Vijaya Lakshmi
Published on Aug 15 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పుత్రోత్సాహం పొందిన స్థలం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే కుమారస్వామి చేతిలో బందీగా మారిన ప్రదేశం. పరమేశ్వరుడే తన కుమారుని దగ్గరే శిష్యునిగా మారిన పుణ్యస్థలం. పుట్టుగుడ్డివానికి చూపు తెప్పించిన మహిమాన్వితమైన క్షేత్రం. కుమారస్వామి వల్లీదేవిని వివాహమాడిన స్థలం. సుబ్రమణ్యస్వామివారి ఆరు ప్రధాన క్షేత్రాలలో అతి ముఖ్యమైన క్షేత్రం.ఆ క్షేత్ర విశేషాలిప్పుడు తెలుసుకుందాం...
కుంభకోణానికి సమీపంలో వెలసిన ఈ క్షేత్రంలో స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ... కార్తికేయుడిగా ... శరవణుడిగా ... షణ్ముఖుడి గా ... మురుగన్ గా వివిధ రకాల ఆరాధనలండుకుంటాడు. సుబ్రమణ్యస్వామి వారి ఆరు ప్రధాన క్షేత్రాలు ఆరుపడైవీడు గా ప్రసిద్ధి చెందాయి. ఆ ఆరు క్షేత్రాలలో ప్రధానమైనది 'స్వామి మలై'.
నాగదోషాలకు,సంతానం లేక బాధపడుతూ సంతానం కోసం తపిమ్చేవారికి, జ్ఞానవృద్ధికి,కుజదోష నివారణకు సుబ్రమణ్య స్వామి ఆరాధనే తరణోపాయంగా చెప్తారు.అలాంటి సుబ్రహ్మణ్యస్వామి స్వామినాధుడిగా కొలువైన ప్రదేశం స్వామిమలై. తమిళనాడు రాష్ట్రం తంజావూరి జిల్లా లోని కుంభకోణానికి సుమారు 6కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామిమలై శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి వారి ఆలయం. స్వామిమలై అంటే తమిళంలో స్వామికొండ అని అర్ధం.
ఇక్కడ స్వామివారిని బాలమురుగన్ ,స్వామినాధుడు, గురునాధుడు అని పిలుస్తారు. ఒక కొండ మీద 60 మెట్లు ఎక్కిన తర్వాత శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామివారి ఆలయం వుంటుంది. అతి పెద్ద రాజగోపురం తో లోపల విశాలమైన ఆలయ మంటపాలతో ఉన్న ఈ ఆలయంలో రెండు అంతస్తులలోను గర్భగుడులు ఉంటాయి.
క్రింద మంటపంలో ' శివుడు ' కొలువై ఉంటాడు. ప్రక్క ప్రాంగణంలో అమ్మవారు ఉంది. ఇక్కడ శివుడు ' సుందరీశన్ ' అని అమ్మ 'పార్వతి' అని పిలవబడతారు.
పై అంతస్తులో తమిళులు ముద్దుగా మురుగన్ అని పిలుచుకునే కుమారస్వామి స్వామినాదుడుగా కొలువుతీరాడు.
ఇక ఈ క్షేత్ర స్థల పురాణం విషయానికి వస్తే ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు కైలాసానికి వెళుతుండగా దారిలో కుమార స్వామి తారసపడ్డాడు.ఆ సందర్భంలో ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని బ్రహ్మదేవుడ్ని అడిగాడు కుమార స్వామి. బ్రహ్మదేవుడు సమాధానం చెప్పలేకపోయాడు. దేవతలకు సైతం అర్థం తెలియని ఈ ప్రశ్నకు దేవతలు కూడా సమాధానం ఇవ్వలేక అయోమయ పరిస్థితులలో పడ్డారు. బ్రహ్మ దేవుడు కూడా జవాబు చెప్పలేకపోయేసరికి ఆయన్ను బందీ చేశాడు కుమార స్వామి. బ్రహ్మ బందీగా మారడంతో అతడి విధులకు ఆటంకం కలిగి సృష్టి ఆగిపోయింది. దాంతో దేవతలు అందరూ వెళ్లి పరమశివునితో జరిగిన విషయాన్ని చెప్పారు. పరమేశ్వరుడు అందరినీ తీసుకొని కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి బ్రహ్మదేవున్ని ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు. అందుకే బందీని చేశానని సమాధానం చెప్పాడు.
కుమారుడి సమాధానం విన్న పరమేశ్వరుడు కుమారస్వామిని, బ్రహ్మకు తెలియదని బందీని చేశావు సరే. మరి నీకు తెలుసా అని అదిగాడు. తండ్రి ప్రశ్నకు కుమారస్వామి నాకు తెలుసు నేను చెప్తాను అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలున్న శిష్యునిగా ఉండి వింటానంటే చెప్తానన్నాడు. సరేనన్నాడు శివుడు. కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. శివుడు అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోయాడు. తరువాత, సుబ్రహ్మణ్యుడు ఏదేమైనా నేను బ్రహ్మ గారిని అలా అవమానించకూడదు” అని, దీనికి ప్రాయశ్చిత్తంగా సర్ప రూపం దాల్చి భూలోకంలో కొంతకాలం తపస్సు చేస్తానని చెప్పి భూమ్మీదకు వచ్చేసాడు సుబ్రమణ్యస్వామి. ఆ సందర్భంలో సర్పరూపంలో ఉన్న స్వామిని అందరూ రాళ్ళతో కొట్టడం మొదలుపెట్టారు. పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి సుబ్రహ్మణ్యుని చేత షష్ఠీ వ్రతం చేయించిందట. దానితో పెద్దలను అవమానించిన ఆయన పాపం తొలగి పూర్తి తెజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని ఓ కథనం.
భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. ఆయన తపస్సు చేస్తున్న సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా ఆయన తపస్సుకు ఆటంకం ఏర్పడి తపోభంగం అయేది. దాంతో భృగు మహర్షి తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఞానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్థ్వలోకాలకి వ్యాపించగా, ఆ వేడిమిని భరించలేని దేవతలు ఆ పరమేశ్వరుని శరణు కోరారు. అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి దేవలోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు. భ్రుగు మహర్షి వరం కారణంగా పరమశివునంత వారికి కూడా జ్ఞానం నశించింది. దాంతో తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఞాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడని మరో కథనం. ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామియై, నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమార స్వామికి స్వామి నాథుడనే పేరు వచ్చింది. ఈ స్థలానికి స్వామిమలై అనే పేరు వచ్చింది.
ఇక ఈ ఆలయంలో మరో విశేషం వినాయక ఆలయం. ఆలయ ద్వజ స్థంభం వద్ద ఉన్న వినాయకుడి ఆలయం చాలా మహిమ కలది. ఇక్కడ కుమారతరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు ఉన్నాయి. ఒకసారి పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే సరిగ్గా ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనికి చూపు వచ్చి కన్నులు కనిపించడం మొదలుపెట్టాయి. అలా వినాయకుని దగ్గరకు వచ్చేసరికి చూపు రావడంతో ఈ వినాయకునికి నేత్ర వినాయగర్ అని పేరు స్తిరపదిమ్ది.
ఇక అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్త వీర్యార్జునుడు కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని దర్శించవచ్చు. ఒక చిన్న కొండలా ఉండే ఈ గుట్ట పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సరాలకి ప్రతీకలని, ఆ సంవత్సరాధిదేవతలు ఈ మెట్ల రూపంలో స్వామిని సేవిస్తున్నారనీ అంటారు.
ప్రతి మెట్టు దగ్గర గోడపై ఆ సంవత్సరం పేరు తమిళంలో వ్రాసి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కే నడక దారిలో 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్క కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న దృశ్యం అద్భుతమైన శిల్పరూపంలో కనబడుతుంది.
ఈ గుడికి క్రింది భాగంలో శివపార్వతులు మంటపాలున్నాయి. అక్కడ వీరిని మీనాక్షి, సుందరేశ్వర్, అని పిలుస్తారు. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడు. అప్పుడు ఆయన కులదైవమైన మీనాక్షి సుందరేశ్వరుని ఆరాధించడానికి ఈ మంటపాలనేర్పరచాడు.
ఈ స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరిన తర్వాత స్వామి వారికి పాలకావడి, పూల కావడి వంటి ముడుపులు చెల్లిస్తుంటారు. 60అడుగుల ఎత్తులో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది ఈ ఆలయం.
ఇక ఈ క్షేత్రంలో పండుగలు, ఉత్సవాలు విషయానికి వస్తే ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతాయి వాటిలో ఏప్రిల్ నెలలో ఆలయ రథోత్సవం మరియు అక్టోబర్ లో స్కంద షష్టి పండుగ మరియు విసాకం పండుగ మే నెలలో మరియు పండుని ఉత్తిరం పండుగ మార్చ్ నెలలో జరుగుతాయి.
స్వామి వారు ఇక్కడే శ్రీ వల్లిదేవిని వివాహమాడినట్టుగా స్థల పురాణం చెబుతోంది. కృత్తికా నక్షత్రంలో జన్మించినందువలన స్వామిని కార్తికేయుడు అని పిలుస్తుంటారు. అందువలన కృత్తిక నక్షత్రం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలో ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం : 4 నుండి రాత్రి 10 గంటల వరకుస్వామిని దర్శించుకోవచ్చు.
రోడ్డు లేదా బస్సు మార్గం : ట్రిచీ, కుంభకోణం, చెన్నై, మధురై, తంజావూర్ బెంగళూరు వంటి పట్టణాల నుండి స్వామిమలై కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుపుతుంటారు.
స్వామిమలై కు 8 km ల దూరంలో కుంభకోణం రైల్వే స్టాట్యూన్ కలదు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని ప్రధాన పట్టణాల నుండి కూడా రైళ్లు వస్తుంటాయి. కుంభకోణం వరకు రైల్లో చేరుకొని అక్కడినుంచి అతూలలో స్వామి మలై వెళ్ళొచ్చు.
స్వామిమలై క్షేత్రం కుంభకోణం నుండి చాలా దగ్గరలో ఉండడం వల్ల, కుంభకోణంలో మనం స్తే చెయ్యొచ్చు.. స్వామిమలైలో అంత ఎక్కువగా వసతి సదుపాయాలూ ఉండవు కాబట్టి కుంభకోణం ప్రఖ్యాత పుణ్య క్షేత్రము అవడం వల్ల ఇక్కడ ఎన్నో హోటళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడే వసతి చూసుకోవడం మంచిది.