రాణి దుర్గావతి చరిత్ర – గోండ్వానా వీరనారి గాథ – అక్బర్ చక్రవర్తిని మూడుసార్లు ఓడించిన ధీర | Forgotten Warrior Queen of India | Rani Durgavati Full Story | Symbol of Courage, Sacrifice & Leadership Bilingual Titles

Vijaya Lakshmi

Published on Sep 16 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

రాణి దుర్గావతి – ధైర్యం, త్యాగం, శౌర్యానికి ప్రతీక.

శౌర్యగాథలలో వెలిగే ఓ తార రాణి దుర్గావతి.


చరిత్రలో తోపు తురుము అని చెప్పబడే అక్బర్ చక్రవర్తినే మూడుసార్లు ఓడించి మూడు చెరువుల నీళ్ళు తాగించిన ధీరవనిత రాణి దుర్గాబాయి. భారతదేశ చరిత్రలో రాణి దుర్గావతి ఒక అజరామరమైన పేరు. మధ్యభారతంలోని గోండ్వానా రాజ్యం ఆమె పాలనలో గర్వంగా తలెత్తుకు నిలబడింది. రాణి దుర్గావతి గోండు తెగకు చెందిన స్త్రీ. గోండు రాణిగా ప్రసిద్ధి కెక్కింది. జీవితంలో ఎపుడూ పరాజయం చూడని ధీరవనిత రాణి దుర్గావతి. మాతృభూమి రక్షణ కోసం అంతిమ క్షణం వరకు పోరాడింది. మొగలులతో పోరాటంలో ఆమె తెగువ అజరామరం. మొఘలుల దాడిని ఎదుర్కొని చివరి శ్వాస వరకు పోరాడిన వీరనారి రాణి దుర్గావతి. అయినా కూడా ఆమె పేరు చరిత్ర పుస్తకాలలో ఎక్కడో తప్ప అంతగా కనబడదు ఎందుకో మరి... లాంటి వీరనారి, చరిత్ర మరచిన ధీర... రాణి దుర్గావతి చరిత్ర అందరికీ చేరాలి.

చరిత్ర మరచిన రాణి దుర్గావతి

16వ శతాబ్దంలో మధ్యప్రదేశ్ లోని గోండ్వానా ప్రాంతాన్ని పాలించిన ఈ వీరరాణి, ఒక సింహస్వప్నం లాంటి జీవితం గడిపింది. ఆమె జీవితం ధైర్యానికి ప్రతీక, త్యాగానికి అద్దం, ప్రజల పట్ల మమకారానికి నిదర్శనం. ఆమె మరణం కూడా శత్రువుల ఖడ్గానికి లొంగి జరగలేదు. తనే తన ఖడ్గానికి అర్పణమవుతూ చరిత్రలో గౌరవంగా నిలిచిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజల గర్వకారణం రాణి దుర్గావతి గాథ.



మన చరిత్రలో విరివిగా కనబడకపోయినా, విదేశీయులు కూడా ఆమె వీరత్వానికి అచ్చెరువొంది ఆమెను గురించి తమ పుస్తకాలలో ప్రస్తావించారు. అబుల్‌ ఫజల్‌ తన 'అక్చర్‌నామా' పుస్తకంలో  దుర్గావతి గురించి ప్రస్తావిస్తూ, “దూరదృష్టితో ఆమె చాలా గొప్పపనులు చేసింది. బాజ్‌ బహద్దూర్‌ మరియు మియాన్స్‌తో చాలా సార్లు యుద్ధం చేసి గెలిచింది. ఆమెకు 20,000 అశ్విక దళం, 1000 ఏనుగులు ఉండేవి.  తుపాకీ ఉపయోగించడంలోనూ, బాణము వేయడములోనూ ఆమె అత్యంత ప్రతిభావంతురాలు. ఏదైనా క్రూర జంతువు జనసామన్యంలోకి అడుగుపెట్టిందని వింటే చాలు, ఆ జంతువును తుపాకీతో వేటాడి చంపిగాని నిద్రపోయేది కాదు” అని రాసారు.

         అలాగే ఆ ప్రాంతంలో అధికారిగా పనిచేసిన స్లీమెన్‌ అను ఆంగ్లేయుడు తన పుస్తకం "Recollections of an Indian Officials " లో  “ఆమె చనిపోయిన చోట ఆమె సమాధి, రెండు పెద్దగుండ్రటి రాళ్ళు ఉన్నాయి. ఆమె విజయదుందుఖిలు రాళ్ళైపోయి రాత్రివేళ భేరీ నినాదములు చేస్తూ ఆమె చుట్టూ ఉన్న వేల సమాధులలోగల సైనికులను పిలుస్తున్నాయని అక్కడి వారి నమ్మకం, “ఆ దారిలో వెళ్ళే బాటసారులు ఆ ప్రాంతములో దొరికే సృటికాలను ఆమె సమాధిపై వారి కృతజ్ఞతా చిహ్నంగా ఉంచేవారు. ఆమె చరిత్రను విన్న నేను నా వంతు కృతజ్ఞతగా ఒక మంచి స్ఫటిక శిలా రూపాన్ని ఉంచాను, దుర్గావతి మానవ స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి పోయిన ఒక వీర, ధీరవనిత” అని రాసుకున్నారు. ఇలా విదేశీయులు కూడా ఆమె వీరత్నాన్ని, ధీరత్నాన్ని కొనియాడారు.



మొఘలుల పరిపాలనలో స్వాభిమానంతో జీవించడం నేరంగా వుండేది. ఆనాడు అక్బరుకు చాలావరకు హిందురాజులు దాసోహమన్నారు. వైధవ్యంతో రాణి దుర్గావతి చక్కటి పరిపాలన చేయడం అక్బరుకు కంటిగింపైంది. తనను శరణువేడమన్నాడు. ససేమిరా అంది. దాంతో యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో 3 సార్లు ఓడిపోయాడు అక్బర్. తన జీవిత కాలంలో రాణి దుర్గావతి 52 యుద్ధాలు చేసింది. 51 యుద్ధాల్లో గెలిచింది. చివరికి శత్రువుల కూట యుద్ధనీతి కారణంగా ఆమె ఓడింది. శత్రువు చేతిలో తన శరీరం పడకూడదని తనకు తానుగా ఆత్మాహుతి చేసుకుంది. ఆమె సందేశం మేరకు అక్బరుకు వశం కాకుండా 5000 మంది గోండు మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు.


రాణి దుర్గావతి చిన్ననాటి జీవితం

దుర్గాష్టమి నాడు జన్మించిన అపర దుర్గ రాణి దుర్గావతి. సా.శ 1524 అక్టోబరు 5, దుర్గాష్ఠమి నాడు ఉత్తర ప్రదేశ్‌లోని బాండ జిల్లాలో కాలింజర్‌ కోటలో చందేల్ రాజు  కీర్తి దేవసింహుడు, కమలాదేవిల ప్రధమ సంతానంగా జన్మించిందొక బాలిక. దుర్గాష్టమి రోజు పుట్టింది కాబట్టి దుర్గావతి అని పేరు పెట్టారు.

పసి వయసు నుంచే  అస్త్ర శస్త్రాలను అభ్యసించడం మొదలయింది. కత్తి తిప్పడంలో సిద్ధ హస్తురాలైంది. 13`14 సం॥కే అడవుల్లో జంతువులను వేటాడే సాహసవంతురాలిగా మారింది దుర్గావతి.


అది భారతావనిలో అతి క్లిష్టమైన సమయం. హిందూ రాజులు పరాక్రమం చూపినా కూడా పరాజయాల పాలవుతున్న కాలం మొదలయింది. అనేక మంది హిందూ రాజుల అస్తిత్వం ప్రశ్నార్ధకమై వారు మొగలులను శరణుజొచ్చిన పరిస్తితి. అంతా తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో దుర్గావతి జననం కాలింజర్‌ రాజ్యంలో కొత్త ఊపిరి పోసింది. 



పసి ప్రాయం నుంచే రాణి దుర్గావతి ధైర్య, సాహసాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసేవి. 10 సం॥ల వయసున్నపుడు, ఒక ఏనుగు ఆ గ్రామంలో భీభత్సం సృష్టించి అందరినీ భయపెడ్తుంటే దుర్గావతి ఆ ఏనుగును ఒడిసి  పట్టుకుంది. అధిరోహించింది. నియంత్రించింది, స్వారీ చేసింది.


 

ఒక రోజు సమీప గ్రామంలోకి ఒక సింహాం వచ్చి అనేక మందిని చంపి వేసిందన్న వార్త విన్నది దుర్గావతి. వెంటనే దుర్గావతి తండ్రి వద్దకు వెళ్ళి తానూ ఆ సింహాన్ని చంపి గ్రామస్తులను రక్షిస్తానని చెప్పి తన సహచరి రామచేరిని తీసుకొని వెళ్ళింది. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దుర్గావతి చాలాసేపు సింహం రాక కోసం నిరీక్షించింది. కాని ఎంతకీ సింహం రాక పోయేసరికి క్రిందకి దిగింది. ఒక్కసారిగా సింహం ఎదుటపడింది. ఊహించని ఈ ఉత్పాతానికి  ఏ మాత్రం భయపడకుండా విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించింది. ఆ బాణం సింహం మెడకు గుచ్చుకుని అది నేల కూలింది. ఈ విషయం అందరికీ తెలిసింది. ఆమె ధైర్య,స్యయిర్యాలకు అందరూ ఆశ్చర్యపోతే, కూతురు ప్రావీణ్యానికి తండ్రి గర్వపడ్డాడు. 500 ఏళ్ళకు పూర్వమే ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా ఎలాంటి  స్వేచ్ఛ ఉండేదన్నది కూడా ఈ సంఘటన తెలుపుతోంది.


వివాహం – గోండ్వానా రాణిగా గోండ్వానా సామ్రాజ్యంలోకి ప్రవేశం

1542లో గోండ్ రాజవంశానికి చెందిన రాజు సంగ్రామ్షా పెద్ద కుమారుడు దల్పత్షాను వివాహం చేసుకుంది దుర్గావతి. గోండులది అప్పుడు మధ్యప్రదేశ్ ప్రాంతంలో శక్తివంతమైన గిరిజన రాజ్యం. వివాహం తర్వాత దుర్గావతి గోండ్వానా రాణిగా ప్రజాదరణ పొందింది. రాజ్యంలో న్యాయపరమైన పాలన, రైతుల సంక్షేమం, విద్యా అభివృద్ధి కోసం ఆమె అనేక నిర్ణయాలు తీసుకుంది. 1545లో వీర్ నారాయణ్ అనే పుత్రునికి జన్మనిచ్చింది.



రాణి దుర్గావతి గర్భవతిగా ఉన్న సమయంలోనే జరిగిన ఒక ఉదంతం ఆమెకున్న అపారమైన యుద్ధవ్యూహ నైపుణ్యం తేటతెల్లం చేస్తుంది. ఆ సమయంలోనే  షేర్‌షా సూరి ‌కలింజర్‌ ‌మీద ఆక్రమణ చేశాడు. కలింజర్ రాజు అల్లుడయిన దళ్పత్‌ ‌షాహ్‌తో కలిసి షేర్‌షా సూరిని  ఎదుర్కొ న్నాడు. ఆ యుద్ధంలో షేర్షా ఓటమిపాలయాడు. దీనికి యుద్ధ వ్యూహం అంతా రాణి దుర్గావతే సిద్ధం చేసిందని చరిత్ర చెబుతోంది.


పాలనలో దుర్గావతి

1550లో దళపతి షా అనారోగ్యంతో మరణించడంతో, భర్త మరణానంతరం 5 ఏండ్ల కుమారుడు వీర్దేవ్ గా పిలవబడిన వీర నారాయణ్‌ను సింహాసనంపై కూర్చోబెట్టి గోండ్వానా రాజ్యం పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నది. తరువాత రాజధానిని, చౌరఘర్ నుంచి సాత్పురా కొండ శ్రేణిపై ఉన్న సురక్షితమైన సింగౌర్‌గఢ్‌కి మార్చారు. సైన్యంలో పెద్ద మార్పులు తీసుకొచ్చి సుసంపన్నం చేశారు. అనేక దేవాలయాలు, ధర్మశాలలు, చెరువులను నిర్మించారు. ఆ పాలన ఆమెను ఒక రాజమాతగా మాత్రమే కాకుండా, రాజ్యాన్ని కాపాడిన యోధురాణిగా నిలబెట్టింది.


రాణి దుర్గావతి 1550 నుండి 1564 వరకు గోండ్‌వానా రాజ్యమును పరిపాలించింది. ఆమె  పాలనలో గోండ్వానా రాజ్యం సుస్థిరంగా నిలిచింది. న్యాయంగా పన్నులు విధించడం. రైతులకు రక్షణ, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం, సైన్యాన్ని బలోపేతం చేయడం ఇలాంటి ముఖ్యమైన అంశాలలో పటిష్టమైన నిర్ణయాలతో ప్రజారంజకముగా పాలన సాగించింది రాణి దుర్గావతి.



తన పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో దుర్గావతి విజయవంతమైంది. ఆమెను ప్రజలు “రాణి మై” అని గౌరవంగా పిలిచేవారు


అపర చండి రాణి దుర్గావతి

పొరుగు రాజ్యమైన మాల్వారాజు బాజ్ ‌బహుదూర్‌, స్త్రీయే కదా రాజ్యరక్షణ ఆమెకేం తెలుసు అన్న చిన్నచూపుతో రాణి దుర్గావతి రాజ్యంపై దాడి చేసాడు. తన వ్యూహాత్మక పరాక్రమంతో అతన్ని మట్టి కరిపించింది రాణి దుర్గావతి. తరువాత చాలామంది రాజులు ఇలాంటి ప్రయత్నాలే చేశారు. అన్నిటినీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది.


మొఘల్ దాడులు

అక్బర్ హయాంలో మొఘల్ సామ్రాజ్యం విస్తరిస్తూ పోతున్నది. ఆ సమయంలో గోండ్వానా రాజ్యం కూడా మొఘలుల దృష్టిని ఆకర్షించింది. 1562 లో రాణి దుర్గావతి రాజ్యానికి ఇరుపక్కలా ఉన్న రేవా, మాల్వా రాజ్యాలు మొఘలులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో వారి కన్ను గోండ్వానా రాజ్యంపై పడింది. 1564లో మొఘల్  సైన్యాధిపతి అసఫ్ ఖాన్ గోండ్వానా మీద దాడి చేశాడు. ఈ పరిస్థితిలో అనేక మంది, ముఖ్యంగా రాణి దుర్గావతి మంత్రులే, అపారమైన మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలవడం అసాధ్యమని, మొఘలులకు లొంగిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని సలహా ఇచ్చారు.



కానీ రాణి దుర్గావతి తన నిర్ణయాన్ని ఒక్క మాటలో చెప్పింది... “గౌరవం కోల్పోయిన జీవితం కంటే, గౌరవంతో మరణం మిన్న” అని.



యుద్ధరంగంలో రాణి దుర్గావతి

విజయమో వీరస్వర్గమో అనుకున్న రాణి దుర్గావతి తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమైంది. ఆమె స్వయంగా గుర్రంపై ఎక్కి సైన్యాన్ని నడిపించింది. శిక్షణ పొందిన అపార సైన్యం, ఆధునిక ఆయుధాలు కలిగిన మొఘలుల సైన్యాన్ని, కొద్దిపాటి సంప్రదాయ ఆయుధాలతో... కొంతమంది  సైనికులతో వ్యూహాత్మకంగా ఎదుర్కొని మొఘలులను మట్టి కరిపించింది రాణి దుర్గావతి. మొఘల్ సైన్యంపై మొదటిసారి ఘనవిజయం సాధించింది. అందుకే చరిత్రలో ఇది అసమాన యుద్ధంగా నిలిచిపోయింది.


రాణి దుర్గావతి పేరు చెబితేనే, చక్రవర్తి అనిపించుకున్న అక్బర్ గుండెల్లో దడ పుట్టేలా వీర విహారం చేసింది. అలా ఒకసారి కాదు మూడుసార్లు అక్బర్ కి ఓటమి రుచి చూపించింది రాణి దుర్గావతి.


ఇది చూడండి : విదేశీయుల్ని అబ్బా! అనిపించిన తుళునాడు రాణి అబ్బక్క

youtube play button



చివరికి నాల్గవసారి మరికొంతమంది వెన్నుపోటుదారుల సహకారంతో మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డాయి అసఫ్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సేనలు. మళ్ళీ వీరనారి విజ్రుంభించింది. అగ్నికి ఆజ్యం తోడయినట్టు, ఆమె కుమారుడు కూడా యుద్ధరంగంలో వీరవిహారం చేసాడు. కాని కాలం కలిసిరాలేదు. మొఘలుల కుత్సిత వ్యూహాల ముందు, ఆమె సైన్యం నేలరాలుతోంది. రాణి దుర్గావతి వ్యూహాన్ననుసరించి జబల్పూర్‌కు 11 కి.మీ. దూరంలో బరేలి గ్రామం వద్ద గల కాలువను దాటి పర్వతాలపైకి వెళ్లి ఆమె సేనలు అక్బరు సేనలతో గెరిల్లా యుద్ధం చెయ్యాలని అనుకున్నారు. కాని ఒక వెన్నుపోటుదారుడి కారణంగా ఈ వ్యూహ సమాచారం అక్బర్ కి చేరిపోయింది. వెంటనే ఆ కాలువ గట్లు తెంచి, వరదముంచెత్తేలా చేసాడు. రాణి సైన్యమంతా మొగలు సేనల చక్రబంధంలో చిక్కుకున్నారు. రాణి కూడా గాయపడింది. రాణి దుర్గావతి అపస్మారకంలోకి వెళ్లిన మరుక్షణం ప్రాణాలతో తమ వద్దకు తీసుకు రమ్మని అసఫ్‌ అలీఖాన్‌ ఆదేశించాడు.


కాని అతడి కోరిక ఫలించలేదు. స్పృహలోకి వచ్చిన రాణి దుర్గావతి ఓటమి ఆసన్నమైందని గ్రహించింది. మొఘల్ సేనల ముందు తలవంచడం కంటే ఆత్మార్పణే గౌరవంగా తలచినది. తన వొర నుంచి కత్తిని తీసి ఆత్మార్పణ చేసుకుంది. అప్పుడామె వయసు 40సం.


జూన్‌ 24, 1564 ‌నాడు ఆమె వీరమరణం పొందింది. జబల్పూరుకి 12 కి.మీ. దూరంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె స్మారక చిహ్నం జబల్పూర్‌ ‌మండల రహదారిపై బరేలి సమీపంలోని నార్యానా వద్ద ఆమె అమరత్వం పొందిన అదే స్థలంలో నిర్మించారు.


రాణి దుర్గావతి కేవలం యోధురాలు మాత్రమే కాదు చక్కటి పరిపాలనా దక్షురాలు. తన రాష్ట్రంలో అపరిమితమైన సరస్సులు నిర్మించింది. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఆమె పండితులను, ఆధ్యాత్మిక వేత్తలను, గురువులను  గౌరవించి, వారికి పోషణను అందించింది.  ఎంతోమంది ఇతర మతస్తులను కూడా ముఖ్యమైన పదవుల్లో నియమించి తన దాతృత్వాన్ని, సమానత్వాన్ని చూపించింది.


       రాణి దుర్గావతి కేవలం చరిత్ర కాదు, ఒక స్ఫూర్తి. అందుకే ఆమె వీరమరణం పొందిన జూన్ 24, రోజును  నేటికీ "బలిదాన్ దివస్"గా జరుపుకుంటున్నారు.

     1983 సంవత్సరంలో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం జబల్‌పూర్ విశ్వవిద్యాలయానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయగా పేరు మార్చింది.

భారత ప్రభుత్వం 1988 జూన్ 24న ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం ద్వారా వీరరాణికి నివాళులర్పించింది.


ఇవి కూడా చదవండి


ఇవి కూడా చూడండి

youtube play button


youtube play button


youtube play button



         

 

Recent Posts