Vijaya Lakshmi
Published on Aug 10 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?కొన్ని పేర్లు వినగానే భక్తికి పరాకాష్టగా వినబడతాయి. పరమభక్తులు మన కళ్ళముందు సాక్షాత్కరిస్తారు. అలాంటి పేరే హేమారెడ్డి మల్లమ్మ. ముఖ్యంగా శ్రీశైలం క్షేత్రంతోను, శ్రీశైల మల్లన్నతోను ముడిపడిన పేరు హేమారెడ్డి మల్లమ్మ. విచిత్రమేంటంటే శివయ్య ప్రత్యక్షంగా దర్శనమివ్వగానే ఆనందపారవశ్యంతో... ఆర్తితో మల్లమ్మ కంటినుండి కన్నీళ్లు ధారగా ప్రహించాయట. ఆ కన్నీరే ఇప్పటికీ శ్రీశైలంలోని హేమారెడ్డి మల్లమ్మ ఆలయంలో మల్లమ్మ విగ్రహం పక్కనుంచి ప్రవహిస్తూనే ఉంటుందని చెప్తారు. అందుకే శ్రీశైలంలో ఆ ఆలయం మల్లమ్మ కన్నీరుగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చే పేర్లలో ఒకటి హేమారెడ్డి మల్లమ్మ.
లోటన్నది లేని ఒక ధనిక కుటుంబంలో పరమ భక్తులైన తల్లిదండ్రులకు కూతురిగా పుట్టి, మరో ధనిక కుటుంబానికి కోడలిగా వెళ్ళి, భోగాలనుభవించవలసిన యుక్తవయసులోనే అన్నిటినీ వదిలిపెట్టి, నిరుపేదగా శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరి సన్యాసినిగా జీవితం గడిపి, మనిషిగా దుర్లభమైన శివ సాక్షాత్కారం పొందిన ధన్యురాలు హేమారెడ్డి మల్లమ్మ.
హేమారెడ్డి మల్లమ్మ జన్మ గురించి విభిన్న కథనాలు వినబడతాయి. ఒక కథనం ప్రకారం 1364 నుండి 1386 వరకు కొండవీడును పాలించిన రెడ్డిరాజు అనవేమారెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరే మల్లమ్మ అని చెబుతారు. అయితే మరో కథనం ప్రకారం శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలోనే ఉన్న శివపురం అన్న గ్రామంలో... నాగిరెడ్డి , గౌరమ్మ దంపతుల కుమార్తె హేమారెడ్డి మల్లమ్మ. నాగిరెడ్డిది భూస్వాముల కుటుంబం. శివభక్తులు. నిత్యం శివ చిహ్నాలయిన రుద్రాక్ష ధారణ, విభూతి ధారణతో, శివారాధన చేసి, జంగమదేవరలకు ఆహారం పెట్టి, ఒకవేళ ఏ రోజైనా భిక్ష స్వీకరించడానికి జంగమదేవరలు లభ్యం కాకపొతే గ్రామంలోకి వెళ్లి వెతికి మరీ జంగమదేవరలను పట్టుకొని వచ్చి వారికి ఆహారం పెట్టిన తరువాతే తాము ఆహారం తీసుకునేవారు నాగిరెడ్డి,గౌరమ్మ. అంతటి శివభక్తి పరులు... ఆచార పరులు.
నాగిరెడ్డి గౌరమ్మలకు ధనధాన్యాలకు కొదవలేదు. గ్రామంలో గౌరవానికి కొదవలేదు. ఉన్నదల్లా ఒక్కటే కొరత. సంతానం లేకపోవడం. పిల్లలు లేకపోవడం వారిని చాలా బాధపెట్టింది. తాము నమ్ముకున్న శివయ్యను తమ బాధ తీర్చమని ఆర్తిగా వేడుకున్నారు. వీరి పరిస్తితి చూసి ఇంత మంచి మనుషులకు ఈ లోటేంటని గ్రామస్తులు కూడా బాధపడేవారు. సంతానం కోసం నాగిరెడ్డి దంపతులు తిరగని క్షేత్రం లేదు. మొక్కని దేవుడు లేడు. మునగని తీర్థం లేదు. అందులో భాగంగానే తమ ఆరాధ్యదైవం మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ సత్రంలో ఉంటూ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. అక్కడ ఉండగానే శ్రీశైల మల్లన్న కరుణ లభించింది నాగిరెడ్డి దంపతులకు.
నాగిరెడ్డి దంపతులకు శ్రీశైల మల్లన్న దర్శనం
ఒకరోజు నాగిరెడ్డికి కలలో కనిపించిన శ్రీశైలమల్లికార్జునుడు నాగన్నా, మీ సంతానంగా ఒక బాలిక ఉదయించబోతుంది. ఆమె గొప్ప శివ భక్తురాలు...లీలా స్వరూపిణి... అవుతుంది. ఆమె నా భక్తురాలిగా నా క్షేత్రంతో ముడిపడి ఉంటుంది. అమె కారణంగా మీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు " అని చెప్పి దీవించాడు.
అలా శివయ్య కరుణతో నాగిరెడ్డి, గౌరమ్మ దంపతులకు ఒక పుత్రిక జన్మించింది. మల్లికార్జునుడి ఆశీర్వాదంతో జన్మించింది కాబట్టి మల్లమ్మ అని పేరు పెట్టుకున్నారా బాలికకు. ఆ పరమేశ్వరుని కరుణతో జన్మించిన ఆ బిడ్డకు జన్మతః శివభక్తి ఏర్పడింది. ఎవరూ చెప్పకుండానే, నేర్పకుండానే శివనామ జపం చేసేది. తోటిపిల్లలతో ఆడుకుంటున్నా, ఆహారం తింటున్నా, చివరికి నిద్రపోతున్నపుడు కూడా మల్లమ్మకు శివనామస్మరణే. శివయ్య ధ్యాసే. పసి వయసులో ఆటపాటలతో తిరగవలసిన స్తితిలో ఆమె అకుంఠిత శివ దీక్ష చూసి పెద్దలే ఆశ్చర్యపోయేవారట.
ఇలాంటి సమయంలోనే కూతురి ఆటపాటలను చూసి మురిసిపోవలసిన సమయంలోనే హఠాత్తుగా ఆమె తల్లి మరణించింది. తల్లి లేని ఆ బిడ్డను తల్లి, తండ్రి తానే అయి పెంచుకున్నాడు నాగిరెడ్డి. యుక్తవయసు రాగానే ఆమెకు వివాహం నిశ్చయించి సమీప గ్రామం సిద్దాపురంలో మోతుబరి రైతు హేమారెడ్డి చిన్నకుమారుడు బరమారెడ్డి కి ఇచ్చి వివాహం చేసాడు.
అప్పుడు మొదలయ్యాయి మల్లమ్మకు కష్టాలు... ఆమె శివదీక్షకు ఆటంకాలు. వివాహమై మల్లమ్మ అత్తింట అడుగుపెట్టిన తరువాత ఆమె అత్తింటివారికి బాగా కలిసి వచ్చిందని, మల్లమ్మ అదృష్టం కారణంగానే, ఆమె అడుగుపెట్టిన కారణంగా వారి ఆస్తిపాస్తులు, సంపద మరింత పెరిగాయని చెప్పుకునేవారు గ్రామస్తులంతా. ఆమె గురించి ఇలా గొప్పగా చెప్పుకోవడం ఆమె తోడికోడలికి కంటగింపుగా మారింది. ఆడపడుచుకి అసూయ కలిగింది. ఈర్శ్యాసూయలతో రగిలిపోయేవారు. దాని ప్రభావం ఆమె అత్తగారికి కూడా అంటించింది. అత్తా, తోడికోడలు కలిసి మల్లమ్మ పట్ల తమ అసహనాన్ని పలువిధాలుగా, పరిపరివిధాలుగా వ్యక్తం చేసేవారు.
వారి వేధింపులు ఎంత వరకు వెళ్ళాయంటే మల్లమ్మ తన భర్తతో ఏకాంతంగా ఉండే సమయం కూడా ఇవ్వకుండా ప్రతిరోజూ బరమారెడ్డిని రాత్రిపూట పొలానికి కాపలా ఉండమని పంపించేవారు. తల్లిమాటను తు.చ. తప్పకుండా పాటించేవాడు బరమారెడ్డి.
ఎవరైనా జంగమదేవరలు భిక్షకు వస్తే, “తెల్లారిందా...! అడుక్కోడానికి వేళయిందా...! వచ్చేశారు...! భిక్ష లేదు, గిక్ష లేదు పొండి పొండి...” అనే కసిరి కొట్టేవారు మల్లమ్మ అత్తా, తోడికోడలు. ఇది చూసి సహించలేని మల్లమ్మ, భోజన పదార్ధాలు ఇస్తే తన అత్తగారు ఎక్కడ చూస్తుందో అని భయపడి, ఒక చేటలో పదార్ధాలు పెట్టుకొని పరుగు పరుగున వెళ్లి వారికి అందించేది. ఇది అత్తగారికి తెలియనే తెలిసింది. దాంతో వారికి ఆమె మీద ద్వేషం మరింత పెరిగింది.
మరోసారి శ్రీశైలంలో ఒక దైవకార్యం కోసం సహాయం చెయ్యమని కొందరు వచ్చారు. దైవకార్యం కోసం తనవంతు సహాయం అందించాలనుకుంది మల్లమ్మ. కాని యదా ప్రకారం మల్లమ్మ అత్తగారు ఇక్కడ మీ తాత ముల్లేం దాచిపెట్టిలేదు. వెళ్ళండి వెళ్ళండని వాళ్ళని తరిమికొట్టారు. అయితే ఇంటినుంచి ఏమీ ఇవ్వలేని నిస్సహాయ స్తితిలో మల్లమ్మ తన చేతి గాజులను, మెడలోని హారాలను తీసి వారికి విరాళంగా ఇచ్చేసింది. ఇది ఆమె అత్తగారి కోపానికి అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది.
“ఇంటికి పెద్దను నేనా? నువ్వా? నేను బిక్షంలేదు వెళ్ళమంటే, నువ్వు వాళ్లకి భిక్షను ఇస్తావు. నేను వద్దు అన్నది నువ్వు చేస్తావు... ఇక మీదట నువ్వు అసలు వంట ఇంటిలోకి రానే వద్దు. బైట ఉండి పనులు చెయ్యి...” అంటూ ఇంటికి కావలసిన మొత్తం నీరంతా బావి నుంచి తోడి నిలవచేయ్యమనేది. జొన్నలు రాశిగా పోసి ఈ జొన్నలన్నీ విసిరి పిండి చెయ్యి అనేది. పాపం మల్లమ్మ ఆ పనంతా కిమ్మనకుండా చేసేది. చేతులు బొబ్బలెక్కిపోయినా ఆమె మీద జాలి చూపేవారు కాదు అత్తా, తోడికోడలు. ఒంట్లో శక్తి లేకపోయినా, చేతులు బొబ్బలెక్కినా పిండి విసురుతూనే ఉండేది మల్లమ్మ. కాని ఎంత విసిరినా ఆ జొన్నలరాశి తరిగేది కాదు. చివరికి తిరగలి విసరలేక మల్లమ్మ సోమ్మసిల్లినట్టుగా ఉండిపోయింది. భక్తురాలి ఈ బాధను చూసి ఆ శివయ్యే ఈ కార్యాన్ని పూర్తి చేసాడు. తేరుకొని కళ్ళు తెరిచిన మల్లమ్మ అక్కడ ఉన్న పిండిని చూసి ఇదంతా శివయ్య మహిమేనని గ్రహించి పరిపరివిధాల శివయ్యను స్తుతించి ఆ పిండినంతటినీ కుండకు ఎత్తి భద్రపరిచింది. కొంతసేపటికి అక్కడ పిండి లేకపోవడం చూసి, పిందినంతటినీ మళ్ళీ ఎవడికి ధారపోశావే అంటూ జుట్టు పట్టుకొని కొట్టింది అత్త. ఇంకొంచెం ఎగదోసింది తోడికోడలు. ఇలా పనిచేసినా, దానం చేసినా, ధర్మం చేసినా మల్లమ్మకు హింసే మిగిలేది.
ఒకసారి ఏరువాకకు వెళుతూ కొత్తకోడలు కదా అని ఎదురు రమ్మన్నాడు మామగారు హేమారెడ్డి. దురదృష్ణవశాన పిడుగులు పడి ఆ ఎద్దు మరణించింది. మల్లమ్మ జాతకం మంచిది కాదు, ఆమె ఎదురు మంచిది కాదు అందుకే ఎద్దు మరణించిందని యాగీ చేసింది అత్తగారు.
ఇంకోసారి వ్యసనపరుడైన పెద్దకొడుకు ఇంట్లో నగలు దొంగతనం చేసి పట్టుకుపోతే ఆ దొంగతనం మల్లమ్మే చేసిందని దొంగతనం మోపారు. ఇలా ఇంట్లో ఏం జరిగినా మల్లమ్మనే బాధ్యురాలిని చేసి, ఎన్నో అవమానాలకు, హింసలకు గురిచేసేవారు.
మరోసారి ఊర్లో ఏదో తిరణాల జరిగితే అందరితో పాటు వెళ్ళిన మల్లమ్మను చూసి ఆకతాయిలు అల్లరి పెడితే, అప్పుడు కూడా తప్పు మల్లమ్మదే అని ఆమె మీద అభాండాలు వేసారు. మల్లమ్మను అక్కడ మగవారితో కలిపి నిందలు వేసారు. నీలాంటి పాపిష్టిదాని వలన ఇంటి పరువు పోతుంది, నీలాంటిది ఇంట్లో ఉండకూడదు... అంటూ ఇంటి వెనక ఉన్న పశువుల పాకలోకి తోసేసారు. కన్నీటితో అక్కడే పడి ఉంది మల్లమ్మ.
అయితే ఆ పాకలో శివారాధనకు అవకాశం లేకపోయింది. మల్లమ్మ ఊపిరే శివారాధన. మరి శివయ్యను అర్చించకుండా ఉండగలదా? అందుకే అక్కడ ఉన్న రుబ్బురోలును శివలింగంగా భావించి దానికే పూజలు చేసేది. ఇది చూసిన తోడికోడలు గగ్గోలు పెడుతూ అత్తగారికి ఈ వార్త చేరవేసింది. “ఇదేంటి రుబ్బురోలుకు పూజలేంటి? దీనికి పిచ్చి పట్టింది!” అంటూ అత్తాకోడల్లిద్దరూ కలిసి మల్లమ్మకు పిచ్చి పట్టిందని రభస చేసారు.
అంతటితో ఆగకుండా ఎలాగైనా మల్లమ్మను వదిలించుకోవాలని పశువులను మేపుకు రమ్మని అడవికి పంపారు. సరేనని మల్లమ్మ పశువులను తోలుకొని అడవికి వెళ్ళింది. పశువులను మేతకు వదిలి, తాను ఒకచోట కూర్చొని స్థిరంగా శివధ్యానంలో మునిగిపోయింది.
ఇక ఇంటి దగ్గర మల్లమ్మ ఏదీ అనడిగిన ఆమె భర్త బరమారెడ్డికి, “ఏం చెప్పమంటావు నాయనా! నీ భార్య పరపురుషుల సాంగత్యానికి బాగా అలవాటు పడింది. నిన్ను మోసం చేస్తోంది. అందుకే మేము వద్దు వద్దని చెబుతున్నా వినకుండా పశువులను మేపుకు వస్తానని అడవికి వెళ్ళింది. అక్కడ తన ప్రియుడిని కలుసుకోడానికే వెళ్ళింది...” అని చెప్పారు తల్లి, వదిన.
దాంతో వారి మాటలు నమ్మి ఉగ్రుడయిన బరమారెడ్డి ఈ రోజెలాగైన మల్లమ్మ సంగతి! ఆమె ప్రియుని సంగతి తెలుస్తానని కత్తి తీసుకొని బయల్దేరాడు.
హమ్మయ్య తమ పధకం పారింది అని నవ్వుకున్నారు అత్తాకోడళ్ళు.
ఇక్కడ అడవిలో పశువులు స్వేచ్చగా మేత మేస్తుంటే, తాను నిశ్చలంగా శివయ్య ధ్యానంలో మునిగిపోయింది మల్లమ్మ. ఇలాంటి సమయంలో శివయ్యకు, మల్లమ్మకు దర్శనమివ్వాలనిపించింది. ఒక సాధువు వేషంలో మల్లమ్మ ముందు నిలబడి మల్లమ్మా అని పిలిచాడు శివయ్య. కళ్ళు తెరిచిన మల్లమ్మ తన ముందు నిలచినవాడు సాక్షాత్తూ శివయ్యే అని గ్రహించింది. “స్వామీ దయచేసారా!” అంటూ అతడిని స్తుతించడం మొదలుపెట్టింది.
సరిగ్గా అదే సమయంలో పరమ ఆవేశంతో పరుగెత్తుకు వచ్చాడు బరమారెడ్డి.
“ఓహో! ఇతడేనా నీ ప్రియుడు. మా అందరి కళ్ళు గప్పి ఇక్కడికొచ్చి నీ ప్రియుడితో గడుపుతున్నావా? వాడినేం చేస్తానో చూడు అంటూ...” చేతిలోని కత్తితో సాధువు మేడమీద ఒక్క వేటు వేసాడు. క్షణాల్లో అదృశ్యమయిపోయాడు సాధువు. “ఓహో! మాయలమారి. ఈ మాయలవిద్యలు కూడా ఉన్నాయా! భయపడి మాయమయ్యాడు. ఉండు నీ పని చెప్తాను” అంటూ మల్లమ్మ మెడమీద కత్తివేటు వేసాడు. అంతే ఆ కత్తి రెండుముక్కలయింది. .’ ఏంటిలా జరిగింది...’ అనుకుంటూ ఖిన్నుడయి నిలబడిపోయాడు బరమారెడ్డి. అసలేం జరిగిందో అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు.
“అయ్యో! ఎంత పని చేసారు. ఆ సాధువు ఎవరనుకున్నారు. సాక్షాత్తూ శివయ్యే. శివయ్య మీదే కత్తి దూసారా... ఎంత అపచారం జరిగింది. పరమేశ్వరా! నా భర్త అజ్ఞానంతో చేసిన తప్పిదానికి మమ్మల్ని మన్నించు” అంటూ వాపోయింది మల్లమ్మ.
అప్పటికి అర్థమయింది బరమారెడ్డికి అసలు విషయం. పరమేశ్వరుని దయ వలన అతని కళ్ళకున్న తెరలు విడిపోయాయి. వాస్తవాన్ని గ్రహించాడు. తల్లి వదినల కుట్రను తెలుసుకున్నాడు. తన తొందరపాటుకు క్షమించమని మల్లమ్మ ముందు మోకరిల్లాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి పోదాం రమ్మని పిలిచాడు. కాని ఈ సంఘటనతో మల్లమ్మకు పూర్తిగా సంసారం మీద ఆసక్తి సన్నగిల్లింది. శివయ్య మీద అనురక్తి పెచ్చు పెరిగింది.
నన్ను క్షమించండి. నేనిక ఇంటికి రాను. ఇక నా గమ్యం శివయ్యే. శివారాధన లోనే నా జీవితం గడపాలనుకుంటున్నాను. మీకు దయ ఉంటే నాకు కొన్ని గోవులను ఇవ్వండి. వాటిని సాకుతూ గోసేవ చేసుకుంటూ ఆ మల్లికార్జునుని సేవలోనే జీవిస్తాను అంటూ బదులిచ్చింది భర్తకు.
మల్లమ్మ స్థిర నిశ్చయాన్ని అర్థం చెసుకున్న బరమారెడ్డి ఆమె కోరిన విధంగానే గోవులను ఇచ్చాడు. ఆ గోవులతో శ్రీశైలం చేరుకొని, మల్లికార్జునుని ఆలయ సమీపంలోనే ఒక పాక వేసుకొని అందులో గోసేవ చేసుకుంటూ, ఆ గోక్షీరంతో ప్రతిరోజూ మల్లికార్జునునికి అబిషేకం చేస్తూ శివారాదనలో మునిగిపోయింది మల్లమ్మ. అలా శివయ్య సేవ చేసుకుంటూ కొంతకాలానికి మల్లమ్మ తనని తానే కాదు, ఈ లోకాన్ని కూడా మర్చిపోయిన పరిస్తితికి చేరుకుంది. ఇక మల్లమ్మ శోధన ముగిసింది. ఆమెకు దర్శనమివ్వవలసిన సమయం ఆసన్నమైనదని భావించిన శ్రీశైల మల్లికార్జునుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఆ ఉద్విగ్న సమయంలో మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నది. ఆ కన్నీరే ఇప్పుడు మందిరం పశ్చిమ వైపు ప్రధాన ఆలయం నుండి సుమారు 2 కి.మీ. దూరంలో రెండు సహజ శిలల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహంగా కనిపిస్తున్నదని భక్తుల విశ్వాసం. ఈ ప్రవాహానికి మల్లమ్మ కన్నీరు అని పేరు. అలా మల్లమ్మ ఆ శ్రీశైల మల్లికార్జునునిలో లీనమయిపొయింది.
ఆమె భక్తికి నిదర్శనంగా శ్రీశైల మల్లన్న ఆలయానికి సమీపంలోనే కర్ణాటక వీరశైవ రెడ్డి సమాజ్ ఆలయాన్ని నిర్మించారు. 2010 సంవత్సరంలో ఆలయాన్ని ప్రారంభించారు.
ఈ ఆలయంలో కర్ణాటక భక్తులచే దీపారాధన కార్యక్రమం నిర్వహించిన అనంతరం పూజ కార్యక్రమాలు మొదలు పెడతారు. కర్ణాటక పూజారి ఆధ్వర్యంలోనే ఈ తంతు నిర్వహిస్తారు. మల్లమ్మ కన్నీరు ఆలయంలో మల్లమ్మ ఎదురుగా ఒక చిన్న బావిలా ఉండి ఎప్పుడు ఆ బండ రాయి నుంచి నీటిప్రవాహం వస్తూ ఉంటుంది. వాటిని భక్తులందరూ మల్లమ్మ ఆనంద భాష్పాలు గా భావిస్తారు. మల్లమ్మ గుడిని దర్శించినవారందరికీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడం ఆనవాయితీ.
మల్లమ్మ ఆంధ్ర, కర్నాటక సరిహద్దు గ్రామంలో జన్మించినా... ఉత్తర కర్ణాటక ప్రాంతంలో వీరశైవ లింగాయత రెడ్డి కుటుంబంలో జన్మించినట్టుగా భావిస్తారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 10న హేమారెడ్డి మల్లమ్మ జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహిస్తుంది.