన్నారు. ఈ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి.
ఇక ఈ క్షేత్ర స్థలపురాణం విషయానికి వస్తే, పంచారామాల్లో ఒకప్పుడు తారకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను జన్మతః రాక్షసుడైనప్పటికీ గొప్ప శివ భక్తుడు. శివుని నుంచి గొప్ప వరాలు కూడా పొందాడు. దీంతో దేవతలను, సాధు, సన్యాసులను బాధిస్తుండేవాడు. దీంతో దేవతలందరూ, విష్ణుమూర్తిని వెంటబెట్టుకుని శివుని వద్దకు వెళ్ళి తారకుడి బాధలను ఏకరువుపెట్టుకున్నారు. అప్పుడు శివుడు తన అంశతో జన్మించిన కుమార స్వామిని దేవతల
సైన్యానికి నాయకుడిగా చేసుకుని తారకుని జయించమని చెబుతాడు.
అయితే, కుమారస్వామి ఎంత వీరోచితంగా పోరాడుతూ ప్రయత్నించినా తారకాసుడిని జయించలేకపోతాడు. తిరిగి అందరూ శివుని వద్దకు వెళతారు. తారకాసురిని కంఠంలో ఒక లింగం వుంది అనీ, అతని ప్రాణాలు ఆ లింగంలోనే ఉన్నాయని చెబుతాడు. అప్పుడు కుమారస్వామి వెళ్ళి తన శూలంతో తారకాసురిని కంఠంలో ఉన్న లింగాన్ని ముక్కలు చేస్తాడు. దాంతో తారకుడు మరణిస్తాడు.
తారకుని కంఠంలో ఉన్న ప్రాణలింగం శివుడు ప్రసాదించింది. దానిని కుమారస్వామి శూలంతో ముక్కలు చేశాడు. ఆ ముక్కలు నేల మీద పడగానే, అవి తిరిగి సంపూర్ణ లింగంగా మారతాయని, అలా తిరిగి తయారైన లింగాలు అనంతంగా పెరిగిపోతాయని, కాబట్టి వాటిని వెనువెంటనే ప్రతిష్ఠ చేయాలని శివుడు దేవతలతో చెబుతాడు. కుమారస్వామి చేత ఛిన్నాభిన్నం అయిన ఆ లింగం మొత్తం అయిదు ముక్కలయింది. ఆ ముక్కలు అయిదుచోట్ల పడి అయిదు శివలింగాలు తిరిగి ఉద్భవించాయి. ఈ లింగాలకోసం ఆలయాలు నిర్మించారు.
ఆ అయిదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. అవే.. అమరావతిలోని అమరేశ్వరుడి అమరారామం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం గుణుపూడిలోని కుమారారామం, పాలకొల్లులో క్షీరారామం, తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని భీమారామం, తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్న ద్రాక్షారాములు.
అన్నింటికన్నా పెద్ద ముక్క, మొట్టమొదటిసారిగా పడ్డచోటే ఈ అమరారామం. ఇది ఎక్కడ పడిందో అని వెదుక్కుంటూ దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతితో కలిసి పరుగు పరుగు వచ్చాడు. అప్పటికే ఆ ముక్క శివలింగ రూపం ధరించడంతోపాటు దాదాపు పది అడుగుల పొడవుకు పెరిగిపోయింది కూడా. వెంటనే దేవేంద్రుడు బృహస్పతి సలహాలను అనుసరించి ఆ లింగాన్ని అలాగే ప్రతిష్ఠించాడు.
అప్పుడు శుక్రాచార్యుడు అక్కడకు వచ్చి బృహస్పతితో మాట్లాడుతూ.. “ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. కాని ఇంకా కొంతకాలం తర్వాత కృష్ణవేణి అనే నది సహ్యాద్రి అనే పర్వతం మీద జన్మించి, ఈ అమరావతి మీదుగా ప్రవహించుకుంటూ వెళుతుందని విష్ణుమూర్తి చెప్పాడని, ఆ నది వేగానికి ఈ విగ్రహం నిలబడుతుందా?” అని ప్రశ్నించాడు.
శుక్రాచార్యుని ప్రశ్నకు సమాధానంగా బృహస్పతి, “ఈ విగ్రహం పడినచోటును క్రౌంచ పర్వతం. ఈ పర్వతం అడుగుభాగం పాతాళం వరకు ఉంది. అందువల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుంది. అదీగాక ముందు ముందు జన్మించబోయే కృష్ణానది సాక్షాత్తూ విష్ణుస్వరూపం కాబట్టి, విష్ణువు, శివుడు అభేదులైన వారు గనుక ఆ నది పర్వతం పక్క నుంచి వెళ్ళిపోతుంది” అని చెప్పాడు.
ఇలా అమరుల అధిపతి అయిన మహేంద్రుడిచేత ప్రతిష్ఠించిన స్థలం గనుక దీనిని అమరారామం అని, దేవేంద్రుడి నగరమైన అమరావతి అనే పేరు కూడా వచ్చినందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక్కడ పరమేశ్వరుడు పంచలింగాకారాలతో పంచాక్షరీ మహామంత్రాన్ని బోధిస్తూ ఉంటారని ప్రతీతి. స్వామివారు ప్రణవేశ్వరుని గా, అగస్త్యేశ్వరుని గా, కోసలేశ్వరుని గా , సోమేశ్వరుని గా, పార్ధివేశ్వరుని గా దర్శనమిచ్చే ఈ క్షేత్రం లో అయిదు రోజులు నివసించి, ఆలయానికి అనుకునే ప్రవహించే కృష్ణానది లో స్నానం చేస్తూ, పంచాక్షరిని జపిస్తూ స్వామిని ఆరాథిస్తే కైవల్యం కలుగుతుందని భక్తులు గాఢంగా నమ్ముతారు.
స్వామి కొలువుతీరిన ఈ ప్రాంతం పురాతన కాలంలో క్రౌంచ పర్వతమని ఆ క్రౌంచ పర్వతం మీద గతంలో దేవతలు, కపిలుడు మొదలైన మహామునులు తపస్సు చేసి కృతార్థులయిన కారణంగా దీన్ని సిద్థి క్షేత్రం గా కూడ పిలుస్తారు.
పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, ఆర్ధ్ర నక్షత్రము, ఆదివారము, సంక్రాంతి, సూర్య, చంద్రగ్రహణ కాలాల్లోను, సప్తమీ సోమవారం, దక్షిణోత్తరాయణములందు ఈ అమరావతీ తీర్ధమందుస్నానం చేసి, అమరేశ్వరుని సేవించిన యెడల వారికి సహస్ర యజ్ఞఫలము లభిస్తుందని పురాణ కథనాలు చెప్తున్నాయి.
శతాబ్దాల నుంచి నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు వున్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి అమరేశ్వరుని ఆరాధించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగ ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది.
కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగి, తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది.
ఎప్పుడో దేవతల చేత నిర్మించబడిన ఈ ఆలయం ఆ తరువాత కాలంలో శిదిలమైపోగా సా.శ. 1156లో వెలమనాటిలోని దావులూరు ప్రభువైన కొమ్మనాయుడు ఈ ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని కొంత దెబ్బతిన్న ఆలయాన్ని పునరుద్ధరించాడు.
మరొక మూడు వందల ఏళ్ళ తర్వాత కొండవీటిని రాజధానికి పరిపాలించిన ప్రోలయవేమరెడ్డి ఆలయాన్ని తిరిగి మరమ్మతు చేయించి, చుట్టుపక్క ప్రాకారాలు, గోపురాలు నిర్మించించాడు. ఆ తరువాత మళ్ళీ హంద్రికం పెద్దప్పం అనే వ్యక్తి ఈ ఆలయాన్ని మరొకసారి పునరుద్ధరించార చరిత్ర కథనాలు చెప్తున్నాయి. అమరావతీ ఆలయ కుడ్యాల మీద నున్న ఎన్నో శాసనాలు చరిత్ర పరిశోధకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయని చెప్తారు. ఈ ఆలయము ఉదయము 5గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శించుకొనవలెను.
శ్రీ అమరేశ్వరస్వామి కి మాఘ బహుళ దశమి త ప్రారంభమయ్యే మహాశివరాత్రి ఉత్సవాలు , అమావాస్య నాడు జరిగే రథోత్సవాన్ని చూడటానికి భక్తులు వేలాది గా తరలివస్తారు. కార్తికమాసోత్సవాలు కన్నుల పండువుగా జరుగుతాయి.
గుంటూరు పట్టణానికి 35 కి.మీ. దూరంలో అమరారామం ఉన్నది. గుంటూరు వరకు ట్రైన్ లో చేరుకొని అక్కడినుంచి బస్సుల్లోను ప్రయివేట్ వాహనాలలోను అమరారామం చేరుకోవచ్చు. తెలుగురాష్ట్రల్లో అన్నిచోట్లనుంచి గుంటూరుకు బస్సు సౌకర్యం ఉంది. అమరావతికి దగ్గరలోని రైల్వేస్టేషన్లు గుంటూరు, మరియు విజయవాడ. అక్కడివరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి బస్సులు ప్రయివేట్ వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.
దేవాలయానికి దగ్గరగా వసతి సౌకర్యాలు, హోటళ్ళు కూడా ఉన్నాయి.
ఈ ఆలయ చరిత్రలు వింటే మీకు గూస్ బంప్స్ గ్యారంటీ!