Vijaya Lakshmi
Published on Sep 02 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఆ పేరే ఓ సంచలనం. ఆ పేరుతొ ఉన్న ఆలయమే కాదు. ఆ స్వామి చరిత్ర కూడా సంచలనమే రహస్యాలమయమే. ఆ స్వామే అనంతపద్మనాభస్వామి. అనంత పద్మనాభ స్వామి అనగానే అందరి కళ్ళముందు మెదిలేది కేరళలో తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి దేవాలయం.
అయితే ఇప్పుడు చెప్పబోయేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల గురించి. నిజానికి అనంత పద్మనాభస్వామి ఆలయాలు కాస్త తక్కువగానే ఉంటాయని చెప్పాలి. ప్రసిద్ధి చెందిన కేరళలోని ఆలయం తప్ప మిగిలినవి చాలామందికి తెలియవనే చెప్పాలి.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న అనంతపద్మనాభస్వామి ఆలయాలు. నిజానికివి అతి ప్రాచీన ఆలయాలు. అయినా కూడా ఎందుకో మరి అంతగా వెలుగులోకి రాకుండానే ఉండిపోయాయి. అందుకే అలాంటి మరుగున పడిన అనంతపద్మనాభస్వామి ఆలయాల గురించి చెప్పలన్నదే ఈ ప్రయత్నం.
ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. అది స్వామి పేరుతోనే ఉన్న గ్రామం పద్మనాభం. విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో విశాఖ జిల్లా, సింహాచలం నకు ఈశాన్యంగా సుమారు 30 కీ.మీ దూరంలో గోమతి నది ఒడ్డున ఉన్న పద్మనాభం గ్రామంలో ఎత్తైన కొండ మీద అనంత పద్మనాభస్వామి స్వయంభువుగా వెలిసాడు.
ఈ గ్రామాన్ని రేవడి పద్మనాభం అని కూడా పిలుస్తారు. పచ్చటి ప్రకృతిని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కొండ ఎక్కడ అద్భుతమైన అనుభవం. సుమారు 1278 మెట్లు ఎక్కి వెళితే అక్కడ స్వామి మూలవిరాట్టు అవ్యక్తం గా దర్శనమిస్తుంది. కొండ రాతి పైన లీలగా మాత్రమే దర్శనమిస్తాడు అనంతపద్మనాభుడు. ఆదిశేషుని పైన శంఖు, చక్రాలను ధరించి లక్ష్మీ సమేతంగా కొలువుతీరాడు అనంతపద్మనాభస్వామి. స్వామి వారికి నిత్య అర్చనలు, నైవేద్యం సేవలు జరుగుతాయి.
కార్తీక అమావాస్య రాత్రి ఇక్కడ కొండ మెట్లకు కన్నులపండుగగా జరిగే దీపోత్సవం చూసి తీరవలసిందే.. రెండు కన్నులు కాదు కదా ఆ దీపోత్సవ శోభ చూడడానికి ఎన్ని కన్నులున్నా సరిపోవేమో అనిపిస్తుంది. అంత వైభవంగా ఉంటుంది ఆ ఉత్సవం.
ఈ కొండ క్రింద, మెట్లుకు సమీపంలో శ్రీ నారాయణేశ్వరాలయంలో పరమేశ్వరుడు కొలువుతీరాడు.
శ్రీ అనంత పద్మనాభ స్వామి ముఖ ద్వారం నకు కొద్దిదూరంలోనే కొండకు దిగువ భాగంలో అత్యంత ప్రాచీనమైన శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయం ఉంది. నాగుల చవితి సందర్భముగా పద్మనాభం లో జాతరోత్సవాలు జరుగుతాయి.
పాండవుల తల్లి కుంతీదేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ట చేసినందువల్ల స్వామికి కుంతీమాధవస్వామి అనే పేరు వచ్చినట్లు చెబుతారు. భక్తులు ముందుగా కుంతీ మాధవస్వామిని దర్శించుకుని, ఆ తరువాతే కొండపైనున్న అనంత పద్మనాభస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం.
సింహాచలం RTC బస్ స్టాండ్ నుంచి శొంఠ్యాం, పద్మనాభం, జామి మీదగా విజయనగరం వెళ్ళే బస్సులుంటాయి సుమారు ప్రతి గంటకు ఈ బస్సులుంటాయి. ఈ బస్సులలో వెళ్లి ఆలయం దగ్గర దిగవచ్చు. ఇక విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళే దారిలో ఉన్న తగరపువలస దగ్గర దిగి ఆటల్లో కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు.
ఇక మరో పురాతన అనంత పద్మనాభుని ఆలయం కూడా మన రాష్ట్రంలోనే విజయవాడ దగ్గరున్న ఉండవల్లిలో ఉంది. ఇది గుహాలయం. ఉండవల్లి గుహలలో ఉంటాడీ అనంత పద్మనాభుడు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. ఇవే ఉండవల్లి. ఈ గుహాలయాలు సాధారణ శకం 420 -620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలు గా చెప్తారు చరిత్ర పరిశోధకులు. సాధారణంగా గుహాలయాలు అనగానే ఈ గుహాలయాల్లో ఎక్కువగా బౌద్ధ, జైన ఆలయాలే కనబడతాయి. అందులే ఈ వైష్ణవ గుహాలయం ఉండడం విశేషమైన విషయంగా చెప్తారు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాథికారిగా పనిచేసిన మాథవరెడ్డి చేత ఈ అనంత పద్మనాభుని గుహాలయము నిర్మింపజేసినట్లుగా చెప్తారు. మూడవ అంతస్తు చివరి మందిరంలో ఉంటుంది ఈ ఆలయం. ఆలయంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంతో చకితుల్ని చేసేలా ఉంటుంది శ్రీ అనంతపద్మనాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహం.
మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ఒక ప్రచారం ఉంది. విజయవాడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడ నుంచి ఆటల్లో వెళ్ళవచ్చు.
ఇక మరో పద్మనాభస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో అందమైన అనంతగిరి కొండల్లో ఉంది. ఈ ప్రాంతం వేసవి లో కూడా చల్లటి వాతావరణంతో ఉంటుంది. అందుకే అనంతగిరి ‘’తెలంగాణా ఊటీ ‘’అని ప్రసిద్ధి చెందింది. అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటయిన ఈ దేవాలయం హైదరాబాద్‌కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో మార్కండేయ మహర్షి నిర్మించాడని చెప్తారు.
ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి, ఆహ్లాదకర ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైన మార్కండేయుడు ప్రతిరోజూ ఇక్కడ యోగసాధన చేసేవాడట. సాధన తరువాత ఇక్కడి ఒక గుహ ద్వారా కాశీలో గంగానదికి వెళ్లి అక్కడ స్నానమాచారించేవారట. అయితే ఒక సారి సకాలంలో మార్కండేయుడు కాశీకి చేరుకోలేకపోయాడు. దాంతో సరయిన సమయంలో తన అనుష్టానాలు చెయ్యలేకపోయానని చాలా బాధపడ్డాడు మార్కండేయుడు. అప్పుడు శ్రీమహావిష్ణువు స్వయంగా మార్కండేయుని కలలో కనిపించి ఋషి స్నానం కోసం గంగానది నీటిని ఇక్కడే ఏర్పాటు చేశాడని ఓ కథనం.
ఇక్కడే ఒక గుహలో నిద్రిస్తున్న ముచుకు౦ద మహర్షి కంటినుంచి వచ్చిన మంటలకు శ్రీకృష్ణునితో యుద్ధం చేస్తూ వచ్చిన కాలయవనుడు భాస్మమయిపోయాడని పురాణ కథనం. రఘువంశంలో పుట్టిన మాంధాత కుమారుడు ముచికుందుడు. దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్దంలో దేవతలా తరపున వెయ్యేళ్ళు పోరాడాడు. దేవతలు గెలిచారు.
వెయ్యేళ్ళు రాక్షసులతో యుద్ధం చేయడం వలన అలసిపోయిన ముచికుందుడు గాదంగా నిద్రపోవాలనుకున్నాడు. అతడికి దీర్ఘ నిద్రను ఇచ్చి ఎవరైనా అతడికి నిద్రాభంగం చేస్తే అతడి కంటిమంటకు భాస్మమయిపోయేలా వరం కూడా ఇచ్చారు దేవతలు. అలసిపోయిన ముచికుందుడు ఈ అనంతగిరి గుహలో హాయిగా గాధనిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తమపై దండెత్తి వచ్చిన కాలయవనుడితో యుద్ధం చేస్తూ అతడిని మామాలుగా అయితే అతడిని ఓడించడం సాధ్యం కాదని గ్రహించన కృష్ణుడు అతడిని ఈ ముచికుందుని దగ్గరకు వచ్చేలా తానూ అతడి ముందే ఈ గుహలోకి వచ్చే చేరాడు.
కృష్ణుడిని వెంటాడుతూ వచ్చిన కాలయవనుడు అక్కడ నిద్రపోతున్న ముచికున్డుడిని చూసి కృష్ణుడే ఇలా మాయచేస్తున్నాడని భావించి ముచికుందునికి నిద్రాభంగం చేస్తాడు. కళ్ళు తెరిచిన ముచికుందుని కంటినుంచి వచ్చిన మంటలకు భస్మమై పోతాడు. ఆ సమయంలో ముచికుందుని ఆగ్రహాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు ఆయనకు అనంత పద్మనాభ స్వామిగా దర్శనమిచ్చాడట . అప్పుడు ముచుకు౦దుదు అనంత పద్మనాభస్వామి పాదాలను తన కమండల జలంతో కడిగాడని, ఆ జలమే ఈ అనంతగిరులలో ‘’ముచుకుందనదీ’’ రూపాన్ని పొంది ,కృష్ణానదికి ఉపనది యై ప్రవహించిందని అంటారు. ఆ ముచుకుంద నదే ఇప్పుడు ‘’మూసీ నది ‘’గా పిలువబడుతోందని చెప్తారు.
మరో కథనం ప్రకారం ముచికుంద మునికే శ్రీకృష్ణుడు నదీ రూపం ఇచ్చాడని అదే ఇప్పటి మూసీనది అని కూడా చెప్తారు.
అదే సమయంలో ఇక్కడ తపస్సులో ఉన్న మార్కండేయునికి కూడా అనంతపద్మనాభుడు దర్శనమిచ్చాడని పురాణ కథనం. అప్పుడు మార్కండేయుడు కట్టించిన ఆలయం మరుగున పడిపోగా ఈ ఆధునిక కాలంలో హైదరాబాద్ నవాబు పద్మనాభస్వామి ప్రధాన ఆలయాన్ని నిర్మించాడని చారిత్రిక కథనాలు చెప్తున్నాయి. ఇక్కడి పుష్కరిణీ స్నానం అనంత శుభ ఫలితాలుస్తుందని చెప్తారు.ఈ పుష్కరిణి కి వెళ్ళేదారిలో మార్కండేయమహర్షి తపస్సు చేసిన తపోవనం, శివాలయం ఉన్నాయి. అనంతపద్మనాభాలయం గర్భగుడిలో ఎడమవైపు మార్కండేయముని కాశీకి వెళ్ళిన బిలమార్గం కూడా ఉంది.
మరో అనంత పద్మనాభుని దేవాలయం నిజామాబాద్ లోని మల్కాపూర్ లో కొండగుహలలో ఉంది. 600 ఏళ్ల క్రితం ఇక్కడ స్వామి వారు వెళిశారని ఆలయ స్థలపురాణం చెపుతోంది. వికారాబాద్ ప్రాంతం నుంచి మాకునూరి కోనమాచారి అనే బ్రాహ్మణుడు ఎడ్లబండిపై ప్రయాణం చేస్తూ ఉండగా ఆయనకు కలలో అనంతపద్మనాభ స్వామి వచ్చి నేను మీరు వెళ్లే మార్గంలో ప్రత్యక్షమవుతాను.. ఓ తెల్లని అశ్వంమీకు కనిపిస్తుంది. ఆ అశ్వాన్ని వెంబడించండి అది ఎక్కడ ఆగుతుందో అక్కడే నేను కొలువుదీరుతాను అని మాకునూరి కోణమాచారికి స్వామి వారు స్వప్నంలో చెప్పారు.
స్వామివారు స్వప్నంలో చెప్పిన విధంగానే ఓ తెల్ల గుర్రం కోనమాచారికి కనిపించింది... ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. గుండారం చెరువు వద్ద గుహలోకి వెళ్లిన అశ్వం మాయమైంది. కోనమాచారికి ఆ గుహలో ఓ వెలుగు కనిపించి ఆ వెంటనే మాయమయింది. ఆ వెలుగు మాయం కాగానే నేనే అనంత పద్మనాభ స్వామిని ఇక్కడ నేనే కొలువుదీరుతున్నాను అన్న మాటలు వినిపించాయి. అక్కడ చూస్తే రూపాయి బిళ్ల సైజులో స్వామి వారి స్వయంభూ ఆకారం కనిపించింది. నాటి నుంచి అక్కడ పూజలు, అర్చనలు ప్రారంభించారు. అయితే విచిత్రంగా ప్రారంభంలో రూపాయి సైజులో ఉన్న స్వామి వారు ఆకారం క్రమక్రమంగా పెరిగి ప్రస్తుతం నరసింహ స్వామి ఆకారంలో దర్శనమిస్తున్నారు.
దాదాపు 600 సంవత్సరాల నుంచి మాకునూరి వంశస్తులే ఈ ఆలయంలో అనంతపద్మనాభ స్వామికి పూజలు, అర్చనలు చేస్తున్నారు. ఆ వంశాస్తులలో ఎనిమిదో తరం వారు ప్రస్తుతం స్వామివారి సేవలో ఉన్నారని చెప్తారు. అనంతపద్మనాభ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పచ్చటి ప్రక్రుతి లో వెలసిన స్వామిని దర్శించుకునేవారికి ఆధ్యాత్మికానందం తో పాటు పర్యాటక ఆహ్లాదం కూడా కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి... మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి పురాతన అనంత పద్మనాభస్వామి ఆలయాల విశేషాలు.