నడి సముద్రంలో ఆలయం | నిత్యం సముద్రంలో మునిగి ఉండే 5 శివాలయాలు |సముద్ర గర్భంలో అద్భుత ఆలయం | 5 under water shiva temples

Vijaya Lakshmi

Published on Aug 31 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

అప్పుడెప్పుడో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జన్మించినపుడు ఉధృతంగా ఉప్పొంగుతున్న యమునానది రెండుగా చీలి కృష్ణయ్యకు దారిచ్చిందని పురాణాల్లో చదువుకున్నాం. ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకొని, అలాంటి సన్నివేశం కళ్ళార చూస్తే ఎంత బాగుంటుందో... కాని చూడలేం కదా! అని కొంతమందయినా అనుకుంటారు. ఇప్పుడలాంటి దృశ్యం చూస్తె అదృష్టం కొన్ని ప్రదేశాల్లో ఉంది. ఎక్కడో తెలుసా! అవును అచ్చంగా అలాంటి చిత్రమే...



 నడి సముద్రంలో ఆలయాలు! నదీ గర్భంలో ఆలయాలు! దర్శనం చేసుకోవాలంటే ఒళ్ళు గగుర్పొడిచే సాహసం చెయ్యాల్సిందే! ముఖ్యంగా శివాలయాలు! గంటల తరబడి ఎదురుచూపులు! ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మరచిపోలేని థ్రిల్ మన సొంతం.


పరమేశ్వరుడు గంగాధరుడు. నిత్యం గంగాభిషేకంతో చల్లబడే గరళకంఠడు. అందుకే ఆలయాల్లో శివలింగం పైన నిత్యం జలధార పడే విధంగా ఏర్పాట్లు చేస్తుంటారు. అలాంటిది సాక్షాత్తూ ఆ సముద్రుడే నిరంతరం ఆ మహాదేవుడిని అభిషేకిస్తూ ఉంటే... చూడ్డానికి ఎంత బాగుంటుంది!



,ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపుటలలు ఉత్సాహంగా ఉరుకుతూ వచ్చి ఆ మహాదేవుడ్ని నిలువెల్లా తడిపి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటే, ఆ సుందర దృశ్యం చూసి తీరాల్సిందే... మరా సుందర దృశ్యం ఎక్కడ కనబడుతుంది...? ఆ క్షేత్ర విశేసాలేంటి? అలా నిరంతరం నీళ్ళలో ముఖ్యంగా సముద్రగర్భంలో కొలువైన 5 అద్భుత శివాలయాలు


ఏడు నదులు కలిసే చోట సంగమేశ్వరాలయం  


 నిరంతరం నదీగర్భంలోనే ఉండే ఆలయం సంగమేశ్వరాలయం. ఎన్నో రహస్యాలకు మరెన్నో శైవ క్షేత్రాలకు నిలయమైన కర్నూలు జిల్లాలో ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సప్తనదీ సంగమంగా చెప్పే ప్రాంతంలో ఉంది సంగమేశ్వరాలయం.


వేపమొద్దు లింగం

         దేశంలో ఏ ప్రాంతంలో కనిపించని విధంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఈ ఏడు నదులు ఒకే చోట కలుస్తాయి. అందుకే ఇది సప్త నదుల సంగమేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. వెంటనే కాశీకి వెళ్లి శివలింగాన్ని తెమ్మని తమ్ముడైన భీముడ్ని ఆదేశించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు. లింగ ప్రతిష్ట జరగవలసిన ముహూర్తానికి అక్కడికి రాలేకపోయాడు. సమయం మించి పోతుండడంతో రుషుల సూచన మేరకు ధర్మరాజు ఒక వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు.



పంచేస్వరాలు


లింగప్రతిష్ట జరిగిపోయిన తరువాత, రెండు చేతులలో రెండు రెండు చొప్పున తల మీద ఒకటి మొత్తంగా ఐదు లింగాలతో అక్కడికి చేరుకున్నాడు  భీముడు. అప్పటికే శివలింగ ప్రతిష్ట జరిగిపోవడంతో తాను ఇంత కష్టపడి శివలింగాలను తెచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందే అన్న బాధతో, ఆగ్రహంతో వాటిని విసిరెసాడట. అవి పడిన ప్రదేశాలే మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలుగా ఏర్పడ్డాయని ఓ పురాణ కథనం.



ఇది చూసిన ధర్మరాజు భీముడిని శాంతింప జేసి, అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి దానికి , భీమలింగంగా పేరు పెట్టాడు. భక్తులు ముందుగా భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.


హంసగా మారిన గంగాదేవి


ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమేశ్వరం అని కూడా పిలవడం జరుగుతోంది. దానికి సంబంధించిన పురాణ కథనం గంగానదితో ముడిపడి ఉంది. స్నాన మాత్రం చేతనే  ప్రజల పాప ప్రక్షాళన చేసే గంగాదేవికి, వారి పాపాలన్నీ ప్రక్షాళన చేసి తనలోకి తీసుకున్న కారణంగా గంగా దేవికి నల్లటి కాకి రూపం వచ్చిందట. ఆ పాప ఫలితాన్ని పోగొట్టుకోవడం కోసం కాకి రూపంలోని గంగమ్మతల్లి వివిధ నదీ సంగామాల్లో  స్నానమాచరిస్తూ వెళ్తుండగా ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఇక్కడ పాపాలు నివృత్తి అయ్యాయి కాబట్టి దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.



నరకబాధలు పోగొట్టే వేపకర్ర శివలింగం  

ఒకప్పుడు నిత్య పూజలతో కళకళలాడుతూ ఒక వెలుగు వెలిగిన ఆలయం, క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయంలో వేపమొద్దుతో ఏర్పరచిన శివలింగాన్ని దర్శించుకుంటే నరక బాధలుండవని భక్తుల నమ్మకం. ఒకప్పుడు నిత్యపూజలతో కళకళలాడిన ఈ క్షేత్రం ఇప్పుడు సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమివ్వడానికి కారణమేంటి? 


మరుగున పడిన ఆలయం

శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈ నివృత్తి సంగమేశ్వరాలయం మాత్రం నీటిలోనే ఉండిపోయింది. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్షేత్రం. నదిలోనే ఉండిపోయిన నివృత్తి సంగమేశ్వరాలయం శ్రీశైలం డ్యామ్ నిర్మాణదశలో 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగి ఉండిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయిన విధంగా ఇది మరుగున పడిపోయింది. మళ్ళీ 2003లో శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో ఆలయం నీటి నుంచి బయటపడింది. ఆ సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సంవత్సరంలో నాలుగు నెలలు భక్తులకు దర్శనమిస్తోంది.



కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది సంగమేశ్వర క్షేత్రం. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు.


స్తంభేశ్వర్ మహదేవ్ మందిర్ – గుజరాత్

           అతి రహస్యమైన శివాలయాల్లో ప్రధానమైనది స్తంభేశ్వర్ మందిర్. ఆ స్తంభేస్వర్ మందిర్ గుజరాత్లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అరేబియా సముద్రతీరంలో ఉన్న ఈ స్తంభేస్వర ఆలయం ప్రస్తావన స్కందపురాణంలో కూడా ఉందని చెప్తారు.



ఈ స్తంభేస్వర్ ఆలయం నిరంతరం అరేబియా సముద్రంలో మునిగి ఉంటుంది. అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయ దర్శనం. సముద్రపు అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఈ ఆలయం బయటయపడుతూ భక్తులు ఆలయంలోకి వెళ్లే అవకాశం వస్తుంది. మళ్లీ అదే క్రమంలో క్రమక్రమంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని చూడడం కోసం భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ అరేబియా సముద్రతీరం వద్దనే వేచి ఉంటారు.



ఈ వింతతో పాటు 4 అడుగుల పొడవు 2 అడుగుల వ్యాసం తో ఉండే ఈ శివలింగం చంద్రుని కళలను అనుసరించి ఒకో రోజు ఒకో తీరుగా మారుతూ దర్శనమిస్తుంది. స్కంద పురాణం, శివపురాణం రుద్ర సంహిత మొదలైన గ్రంధాలలో ప్రస్తావించబడినట్టు చెప్పే ఈ శివలింగానికి ఆలయం మాత్రం సుమారు 150  ఏళ్ల క్రితమే నిర్మించబడిందట.


ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం శివభక్తుడైన శివుడిని మెప్పించి శివపుత్రునితో తప్ప ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండాను ఇంకా అనేక వరాలు సంపాదించి ఆ వరాల గర్వంతో ముల్లోకాలను జయించి లోకాన్ని పీడిస్తూ ఉండేవాడు. ఇలాంటి సమయంలో లోకాలకు ఆ రాక్షసుడి పీడా వదిలిమ్చడం కోసం శివ పుత్రుడైన షణ్ముఖుడు తారకాసురుడిని సంహరించాడు. తారకాసురుడు లోకకంటకుడే అయినా మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు చాలా బాధపడ్డాడట. ఆ సమయంలో ‘శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ అందువలన ఒక శివలింగాన్ని స్థాపించి పూజించమని చెప్పిన శ్రీమహావిష్ణువు సలహాతో. కార్తికేయుడు స్థాపించిన శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.



రోడ్డు మార్గంద్వారా వడోదర నుండి 75 కి.మీ. దూరంలో కవికంబోయి ఉన్నది. వడోదర నుంచి ప్రైవేట్ కాబ్స్ అందుబాటులో ఉంటాయి.

ఇక రైలు మార్గం ద్వారా కూడా కవి కంబోయ్ స్టేషన్ కి చేరుకొని ఆలయానికి వెళ్ళవచ్చు.


youtube play button



నిష్కళంక్ మహాదేవ మందిర్

నిరంతరం సముద్రంలోనే మునిగి ఉండే మరో ఆలయం నిష్కళంక్ మహాదేవ మందిర్.

 ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు వున్నాయి. వాటిని గురించి వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటి మహాద్భుత శివాలయమే నిష్కలంక్ మహాదేవ మందిర్.

సమయం దాటితో సముద్రంలో కలిసిపోవాల్సిందే




ఈ గుడిలోకి వెళ్ళాలంటే సాహసయాత్రే అవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం సముద్రపు అలలు వుప్పొంగినా, సమయం దాటిపోయినా, మనం సముద్రంలో కలిసి పోవలసిందే. ఈ నిష్కళంక మహాదేవ మందిర్  గుజరాత్ లోని భావ్ నగర్ నగరానికి సమీపంలోవున్న కులియాక్ అనేగ్రామంలో సముద్రం నుండి ఒకటిన్నర కి.మీ లోపల వుంది ఈ టెంపుల్. మామూలు సమయాల్లో సముద్రంలో కేవలం ఒక జెండా మాత్రమె కనిపించే ఈ ఆలయం మధ్యాహ్నంపూట మాత్రమె కనబడుతుడి. ఆ సమయంలో సముద్రం మెల్లగా వెనక్కి వెళుతుంది. మధ్యాహ్నమంటే సుమారు 1గంట సమయంలో అలా సముద్రం వెనక్కివెళ్ళిన తర్వాత ఆ ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళాలి.


         మళ్ళీ కొన్ని గంటలలోనే సముద్రం మళ్ళీ ముందుకు వస్తుంది.గుడిని ముంచెత్తుతుంది.దాంతో గుడి కనిపించదు. పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. కేవలం ఆలయ జెండా మాత్రమే కనబడుతుంది, ఇది అక్కడ జరిగే అద్భుతం.ఆలయంలో ఎత్తుగావుండేది ధ్వజస్థంభం.సుమారు ఆ లెవల్ వరకు అంటే 20మీలఎత్తు నీళ్ళు వచ్చేస్తాయ్. ఆ లోపలే ఆలయ దర్శనం చేసుకొని వచ్చేయాలి లేకపోతే సముద్రంలో మునిగి పోవలసిందే. ఇలాగ కొన్ని వందలవేల సంల నుంచి జరుగుతుందట అక్కడ.


ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థలపురాణం చెబుతుంది. పాండవులు పూజలుచేసి ప్రతిష్టించిన 5శివలింగాలు ఇప్పటికి ఆలయంలో చెక్కు చెదరకుండా వున్నాయ్.పౌర్ణమిలో చంద్రుని వెన్నెల కాంతిలో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా గుడిని తీసుకుపోవటం అద్భుతంగా కనిపిస్తుందట అక్కడ. పాండవ కౌరవ యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు జయకేతనం ఎగురవేశారు. కానీ... ఎంతోమంది రక్తసంబంధీకులనూ పెద్దలనూ ఈ యుద్ధంలో భాగంగా చంపాల్సి రావడం ఆ ఐదుగురు అన్నదమ్ములనూ కలవరపరచింది. అదే విషయాన్ని కృష్ణభగవానుడికి విన్నవించుకున్నారు. అందుకు పరిష్కారంగా ఆయన పాండవులకు ఒక నల్ల ఆవునూ, ఒక నల్ల జెండానూ ఇచ్చాడు. 'ఈ ఆవును వదిలేయండి. ఈ జెండా చేత పట్టుకొని దాని వెంట నడవండి. ఏ ప్రాంతంలో అయితే ఆ ఆవు రంగూ, జెండా రంగూ తెల్లగా మారతాయో, అక్కడే మీరు పరమశివుడిని దోష పరిహారం కోసం ప్రార్థించండి' అని చెప్పాడు.


            పాండవులంతా ఆ ఆవునడచిన దారిన నడిచారు. ఓ రోజు సముద్ర తీరం వెంట నల్లావు ప్రయాణించ సాగింది. అలా నడుస్తూ ఉండగా ఓ చోట ఆవురంగూ, జెండా రంగూ తెల్లగా మారిపోయాయి. అక్కడే సోదరులంతా కూర్చుని మహాదేవుడ్ని ధ్యానించారు. భోళాశంకరుడు కరిగిపోయాడు. ధ్యానముద్రలో ఉన్న ఆ ఐదుగురు అన్నదమ్ముల ముందూ ఐదుశివలింగాల రూపంలో ఉద్భవించాడు. ఆ శివలింగాలను చూసిన పాండవులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. భక్తితో పూజించారు. వారి పాపాలను తొలగించేందుకు ఉద్భవించిన శివుడు కనుక ఆయన్ను నిష్కళంక మహదేవ్‌గా కొలుస్తారు భక్తులు. అక్కడి అరేబియా సముద్ర తీరం దగ్గర నిలుచుంటే సముద్రం లోపలికి దూరంగా రెండు స్తంభాలపై జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి. అదే శివుడు వెలసిన ప్రాంతానికి గుర్తు. పోటు తగ్గినప్పుడు కాలి నడకన ఇక్కడికి వెళ్లొచ్చు. 500 అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల కనిపిస్తుంది. ఆ ప్రాంగణంలోనే ఐదు శివలింగాలూ నందితో కలిసి వెలసి ఉంటాయి. అక్కడే ఓ పక్క పాండవ కొలను అన్న పేరుతో చిన్న సరస్సు ఉంటుంది. అందులో కాళ్లు కడుక్కుని స్వామి దర్శనానికి వెళతారు భక్తులు. పక్కనే రెండు జెండా స్తంభాలూ కనిపిస్తాయి.


17వ శతాబ్దంలో భావ్‌నగర్‌ మహారాజు భావ్‌సింగ్‌ ఈ ప్రాంతాన్ని భక్తులు పూజ చేసుకునేందుకు వీలుగా కాంక్రీటూ, నాపరాళ్లతో మలచారు. ప్రతి శ్రావణ మాసంలోని అమావాస్యనాడు భాదర్వి పేరుతో ఇక్కడ ఓ వేడుక జరుగుతుంది. దాన్ని దేవాలయ పండుగగా పిలుస్తారు. ఆ రోజు భావ్‌నగర్‌ మహారాజులు ఇక్కడి ధ్వజస్తంభం మీద కొత్త జెండాను ఉంచుతారు. వేడుకగా జరిగే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు వస్తారు.

             మరుసటేడాది మళ్లీ మార్చేదాకా ఆ జెండానే అక్కడ ఉంటుంది. సముద్ర తీరంలో భూకంపం లాంటివి వచ్చిన సందర్భాలు సహా ఏనాడూ ఈ జెండా అక్కడి నుంచి కదలలేదని స్థానికులు చెబుతారు.


బుధనీలకంఠ ఆలయం

నిరంతరం నీటిలోనే ఉండే మరో ఆలయం నేపాల్ లో బుధనీలకంట ఆలయం. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు...ఇంకెన్నో విచిత్రాలు... మరెన్నో అద్భుతాలు... అలాంటి అద్భుతమే నేపాల్ లోని బుద్ధ నీలకంఠ విగ్రహం. 5 మీటర్ల భారీ రాతి విగ్రహం. ఇలాంటి భారీ విగ్రహాలు చాలానే ఉన్నాయి... అది వింతేంటి అని మీరనుకోవచ్చు. భారీ విగ్రహం అన్నది కాదు ఇక్కడ వింత. అంత భారీ రాతి విగ్రహం ఒక చెరువులో నీటిమీద తేలుతూ ఉంటుంది అది వింత.... బుద్ధ నీలకంఠ ఆలయం.



నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండు లో కొలువుతీరిన ఓ అద్భుతం. పేరులో బుద్ధుడున్నా ఇది బుద్ధ దేవాలయం కాదు. హిందూ దేవాలయం. నీలకంఠ అని పేరుంది కదాని పూర్తిగా నీలకంటుడైన పరమేశ్వరుని ఆలయం అని కూడా చెప్పలేం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణు ఆలయం. సుమారు 5 మీటర్ల పొడవుతో ఉన్న భారీ విష్ణుమూర్తి రాతి విగ్రహం నీటిమీద తేలుతూ ఉంటుంది. ఆలయం అని పిలవడమే గాని నిజానికిది గుడి గోపురం లేని బహిరంగ ప్రదేశం. అయితే ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే మాత్రం గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం వుండేదని అర్థం అవుతుంది.


ఈ ఆలయాన్నే నారాయణాథన్‌, జల శయన నారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి నాలుగు చేతులలో శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి దర్శనమిస్తాడు.. బుధనీలకంఠ అంటే పురాతన నీల కంఠుడని అర్థం. సాధారణంగా కాల కంఠుడు లేదా నీల కంఠుడు,గరలకంటుడు ఇలాంటి పేర్లు శివునికి వాడతారు.


మరిక్కడ విష్ణుమూర్తికి నీలకంఠ అనే పేరు ఎలా వచ్చింది? అన్నిటి కంటే ముఖ్యంగా నీటిలో మునిగి ఉండే శివాలయాలు అని చెప్పి విష్ణు ఆలయం గురించి చెప్తున్నానేంటి అని మీరు అనుకోవచ్చు. నిజానికి ఈ సరస్సులో అట్టడుగున శివభగవానుడు శయన ముద్రలో ఉంటాడట. ఆ కథనం ఎలా ఉందంటే... క్షీరసాగర మధనంలో వచ్చిన గరళాన్ని శివుడు మింగిన తర్వాత దాని మంటకు తట్టుకోలేక ఆ తాపాన్ని చల్లబరిచే నీటి కోసం హిమాలయాల్లో తిరుగాడాడట. ఆ సందర్భంలోనే ఖాట్మండుకు ఉత్తరంగా ఉన్న పర్వత శ్రేణులపైకి ఎగిరి తన త్రిశూలాన్ని కొండ పక్క భాగంలో గుచ్చి ఒక సరస్సు సృష్టించి ఆ నీటితో మంట చల్లార్చుకున్నాడట. ఆ సరస్సే గోశయన్‌ కుండ్‌ అని. ప్రస్తుతం విష్ణువు శయనించి ఉన్న సరస్సులోని నీరు గోశయన కుండంలోనిదేనని అందుకే నీలకంఠుని పేరు మీద ఈ ఆలయానికి ఆ పేరు వచ్చి ఉంటుందని, దీనికి చిహ్నంగా సరస్సు అడుగు భాగాన పడుకుని ఉన్న శివుని మూర్తిన కూడా ఉందని కొందరి నమ్మకం.


ఇక స్థల పురాణం విషయానికొస్తే ఒక రైతు పొలం దున్ను తుండగా నాగలికి భూమిలో దిగబడి కదలకుండా పోయిందట. ఎంత ప్రయత్నించినా నాగలి కదలలేదు. పైగా ఆ ప్రదేశంలో రక్తం చిమ్మడం మొదలైంది. దాంతో ఆ ప్రదేశంలో తవ్వి చూడగా ఈ బుధ నీలకంత విగ్రహం కనబడిందట. దానితో ఆ విగ్రహాన్ని తీసి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించారని చెబుతారు.

         మరో కథ ప్రకారం ఎక్కడో చెక్కిన ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పాలించిన విష్ణు గుప్తుని కాలంలో ఖాట్మండుకు తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చెబుతారు.

సుమారు 1400 సం ల ముందునుండే ఈ విగ్రహమ్ అలా నీటిలో తేలుతూనే ఉందట. మరి ఇంత బరువైన భారీ విగ్రహం నీటిలో తేలియాడటం సాధ్యమయే పనేనా?  ఇంత బరువైన భారీ విగ్రహం నీటిలో తేలియాడటం వెనక ఏదో మిస్టరీ ఉంది అదేదో కనిపెడతామని పరిశోధనలకు పూనుకున్నారు పరిశోధకులు. ఈ విగ్రహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు భూమిలోని లావాలాంటి పదార్ధంతో సిలికాన్ సంబంధితమైన తక్కువ సాంద్రతకలిగిన శిలతో ఈ విగ్రహ మూర్తిని మలచారు అని అందుకే అంత భారీ విగ్రహం కూడా అలా తేలుతోందని చెప్పారు. అయితే విగ్రహం అలా  నీటిమీద తేలడానికి పూర్తిగా అదే కారణం అని మాత్రం రుజువు చేయలేకపోయారు. అందుకే విగ్రహం నీటిమీద ఎలా తేలుతుంది అన్నా విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.


గంగేశ్వర్ మాహదేవ్

డయ్యు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఫుదమ్ గ్రామం దగ్గరున్న సముద్రతీరంలో గంగేశ్వర్ అన్న శివక్షేత్రం ఉన్నది. శివక్షేత్రం అంటే అదేమంత ఆధ్యాత్మిక ప్రదేశం కాదు. సముద్రపు తీరంలోనే ఐదు శివలింగాలు ప్రతిష్ఠించిన ప్రదేశమిది. ప్రతి సముద్రపు అల ఈ ఐదు శివలింగాలను అభిషేకం చేసి వెనక్కి వెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. ఈ శివలింగాలకు ప్రత్యేకమైన గుడి ఏమీలేదు. ఐదారు మెట్లు కట్టి వాటి దగ్గరకు వెళ్లే ఏర్పాటుచేశారు. ఈ శివలింగాలను పాండవులు ప్రతిష్ఠించారని చెప్తారు.



ఇవి కూడా చూడండి

youtube play button


youtube play button


 


Recent Posts