Vijaya Lakshmi
Published on Jul 20 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?“భీమిలి...” ఓ వైభవం. ఓ చరిత్ర. ఓ పురాణం. మన దేశానికి వ్యాపారం కోసం వచ్చిన పోర్చుగీస్, డచ్ వారికి ప్రధాన స్థావరం. హిరణ్యకశిపుడిని పేగులు చీల్చిన ఉగ్రనరసింహుడు శాంతంగా సౌమ్యనారసింహుడుగా మారిన ప్రదేశం. భీముడు బకాసురుడిని ఉసురు తీసిన ప్రాంతం. బుద్ధుని అవశేషాలు అడుగడుక్కీ కనబడే బౌద్ధ చిహ్నాలు.
“భీమిలి...” అత్యంత ఆకర్షణీయమైన తీర ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి మున్సిపాలిటీ... భారతదేశంలోనే రెండవ మున్సిపాలిటీగా ప్రతిష్ట సంపాదించుకున్న పట్టణం. ఇప్పుడు విశాఖపట్నం మెగాసిటీగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది గాని, విశాఖపట్నం చేరువలోనే ఉన్న భీమిలి లేదా భీమునిపట్నం, విశాఖపట్నం కంటే ముందే ఓ పెద్ద పట్టణంగా, చారిత్రక ప్రాంతంగా వైభవాన్ని చవి చూసిన పట్టణం. ఈ పట్టణం తర్వాత కాలంలో కాస్త మరుగునపడినా తన ప్రత్యేకతను మాత్రం కోల్పోలేదు అదే భీమునిపట్నం.
రామాయణ, మహాభారత కాలంనాటి కథలతో ముడిపడిన ప్రాంతం భీమునిపట్నం. ఇటు పౌరాణికంగాను, అటు చారిత్రాత్మకంగాను కూడా భీమునిపట్నానికి పెద్ద స్థానమే ఉంది. భీమిలి అంటే అందమైన సముద్రపుటలలు కళ్ళముందు కదలాడతాయి. ముఖ్యంగా బెస్తవారు అంటే మత్స్యకారుల జీవనవిధానం అతి దగ్గరనుంచి చూడగలిగే ప్రాంతం.
భీమిలి అంటే ఉగ్ర నరసింహుడు అత్యంత సౌమ్యంగా కనిపించే నరసింహదేవాలయం గుర్తొస్తుంది. భీమిలి అంటే డచ్ బంగళాలు, పోర్చుగీస్ వారి భవన శిధిలాలు..., బుద్ధుని అవశేషాలు దొరికిన బౌద్ధారామాలు అందమైన స్థలాలు, ఇలా చాలా చాలా విశేషాలు ..
భీమిలి అత్యంత ప్రాచీనమైన రేవు పట్టణం. పాండవులలో రెండవ వాడయిన భీముని పేరిట ఈ పట్నం వెలిసిందని పురాణ కథనాలు చెప్తున్నాయి. విశాఖ నుంచి 24 కి.మీ. దూరంలో ఉన్న అద్భుత పర్యాటక ప్రాంతం భీమిలి.
భీమిలి... భీమునిపట్నం ... దీని గురించి చెప్పుకోవలసి వస్తే చారిత్రిక ప్రసిద్ధి, ఆధ్యాత్మిక ఆనందం అన్నిటిని మించి సముద్రపుటందాలు... ఇలా చాలానే ఉన్నాయి వాటిలో ముందుగా బీమిలి బీచ్ అందాలు ....
ఇదొక ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్. స్థానికుల దగ్గర్నుంచి, విశాఖపట్నం వచ్చే పర్యాటకుల వరకు ప్రతి ఒక్కరు భీమిలి బీచ్ చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అంత అందంగా ఉంటుంది భీమిలి బీచ్. అందుకే లెక్కలేనన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి, జరుపుకుంటూనే ఉన్నాయి.
అందమే కాదు చారిత్రకంగా కూడా ఈ భీమిలి బీచ్ ప్రసిద్ధి చెందింది. అనేకమైన బౌద్ధ విశేషాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. బౌద్ధుల సంస్కృతి సంప్రదాయాలు వాటికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇక్కడ లభించాయి. బుద్ధుని మరణానంతరం అతడి అవశేషాలను ఎనిమిది భాగాలుగా చేసి వివిధ ప్రాంతాల్లో భద్రపరిచారట. అందులో ఒకటి భీమిలి పరిసర ప్రాంతంలో దొరికిందట. బుద్ధుని అవశేషాలలోని ఎనిమిదవ భాగం భీమిలి సమీపంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైందని. ఉత్తరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి గా చెప్తారు.
బౌద్ధానికి ప్రముఖ కేంద్రంగా పరిగణించే భీమిలి పావురాల కొండ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ సాధారణ శకానికి పూర్వం మూడవ శతాబ్దం నుంచి సాధారణ శకం రెండవ శతాబ్దం వరకు ఇక్కడ జనావాసాలు ఉండేవని పరిశోధనలు చెప్తున్నాయి.
ఉత్తర తీర ప్రాంతాల్లోని అతిపెద్ద బౌద్ధ క్షేత్రాల్లో పావురాల కొండ ఒకటి. 1990-91 లో జరిగిన తవ్వకాల్లో ఎన్నో రకాల ఆనాటి అవశేషాలు కట్టడాలు కనిపించాయి... ప్రస్తుత కాలంలో మనం ఇంకుడు గుంతలు, వర్షపునీటిని భద్రపరిచే పద్ధతులు అంటూ చాలా చేస్తున్నాం. కానీ ఆనాడే వర్షపునీటిని భద్రపరిచే పద్ధతులు పాటించిన ఆనవాళ్ళు ఇక్కడ కనబడతాయి. భీమిలి బీచ్ కి సమీపంలోనే ఉన్న పావురాల కొండ పై పురావస్తు శాఖ వారు కనుగొన్న 16 నీటి తొట్టెలే దీనికి సాక్ష్యం. బౌద్ధ విశేషాలను చాటిచెప్పే తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి.
ఒకప్పుడు విశాఖపట్నంలో పోర్టు ఉండేది కాదు... కాని అప్పట్లో వర్తకాలు అన్ని దాదాపుగా సముద్ర మార్గం లోనే జరిగేవి. కాబట్టి ఓడలు రావడానికి అనుకూలంగా ఉండే ప్రాంతం అని ఈస్టిండియా కంపెనీ వారు ఈ భీమిలిని ఎన్నుకున్నారు. భీమిలి కి మరో ప్రత్యేకత కూడా ఉంది.
భారతదేశం మొత్తం మీద ఏర్పడిన పురపాలక సంఘాలలో భీమిలి రెండోది. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, మన రాష్ట్రంలోనే మొట్టమొదటి పురపాలక సంఘం... అంటే మొదటి మున్సిపాలిటి. ఈ ప్రాంతంలో డచ్ వారు కూడా స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు... దానికి రుజువులుగా ఇప్పటికీ భీమిలి బీచ్ కి దగ్గరలో డచ్ సమాధులు కనిపిస్తాయి. ఎన్నో ప్రాచీన కట్టడాలు, హిందూ, బౌద్ధ మత ప్రాచీన నిర్మాణాలతో పాటు బ్రిటీష్, డచ్ వారి పాలనకు ఆనవాళ్ళుగా నిలిచే చారిత్ర కట్టడాలకు నిలయం భీమిలి.
ఇక్కడున్న లైట్ హౌస్ అప్పట్లో కాకినాడ, శ్రీకాకుళం మధ్య నిర్మింఛిన ఎనిమిది లైట్ హౌస్ లలో ఒకటి. ఈ లైట్ హౌస్ 18 వ శతాబ్ధపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుంది. ఇప్పు డు నిత్యం ప్రజలకు సమయాన్ని తెలియజేస్తున్న గంటస్తంభం ఆంగ్లేయుల కాలంలో నిర్మించారు. అప్పటి డచ్, ఫ్రెంచ్, బ్రిటన్ పాలకుల స్మృతి చిహ్నంగా భీమిలి సముద్ర తీరంలో ఉన్న వారి సమాధులు ఆనాటి చారిత్రిక నేపధ్యానికి గుర్తులుగా కనబడతాయి.
ఇక ఆధ్యాత్మికంగా కూడా భీమిలి అత్యంత ప్రసిద్ధి చెందింది. ఉగ్రనరసింహస్వామి సౌమ్య నారాయణుడిగా వెలసిన ప్రదేశం. భీమునిపట్నం లో నరసింహస్వామివారు వెలసిన కొండను సౌమ్యగిరి అని పిలుస్తారు. స్వామి ఉగ్రరూపం వదిలి సౌమ్య రూపం దాల్చిన ప్రదేశం కావున అలా పిలిచేవారు.ఈ సౌమ్య గిరే నేడు భీమిలి పట్టణంలో ఉన్న పావురాల కొండ.
మన రాష్ట్రంలో ముప్పైరెండు పురాతన నృసింహ క్షేత్రాలు యుగయుగాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ దివ్యక్షేత్రాలలో నవనారసింహ నిలయం అహోబిలం మొదటి స్థానం. చివరది సౌమ్య గిరి.
కృతయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నర, మృగ శరీరంతో ఆవిర్భవించాడు నరసింహస్వామి. హిరణ్యకశిపుని సంహరించి ఆ క్రోధం చల్లారక హుంకరిస్తున్న నరసింహస్వామిని చూడడానికే భయపడిపోయారట సర్వదేవతలు. చివరికి దేవతలందరూ కలిసి, “భయంకరంగా, ఉగ్రస్వరూపంతో స్వామిని దరిచేరడానికి ఎవరికీ ధైర్యం లేదు. ఒక్క నీవు మాత్రమే స్వామిని శాంతింపచేయగలవు” అంటూ ప్రహ్లాదుని ముందుకు తోసారు. దాంతో స్వామికి ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు ఉగ్రస్వరూపంతో ఉన్న స్వామిని శాంతింపచేసి సౌమ్య రూపంతో దర్శనమిమ్మని కోరగా ప్రహ్లాదుని అభ్యర్ధన మేరకు శాంతించిన నరసింహుడు శంఖు, చక్ర, గద, అభయహస్తములతో శాంత స్వరూపంతో సుందరమైన రూపంతో వారికి దర్శనమిచ్చాడు. తరువాత ఇక్కడి సౌమ్యగిరిపై స్వయంభువుగా శాంతస్వరూపుడైన నారాయణ స్వరూపంతో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
మరో కథనం ప్రకారం ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోనే కొంతకాలం సంచరించారు. వనవాసకాలంలో పాండవులు నివసించిన ఏకచక్రపురమే ప్రస్తుతం భీమునిపట్నంగా మారింది. భీముడు ఈ ఏకచక్రపురంలోనే బకాసురుడిని సంహరించాడు. అందువల్లనే ఈ పట్టణానికి భీమునిపట్నంగా పేరొచ్చిందని, ఆనాటి ఏకచక్రపురమే ఈనాటి భీమునిపట్నంగా రూపాంతరం చెందినట్లుగా చెప్తారు. రాక్షస సంహారం తరువాత భీముడు ఇక్కడి సౌమ్యగిరిపై లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని అంటారు. అదేవిధంగా పరమేశ్వరుని కృప కారణంగానే రాక్షస సంహారం చేయగలిగానని అందువలన స్వామికి కృతజ్ఞతగా శివాలయాన్ని కూడా నిర్మించి పరమేశ్వరుని ప్రతిష్టించినట్టు ఓ కథనం. అదే భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వరాలయం.
భీమిలిలో పాండవుల వనవాస ఆనవాళ్ళు, పంచపాండవుల విగ్రహాలు ఈనాటికి కూడా మనకు కనిపిస్తాయి.
భీమిలిలో నరసింహస్వామి ఆలయం చాలా ప్రాచీన ఆలయం. సాధారణంగా నరసింహస్వామి క్షేత్రం అనగానే గర్భాలయంలో స్వామివారు సింహం తలతో ... మానవ శరీరంతో తన ఎడమ తొడపై అమ్మవారిని కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తుంటాడు. కాని భీమిలి నరసింహస్వామి ఆలయంలో అందుకు భిన్నంగా, ప్రశాంతమైన వదనంతో నిలబడి శంఖు చక్రాలతో నారాయాణ స్వరూపంతో స్వామివారు దర్శనమిస్తారు. ఊరికి దూరంగా కొండమీద ఉంటుందీ ఆలయం. మొట్టమొదట ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని అంటారు.
కలియుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన నరసింహప్ప చోళ రాజు పురాతన ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణకు గోవులు, మాన్యాలు ఇచ్చినట్లుగా లభించిన శాసనాలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా శ్రీ నరసింహ చోళ కొండ అని కూడా పిలుస్తారు. తరువాత స్థానిక పాలకులైన "మింది వంశం" వారు ప్రస్తుత ఆలయాన్ని 1226వ సంవత్సరంలో నిర్మించారు.
స్వాతి నక్షత్రం రోజున, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి మరియు శనివారాలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి, నృసింహ జయంతి, ధనుర్మాస పూజలు ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ప్రాంతాలలో ఎవరి ఇంట శుభ కార్యం జరుగుతున్నా ప్రధమ ఆహ్వానం స్వామివారికే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్వతానికి వెనక పక్క క్రీస్తుపూర్వం నాటి బౌద్ద భిక్షువుల విహార శిధిలాలు ఉంటాయి.అయితే సౌమ్యగిరి అని పిలుచుకునే ఈ పర్వతం ఒకప్పుడు బౌద్దక్షేత్రముగా ఉండేదట. ఇక 11 , 12 శతాబ్దాలలో వైష్ణవం బాగా వ్యాపించి ఆ సమయంలో ఇచట ఈ వైష్ణవాలయం ఏర్పాటు చేసినట్టు కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఆ తరువాత శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసినట్టు కూడా చెప్తారు.ఇలా ఈ క్షేత్రం గురించి విభిన్న కథనాలు వినబడతాయి.
సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ ఆలయంలో ప్రదక్షిణ చేసి ఆ తరువాతే స్వామివారి దర్శనం చేసుకోవడం ఇక్కడి ఆచారం.
ఇక భీమిలిలో ఉన్న మరో ప్రాచీన దేవాలయం భీమేశ్వరాలయం. ప్రధాన రహదారి పైన ఉన్న ఈ దేవాలయం శాలివాహన శకం 1170 లో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. చోళరాజులు దీనికి అనుబంధం మరో ఆలయాన్ని నిర్మించారని అదే చోళేశ్వరాలయంగా చెప్తారు. ద్వాపరయుగం నాటి నుంచి ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువుతీరిన శివకేశవులను దర్శిస్తే దుఃఖ, దారిద్రాలను తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
విశాఖపట్టణానికి అతి సమీపంలో ఉన్న భీమిలికి తరుచుగా సిటీ బస్సులు నడుస్తుంటాయి. భీమిలి కి 24 km ల దూరంలో ఉన్న వైజాగ్ లో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుండి భీమిలికి బస్సులలో లేదా ప్రవేట్ వాహనాలలో ప్రయాణించి భీమిలి చేరుకోవచ్చు. వైజాగ్ నుండి తరచూ సిటీ బస్సులు 999, 900T, 900K తిరుగుతుంటాయి.
ఈ డిటెక్టివ్ నవల మొదలుపెడితే అస్సలాపలేరు