Vijaya Lakshmi
Published on Aug 11 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే.
ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత. విశిష్టతను మించిన అంతుచిక్కని రహస్యాలు.
ఆ రహస్యాలపై ఏళ్లకు ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.
అలాంటిదే ఈ ఆలయం కూడా ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు. అసలవి ప్రత్యేకతలు అనడం కంటే అంతుచిక్కని రహస్యాలు, సమాధానం దొరకని ప్రశ్నలు అనడం సబబుగా ఉంటుంది. అది సంవత్సరంలో ఒకే ఒక్కసారి మాత్రమె తెరిచే ఆలయం. ఏడురోజులు మాత్రమే తెరిచి ఉంచి మళ్ళీ మూసేసే ఆలయం. పూజలు చేసి అన్నం నైవేద్యం పెట్టి తలుపులు మూసి మళ్ళీ సంవత్సరం తరువాత తెరిచేసరికి ఆ పువ్వులు, ప్రసాదాలు తాజాగా ఉంటాయి. ఆ అన్నం చక్కగా తినడానికి వీలుగా ఉంటుంది. ఇదెలా సాధ్యం... ఎన్ని పరిశోధనలు జరిగినా సమాధానం దొరకని ప్రశ్న. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అలాంటి ఓ మహిమాన్విత, రహస్య దేవాలయం గురించి తెలుసుకుందాం....
ఆ జగజ్జనని అనేక ప్రాంతాల్లో అనేక పేర్లతో వెలిసింది. అలా అమ్మవారు హసనాంబగా అతి విచిత్రమైన చరిత్రతో వెలసిన అమ్మవారే హసనాంబ దేవి. కర్నాటకలో రాష్ట్రంలో హాసన్ అనే పట్టణం. ఆ పట్టణంలో వెలసిన అమ్మవారు హాసనాంబ. అమ్మకు ఎన్నో పేర్లున్నాయి. ప్రతి పేరుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. అలాగే ఈ పేరు కూడా. హాసనాంబ. హాసం అంటే నవ్వు. అమ్మవారు ఎప్పుడూ ప్రసన్నంగా నవ్వుతూ ఉంటుంది కాబట్టి హాసనాంబ అయింది. ఆ అమ్మవారి పేరుమీదే ఆ పట్టణం పేరు కూడా హాసన్ అయింది. బెంగుళూరు కు 183 కి. మీ. ల దూరంలో హాసన్ లో వెలసిన అమ్మవారి మహిమల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అమ్మవారు నిరంతరం ప్రసన్నంగా నవ్వుతూ ఉంటుంది. అయితే ఆ నవ్వు తన భక్తులకు హాని కలగనంతవరకే. తన భక్తులకు ఎవరైనా హాని కలిగిస్తే అమ్మవారి ప్రసన్నత పోయి ఉగ్రకాళిగా మారిపోయి వారి అంటూ చూస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథను చెప్తారు. అమ్మవారి భక్తురాలైన ఒక స్త్రీ నిరంతరం దాంతో అత్తవారింట్లో బాధలు పడుతూ ఉండేది. ఎన్ని బాధలు పడినా అమ్మవారినే నమ్ముకొని అన్ని సహిస్తూ ఉండేది. ఒకసారి ఆమె అత్తగారి కర్కశత్వం పరాకాష్టకు చేరింది. ఆమె మీద చెయ్యి చేసుకొని కొట్టింది. దాంతో తన కష్టాలకు ఏడుస్తూ అమ్మవారిని వేడుకుంది. తన భక్తురాలి కష్టాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయింది హాసనాంబ. కఠిన పాషాణంలా ప్రవర్తించినందుకు గాను ఆ అత్తగారిని రాయిలాగా మార్చేసి ఆలయంలో తన దగ్గరే ఉంచేసుకుందట. ఈ రాయి ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా అమ్మవారివైపు జరుగుతుందని చెపుతారు. ఇలా జరిగి జరిగి, ఆ రాయి అమ్మవారి పాదాలను తాకేసరికి కలియుగం అంతమవుతుందని భక్తులు నమ్ముతారు. భక్తుల నమ్మకం సంగతి అలా ఉంచితే ఎవ్వరూ కదపకుండా ఒక రాయి అలా కదలడం అనేది ఊహకందని విచిత్రం. అసాధ్యం కూడా. కాని ఇక్కడ అసాధ్యం సాధ్యమయింది. అసలా ఒక రాయి కదలడం వెనక ఉన్న శాశ్త్రీయ కారణమేంటా అని ఎన్ని పరిశోధనలు జరిగినా అసలు రహస్యం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది.
అదేవిధంగా ఒక సారి నలుగురు బందిపోట్లు హాసనాంబ గుడి ధనాన్ని దోచేందుకు ప్రయత్నించారు. హసనామ్బకు కోపం వచ్చి, వారిని రాళ్ళుగా మారమని శాపం పెట్టింది. కళ్ళ అంటే కన్నడంలో దొంగ ఆ కారణంగా ఈ టెంపుల్ ను కళ్ళప్పన గుడి అని కూడా అంటారు. ఇప్పటికి కూడా ఆ నాలుగు రాళ్ళను చూడొచ్చు.
ఇంత మహిమాన్వితమైన ఈ అమ్మవారిని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకుందామంటే కుదరదు. ఎందుకంటే హసనాంబ అమ్మవారి దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. అలా తెరిచినపుడు ఏడు రోజులు మాత్రమే దేవాలయంలోని అమ్మవారిని దర్శించు కోవడానికి అనుమతి ఉంటుంది.
ఈ సమయంలో కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు.
సరిగ్గా ఏడు రోజుల తర్వాత ఈ దేవాలయాన్నిమూసివేస్తారు. అలా మూసేసేముందు నెయ్యితో వెలిగించిన దీపాన్ని హాసనాంబ అమ్మవారి విగ్రహం ముందు ఉంచుతారు. ఆ దీపాన్ని నందాదీపం అంటారు. అమ్మవారిని పూలతో అలంకరిస్తారు. రెండు బస్తాల బియ్యాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు. మళ్ళీ ఏడాది తర్వాతే ఆలయ ద్వారాలను తెరివడం జరుగుతుంది. విచిత్రంమైన విషయం, నమ్మలేని నమ్మకతప్పని విషయమేమిటంటే సంవత్సరం క్రితం పెట్టిన ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వులు కూడా వదలిపోవు. అన్నిటికంటే విచిత్రం హసనాంబ అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదాలు కూడా చెడిపోకుండా తినడానికి అనుకూలంగా ఉంటాయి. ఇదెలా సాధ్యం అన్నది పరిశోధనలకందని నమ్మకం. అది ఆ హసనంబకే ఎరుక.
సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి మర్నాడు ఆలయాన్ని మూసివేస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వ్వేయుజ మాసంలో అంటే సాధారణంగా అక్టోబర్ చివర - నవంబర్ మొదట్లో వచ్చే పౌర్ణమి గురువారం నాడు మాత్రమే ఈ టెంపుల్ తెరుస్తారు. సరిగ్గా, దీపావళి మరుసటి రోజు అయిన బలి పాడ్యమి నాడు మూసి వెయ బడుతుంది. అప్పటి నుండి మరల సంవత్సరం తరువాతే తెరవడం జరుగుతుంది.
ఇంత మహిమాన్వితమైన హసనాంబ అమ్మవారు ఇక్కడ ఎలా వెలసింది. ఒకసారి, సప్త మాతృకలు అంటే, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి దేవతలు ఒక పడవలో ఈ భూమ్మీదకు విహారానికి వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఈ ప్రాంత అందాలకు ముగ్ధులై, అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. మహేశ్వరి, కౌమారి, వైష్ణవి లు ఆ ఆలయ ప్రాంతంలోని మూడు చీమల పుట్టలను తమ నివాసంగా చేసుకొన్నారు. బ్రాహ్మి దేవి ఇక్కడి కోట లోను, ఇంద్రాణి, వారాహి మరియు చాముండి దేవిగేరే హోండా లోని మూడు బావులను నివాసంగా చేసుకున్నారు.
ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తీ ఆధారాలు మాత్రం కనిపడవు. అయితే కొన్ని కథనాలు చెప్తున్నదాని ప్రకారం చారిత్రాత్మకంగా చూస్తె ఈ హోయసలుల పాలనలోకి వచ్చినపుడు హోయసల రాజులు చెన్నపట్న పాలకుడిగా కృష్ణప్ప నాయకను నియమించారు. ఈయన ఒకసారి తన పరిపాలన నిమిత్తం ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతంలో బస చెయ్యవలసి వచ్చింది. ఆ ఆ సమయంలో ఇతనికి ఒక కుందేలు వ్యతిరేక దిశలో వస్తూ కనిపించింది. అది చూసి కొంతమంది కృష్ణప్ప నాయకుడితో ఇది దుశ్శకునం. మీరు ప్రయాణం ముగించి వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పారు. ఇది విని అయ్యో ప్రయాణం మధ్యలోనే వెనుతిరగ వలసి వచ్చిందని బాధపడి తన ప్రయాణాన్ని ముగించడమే కాకుండా శాశ్వతంగా ఆ నగరాన్ని విడిచిపెట్టాలని అనుకున్నాడు కృష్ణప్ప నాయకుడు. అప్పుడు హసనంబ దేవి ప్రత్యక్షమయి రాజా విచారించకు కోట నిర్మించడానికి ఈ స్థలం సముచితం కాబట్టి కుందేలు మొదట ప్రారంభమైన చోట కోటను నిర్మించు అని చెప్పింది. దేవి ప్రత్యక్షమయిన చోటే కృష్ణప్ప నాయకుడు హసనంబ దేవికి గుడి కట్టించాడు. అలాగే దేవి ఆదేశించిన ప్రాకారం దుర్భేధ్యమైన కోటను నిర్మించాడు అప్పట్నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారి పేరైన హసన్ అన్న పేరే స్థిరపడింది. హోయసలుల కాలంలో ఈ ఆలయం అత్యంత వైభవాన్ని చవిచూసింది. అందుకే ఆలయం అంతా హోయసలుల నిర్మాణ కళకు అనుగుణంగా ఉంటుంది.
హసనాంబ ఆలయానికి ఎదురుగా శివాలయం ఉంది. దీనిని స్థానికులు సిద్దేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ సిద్ధేశ్వరస్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తాడు. ఇక్కడే తొమ్మిది తలలు కల ఒక రావణ విగ్రహం వీణ వాయిస్తూ వుంటుంది. ఈ రావణ విగ్రహాన్ని ప్రతి పౌర్ణమి నాడు ప్రజలు దర్సిన్చుకొంటారు. ఇవి రెండు చాలా అరుదైన విషయాలుగా చెప్తారు. దీపావళి సమయంలో మూసివేసే రోజున హసనంబ ఆలయంలో అత్యంత వైభవంగా రధోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా హసనంబా ఆలయంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇంత మహిమాన్వితమైన హసనాంబ అమ్మవారి ఆలయానికి చాలా సులువుగా వెళ్ళొచ్చు. బెంగళూరు నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసనాంబ దేవాలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి బెంగుళూరు నుండి హసన్ కు తరచుగా బస్సు లు, ట్రైన్ లు కలవు.