Vijaya Lakshmi
Published on Aug 13 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?పరమేశ్వరుడు ఎక్కడా చోటు లేనట్టు మట్టికుండపెంకులో ఎందుకు వెలిసాడు విచిత్రంగా ఉంది కదూ! ఆ కథేంటో... హటకేశ్వరం విశేషాలేంటో ఈ కథనంలో...
ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీశైలం క్షేత్రంలో పర్యాటకానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రయాణ అనుభూతిని ఒక్కసారి పొందిన వారు మళ్లీమళ్లీ రావాలని కోరుకుంటారు. అంత అద్భుతమైన అనుభావాన్నిస్తుంది ఆ ప్రయాణం.
భారతదేశంలోని జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం ఒక్కసారైనా సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో శ్రీశైలం ఒకటి. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి యాత్రికులు, భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. శ్రీశైలం కొండ కింది నుంచి మొదలయ్యే ఘాట్ రోడ్డు ప్రయాణంతోనే పర్యాటకుల అనుభవాలు మొదలవుతాయి.
నల్లమల అడవుల్లో మంచు దుప్పటిని చీల్చుకుంటూ పర్వతాల మలుపుల్లో చేసే ప్రయాణం సాహసోపేతమైన అనుభూతిని అందిస్తుంది. కేవలం ఘాట్ రోడ్డు మార్గం ద్వారా మాత్రమే శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది. మరో మార్గం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణపు అనుభూతిని, ప్రకృతి శోభను ఆస్వాదించగలుగే అవకాశం ఉంది. నిజానికి ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన పర్యాటక ప్రాంతాలు నల్లమల అడవుల్లో దాక్కుని రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి. వీటిలో కొన్ని ప్రదేశాలు ఆహ్లాదాన్ని పంచేవి అయితే మరికొన్ని ప్రదేశాలు సాహసోపేత అనుభవాన్ని అందిస్తాయి.
అలాంటి అద్భుత ప్రదేశాల్లో ఒకటి శ్రీశైలం. ఆ శ్రీశైలం సమీపంలో ఉన్న మహిమాన్విత క్షేత్రం హటకేశ్వరం.
పరమేశ్వరుడు వివిధ సందర్భాల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ కారణాలతో విభిన్నంగా వెలిసాడు. అయితే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం కి సమీపంలో హటకేశ్వరంలో ఒక ప్రత్యేకమైన శైలిలో ఆవిర్భవించాడు. శ్రీ శైలం క్షేత్రానికి వెళ్ళిన వారు శ్రీశైలంలో చూడవలసిన పరమ పవిత్ర ప్రదేశం హటకేశ్వరం. నిజానికి హటకేశ్వరం కాదు అటికేశ్వరం. పరమశివుడు అటిక కుండ పెంకు) లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు. రానురాను అదే హటకేశ్వరం గాను ఆ స్వామి హటికేశ్వరుడిగాను స్తిరపడిపోయాయి.
అసలు పరమేశ్వరుడు ఎక్కడా చోటు లేనట్టు ఇక్కడ మట్టికుండపెంకులో ఎందుకు వెలిసాడు విచిత్రంగా ఉంది కదూ ఆ కథేంటో... హటకేశ్వరం విశేశాలెంతో ఈ కథనంలో
హటకేశ్వరం చరిత్ర మహాభక్తుడైన కుమ్మరి కేశప్పతో ముడిపడిన కథనం. నిస్వార్ధమైన సేవతో ... అనితర సాధ్యమైన భక్తితో సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన మహా భక్తుడు కేశప్ప. శ్రీ శైలం సమీపంలోని నివసించే కుమ్మరి కులానికి చెందిన కేశప్ప ... తన వృత్తిని చేసుకుంటూనే, శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు.
శ్రీశైలం శివయ్య దర్శనానికి వెళ్లే వారు అక్కడ తృప్తిగా భోజనాలు చేసి కేశప్ప సేవను కొనియాడుతూ ... దారి పొడవునా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళేవారు.
దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. అందరూ కేశప్పను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. శ్రీశైలం వేల్లెవారందరూ కేశప్ప సేవను పొగిడే వారే. ఇది ఇరుగుపొరుగువారికి కంటగింపుగా మారింది. ఒకరు తమ స్వశక్తితో కష్టపడి గొప్పగా బతకడమో లేదంటే పేరు తెచ్చుకోవడమో, పైకేదగడమో చేస్తే వాడంత ఎదిగిపోవడమా అని అసూయతో వాడిని కిందికి లాగి పడగొట్టాలని చూసేవారు ప్రతి చోట ఉంటూనే ఉంటారు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది.
తమతోటి వాడు, తమలాగే బతికే వాడు ఇంత పేరు తెచ్చుకోవడమా అని ఈర్ష్యతో రగిలిపోడం మొదలుపెట్టారు కేశప్ప ఇరుగుపొరుగు వారు. ఎలాగైనా అతని పేరు చెదగోట్టాలనుకున్నారు. అతనిని ఎదిపించాలనుకున్నారు. అతని పని పాడు చేయాలనుకున్నారు. ఓ రాత్రి వేళ అతని కుండలన్నిటినీ పగులగొట్టేసారు. ఇంకా వారి కక్ష చల్లారక ఆటను కుండలను తయారు చేసే 'అటికె'ను కూడా విరగ్గోట్టేశారు. తెల్లారగానే పగిలిపోయి ఉన్న కుండలు విరిగిపోయిన అటిక చూసి కేశప్ప గుండె గుబెలుమన్నది. భోరుమన్నాడు. లబోదిబోమంటూ ఏడ్చాడు. ఆ మర్నాడే శివరాత్రి పర్వదినం. శివయ్య దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలయిపోయింది. వస్తున్న యాత్రికులకు భోజనాలు ఏర్పాటు చెయ్యడానికి కుండలమ్మి డబ్బులు సంపాదించాలంటే కుండలు లేవు. కుండలు చేద్దామంటే కుండలు చేసే అటికే లేదు.
సరే... ఎలాగైనా అటికెను బాగు చేసి యాత్రికులకు భోజనాలు సమకూర్చాలన్న ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు కేశప్ప. సరిగ్గా ఇలాంటి సమయంలో యాత్రికులను అతని ఇంటికి పంపిస్తే భోజనాలు పెట్టలేక అతడికి చెడ్డపేరు వస్తుందని కుత్సిత బుద్ధితో ఇరుగు పొరుగు వారు యాత్రికులను భోజనం కోసం అతని ఇంటికి పంపించారు. ఇటు చూస్తె యాత్రికులు భోజనాల కోసం వచ్చి ఉన్నారు. అటు చూస్తె భోజనాలు ఏర్పాటు చేసే పరిస్తితి లేదు. యాత్రికులకు భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని ఆ పరమేశ్వరుణ్ణి తలచుకొని కూర్చుని “ఏంటయ్యా నాకీ పరీక్ష... ఆకలంటూ ఇంటికి వచ్చినవారికి పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను” అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కేశప్ప.
అప్పుడు అతని ముందు విరిగిన అటికపై పరమేశ్వరుడు ప్రత్యక్షమై, “కేశప్పా నువ్వు లోపలి వెళ్లి వచ్చినవారికి భోజనాలు వడ్డించు” అన్నాడు.
“అదేంటి స్వామీ నీకు తెలియనిదేముంది. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు భోజనాలు పెట్టు అంటే నేనెలా పెట్టను? ఎక్కడినుంచి తెచ్చి పెట్టను? ఇంకా నన్ను పరీక్ష చేస్తున్నావా స్వామీ?” అంటూ బాధపడుతూ మొత్తుకున్నాడు కేశప్ప.
“నీకెందుకయ్యా ముందు నువ్వు లోపలి వెళ్ళు భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకో” అన్నాడు పరమేశ్వరుడు.
సరేనని శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళాడు కేశప్ప. ఆశ్చర్యంతో అతనికి నోట మాట రాలేదు. అక్కడ కుండల నిండుగా రకరకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. ఆశ్చర్యంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన కేశప్ప, ఇదంతా శివయ్య మహిమేనని తెలుసుకొని సంతోషంగా యాత్రికులకు కడుపు నిండుగా ... సంతృప్తిగా భోజనం వడ్డించాడు. వచ్చిన యాత్రికులు తృప్తిగా కడుపునిండా భోజనం చేసి వెళ్ళారు.
అలా శివుడు అటికెలో ప్రత్యక్షమై కేశప్పను గండం నుంచి గట్టెక్కించాడు. శివుడు అటికెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పేరు పడింది. కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహా భక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు.`
శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా చూడవలసిన పుణ్యస్థలం ఈ హటకేశ్వరం. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-పంచదారలు ఉన్నాయి. ఇక్కడే ఆదిశంకరాచార్యుడు చాలాకాలం తపస్సు చేసినది. ఒక బండపై అయన కాలిముద్రలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకముల మూలికలు, తేనె మరియు సరస్వతి ఆకు లభిస్తాయి.
హటకేశ్వర ఆలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
శ్రీశైలంలో ప్రతి రోజు ఆటోలు జీపులు లాంటి ప్రైవేట్ వాహనాలు మనిషి కింత అని రుసుము తీసుకొని హటకేశ్వరంతో పాటు మరికొన్ని ప్రదేశాలను కూడా కలిపి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాహనాలు మాట్లాడుకొని ఈ ప్రదేశాన్ని సులువుగా చూడొచ్చు.
స్కంద పురాణం ప్రకారం హాటకేశ్వర అనే పేరుకు బంగారు (హటక) దేవుడు అని అర్థం. హటకం అంటే బంగారమని అర్థం. మేరు పర్వతాన్ని ఆయుధంగా త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించిన తరువాత బంగారు లింగం ఆకారంలో ఇక్కడ దర్శనమిచ్చాడని అందుకే ఇక్కడి స్వామికి కనుక హటకేశ్వరుడనే పేరు ఏర్పడింది అని కూడా చెప్తారు,.
సాధారణ భక్తులకు, శివలింగం ఏదైనా ఇతర లింగంగా అనిపించవచ్చు కానీ ఆధ్యాత్మిక గురువులు మరియు యోగులకు, ఈ లింగం అగ్ని వంటి బంగారు కాంతిని వెదజల్లుతూ కనబడుతుందట. అగస్త్య మహాముని కూడా ఇక్కడికి సమీపంలో ఉన్న నీటి ప్రవాహంలో స్నానం చేసి స్వామిని ఆరాదిన్చేవాడని పురాణ కథనాలు చెప్తున్నాయి.
హటకేశ్వరానికి దగ్గరలో పాలధార నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. శివుని శిరస్సు నుండి ఈ ధార ఉద్భవించిందని ప్రతీతి. హటకేశ్వరం వద్ద పక్కపక్కగా పాలధార, పంచధార ప్రవహిస్తూ కనిపిస్తాయి. అత్యంత మనోహర ప్రదేశం ఇది. శివుని ఐదు ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పేరుగల పంచ ముఖాలనుండి ఈ పంచధార ఉద్భవించింది కనుక దీనిని పంచ (ఐదు) ధారగా పిలుస్తారు. ఇక్కడి జలాన్ని సేవించి స్నానంచేస్తే అన్ని కోరికలూ సిద్ధిస్తాయని చెబుతారు. ఇక్కడే జగద్గురువులైన ఆది శంకరులు తపస్సు చేశారని, 'శివానందలహరి , 'సౌందర్యలహరి అనే సుప్రసిద్ధ గ్రంథాలను వారు ఇక్కడే రచించినట్టుగా చెబుతారు. ఇది దివ్యమైన సుందర పవిత్ర ప్రదేశం.