Vijaya Lakshmi
Published on Jul 30 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?మన దేశం ఎన్నో చారిత్రక, రహస్య ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత... పురాతన వారసత్వ సంపద మన సొంతం. అలాంటి రహస్య, మిస్టరీ ఆలయాల చరిత్ర, విశిష్టతల గురించి మనందరం ఎంతో కొంత వింటూనే ఉంటాం.. ఐతే... ఇప్పటికీ, శాస్త్ర విజ్ఞానం అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఈనాటికి కూడా కొన్ని ఆలయాలలో రహస్యాలు అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి.
ఆకాశానికి నిచ్చేనలేసి, చంద్ర మండలం మీద ఫ్లాట్లు కట్టే సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతున్న ఈ ఆధునిక యుగంలో కూడా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన ఆలయాలు. ప్రాచీన భారతీయ సాంకేతిక పరిజ్ఞానానికి, వారి టెక్నాలజీకి ఒక పెద్ద ఉదాహరణ అని శాస్త్రవేత్తలు చెప్తుంటే, ఇదంతా ఆ పరమేశ్వరుని లీలలు అని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తారు. కాని అందరూ ముక్తకంఠంతో చెప్పేది మాత్రం అవి అతి పెద్ద మిస్టరీ టెంపుల్స్ అని.
బెంగళూరులో కాడు మల్లేశ్వరస్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది.ఆకాశానికి నిచ్చేనలేసి, చంద్ర మండలం మీద ఫ్లాట్లు కట్టే సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతున్న ఈ ఆధునిక యుగంలో కూడా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిందా ఆలయం. ప్రాచీన భారతీయ సాంకేతిక పరిజ్ఞానానికి, వారి టెక్నాలజీకి ఒక పెద్ద ఉదాహరణ అని శాస్త్రవేత్తలు చెప్తుంటే, ఇదంతా ఆ పరమేశ్వరుని లీలలు అని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తారు. కాని అందరూ ముక్తకంఠంతో చెప్పేది మాత్రం అదో మిస్టరీ టెంపుల్.
కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులోని మల్లెశ్వరంలో శ్రీ దక్షిణముఖ నందితీర్థ కళ్యాణి క్షేత్రం ఉంది. దేశంలో ఉన్న అతిప్రాచీన శివాలయలలో ఈ ఆలయం కూడా ఒకటి.ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. కాని అంతకంటే ప్రధాన ఆకర్షణ నంది. ఆ నందిలోనే ఉంది అసలు మిస్టరీ. శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ఏ శివాలయంలోనైనా మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. కొందరు నంది కొమ్ములో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే, కొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. అయితే ఈ ఆలయంలో నంది మాత్రం డిఫరెంట్. ఆలయంలో కిందిభాగంలో శివుడు కొలువుతీరితే పైభాగంలో నంది కొలువుతీరి ఉంటుంది. ఆ నంది నోటినుండి నిరంతరం నీరు ధారలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఒక గుంతలోనుంచి సరిగ్గా శివలింగం మీద పడుతూ అభిషేకం చేస్తుంది. ఆ నందిలోను నంది నోటినుంచి వచ్చే నీటిలోనే ఉంది మర్మమంతా.
1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచీ నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా... ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచీ... ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచీ వచ్చే నీరు... శివలింగం పై పడి... ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఐతే... నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచీ వస్తుందో తెలియలేదు. ఈ గుడి 400 సంవత్సరాల నాటిదని అరియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తుంటే వేద శాస్త్రవేత్తలు మాత్రం ఈ ఆలయం దాదాపు ఎనిమిది వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు.
బుద్ధ నీలకంఠ ఆలయం. నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండు లో కొలువుతీరిన ఓ అద్భుతం.
ఇది బుద్ధ నీలకంఠ ఆలయం.... పేరులో బుద్ధ ఉన్నా... నిజానికి ఇది మహా విష్ణువు వెలసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే... పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్‌లోని ఖాట్మండ్ లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు... ఆదిశేషుడి పైన శయన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం... 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కివుంది. సుమారు 5 మీటర్ల పొడవుతో ఉన్న భారీ విష్ణుమూర్తి రాతి విగ్రహం నీటిమీద తేలుతూ ఉంటుంది. ఆలయం అని పిలవడమే గాని నిజానికిది గుడి గోపురం లేని బహిరంగ ప్రదేశం.
అయితే ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే మాత్రం గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం వుండేదని అర్థం అవుతుంది. సహజంగా విష్ణువు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి... వెల్లకిలా పడుకొని, నింగివైపు చూస్తుంటాడు. ఇంత భారీ విగ్రహం అందులోను రాతి విగ్రహం నీటిలో తేలుతూ ఉండడం ఇక్కడ అతి పెద్ద మిస్టరీ.. భక్తులతోపాటూ... పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న అంశామిదే.. 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం... సుమారు 1400 సం ల ముందునుండే ఈ విగ్రహమ్ అలా నీటిలో తేలుతూనే ఉందట. మరి ఇంత బరువైన భారీ విగ్రహం నీటిలో తేలియాడటం సాధ్యమయే పనేనా? ఎందుకు సాధ్యం కాదు ఆ స్వామి తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటున్నారు భక్తులు.
అయితే శాస్త్రవేత్తలు ఇలాంటి మాటలు ఒప్పుకోరు కదా... ఇంత బరువైన భారీ విగ్రహం నీటిలో తేలియాడటం వెనక ఏదో మిస్టరీ ఉంది అదేదో కనిపెడతామని పరిశోధనలకు పూనుకున్నారు పరిశోధకులు. ఈ విగ్రహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు భూమిలోని లావాలాంటి పదార్ధంతో సిలికాన్ సంబంధితమైన తక్కువ సాంద్రతకలిగిన శిలతో ఈ విగ్రహ మూర్తిని మలచారు అని అందుకే అంత భారీ విగ్రహం కూడా అలా తేలుతోందని చెప్పారు. అయితే విగ్రహం అలా నీటిమీద తేలడానికి పూర్తిగా అదే కారణం అని మాత్రం రుజువు చేయలేకపోయారు. అందుకే విగ్రహం నీటిమీద ఎలా తేలుతుంది అన్నా విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
ఉత్తరాఖాండ్‌లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో ఉంది అత్యంత విచిత్ర సంప్రదాయం ఉన్న ఆలయం లాతూ దేవత ఆలయం. ఈ ఆలయంలో లాతు దేవతను పూజిస్తారు. స్థానికుల కథనం ప్రకారం, ఇక్కడి లాతు దేవతను ఉత్తరాఖాండ్‌లోని నందాదేవి సోదరుడుగా పరిగణిస్తారు. ఆలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమె, వైశాఖ పూర్ణిమ రోజున తలుపులు తెరుస్తారు, అదే రోజు మళ్ళీ తలుపులు మూసివేస్తారు.
మనం ఏదయినా ఆలయానికి వేల్లినపుడు అక్కడ దేవతను కళ్ళారా చూడాలని ఆశపడటం. కాని ఇక్కడ లాతూ దేవత ఆలయంలో మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని దేవతను ఆరాధించాలి. చివరికి అక్కడ పూజలు చేసే పూజారులు సైతం కళ్ళకు గంటలు కట్టుకునే పూజలు చేసి తలుపులు మూసేస్తారు. ఎందుకలా కళ్ళకు గంతలు కట్టుకున్తారంటే ఆలయంలో నాగరాజు నాగమనితో ఉంటాడని ఆ నాగమణి దివ్య కాంతులకు భక్తులు అంధులవుతారని, పైగా ఆ దివ్యత్వాన్ని చూస్తే అనేకమైన విచిత్ర పరిస్తితులు ఏర్పడతాయని, అందుకే అలా ప్రత్యక్షంగా దేవతా దర్శనం చేసుకోనివ్వారని చెబుతారు.
కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో, వద్దో కూడా అర్థం కాదు. ఉత్తరప్రదేశ్ లోని నిధివన్ కూడా అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌లోని బృదావనంలో ఉంది నిధివనం. రంగ మహల్ టెంపుల్. ఉత్తరప్రదేశ్ లోని వృందావన్ లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది.
కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని, అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో, గోపికలతో రాసలీల జరుపుతాడని చెబుతారు. ఈ కారణంగానే ప్రతి రోజు సాయంత్రం 5 గంటల తరువాత నిధివన్ ను మూసి వేస్తారు.అందుకే... సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్‌ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్‌లోకి వెళ్తే... వాళ్లు చనిపోతారనీ లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని, పిచ్చివారయిపోతారని చెబుతారు. అలా జరిగిన ఉదాహరణలు కూడా చూపిస్తారు.
నిధివనంలో ఉండే చెట్లు... మెలికలు తిరిగి... చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా... ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ చెట్లన్నీ గోపికలనీ రాత్రయితే గోపికలుగా శ్రీకృష్ణునితో రాసలీలలాడిన వారు మళ్ళీ పగటిపూట చెట్లుగా మారిపోతారని స్థానికులు గాదంగా నమ్ముతారు.
ఇప్పటివరకూ రాత్రి వేళ టెంపుల్‌లోకి ఎవర్నీ అనుమతించలేదు. నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్‌లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి.
కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న హసనాంబ దేవాలయం అత్యంత మిస్టరీ ఆలయంగా చెప్పుకోవాలి. దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆలయాలన్ని మూసివేస్తారు. హాసనాంబ ఆలయం తలుపులు తెరిచి ఉత్సవాలు చేసిన తర్వాత చివరిరోజు అమ్మవారికి పూలు, నేతి దీపం, వండిన అన్నం ప్రసాదంతో నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక ఆచారాల ప్రకారం ఆలయం మూసివేస్తారు. ఏడాది తర్వాత మళ్లీ తలుపులు తెరిచేనాటికి కూడా.. ఆలయంలో ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుంద. అదే విధంగా అమ్మవారిని పూజించిన పూలు కూడా ఆలయ తలుపులు మూసినపుడు ఎలా ఉంటాయో అలాగే తాజాగా కనిపిస్తాయట. అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవ్వకుండా ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత అని చెబుతారు. ఈ మిస్టరీని ఇప్పటికీ ఎవ్వరూ చేధించలేకపోతున్నారు.
ఇలా పరిశీలించాలేగాని పరిశోధనకందని ఎన్నో మిస్టరీ ఆలయాలున్నాయి మన దేశంలో. వాటి రహస్యాన్ని బట్టబయలు చేయాలని హేతువాదులు, పరిశోధకులు శోధనలో మునిగిపోతే ఇదంతా కేవలం దేవరహస్యమని,దైవ మహిమ అని ఆధ్యాత్మిక వేత్తలు, ఆస్తికులు చెబుతారు.