Vijaya Lakshmi
Published on Jun 29 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?నిధివన్ ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో నేటికి కూడా శ్రీకృష్ణుడు రాసలీలలాడతాడని గాఢంగా నమ్మే most mysterious ప్లేస్.
బృందావనం శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రమైన నేల. బృందావనం కృష్ణయ్య లీలలకు, బాల్యక్రీడలకు వేదిక.
బృందావనం అంటేనే రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీక. ఆ ప్రేమలీలలకు వేదికైన ఎన్నో ఆలయాలు, వనాలు బృందావన్ లో ఉన్నాయి. ఆ ఆలయాలు, వనాలకు భిన్నంగా, ఒక ప్రత్యేకమైన ఆరా, అంతుచిక్కని రహస్యం, అలౌకిక భీతిని కలిగించే ప్రదేశం కూడా ఉంది. అదే నిధివన్. పగటిపూట వేలమంది భక్తులతో కళకళలాడుతూ, పవిత్రంగా కనిపించే ఈ వనం, సూర్యాస్తమయం కాగానే అదృశ్య శక్తులకు నిలయంగా మారుతుందనే ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే, ఇక్కడే ప్రతి రాత్రి స్వయంగా శ్రీకృష్ణుడు, రాధాదేవి గోపికలతో కలిసి రాసలీలలు జరుపుతారని, వారి దివ్యప్రేమకు ఈ వనం ప్రత్యక్ష సాక్షి అని చెబుతారు.
ఈ నమ్మకం ఎంత బలమైనదంటే, సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు, నిధివనంలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకు తాళాలు వేస్తారు. అక్కడి పూజారులు, వన సంరక్షకులు, చివరికి పక్షులు కూడా ఈ వనాన్ని విడిచి వెళ్ళిపోతాయి. ఒక్క మనిషి కాదు కదా, ఒక్క జంతువు కూడా రాత్రి వేళ ఈ వనంలో ఉండటానికి సాహసించదు. ఒకవేళ ఎవరైనా ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, కుతూహలంతో రాత్రిపూట నిధివనంలోకి ప్రవేశిస్తే, వారికి మానసిక స్థితి తప్పిపోతుందని, లేదా అంతకంటే ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయని తరతరాలుగా వస్తున్న కథలు చెబుతున్నాయి. కొందరైతే మాయమయ్యారని, మరికొందరు పిచ్చిపట్టిపోయారని చెబుతారు.
అసలు నిధివన్ వెనుక ఉన్న ఈ అలౌకిక శక్తుల రహస్యం ఏమిటి? రాధాకృష్ణుల రాసలీలలు నిజంగానే ఇక్కడ జరుగుతాయా? అద్భుతమైన ఈ నమ్మకాలకు ఆధారాలు ఉన్నాయా? ఆ పవిత్ర, భయానకమైన వనంలో దాగిన ఆశ్చర్యకరమైన విషయాలు, స్థానికుల అనుభవాలు, చరిత్రలో నిక్షిప్తమైన రహస్యాలేంటి….
స్వామి హరిదాస్ గారు తపస్సు చేసి నిధివన్ ప్రదేశాన్ని పవిత్రంగా మార్చారు. వారు కృష్ణుని దర్శించారని కథనాలున్నాయి.
నిధివన్ దట్టమైన చెట్లు, మొక్కలతో నిండి బృందావనంలో ఉన్న ఒక వనం. నిధివనం ఇక చిన్న అడవిలాగా ఉంటుంది. తులసి, మెహందీ, కదంబ చెట్లు ఉన్నాయి. నిధివనంలో ఉన్న తులసి మొక్కలు రాత్రిపూట గోపికలుగా మారతాయని చెబుతారు.
పగటి వేళలలో నిదివనంలో ఎంతసేపైనా తిరగవచ్చు.. కానీ, రాత్రి మాత్రం ఆ పరిసరాల్లో అస్సలు ఉండవద్దని హెచ్చరిస్తారు. కృష్ణుడు ప్రతి రాత్రి అక్కడికి వచ్చి తన ప్రియురాలైన రాధా, గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని, ఆ సమయంలో కృష్ణుడి భటులు నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపాలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని ప్రజలు విశ్వసిస్తారు.
ఈ నిధివన్ దగ్గరగా స్థానికుల ఇళ్లు ఉంటాయి కాని వాటికీ కిటికీలు పెట్టుకోరు. ఎందుకంటే నిధి వన్ వైపు వారి చూపు కూడా వెళ్లకూడదని కిటికీలు పెట్టుకోరు. ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధివన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు. నిధివన్ లో రాత్రిపూట జరిగే రాసలీలలను చూడాలనుకోవడం పాపంగా బావిస్తారు. నిధివన్ నుంచి రాత్రి సమయంలో పిల్లనిగోవి వాయుస్తున్న శబ్ధంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తాయని చెబుతారు. కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల గాఢమైన నమ్మకం.
ఒకవేళ ఎవరైనా నిధివన్ లో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణ రాసలీలలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికీ పిచ్చిపట్టడం.. లేదా ప్రాణం పోవడం వంటివి జరుగుతాయని, అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జయపూర్ కు చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధివన్ లో ఏమి జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడని,. రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశద్వారంలో అతను అచేతనంగా పడి ఉన్నాడని, ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. గతంలోనూ ఓ భక్తునికి ఇలాగే జరిగిందట. శ్రీకృష్ణుడి రాసలీలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట
నిధివన్‌లో రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు నిధివన్‌లోని చెట్ల వెనుక దాక్కొని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించి . తర్వాతి రోజు వారు షాక్‌తో మతిస్థిమితం కోల్పోయినవారిలా ప్రవర్తించారని,. కొందరు చూపు, మాట కోల్పోయారట. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు అస్సలు ప్రయత్నించకూడదని, అది చాలా చిత్రంగా.. భయానకంగా, మనస్సును కదిలించేదిగా ఉండవచ్చని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే, నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు, తలుపులు తెరవరు.
ఇక్కడ చెట్ల మధ్య ఒక చిన్న ప్యాలెస్ ఉంది. దీనిని రంగ్ మహల్ అని పిలుస్తారు. నిదివనం లో రాసలీలల తరువాత రంగమహల్ లోనే రాధ, కృష్ణులు ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్లు తోముకోవడానికి రెండు వేపపుళ్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తులు అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూళం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచం పై ఉన్నదుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు.
అయితే యుగాలు గడిచి పోయినా శ్రీకృష్ణుడు తన చెలులతో ఇక్కడే ఎందుకు గడుపుతాడు అన్నదానికి ఓ కథనం ఉంది.
స్వామి హరిదాస్ ఒక గొప్ప సాధువు, సంగీతకారుడు మరియు శ్రీకృష్ణుని భక్తుడు. కృష్ణుడు ఇప్పటికీ బృందావనంలోనే ఉన్నాడని నమ్ముతూ, ఆయన తన జీవితాన్ని ధ్యానం మరియు భక్తితో గడిపారు. ఒకరోజు, నిధివనంలో ధ్యానం చేస్తూ భక్తి గీతాలు పాడుతూ ఉండగా, శ్రీకృష్ణుడు రాధ అతని ముందు కనిపించారు . స్వామి హరిదాస్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు, కృష్ణుడిని ఎప్పటికీ బృందావనంలోనే ఉండమని కోరాడు. కృష్ణుడు అంగీకరించాడు, ఫలితంగా బాంకే బిహారీ జీ విగ్రహం కనిపించింది . ఈ అద్భుత సంఘటన నిధివన్‌ను మరింత పవిత్రం చేసిందని, అందుకే ఇప్పటికీ కృష్ణయ్య నిదివన్ కు వస్తాడని నమ్ముతారు.
నిధివన్ లోపల ఉన్న తులసి చెట్లు చాలా ప్రత్యేకమైనవి. అవి సాధారణంగా పెరిగే తులసి చెట్ల లాగా కాకుండా, విచిత్రంగా జంట జంటలుగా, ఒకదానితో ఒకటి పెనవేసుకుని పెరుగుతాయి. వీటిని 'తులసి మాలలు' అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు రాత్రిపూట గోపికలుగా మారి రాసలీలల్లో పాల్గొంటాయని, తెల్లవారుజామున మళ్లీ తులసి చెట్లుగా మారతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా, ఇక్కడ ఉన్న రాళ్లు, కొండలు కూడా రాత్రిపూట గోపికలుగా మారతాయని చెబుతారు.
నిధివన్ పట్ల ఉన్న నమ్మకం కేవలం కథలు కాదు, స్థానికులు, భక్తులు చెప్పే ప్రత్యక్ష అనుభవాల వల్ల కూడా బలపడింది. కొందరు తమ కలలో రాధాకృష్ణుల దర్శనం లభించిందని చెబుతారు. మరికొందరు రాత్రిపూట నిధివన్ నుండి మృదంగ నాదాలు, గజ్జెల సవ్వడులు, వేణువు ధ్వనులు వినిపించాయని ప్రమాణం చేసి మరీ చెప్తారు.
నిధివన్ లోపల ఒక చిన్న కోనేరు ఉంది, దీనిని లలితా కుండ్ అని పిలుస్తారు. రాధాదేవికి దాహం వేసినప్పుడు శ్రీకృష్ణుడు తన వేణువుతో ఈ కోనేరును సృష్టించాడని పురాణం. ఈ కోనేరులోని నీరు చాలా పవిత్రమైనదని భావిస్తారు.
నిధివన్ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. నిధివన్ కు వెళ్లినవారు ప్రధాన ఆలయమైన రంగమహల్ లోని రాధకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ ను దర్శించుకుని వస్తారు.
సైన్స్ దృష్టికోణంలో ఈ నమ్మకాలకు ఎటువంటి ఆధారాలు లేవు. నాస్తికులకు, హేతువాదులకు ఇప్పటి వరకూ నిధివన్ మర్మం అంతుచిక్కలేదు. కొందరు “నిధివన్ లో దేవుడు లేడు" అని నిరూపించడం కోసం రాత్రి సమయంలో రహస్యంగా ఆ ఆలయ ప్రహరీ లోపల సంచరించారు. అలా ప్రయత్నించిన వాళ్ళకి కళ్ళుపోవటం, మతిచెడిపోవటం లాంటివి జరిగాయి. కొంతమంది చాలా రహస్యంగా ఆ ఆలయం లోపల నిఘా కెమెరాలు" అమర్చి విఫలమయ్యారు కూడా అయితే, భక్తులు మరియు స్థానికులు దీనిని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా, దివ్య శక్తి ప్రబలంగా ఉన్న ప్రదేశంగా భావిస్తారు. బృందావనంలో ఆధ్యాత్మికతకు, నమ్మకానికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకే నిధివన్ ఒక అద్భుతమైన రహస్యంగా, అంతుచిక్కని ఆధ్యాత్మిక ప్రదేశంగా కొనసాగుతోంది.
శాస్త్రీయంగా ఈ ప్రాంతంలోని వాతావరణం, నేల, చెట్ల రసాయన నిర్మాణం గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటికీ నిధివన్ మిస్టరీని మాత్రం పూర్తిగా కనుక్కోలేకపోయారు.
నిధివన్ - శ్రీకృష్ణుడు, రాధాదేవిల ప్రేమకు నిరంతర సాక్షిగా, అలౌకిక శక్తులతో నిండిన ఒక మిస్టీరియస్ ప్రదేశంగా బృందావనంలో నిలిచి ఉంది. ఇది కేవలం ఒక భౌతిక స్థలం కాదు, తరతరాలుగా భక్తుల హృదయాల్లో నాటుకుపోయిన ఒక ప్రగాఢ విశ్వాసం, ఒక ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక అనుభవం.
ద్వారా అయితే ఆగ్రా, మధుర లేదా ఢిల్లీ వరకు వెళ్లి అక్కడినుంచి కేబ్ లో వెళ్ళవచ్చు. ఢిల్లీ నుండి సుమారు 157 కి.మీ, ఆగ్రా నుండి 80 కి.మీ మరియు మధుర నుండి 12 కి.మీ దూరంలో ఉంది నిధివన్.
దేశంలోని దాదాపు అన్ని నగరాల నుంచి ఇక్కడికి రైలు సదుపాయం ఉంది. సమీప రైల్వే స్టేషన్ 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురలో ఉంది.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది నిధివన్ కి 150 కి.మీ దూరంలో ఉంది.