Vijaya Lakshmi
Published on Oct 07 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?“ఏంటి తారా! కంబైండ్ స్టడీస్ చేద్దామని నన్ను రమ్మని చెప్పి, నువ్విలా విషాద సినిమాలో హీరోయిన్లా ఎటో చూస్తూ కూర్చుంటే ఎలా? విసుగ్గా అంది అనిత.
ఆ మాటలతో ఇటు తిరిగిన తారను చూసి మళ్లీ అనితే అంది. “పుస్తకాలు స్టడీ చేసే మాట ఎలా ఉన్నా... పావుగంట నుంచి నువ్వలా శూన్యంలోకి చూస్తూ స్టడీ చేస్తుంటే... నేను నీ భంగిమను స్టడీ చేయాల్సి వస్తోంది”
“ఛ...! ఛ...! ఈరోజేంటో... ఎంత ప్రయత్నించినా చదవలేక పోతున్నాను” బాధ ద్వనించింది తార గొంతులో.
“ఎనీ ప్రోబ్లం? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా?”
“ఇప్పటివరకు లేదు. ఇకముందు జరుగుతుందేమో అని నా భయం”
“ఏ విషయంలో?”
“నాటక విషయంలో...”
“నాటకం గురించా? ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు గొడవ జరగడం ఏంటి!?”
“పాత సంగతి వదిలేయ్. ఇప్పుడు కొత్త అవకాశం వచ్చింది” అంటూ స్నేహితురాలికి అంతా వివరించింది తార.
కాసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత అడిగింది అనిత. “నీ ఉద్దేశం ఏంటి?”
“నాకైతే వచ్చిన ఛాన్స్ వదలకూడదని, తప్పకుండా ఉపయోగించుకోవాలనే ఉంది”
“నువ్వంత కచ్చితంగా నిర్ణయించుకున్న తర్వాత ఇక చెప్పేదేం ఉంటుంది! అయినా... నాకు తెలిసినంతవరకు ఆ ఫీల్డ్ లోకి అడుగుపెట్టడం రిస్క్ తో కూడుకున్నదేమో తారా! ముఖ్యంగా స్త్రీల విషయంలో... అక్కడ బయటకు చెప్పుకోలేని అసహ్యకరమైన పరిస్థితులు చాలా ఎదురవుతాయని విన్నాను. సంఘంలో కూడా రంగస్థల నటీమణుల పట్ల కొద్దిగా చిన్న చూపే ఉందన్నట్టు చెబుతూ ఉంటారు” అంది అనిత.
“సంఘంలో మనం అందుకునే గౌరవం అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నటనకి దీనికి సంబంధమేంటి? ఇక ఇబ్బందులంటావా? అవి ఎక్కడ లేవు... మన పని ఏదో మనం చేసుకుని వచ్చేస్తే సరి” చాలా తేలిగ్గా చెప్పింది తార.
తను ఎన్నుకున్న రంగం పట్ల అంతగా మోజు చూపిస్తున్న స్నేహితురాలని ఇంకా తన అనుమానాలు చెప్పి నిరుత్సాహపరచలేకపోయింది అనిత.
తిరిగి తారతో అంది. “సరే... తారా! నువ్వింతగా ఉత్సాహపడుతున్నావ్ కాబట్టి... ఒక పని చెయ్యి. రామేశ్వరి అని నాకు తెలిసిన డ్రామా ఏక్టర్ ఒకావిడ ఉంది. ఆమెను నీకు పరిచయం చేస్తాను. ఆమెతో మాట్లాడితే నీకు కొంత అవగాహన కలగవచ్చు. ఆ తర్వాత ముందుకు వెళ్లడమో లేదో నిర్ణయించుకోవచ్చు” తనకు తోచిన సలహా ఇచ్చింది అనిత.
ఇదేదో బాగున్నట్టే అనిపించింది తారకు. ఒక ఫీల్డ్ లోకి అడుగుపెట్టేముందు దానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా వివరాలు సేకరించడం మంచిపద్ధతే. ఇది అమ్మకు నచ్చచెప్పి ఒప్పించడానికి కూడా ఉపయోగపడుతుంది... అనుకుంది తార. అందుకే అనిత చేసిన ప్రపోజల్ కు వెంటనే ఓకే అంది.
“అయితే ఇక ఆలస్యం ఎందుకు? రేపే వెళదాం. ఇక ఇప్పుడు చదివే మూడ్ నీకు ఎలాగూ లేదు గాని, నేను వెళ్తాను. రేపు ఉదయాన్నే వస్తాను రెడీగా ఉండు... చెప్పి వెళ్ళిపోయింది అనిత.
అనుకున్నట్టుగానే మర్నాడు, సదరు నటిమణి రామేశ్వరిని కలుసుకొని, తమ అనుమానాలు వ్యక్తపరిచారు స్నేహితురాలిద్దరూ. వాటన్నిటినీ తేలిగ్గా కొట్టి పారేసిందావిడ. పైగా... “ఇబ్బందులన్నీ ఈ రంగంలోనే ఉన్నాయని ఎందుకనుకోవాలి? మిగతా వృత్తుల్లో మాత్రం ఆడవాళ్లు ఇక్కట్లు పడడంలేదా?” అని ఎదురు ప్రశ్నించింది.
“కానీ... ఇందులో మిగిలిన రంగాల్లో లేని కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు కదా మేడం” అచ్చు పత్రిక విలేకరిలా అడిగింది అనిత.
ఆ ప్రశ్నలో ఏం ధ్వనించిందో గానీ... కోపం పొంగి వచ్చిందదావిడ కళ్ళలోకి. అయితే ఆమె చక్కటి నటి కాబట్టి అంతలోనే మామూలుగా అయిపోయింది.
“మీ దృష్టిలో ప్రత్యేకమైన సమస్యలు అంటే ఏంటి?” అని అడిగి వాళ్ళ సమాధానం ఆశించనట్టే తనే చెప్పసాగింది. “సాధారణంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ సాయంకాలం ఆలస్యంగా మొదలవుతాయి. నాటకమంతా అయి ఇంటికి వెళ్లేసరికి చాలా పొద్దుపోతుంది. ఒక్కోసారి ప్రదర్శనల కారణంగా తరచుగా కుటుంబాన్ని వదిలి ఊర్లు తిరగాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని చూసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏం! మామూలు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు మాత్రం పిల్లల పట్ల అంతగా శ్రద్ధ కనబరచగలుగుతున్నారా? ఇలాంటివే మరికొన్ని... ఆఫ్ కోర్స్ మన నటనకు వచ్చే మెచ్చుకోళ్లతో వీటిని మర్చిపోవడం పెద్ద కష్టం అనుకోను” అంది.
నిజానికి వీళ్ళ ఊహకందనన్ని అవమానాలనే చవిచూసిందావిడ తన వృత్తి కారణంగా. ఇప్పుడు అవన్నీ వీళ్ళ ముందు వెల్లడిస్తే, తనకు అవమానం. వీళ్ళ ముందు చులకన అయిపోతాను అన్న భావంతో అసలు విషయాన్ని దాచి పెట్టింది. కానీ తాను హిపోక్రసీతో చెప్పిన మాటలు మరో ఆడపిల్లను కష్టాలు కొలిమిలోకి నెట్టేందుకు దోహదపడుతున్నాయని ఆలోచించ లేకపోయింది.
ఇంటికి తిరిగి వస్తూ దారిలో అంది తార, “అనూ! ఇప్పటికైనా నువ్వు అనవసరంగా భయపడ్డానని ఒప్పుకుంటావా? ఆవిడన్నట్టు ఏ ఉద్యోగమో చేసుకుంటే మాత్రం... పరిస్థితులన్నీ తిన్నగా ఉంటాయని నమ్మకం ఏంటి? పైగా వాటికంటే ఈ రంగంలో పేరు ప్రతిష్టలు ప్రశంసలు అవార్డులు అదనంగా లభిస్తాయి. రామేశ్వరి గారి మాటలు విన్నాకైనా నీ అనుమానాలు తీరిపోయాయనుకుంటాను”
అనిత ఏం మాట్లాడలేదు. స్నేహితురాలి వాదన అంతగా నచ్చలేదామెకు. ‘తార చాలా సున్నిత మనస్కురాలు. తానుగా ఎవరిని కష్టపెట్టదు... తనను ఎవరైనా కాస్త పరుషంగా అవమానకరంగా మాట్లాడితే సహించలేదు. దాన్నే పదేపదే గుర్తుచేసుకొని తనలో తనే మధన పడిపోతుంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కాదు. అలాంటివారు ఈ రంగంలో ఇమడగలరా? స్నేహితురాలు తోవ మార్చుకుంటే బావుండు’ అనిపించిందా అమ్మాయికి.
******************
“అమ్మా!” నెమ్మదిగా పిలిచింది తార.
స్వెటర్ అల్లుతున్న పార్వతి తలెత్తి చూసింది “ఏమిటి!?” అన్నట్టు.
‘తను ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందా!’ అనుకుందామె. ఆ అమ్మాయి తన ప్రేమ వ్యవహారం వెల్లడి చేస్తే, తను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆ పిల్లని తన దారిలోకి తెచ్చుకోవడానికి ఎలా మాట్లాడాలి? అన్నది మనసులోనే ప్రాక్టీస్ చేసుకుంటుందామె.
“అమ్మా! ఒక ప్రముఖ నాటక సమాజంలో నటించడానికి నాకు అవకాశం వచ్చింది” అంటూ నెమ్మది నెమ్మదిగా విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పింది తార.
దిమ్మెర పోయింది పార్వతి. అంతవరకు చేతిలోనే ఊలు దారాలను యాంత్రికంగా మెలికలు తిప్పుతున్న ఆమె చేతి వేళ్ళు, సడన్ గా ఎవరో పట్టి ఆపినట్టు ఆగిపోయాయి. ‘ఇదేంటి తను ఊహించిన విషయం ఒకటైతే... కూతురు మరో కొత్త సంగతి చెబుతుందేమిటి? ఒక ప్రమాదం తప్పిపోయినందుకు సంతోషించాలో... ఇంకో కొత్త సమస్య తెచ్చిపెట్టినందుకు బాధపడాలో’ అర్థం కాలేదు. అసలు దీనికీ నాటకాల పిచ్చి ఎలా పట్టుకుంది!? అయినా తప్పు తనదేనేమో! తను మొదటే ఖండిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఏది ఏమైనా ఇప్పుడు కఠినంగా ఉండాలని’ నిర్ణయించుకుంది.
“అమ్మా!” బెరుగ్గా పిలిచింది తార
“ఊ...! చెప్పు.”
“అమ్మా! నువ్వేం చెప్పలేదు.”
“ఏం చెప్పమంటావు? నాటక రంగంలో అడుగుపెట్టడం అంటే కాలేజీకి వెళ్లి ఆడుతూ పాడుతూ చదువుకోవడం అనుకున్నావా? అక్కడి వాతావరణానికి నువ్వు తట్టుకోగలనే అనుకుంటున్నావా?
“అది కాదమ్మా...!”
కూతురి మాట పూర్తిగా కాకుండానే అందుకుంది పార్వతి. “ఏది కాదు! నువ్వు స్టేజ్ ఎక్కి నాటకాలు వేయడం మొదలు పెడితే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అసలు ఈ జన్మలో నీకు పెళ్లి అవుతుందా? కోపంగా అంది.
“ఏం? అదేమంత తప్పు పని? నాటకాలు వేసినంత మాత్రాన వివాహం జరగకపోవడానికి!? అయినా ఎంతమంది నటించడం లేదు?” ఉక్రోషంగా అంది తార.
“ఎందుకు అవడం లేదు... మహాబాగా అవుతున్నాయి. వాళ్ళు ఎంత హాయిగా సుఖంగా బ్రతుకుతున్నారో చూడడం లేదూ!”
“ఆ మామూలు వాళ్ళు మాత్రం... ఏ చికూ చింత లేకుండా బ్రతికేస్తున్నారూ...!” దీర్ఘం తీసింది తార.
“ఇదిగో తారా! నువ్వు అనవసరంగా వాదనకు దిగకు. నువ్వు నటించడం నాకు ఇష్టం లేదు... అంతే!”
“అదే... ఎందుకు ఇష్టంలేదు అని... అదేమైనా నీతిమాలిన పనా?”
“ఇదిగో నాచేతట్టే వాగించకు... ఇప్పటివరకు చెప్పింది అంతా ఏంటి? ఇంకా విడమర్చి చెప్పాలా? నీ నటనను గొప్పగా పొగిడిన వెధవలే... నీ వెనక అదీ! ఇదీ! అంటూ నీచంగా మాట్లాడుతారు. నువ్వు వేదిక మీద నటిస్తే... జీవితంలో కూడా నీతో నాటకాలు ఆడటానికి ప్రయత్నిస్తారు కొందరు నీచులు. అవన్నీ నువ్వు భరించగలవా?”
“నువ్వు అనుకుంటున్నట్టు ఏం ఉండదట అక్కడ పరిస్థితి! రామేశ్వరిగారని... ఒక నటిని కలిసి మాట్లాడాను నేను. ఎలాంటి అవమానకరమైన అసహ్యకరమైన వాతావరణ ఉండదట”
“నువ్వెంత ఎంక్వేరీలు చేసుకున్నా, నీకంటే ఎక్కువ జీవితాన్ని చూసిందాన్ని నేను. అనుభవంతో చెప్పేది కూడా కాస్త వినవే తారా!”
“ఈ ఒక్కసారి చూసి, అంతగా ఆ పరిసరాలు నచ్చకపోతే మానేస్తానులే అమ్మా!” నచ్చ చెబుతున్నట్టుగా అంది తార.
“నువ్వు లక్ష చెప్పు... నేను వినను. అయినా పెద్ద చదువులు చదువుతామని పేచీలు పెట్టే ఆడపిల్లల్ని చూసాం. పెళ్లి చేసుకోమంటే ససేమిరా అంటూ ఉద్యోగాల వెంటపడే పిల్లల్ని చూసాం. కానీ నువ్వేంటి నాటకాలూ అంటూ మొదలు పెట్టావు?”
“అది కాదమ్మా...”
“చూడు తారా! తండ్రి లేని పిల్లవని నిన్ను గారం చేసినందుకు నేను పశ్చాత్తాప పడేలా చేయకు. ఇక ఈ విషయంలో చర్చలు అనవసరం. నువ్వు నటించడానికి వీల్లేదు... అంతే.” ఖచ్చితంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది పార్వతి
మతి పోయిన దానిలా తల్లి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది తార. ‘ఎంత ప్రయత్నించినా అమ్మను ఒప్పించలేకపోయాను. ఇప్పుడు ఏం చేయడం? వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలంటే ఏడుపొచ్చేస్తోంది. తన మొదటి ప్రయత్నంలోనే లభించిన ప్రశంసలు చెవుల్లో మారుమోగుతున్నాయి. ఏ ఆశయం లేకుండా, సాధారణ మనిషిగా బ్రతికేయకుండా, ఎప్పటికైనా ఒక గుర్తింపును పొంది నలుగురిలోనూ ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడాలన్న ఆకాంక్ష బలంగా ఉంది తనకు. అదృష్టవశాత్తు తన ఆశ తీరే మార్గం అతి చేరువలోనే ఉన్నన్నాఅందుకోలేకపోతోంది’ తల్లి మీద బాగా కోపం వచ్చింది తారకు. ‘తన మాటే తనది కానీ... ఎవరి మాట వినదు! అందరూ తన మాటే వినాలి. ప్రతీది తను చెప్పినట్టే చేయాలి’ కసిగా అనుకుంది. ఈ సంఘర్షణతో తలబ్రద్దలైపోతోంది. ఎలాగైతేనేం, ఆలోచించి... ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసింది తార.
***********************
సశేషం
మహానటి ధారావాహిక మిగిలిన భాగం తరువాతి బ్లాగ్ లో