Vijaya Lakshmi
Published on Sep 17 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?లంకాయాం శాంకరీదేవి. అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటిది. లంకలోని శాంకరీదేవి ఆలయానికి సంబంధించిన ఓ విచిత్రవిషయం. అక్కడ పాండ్యుల శాసనంలో కొంతభాగం లభ్యమయింది. కులకొట్టన్ నిర్మించిన ఈ పవిత్ర మందిరాన్ని పాశ్చాత్యులు కూల్చివేస్తారు. తరువాత భవిషత్తులో ఏ రాజు కూడా మళ్ళీ మందిర నిర్మాణం చేయడు. పిల్లి కళ్ళు , ఎర్ర కళ్ళు, పొగ కళ్ళు గలవాళ్ళు పాలించిన తరువాత మళ్లీ తమిళుల చేతులోకి వస్తుంది అని ఉందట. ఇది నిజంగా జరిగిందా? ఎవరీ ఎర్రకళ్ళు, పొగకళ్ళ వాళ్ళు.
బుద్ధి కర్మానుసారిణి అంటారు పెద్దలు. నిజమే కదా! మన కర్మను బట్టే మన బుద్ధి కూడా నడుస్తుంది. లేకపోతే సాక్షాత్తూ ఆ జగజ్జనని పరమేశ్వరిని బంధించాలి అనుకుంటాడా ఎంతటి వాడైనా! కాని అనుకున్నాడు రావణాసురుడు.
ఒకప్పుడు రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పార్వతీ దేవిని బంధించి తీసుకువద్దామని ప్రయత్నం చేశాడు. అది అతనివల్ల కాలేదు. కాలేదు సరికదా... ఆ పరాశక్తి యొక్క అస్త్రబంధానికి కట్టుబడి గిలగిల లాడిపోయాడు. అప్పుడు తత్త్వం బోధపడింది లంకాధిపతికి. దాంతో జ్ఞానోదయమై అమ్మవారి ముందు మోకరిల్లాడు.
బిడ్డ పశ్చాత్తాపంతో కదిలిపోతుంటే అమ్మ కరుణించకుండా ఉంటుందా? రావణుని ప్రార్ధనలకు ప్రసన్నురాలైన దేవి కరుణించింది. వరం కోరుకోమంది.
నీవు ఎప్పటికీ, స్థిరంగా, నా పట్టణంలోనే వుండు తల్లి... అన్నాడు రావణుడు.
సరే అంటూనే ఒక షరతు పెట్టింది దేవి.
రావణా! నీవు చేసే అకృత్యాలవల్ల ఇప్పటికే నీ రాజ్యం సముద్రంలో మునిగిపోబోతూ వుంది. ఇప్పుడు నన్ను రమ్మంటున్నావు. వరమిస్తానన్నాను కాబట్టి మాట తప్పను. నీ కోరిక ప్రకారం నీ రాజ్యానికి వస్తాను. నీ రాజ్యంలో కొలువుంటాను. అది నువ్వు నా మాట విన్నంత కాలం మాత్రమే. నేనున్నంత కాలం నీ రాజ్యం నిలిచి వుంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నా మాటను ధిక్కరిస్తావో ఆ మరుక్షణం నేనక్కడ నుంచి వెళ్ళిపోతాను. అంటూ పరాశక్తి లంకానగంరంలో ఆవిర్భవించింది. ఆ దేవే శాంకరీదేవి. అష్టాదశ శక్తి పీఠాలలో తొలి శక్తిపీఠం. ఆది శంకరులు అష్టాదశ శక్తిపీఠాల వర్ణనలో లంకాయాం శాంకరీదేవి అని చెప్పిన శాంకరీదేవి శక్తిపీఠం.
అమ్మవారి షరతుకు అంగీకరించిన రావణాసురుడు తన రాజ్యంలో కొలువైన శాంకరీదేవిని నిత్యమూ భక్తీ శ్రద్ధలతో సేవిస్తూవుండే వాడు. కాని పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటారు. అలా అమ్మవారి అస్త్రబంధంలో పడి తాత్కాలిక మార్పుతో అమ్మవారిని తన రాజ్యంలో కొలువుతీరేలా చేసినా తన సహజబుద్దిని బయట పెట్టుకున్నాడు రావణుడు.
కొంతకాలానికి సీతమ్మను అపహరించి తెచ్చి ఆశోకవనంలో బంధించాడు. ఆ తరువాత రావణాసురుడు శాంకరీదేవి దర్శనానికి వెళ్ళగా ఆ తల్లి, సీతాదేవిని బంధించటం తప్పని ఆమెను తక్షణం వదిలివేయమనీ, బోధించింది. కాని పోయేకాలం దాపురించినపుడు మంచిమాటలు చెవికెక్కవు కదా... అమ్మవారు చెప్పిన మాటను రావణాసురుడు పట్టించుకోలేదు. దానితో ఆగ్రహించిన శాంకరీదేవి అక్కడనుంచి ఆంతర్ధానమైపోయింది.
అలా ఆంతర్ధానమై వెళ్ళిపోతున్న ఆదేవిని కొందరు సాధువులు, తల్లీ నీవు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవద్దని ప్రార్ధించారు. వారి ప్రార్ధనలకు ఫలితంగా ఆ దేవి దక్షిణం నుంచి ఉత్తరానికి వచ్చి, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడి పోయిందని, ఆమెనే బనశంకరీ గా ఋషులు ఆరాదిన్చారని పురాణ కథనాలు చెబుతున్నాయి.. బనం అంటేవనం. అంటే ఆడవి.వనం అంటే నీరు అని కూడా ఈ తల్లి నీటిలో వుండే వనంలో నివసించి అక్కడినుంచి ఇక్కడికి వచ్చింది. కనుక ఆమెను బనశంకరీ అన్నారు. అమె కదంబ వనవాసిని కనుక కూడా బనశంకరీ అన్నారు. సాధకులు ఆమెను వనదుర్గా మంత్రంతో ఉపాసన చేస్తూ వుంటారు
శాంకరీదేవి శక్తిపీఠం పశ్చిమ సముద్ర తీరాన శ్రీలంకలోని ట్రింకోమలి పట్టణంలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పద్దాయని చెప్తారు. ఈ ఆలయంలోని అమ్మవారిని శ్రీ శాంకరీ దేవి అని పిలుస్తారు. ఇక్కడి అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారు రావణాసురుని కారణంగానే ఇక్కడ కొలువుతీరిందని పురాణ కథనం ముందే తెలుసుకున్నాం కదా.
నిజానికి ఇక్కడ ఇది అమ్మవారి "తొడభాగం" పడిందని, అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని భిన్న కథనాలున్నాయి. అమ్మవారు ఇక్కడ శాంకరీదేవి గా వెలియడానికి కారణం రావణాసురుడు. త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం.
రావణుని ఆకృత్యాలకు కోపగించుకున్న అమ్మవారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయిందని, తరువాతి కాలంలో విభీషణుడు రాజయి ధర్మం వర్ధిల్లి, మహర్షులు ప్రార్థించడంతో శాంకరీ దేవి లంకకు మళ్ళీ తిరిగి వచ్చింది అంటారు.
ఇక మరో కథనం ప్రకారం ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని, అయితే రావణ సంహారానంతరం శాంకరీ దేవీ తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది అని చెప్తారు.
ఈ ప్రాంతానికే గతంలో గోకర్ణం అనే పేరు ఉండేదని చెబుతారు. ఈ క్షేత్రం గురించి వాయు పురాణం, రామాయణ, మహాభారతాలలో ప్రస్తావించబడింది. మధ్య యుగాలనాటి "తిరు-గోకన్న-మలై "/ " తిరు - కోన - మలై " అనే తమిళ పేరు యూరోపియన్ల నోళ్ళలో ట్రింకోమలి గా మారిందని, ఆ ప్రాంతాల్లో దొరికిన ఒక పాత శాసనం ఈ ప్రాంతం పేరు గోకర్ణం అని తెలియజేస్తున్నదని కొందరు పరిశోధకులు చెప్తారు.
సాధారణ శకానికి .పూ. 1580 నాటికే ఇక్కడ కోనేశ్వరం అనే గొప్ప శివాలయం ఉండేదని, సా.శ . 300 ప్రాంతాల్లో మహాసేన అనే బౌద్ధ రాజు శివాలయాన్ని కూల్చి బౌద్ధ విహారాన్ని నిర్మించాడని చరిత్ర కథనం. తరువాత కొద్దికాలానికే మధురైకి చెందిన చోళ రాజు వరరామదేవన్ అతని కుమారుడు కులకొట్టన్ బౌద్ధ రాజు చేత కూల్చివేయబడిన ఆలయాన్ని గురించి విని ట్రింకోమలి చేరుకొని కోనేశ్వరం గుడిని సా. శ . 438 నాటికి పునర్నిర్మించారని, గుడిలో పూజాదికాలకై వన్నియార్లను, వారిపట్టాన్ లు అంటే అధికారులు/ రక్షకులను నియమించాడని చరిత్ర.
తరువాతి కాలంలో పాండ్యరాజులు, పల్లవ రాజులు గుడిని ఇంకా అభివృద్ధిచేసి పెద్ద సంఖ్యలో వెండి, బంగారం, ముత్యాలు, రత్నాలు, మణులు సమర్పించారు. ఇక్కడ వెయ్యి స్తంభాలతో నిర్మితమయిన గొప్ప ఆలయం ఉండేదట. శివుడు, పార్వతి, విష్ణువు పూజలన్డుకునేవారు. నవరత్నాల పేర్లతో పిలువబడే తొమ్మిది ప్రాకారాలతో మందిరాలతో ఉండేది ఆలయం. ఈ ఆలయం ఉన్న కొండలో ఏడు గుహలుండేవని, ఉత్తరాన ఉన్న గుహల్లో అగస్త్య, పులస్త్య మహర్షులు ఉంటే , మిగతావాటిలో రహస్యమార్గాలూ, తీర్థాలూ ఉండేవని చెబుతారు.
అలా దాదాపు 1200 సంవత్సరాల పాటు ఈ దేవాలయం మహా వైభోగంతో అలరారింది. భారత ఉపఖండం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయ దర్శనం చేసేవారు.
ట్రింకోమలి ప్రఖ్యాత రేవు పట్టణం అవటం చేత విదేశీయులకు ముఖ్యంగా నావికులందరికీ ఈ క్షేత్రం గురించి తెలుసు. ఎంతో మంది తమ రచనల్లో ఈ ఆలయాన్ని ప్రస్తావించినట్టు చారిత్రిక కథనాలు చెబుతున్నాయి.
అలా ఖ్యాతి పొందిన ఈ గుడి మీద పోర్చుగీస్ వార్ కన్ను పడింది. ఇక్కడున్న ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేసినట్టు చారిత్రిక కథనాలు చెప్తున్నాయి. ఆ కథనాల ప్రకారం 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు.
తమిళ సంవత్సరాది నాడు దేవాలయంలోని ప్రధాన విగ్రహాలను పట్టణంలోకి ఊరేగింపుగా తీసికొని వెళ్లారని,. అప్పుడు పోర్చుగీస్ సైనికులు పూజారులలా వేషాలు వేసుకొని వచ్చి గుడిలోని సంపదలను కొల్లగొట్టడం ప్రారంభించారు. వెయ్యేళ్లకు పైగా పోగు పడ్డ వెలకట్టలేని సంపద కొన్ని గంటలకాలంలోనే దోచుకోబడిందని చెబుతారు.
ఆ తరువాత వాళ్ళ ఓడ పైనుంచి ఫిరంగులను పేల్చి, సముద్రం ఒడ్డున ఉన్న గుడి భాగాలను కూల్చితే అవి సముద్రంలోకి పడిపోయాయి . ఆ సమయంలో పూజారులు దేవతా విగ్రహాలను వారి కంటపడకుండా అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక బావిలో దాచారు. గుడిలో మిగిలిన పూజారులు, ఉద్యోగులు, యాత్రికులు ఈ దాడిలో సంహరించబడ్డారు. అలా మరికొంతకాలానికి ఈ గుడి పూర్తిగా కూల్చివేయబడింది. గుడికి చెందిన శిల్పాలు, చక్కగా చెక్కిన రాతి స్తంభాలూ కొన్ని సముద్రం పాలయితే మరికొన్ని పోర్చుగీస్ వాళ్ళు అక్కడే కోట కట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఏ కారణం చేతోగానీ గుడికి చెందిన ఒకే స్తంభం మిగిలిపోతే దాన్ని మాత్రం వదిలేశారు. ఇప్పటికీ ఆ స్థంభం అలాగే ఉంది. దరిమిలా గుడీ, గుడి చరిత్రను తెలిపే ఎన్నో శాసనాలు నాశనమయ్యాయని కూడా చెప్తారు.
ఆ తరువాత శతాబ్దాల తరబడి ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 1950 లో ట్రింకోమలి మునిసిపాలిటీ వాళ్ళు కోనేశ్వరం గుడి స్థలానికి 500 గజాల దూరంలో నీటికోసం బావిని తవ్వుతుండగా కోనేశ్వరం గుడికి చెందిన చాలా విగ్రహాలు లభించాయి. అందులోపార్వతి ( మధుమయి అంబాల్ ) విగ్రహం కూడా ఉంది. వాటినన్నిటినీ కోనేశ్వరం గుడిఉన్న ప్రదేశంలో ప్రతిష్టించి పూజలు చేయసాగారు.
1956 లో ఆర్థర్ క్లార్క్, మైక్ విల్సన్ అనే స్క్యూబా డైవర్లు గుడి ఉన్న కొండ పక్క సముద్రంలో కోనేశ్వరం గుడికి చెందిన ఎన్నో శిథిలాలను కనుగొన్నారని, సముద్రం లోంచి ఒకప్పటి కోనేశ్వరం గుడిలో ఉన్న స్వయంభూ లింగాన్ని కూడా వెలికి తీసారని, ఆ లింగాన్ని ప్రస్తుతం ఉన్న గుడిలో ప్రతిష్టించారని చెబుతారు. 2005లో శ్రీలంక ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మింపజేసింది. అప్పటి నుంచి శాంకరీదేవి ఆలయం ప్రముఖ సందర్శనీయ కేంద్రంగా నిలుస్తోంది.
ఈ గుడికి సంబంధించి ఒక విచిత్రమైన విషయం చెప్తారు. పాండ్య రాజుల చిహ్నంగా చెప్పే రెండు చేపల చిహ్నంతో ఒక ప్రాచీన తమిళ శాసనం లభ్యమయిందట. అందులో కులకొట్టన్ నిర్మించిన ఈ పవిత్ర మందిరాన్ని పాశ్చాత్యులు కూల్చివేస్తారు. తరువాత భవిషత్తులో ఏ రాజు కూడా మళ్ళీ మందిరనిర్మాణం చేయడు. పిల్లి కళ్ళు , ఎర్ర కళ్ళు, పొగ కళ్ళు గలవాళ్ళు పాలించిన తరువాత మళ్లీ తమిళుల చేతులోకి వస్తుంది అని ఉందట. మరి అలాగే జరిగింది కదా. ఈ శాసనంలో కొంతభాగం గుడిని కూలగొట్టి నిర్మించిన ఫోర్ట్ ఫ్రెడరిక్ అనే కోట గుమ్మం లో నేటికీ ఉందని చెప్తారు.
ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు. త్రిముకోమలై అంటే “త్రిభుజం ఆకారంలో” వున్న “కొండ” పై ఉండటం వల్ల - ఆ దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు. ఆ శివాలాయం ప్రక్కనే… ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆ ఆలయంలోని కొలువైవున్న దేవి మధుమయి అంబాల్ నే శాంకరీ దేవిగా కొలుస్తారు. అయితే ధ్యాన శ్లోకంలో వర్ణించిన శాంకరీ దేవికీ, మధుమయి అంబాల్ విగ్రహానికీ పోలికలు సరిపోవనీ కాబట్టి ఆమె శాంకరీ దేవి కాదనీ అంటారు. ఏదేమైనా సతీ దేవి శరీర భాగం పడిన ప్రాంతంగా ఈ స్థలం పూజనీయమని కొందరి భావన.
ఇక్కడ అడుగడుగునా హిందూ బౌద్ధ మతాల సమ్మేళనం కనబడుతుంది.
శ్రీలంకలోని శాంకరీదేవి ఆలయం కేవలం ఒక శక్తి పీఠం కాదు. అది ఒక పురాణ కధలతో నిండి ఉన్న పవిత్ర క్షేత్రం, ఒక చారిత్రక సంపద, ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడికి వెళ్ళినవారు కేవలం దేవిని దర్శించడం మాత్రమే కాకుండా, సముద్ర గర్జనలు, కొండల అందాలు, పురాణ ప్రతిధ్వనులు అన్నీ కలిపి ఒక ప్రత్యేక మంత్ర ముగ్ధ అనుభూతిని పొందుతారు.
దీన్ని "శక్తి పీఠాల రత్నం"గా వర్ణిస్తారు. ఈ ఆలయ యాత్ర ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒకసారి అయినా తప్పనిసరిగా అనుభవించాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణమే.