మహానటి | నవల - 5 | మావూరు.విజయలక్ష్మి | Mahanati 5th part Telugu novel

Vijaya Lakshmi

Published on Oct 09 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

        2003, ఫిబ్రవరి నెల ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక లో ప్రచురించబడిన నవల


       “మహానటి” ధారావాహిక – 5


        రచన : మావూరు.విజయలక్ష్మి


“హలో...” శిలా ప్రతిమలా నిలబడిపోయిన తార దగ్గరకొచ్చి పలకరిండు విజయ్.

“ హలో” కలలోలా పలికింది. ఆమెకంతా అయోమయంగా ఉంది, ‘ఏంటిదంతా తనని ఇక్కడికి రప్పించింది, ఇన్నాళ్లు ఉత్తరాలు రాసింది ఇతనా!? ఇతనే అయితే తామిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు కదా! మరి... ఈ ఉత్తరాల విషయం అతను ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఎందుకు? లేక విజయ్ ఇక్కడ దర్శనం ఇవ్వడం కేవలం యాదృచ్ఛికమేనా!? ఎటూ తేల్చుకోలేకపోతోంది.

“ఏంటి? నిలబడే నిద్రపోతున్నారా?” టీజింగ్ గా అడుగుతున్నాడు విజయ్.

“భలేవారే!” ముఖానికి నవ్వు పులుముకుంది తార.

“పదండి అలా వెళ్లి కూర్చుందాం” అంటూ కొంచెం దూరంలో ఉన్న సిమెంట్ బెంచి వైపు దారితీస్తున్న విజయ్ ను అనుసరించింది.

కొద్ది నిమిషాలు ఎవరికి వారే ఎదుటివారే సంభాషణ మొదలు పెడితే బాగుండు అన్నట్టు మౌనంగా ఉండి పోయారు. ఇప్పుడిప్పుడే స్నేహపు పరిధిని దాటి ప్రేమగా రూపుదిద్దుకునే దశలో ఉంది. వారి పరిచయం.

నిజానికి అనుకోకుండా జరిగిన ఈ కలయిక ఇద్దరినీ ఆనందపరిచింది. కానీ కలుసుకున్న సందర్భం వారిని సంతోషంలో కంటే ఎక్కువగా టెన్షన్ లో ముంచేసింది. చివరికి మౌనాన్ని ఛేదిస్తూ ముందుగా విజయ్ నోరు విప్పాడు.

“ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా?” దిక్కులు చూస్తున్న ఆమెను చూస్తూ అడిగాడు.

“లేదు...  అదేం లేదు” తడబడుతూ అంది.

ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేకపోతున్నాడతను. తన మనసులో మాట చెప్తే ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని జంకుతున్నాడు. అస్థిమితంగా కదులుతున్న అతని చేతి వేళ్ళు యాంత్రికంగా ఒళ్ళో ఉన్న పుస్తకం పేజీలు తిప్పుతున్నాయి.

ఆమె మనసులో ఆలోచనలు మరోలా ఉన్నాయి. ‘ఇతని వాలకం చూస్తే, యాదృచ్ఛికంగా ఇక్కడ కనిపించాడు తప్ప, ఉత్తరాలు ఇతడే రాసిన సూచనలు కనిపించడం లేదు. మరి... ఉత్తరాలు వ్రాసిన వ్యక్తి కరెక్ట్ గా ఇదే స్థలానికి రమ్మన్నాడు కదా! తనతో విజయ్ ను ఇక్కడ చూసి, తన దగ్గరకు రాకుండా ఆగిపోయాడా!? అలా అయితే అతడు... అతడు... ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండాలి’ చుట్టూ చూస్తూ అనుకుంది.

“ఒక మాట అడగాలనుకుంటున్నాను... అడగమంటారా?” ఆమె ఆలోచనలను భగ్నం చేస్తూ అడిగాడు విజయ్.

“మీరు ముందా అండిలు... కుండీలు మానేయండి బాబు” అతడు చెప్పబోయేది ఏమై ఉంటుందో చూచాయగా తెలుస్తూనే ఉందామెకి.

“అదే... మిమ్మల్ని...”

“అదిగో! మళ్ళీ మీరు...”

“సరే... సరే... నువ్వు మాత్రం బాగా ఆలోచించి సమాధానం చెప్పు. తొందరపాటుగా మాత్రం నిర్ణయాలు తీసుకోకు. నేను అడగబోయేది నీకు నచ్చినా, నచ్చకపోయినా మనం మాత్రం మంచి స్నేహితులుగానే ఉండాలి.

“అబ్బా! ఈ ఉపన్యాసం అంతా దేనికి...? నన్ను సస్పెన్స్ లో పెట్టకుండా మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి”

“అదే... నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను... నీ అభిప్రాయం చెప్తే...” ఎక్కడ సంకోచం అడ్డుపడుతుందో అన్నట్టు గబగబా చెప్పి ఆత్రంగా తార ముఖంలోకి చూడసాగాడు.

ఆమె వెంటనే మాట్లాడలేకపోయింది.

ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న విజయ్, “ఇందులో బలవంతం ఏమీ లేదు తారా! నీకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా నిర్మొహమాటంగా చెప్పేయ్” అన్నాడు విజయ్.

“అబ్బే... అది కాదు విజయ్” కంగారుగా అంది తార.

“మరేంటి మీ అనుమానం? మీ అమ్మగారు ఒప్పుకోరనా? పోనీ నేనొచ్చి మాట్లాడనా”

“వద్దొద్దు... ఇంత తొందరలో మన విషయం అమ్మకు చెప్పలేను. మీకు తెలుసుగా విజయ్! నేను నాటకాల్లో చేరడం అమ్మకు అస్సలు ఇష్టం లేదు. ఆమె అభిప్రాయానికి విరుద్ధంగా నేను ఇందులో ప్రవేశించాను. దాని కారణంగా ఇప్పటికే ఆవిడ చాలా కోపంగా ఉంది. మళ్లీ ఇంతలోనే మన విషయం చెప్తే మరీ పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని భయంగా ఉంది.”

“అదీ నిజమేలే! అయినా నేనో మాట చెప్తాను కోపం తెచ్చుకోవు కదూ...” అన్నాడు విజయ్.

“చెప్పండి”

“నువ్వు డిగ్రీ చేశావు. అంతగా నువ్వు కోరుకుంటే ఏదైనా ఉద్యోగం చేయవచ్చు కదా! ఈ నాటకాలూ అవీ ఎందుకు నీకు? ఆ రంగంలో ఉన్న ఆడవాళ్లకు ఈ సంఘంలో గౌరవం కూడా అంతంత మాత్రం గానే ఉంటుందంటారు” జంకుతూనే అన్నాడు విజయ్.

“ఒక్కసారిగా ఆవేశం తన్నుకొచ్చింది తారకు. “మీరు... మీరు కూడా ఇలాగే అంటున్నారా!? అంటే... మీకూ నేనంటే గౌరవం లేదన్నమాటేగా!?” పెదవులు అదురుతుండగా ఉక్రోషంగా అంది.

“అదిగో అప్పుడే ఆవేశ పడిపోతున్నావ్. నేనందుకే ముందే చెప్పాను కోపం వద్దని. ఇందులో నువ్వంతగా ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. సమాజ పరిస్థితి గురించి చెప్పానంతే...” బుజ్జగింపుగా అన్నాడు.

“సమాజం సంగతి అలా ఉంచండి. ముందు మీ సంగతి చెప్పండి.”

“అవేం మాటలు తారా! నువ్వంటే గౌరవం లేకపోతే, నిన్ను వివాహం చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడతాను? అదిగో! అలా చూడకు. నీ పౌరుషాన్ని అర్జెంటుగా తగ్గించేసుకో మరి. ఇంతకీ నీ నాటక ప్రదర్శన ఎప్పుడు?”

అతడు తన నాటకం గురించి అడిగేసరికి తన కోపాన్ని అంతా మరచిపోయి ఇటు తిరిగింది. నాటకం గురించి అందులో తన పాత్ర గురించి సహనటుల గురించి ఉత్సాహంగా చెప్పసాగింది

*************************

మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది తార. రాజమండ్రిలో తమ ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. ప్రేక్షకుల స్పందన అనుకున్న దాని కంటే ఎక్కువగానే కనిపించింది. పోటీ ఫలితాలు కూడా ప్రకటించారు. తమ నాటకం ఉత్తమ నాటకం గాను, తను ఉత్తమ నటిగాను బహుమతులు గెలుచుకున్నారు.

తారకు చాలా ఆనందంగా ఉంది. తను పడిన కష్టానికి, తల్లితో ఘర్షణ కారణంగా పడిన మానసిక వ్యధకు తగిన ప్రతిఫలం లభించినట్లయింది. ఆమెకి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు... మొదటి ప్రదర్శనలోని ఉత్తమ నటిగా బహుమతి గెలుచుకోవడం. నిజంగా ఇదొక అపురూపమైన అనుభూతి. ఉత్తమ నటి నుంచి మహానటిగా ఎదగాలని అప్పుడే నిర్ణయించుకుంది.

తను ఇప్పుడు ఉత్తమ నటి! అవును... ఉత్తమ నటి! ఈ సమయంలో విజయ్ ఉంటే ఎంత బాగుండును! ఈ బహుమతిని అమ్మకు చూపిస్తే ఏమంటుందో! అప్పటికైనా తన కోపాన్ని తగ్గించుకుంటుందో... లేదో...”

“అక్కా!” అన్న పిలుపు వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకు చూసింది. తన సహనటి జ్యోత్స్న నిలబడి ఉంది. చక్కగా ముస్తాబై ఉంది.

“ఏంటి జోత్స్నా... అప్పుడే తయారైపోయావు? ఎక్కడికైనా వెళుతున్నావా?” అడిగింది తార.

“అదేంటక్కా అలా అడుగుతున్నావ్!? మనందరం కలిసి ఇవాళ ధవలేశ్వరం బ్యారేజ్ చూడ్డానికి వెళ్దామని అనుకున్నాం కదా!” ఆశ్చర్యంగా అంది జోత్స్న.

ప్రదర్శన అనంతరం రాజమండ్రిలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూడాలని, గోదావరిలో కొంతసేపు పడవ మీద తిరగాలని ముందే నిర్ణయించుకున్నారు టీమంతా.

“అయ్యో! మర్చిపోయాను. ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను.” అంటూ బాత్రూంలోకి దూరింది.

అన్నట్టుగానే ఐదు నిమిషాల్లో తయారై వచ్చేసింది. అప్పటికే అందరూ ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు. విజయం తెచ్చిన ఆనందంతో చాలా ఉత్సాహంగా ఉన్నారంతా.అందరూ సందడిగా బయల్దేరారు. కాటన్ బ్యారేజ్ చూసి మ్యూజియంలోకి చొరబడ్డారు. బ్యారేజ్ కట్టకముందు ఉభయగోదావరి ప్రజలు ఎంత కరువు కాటకాలతో అల్లాడిపోయారో, ఆకలి చావులకు గురైన దృశ్యాలు, ఈ అనర్ధాలకు చలించిపోయిన కాటన్ మహాశయుడు ఏ విధంగా బ్యారేజీకి రూపకల్పన చేసిందీ, అతడి కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఆనకట్ట అక్కడి ప్రజల ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వులు నింపింది... చిత్రాలతో ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి చూపరుల హృదయాలలో శాశ్వతముద్రవేసాయి.

అదంతా చూసిన తర్వాత, ‘ఎలాంటి కాటక ప్రాంతాన్ని ఎంత సస్యశ్యామలంగా మార్చేశాడా మహానుభావుడు! నిజంగా... ఈ ప్రాంత ప్రజలకు అతడు ప్రాతస్మరణీయుడు.’ అందుకే అన్నారు... “పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది లేదని”. ఆ కృషిని ఆలంబనగా చేసుకునే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది తార. మొత్తానికి ఎంత ఉత్సాహంతో ఈ ప్రదర్శనకు బయలుదేరిందో... అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి చేరుకుంది.

*********************


సశేషం

మహానటి ధారావాహిక నవల మిగిలిన కథ తరువాయి బ్లాగ్ లో ...


ఇవి కూడా చదవండి



Recent Posts