Vijaya Lakshmi
Published on Jul 02 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?"చలికాలపు పొగమంచులో కనబడే ఎత్తైన కోట గోడలు…"
"పాత బురుజుల నీడల మధ్య నడుస్తే… గాలి సున్నితంగా చెవిలో గుసగుసలాడుతుంది".
"సరిగ్గా అర్థరాత్రి దాటాక, నిశ్శబ్దంగా ఉన్న ఆ కోటలో నుంచి ఏదో తెలియని అరుపు వినిపిస్తుంది."
"గాలిలో ఓ వింతైన చలి, వెన్నులో జరజర పాకే భయం."
"చదరంగం బోర్డు లాంటి తివాచీ మీద మెల్లగా కదలుతున్న పావులు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం."
ఉత్తర ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం నడిబొడ్డున, కాలంతో పాటు నిలిచిపోయిన ఒక పురాతన కోట, తనలో ఎన్నో శతాబ్దాల చరిత్రను, అంతకు మించి అంతుచిక్కని రహస్యాలను, భయంకర రక్త చరిత్రలను దాచుకుంది. రాత్రి చీకటి పరుచుకున్నప్పుడు, ఈ కోట గోడలు తమలోని భయానక కథలను గుసగుసలాడతాయని స్థానికులు చెబుతారు. ఆ కథలు కేవలం కట్టుకథలా? లేక నిజంగానే ఆ కోటలో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయా?
శతాబ్దాల నిండిన కోట గోడలు, పైకప్పు నుంచి వేలాడే గ్యాలరీలు, అందులో ఓ చీకటి గది. శాశ్వతంగా మూసివేయబడిన గది. ఆ గది మూసివేసారు. కాని దాని చప్పుడు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదే జాజ్ మౌ కోటలోని చీకటి గది. ఉత్తరప్రదేశ్ లోని జాజ్ మౌ కోటలోని ఓ రహస్య గది. అది కేవలం ఓ పాత కోట గది కాదు. శతాబ్దాల నిశ్శబ్దాన్ని భద్రపరిచిన శ్మశాన మౌనం. భయంకర నిశ్శబ్దం.
జాజ్‌మౌ కోటాను చూడడానికి వచ్చిన ప్రతి సందర్శకుడి మనస్సులో ఒక్కటే ప్రశ్న
"ఆ గదిలో ఏం జరిగింది?"
"ఎందుకు శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ మూసి ఉంది?"
ఇప్పటికీ మిస్తరీగానే మిగిలిపోయిన అతి పెద్ద భయానక రహస్యం.
జాజ్‌మౌల్ కోట గురించి అనేక భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలు స్థానికుల నోటి నుంచి తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇవి ఈ కోటపై ఒక తెలియని భయాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ కోట గురించి ఒక వింతైన కథ ప్రచారంలో ఉంది. దాదాపు 12 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే కోట స్పష్టంగా కనిపిస్తుందట. కానీ, మీరు దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ, కోట ఆకారం అదృశ్యమవ్వడం మొదలవుతుంది. చివరికి కోట దగ్గరికి చేరుకున్నాక, దూరం నుంచి చూసిన కోట ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుందట. ఈ దృగ్విషయం ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఇది ఒక అంతుచిక్కని మాయగా చెబుతారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి సమీపంలో, గంగా నది ఒడ్డున, జాజ్‌మౌల్ అనే ప్రాంతంలో ఉంది ఈ కోట . ఒక పురాతన నాగరికతకు కేంద్రం ఈ ప్రాంతం.ఒకప్పుడు ఇది ముఘల్ కాలంలో రక్షణ కోటగా నిర్మించబడింది.
జాజ్‌మౌ కోట కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, అనేక భయానక కథలకు నిలయం. ఈ కోట కచ్చితమైన నిర్మాణ తేదీ తెలియదు, కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది మొగల్ చక్రవర్తుల కాలంలో, ముఖ్యంగా 14వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. కోట శిథిలావస్థకు చేరినా, దాని నిర్మాణం ఆనాటి వైభవాన్ని, రాజసం, రక్షణ వ్యవస్థను తెలియజేస్తుంది.
కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఇది *షేర్ షా సూరీ* కాలంలో నిర్మించబడినదని భావిస్తాఋ. తరతరాలుగా ఇది ముఘల్ సామ్రాజ్యంలో భాగమై, తరువాత బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లింది. కానీఅప్పుడే బ్రిటిష్ కాలంలోనే అక్కడ భయంకరమైన మిస్టరీకి తెరలేచింది. అక్కడి ఒక గదిని శాశ్వతంగా మూసివేశారు. మిస్టరీకి మారుపేరుగా మారిపోయింది ఆ గది.
ఆ గది తలుపు ఎప్పుడూ మూసే ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. స్థానికంగా "మరణ గది" అని పిలుస్తారు.
ప్రాచీన కాలం నుంచి ఆ ప్రదేశం మంత్రాలకు, నిషిద్ధ తంత్రపూజలు నెలవుగా కథలున్నాయి. ఆ గదిలో ఒక మంత్రశక్తిని భద్రపరిచినట్లు, అక్కడ ఓ నిషిద్ధ తంత్ర పూజ జరిగిందని కథలు కథలుగా చెబుతారు.
జాజ్‌మౌల్ కోట గురించి అనేక భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలన్నీ స్థానికుల నుంచి తరతరాలుగా వినిపిస్తూనే ఉన్న కథలు. ఈ కోట ఒకప్పటి అంటే మహాభారత కాలానికి చెందిన జరాసంధుడికి సంబంధించిన స్థలంగా నమ్ముతారు. జరాసంధుడు తన ప్రత్యర్థులను పట్టుకొని, ఇక్కడ బలి ఇచ్చేవాడని , ఆ బలి ఇచ్చిన వారి ఆత్మలు ఇప్పటికీ కోటలో తిరుగుతూ ఉంటాయని, రాత్రివేళల్లో వారి అరుపులు, కేకలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు. కోటలో కొన్ని ప్రాంతాలు చాలా చీకటిగా, నిర్జనంగా ఉంటాయి, అక్కడ అడుగుపెట్టిన వారికి ఏదో తెలియని ఆందోళన కలుగుతుందని అంటారు.
ఒకప్పుడు ఈ కోటలో మాంత్రికులు, క్షుద్రశక్తులు ఉండేవారని, కథనం. వారు క్షుద్ర మంత్ర సాధన చేసేవారని, ఆ మంత్రాల ప్రభావం ఇప్పటికీ కోటలో ఉందని నమ్ముతారు. అందుకే రాత్రివేళల్లో వింతైన వెలుగులు, అదృశ్యమైన వ్యక్తుల కదలికలు కనిపిస్తాయని కొందరు సాహసికులు కూడా చెబుతారు.
ఇక ఈ కోటలో అనేక కందకాలు, రహస్య మార్గాలు ఉన్నాయని, వాటిలోకి వెళ్ళిన చాలా మంది అదృశ్యమయ్యారని ప్రచారంలో ఉంది. ఈ మార్గాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు, వాటిలోకి ప్రవేశించిన వారు ఇక తిరిగి రారని ఈ కందకాలు, మార్గాలలో పడి ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు కోటలోనే తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతారు.
కోటలో కొన్ని వస్తువులు, శిల్పాలు శపించాబదినవని,, వాటిని తాకిన వారికి దురదృష్టం పడుతుందని చెబుతారు. అందుకే, కోటలోని కొన్ని ప్రాంతాలకు ఎవరూ వెళ్లడానికి సాహసించరు.
రాత్రివేళల్లో కోటలో నుంచి పిశాచాల అరుపులు, వింతైన ధ్వనులు వినిపిస్తాయని చెబుతారు. ఈ శబ్దాలు భయానకంగా ఉంటాయని, ధైర్యవంతులను కూడా భయపెడతాయని అంటారు స్థానికులు.
ఈ కథనాలన్నీ విన్న కొందరు ఔత్సాహికులు, ఆర్కియాలజిస్టులు ఆ గది తలుపు తెరిచి చూడాలని ప్రయత్నించారు.
తలుపు ఓపెన్ చేసిన రెండవ రోజే – ఆ టీం లో ఉన్ఇన ద్దరికి మానసిక సమస్యలు వచ్చినట్టు రికార్డులు చెబుతాయి. ఒకసారి ఆ గది తలుపు ఓపెన్ చేసిన గైడ్ – నిమిషాల వ్యవధిలో తలబద్ధలయ్ చనిపోయాడని స్థానికులు చెబుతారు. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలో గది *మూసివేయబడింది.*
ఒకసారి ఒక చారిత్రక పరిశోధకుల బృందం, ఆ గదిలో 24 గంటలు గడిపే ప్రయత్నం చేసింది. ఆ టీమ్ సభ్యులలో ఒకరికి మానసిక వైకల్యం వచ్చిందన్నది నానుడి. ఇక ఆతరువాత నుంచి ఆ టాపిక్‌ను ఆ మీడియా కూడా టచ్ చేయలేదు. వాస్తవాలు తెలియలేదు , కానీ స్థానికులు మాత్రం నమ్మకం తో చెబుతారు. ఆ గది – మూసి ఉండాల్సిందే! అని.
జాజ్‌మౌల్ కోటలోని ఈ భయానక కథలకు శాస్త్రీయ వివరణలు చాలా తక్కువ. చాలా మంది ఇవన్నీ కేవలం స్థానిక పుకార్లు, మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు. పాత కోటలు, శిథిలావస్థకు చేరిన భవనాల్లో సాధారణంగా చీకటి, గాలి శబ్దాలు, జంతువుల అరుపులు వంటివి భయానకంగా అనిపించవచ్చు. కాలానుగుణంగా వచ్చే మార్పులు, నిర్మాణం దెబ్బతినడం వల్ల ఏర్పడే శబ్దాలు కూడా దెయ్యాల అరుపులుగా భ్రమపడవచ్చు అంటారు.
కొందరు వీటిని మానసిక భ్రమలు, వాతావరణ ప్రభావాలు లేదా సామూహిక భయం వల్ల జరిగే సంఘటనలుగా పరిగణిస్తారు. ఆ గది నిర్మాణంలో ఉన్న గాలి నిలుపుదల, శబ్ద పరావర్తనాల వల్ల మనకు ఊహలుగా అనిపించే భ్రమలు కలగవచ్చునంటారు శాస్త్రవేత్తలు. కానీ అదే శాస్త్రం, ఎందుకు అక్కడ మానసిక ప్రభావాలు పడుతున్నాయో మాత్రం చెప్పలేక పోతోంది.
అయితే, రాత్రివేళల్లో ఇక్కడికి వెళ్లడం ప్రమాదకరమని, ఒంటరిగా వెళ్లకూడదని స్థానికులు హెచ్చరిస్తారు. మీరు జాజ్‌మౌల్ కోటను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, పగటిపూట వెళ్లి, చీకటి పడకముందే సురక్షితంగా తిరిగి రావాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే, కొన్నిసార్లు చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు ఊహించని భయాలను సృష్టించవచ్చు. జాజ్‌మౌల్ కోట తనలో దాగి ఉన్న మిస్టరీని ఎప్పటికీ బయటపెట్టకుండా, తన భయంకరమైన కథలతో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది
కోట తలుపులు వందల సంవత్సరాలు బంధితంగా ఉన్నా – శబ్దాలు మాత్రం బయటకి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైనా నిజాలు బయటపడతాయా? లేక... మౌనం గదిని కప్పేస్తూనే ఉంటుందా?