Vijaya Lakshmi
Published on Sep 04 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?శక్తిపీఠాల చరిత్ర, విశేషాల గురించి గత బ్లాగ్ తరువాతి వివరణ ఈ బ్లాగ్ లో
అమ్మవారి "తలవెంట్రుకలు" ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెబుతుంది. ఇదే చాముండేశ్వరి శక్తిపీఠం. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. . సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది.
ఈ శక్తి పీఠానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి.. ఒక్క స్త్రీ తప్ప, ఇంకెవ్వరి చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరగర్వంతో ఎవ్వరూ తనని చంపలేరు... ఇక ఒక స్త్రీ తననేం చెయ్యగలడు అన్న అహంకారంతో సకల లోకాలను పీడించసాగాడు. చివరికి ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు.
అతని ఆగడాలకు, భయభ్రాంతులకు లోనైన సకల లోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, వారు మహిషాసుర సంహారం కోసం స్త్రీ శక్తిని సృష్టిస్తారు. ఆ సర్వదేవతల శక్తితో వెలసిన శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. ముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంది.
చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఉన్నమహిషాసురుని విగ్రహం ఉంటుంది. మైసూరు రాజుల ఇష్టదైవమైన చాముండేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా చేస్తరు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాదిమంది యాత్రికులు వస్తుంటారు.
సతీదేవి "దంతాలు" ఇక్కడ పడ్డాయని, అందులోను అమ్మవారి పైదవడ భాగం అలంపూర్‌లో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. కింద దవడకంటే పైదవడ కాస్త వేడిగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ తల్లి రౌద్ర స్వరూపిణిగా వెలసిందని చెప్తారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటంతో ఆమెను శాంతింపజేసేందుకు ఆలయ కింది భాగంలో జల గుండం ఏర్పాటు చేసి నీటితో ఉంచుతారని చెప్తారు.
మిగతాచోట్ల స్త్రీ దేవతలకు తల వెంట్రుకలు వెనక్కి ఉంటే ఇక్కడ మాతకు మాత్రం పైకి ఉంటాయి. ఇలా ఉండటాన్ని ‘జట’ అంటారు. పరమేశ్వరుడికి మాత్రమే ఇలా జట ఉంటుంది. దేవతల్లో జోగులాంబకి మాత్రమే ఇలా ఉంటుంది. జటాజూటధారి అయిన తల్లి తల వెంట్రుకల్లో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి. వీటితోపాటు అమ్మవారు ప్రేతాసనంలో ఉంటారు. ఈ అయిదూ ఇక్కడి ప్రత్యేకతలు. పరమేశ్వరుడు ఎక్కువకాలం శ్మశానవాసి కాబట్టి దేవి కూడా ఆయనలో భాగమని చెప్పడానికే ఈ ప్రత్యేకతలు ఉంటాయని ఓ కథనం.
గృహచండి గా వాస్తుదోషాలు పోగొట్టే అమ్మవారు!
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో కర్నూలుకు 10కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని చెప్తారు. అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనతారు. వాస్తుదోష నివారణలకు కూడా ఈ జోగులాంబ అమ్మవారిని మొక్కితే త్వరగా ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
జోగులాంబ ఆలయాన్ని మొదట సా.శ.ఆరో శతాబ్దంలో బాదామి చాళుక్యుడైన రెండో పులకేశి నిర్మించాడు. 17వ శతాబ్దంలో మహ్మదీయుల దండయాత్ర సమయంలో ఆలయం ధ్వంసమైనట్లు చరిత్ర కథనాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి విగ్రహాన్ని మాత్రం సమీపంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు.
2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నట్టు నిర్మించింది. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ చేశారు.
పూర్వం ఈ ప్రాంతాన్ని హమతాపూర్, అమలాపూర్ అని పిలిచేవారట. జిల్లా కేంద్రం గద్వాల్‌కు 60కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.
ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి.
అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవ శక్తి పీఠం శ్రీశైలం. ఇక్కడ కొలువైన భ్రమరాంబికా దేవి భ్రామరీ శక్తితో విరాజిల్లుతున్నది. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా విశిష్ట స్థానం పొందినది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో, మార్కాపురంకు 80 కి.మీ. దూరంలో, దట్టమైన అడవులు, పర్వతాల మధ్య ఈ క్షేత్రం ఉంది. సతీదేవి కంఠభాగం ఈ ప్రదేశంలో పడిందని చెప్తారు.
అరుణాసురుడనే రాక్షసుడు ఇక్కడి ప్రజలను, మునులను ఆందోళనలకు గురి చేసేవాడు. రెండుకాళ్ళు, నాలుగుకాళ్ళు జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించడానికి అమ్మవారు తుమ్మెద (భ్రమరం) రూపంలో వచ్చి అతన్ని సంహరించింది.
అమ్మవారు ఇప్పటికీ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుందని చెప్తారు. అందుకే ఇప్పటికీ అక్కడ భ్రమరనాదం వినపడుతూ ఉంటుందని, ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయని కూడా చెప్తారు. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవినిబాగా నొక్కిపెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటేఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుందట. దానిని భ్రామరీ నాదము అంటారు. దానికి గుర్తుగానే అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారంచేస్తారు.
మహారాష్ట్రలోని పూణేకి 300కి.మీ దూరంలో కొలహాపూర్ లో వెలిసిన అమ్మ మహాలక్ష్మీ అవతారం. ఇక్కడ సతీదేవి "నేత్రాలు" పడ్డాయని చెబుతారు. ఈ అమ్మవారిని స్థానికులు ప్రేమగా అంబాబాయి అని పిలుస్తారు. సాధారణంగా మహాలక్ష్మిదేవి అంటే శ్రీమహావిష్ణువు పత్ని లక్ష్మీదేవి అని భావిస్తాం. కాని ఇక్కడ వెలసిన మహాలక్ష్మిదేవి అంటే విష్ణుపత్ని లక్ష్మి అనుకోకూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవె ఈ మహాలక్ష్మి అని పండితులు చెప్తున్నారు.
ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో ఛత్రం పడుతున్నట్లు ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ అమ్మవారిని చూడటానికి రెండు కన్నులు సరిపోవు. అందుకే కొల్హాపూర్ ను "అవిముక్త క్షేత్రం" గా వ్యవహరిస్తారు.
ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు.
ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు.
కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది.
మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో ఉన్న మహోర్ కి 15కి.మీ దూరంలో వెలిసిన తల్లి ఏకవీరాదేవి. దక్షయజ్ఞంలో తనువు చాలించిన అమ్మవారి "కుడిచేయి" పడిన స్థలం ఇది.
ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే మనకు కనబడుతుంది. గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత ఎత్తులో ఉండే తలభాగం మాత్రమే ఉంటుందిక్కడ. అమ్మవారి ముఖమంతా సింధూరం పూసి, పూర్తిగా సింధూర వర్ణంతో కనబడుతుంది అమ్మవారు. ఈ ప్రాంతాన్ని మయూరపురమని కూడా అంటారు
.
సహ్యాద్రి పర్వత శ్రేణులలో శిఖరంపై గల ఈ శక్తిపీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి అమ్మవారికి జంతు బలులిచ్చి సంతృప్తిపరుస్తారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ దర్శించినట్లుగా చరిత్రకారుల అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ ఉన్న మూడు కొండలలో ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరాదేవి ప్రతిష్ఠితిమయ్యారు.
జమదగ్ని రేణుఖా దంపతులకు సంబంధించిన కథ ఇక్కడే జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అనికూడాఅంటారు.
జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి మనసు చంచలమయిందని ఆగ్రహించి ఆమె తల తీసేయమని కొడుకైన పరశురాముడిని ఆదేశిస్తాడు. తండ్రి మాటను పరశురాముడు శిరసావహిస్తాడు. ఫలితంగా మొండెం నుంచి వేరైన రేణుకామాత తల అక్కడికి దగ్గరలో వున్న ఓ గూడెంలో పడుతుంది. రేణుకామాత పాతివ్రత్యం గురించి ముందుగానే తెలిసి వుండటం వలన, ఆ గూడెం ప్రజలు ఆమె తల పడిన ప్రదేశంలో గుడికట్టి పూజించడం మొదలు పెట్టారు. అలా ఇక్కడి అమ్మవారు పూజలు అందుకుంటోందని భక్తుల విశ్వాసం.
అయితే ఇది రేణుకా మాత ఆలయమేగానీ శక్తి పీఠం కాదని కూడా ఒక వాదన ఉంది. అక్కడికి దగ్గరలోనే అంటే మాహొర్ కి 10 కిలోమీటర్ల దూరంలో అసలైన శక్తి పీఠం ఉందని, నిజమైన శక్తి పీఠం ఇదేనని చెప్పే ఆధారాలు ఇక్కడ ఉన్నాయని చెబుతారు. మాహొర్ కి 10 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య చిన్న గుడిలో వెలసిన ఈ అమ్మవారి ప్రతిమ కూడా ముఖం వరకు (తల భాగం ) మాత్రమే ఉండటం విశేషం. ఏదేవైనా ఈ ప్రాంతానికి వెళితే రేణుకా మాత క్షేత్రంతో పాటు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించిన భాగ్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అష్టాదశ శక్తిపీఠాలు మిగిలిన తరువాతి బ్లాగ్ లో ....