Vijaya Lakshmi
Published on Sep 01 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?దశావతారాలలో శ్రీమన్నారాయణుడు ధరించిన మొదటి మానవ అవతారం వామనావతారం.
ఇప్పటికీ కూడా బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి తన రాజ్యమయిన కేరళ ప్రాంతానికి వస్తాడు. ఎందుకు?
వామన జయంతి రోజు ఏం చెయ్యాలి...?
‘స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...’ అంటూ బలిని ఆశీర్వదించాడుబాలవటువు వామనుడు. ఇంకేముంది పొంగిపోయాడు బలి చక్రవర్తి. నీకేం కావాలో అడుగు అన్నాడు. నాకేం కావలి మూడడుగులు చాలు అన్నాడు వటువు. సరే అన్నాడు బలి. రెండడుగులతో భూనభోంతరాళములను ఆక్రమించి మూడో అడుగుతో పాతాళానికి తోక్కేసాడు.
కమండలంలో పురుగులా చేరి నీరు బయటకు రాకుండా అడ్డుపడ్డాడు శుక్రాచార్యుడు. దర్భతో పొడిచాడు వటువు వామనుడు. శుక్రాచార్యుని కన్నుపోయింది. నీరు కమండలంలోనుంచి ఉబికివచ్చింది.
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ దశావతారాలలో శ్రీమన్నారాయణుడు ధరించిన మొదటి మానవ అవతారం వామనావతారం. దశావతారాలలో 5 వ అవతారం. అప్పటివరకూ అంటే దశావతారాలలో తొలి నాలుగు అవతారాలు మత్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలెత్తాడు.. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఐదోదైన వామన అవతారానికి ఉన్న ప్రత్యేకతే వేరు అంటారు ప్రవచనకారులు. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే వామనావతారంలో మూడే మూడు అడుగులతో లోకాన్నంతటిని జయించాడు. శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? ఆ అవతార ప్రయోజనమేమిటి?
శ్రీమహావిష్ణువు భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపుల కుమారుడిగా వామనుడిగా అవతరించాడు. ఈ వామనజయంతినే విజయ ద్వాదశి, శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహాద్వాదశి అన్న పేర్లతోనూ వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ప్రతి అవతారం ఏదో ఒక లక్ష్యంతోనే జరిగిందని పురాణ కథనాలు చెప్తున్నాయి.
వామనావతారం బలిచక్రవర్తి తో ముడిపడిన అవతారం. శ్రీమహావిష్ణువు కి అపర భక్తుడైన ప్రహ్లాదుని మనుమడు విరోచనుడు అనే దైత్యుడి కొడుకే ఈ బలి చక్రవర్తి. రాక్షసుడయినా కూడా తాతగారి నుంచి వారసత్వంగా అబ్బిన ధర్మదీక్ష, దానశీలత, దయాగుణాలతో ప్రజారంజకముగా పరిపాలన సాగిస్తున్నాడు. తన రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇప్పటి కేరళ ప్రాంతమే బలి చక్రవర్తి పరిపాలించిన రాజ్యమని చెప్తారు. అంతా సవ్యంగా సాగిపోతే ఇక చెప్పుకునేదేముంది. ఇక్కడ కూడా అదే జరిగింది.
రాక్షస సహజమయిన గుణం బలి చక్రవర్తిలో బయటపడింది. ఇంద్రుణ్ని జయించి బలి స్వర్గాధిపతి అయ్యాడు. ఆ గర్వంతో దేవతల్ని, మునుల్ని బాధించసాగాడు. దేవతలు శ్రీమన్నారాయణుడితో మొరపెట్టుకున్నారు. తనకి శత్రువులైన దేవతలని ఓడించడంతో పాటు, ఈ ముల్లోకాలనూ జయించాలన్ని కోరిక కలిగింది బలి చక్రవర్తికి. బలి చక్రవర్తి ఆలోచనకు మద్దతునిచ్చాడు రాక్షసుల కులగురువు శుక్రాచార్యుడు. దేవతలను ఓడించడం కోసం తగిన సామర్ధ్యాన్ని పొందడం కోసం బలితో విశ్వజిత్ యాగం చేయించాడు శుక్రాచార్యుడు. ఆ హోమాగ్ని నుంచి స్వర్ణ రథం, ఇంద్రుడి అశ్వాలను పోలిన గుర్రాలు, సింహం గుర్తు కలిగి ధ్వజం, దివ్య ధనస్సు, అక్షయ తునీరం, దివ్య కవచం లభించాయి.
యాగఫలంతో బలం పుంజుకున్న దానవులు, బలి నాయకత్వంలో స్వర్గంపైకి దండెత్తారు. దేవతలను ఓడించి, బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించాడు. విశ్వజిత్ యాగంతో శక్తివంతులైన రాక్షసులను జయించడం చాలా కష్టమని, ఇది దేవతలకు గడ్డుకాలం కాబట్టి మంచిరోజులు వచ్చేవరకు ఎదురుచూడడం తప్ప మరో మార్గం లేదు. అందుకే తగిన సమయం వచ్చేవరకు ఎక్కడైనా తలదాచుకొమని దేవతలకు సలహా ఇచ్చాడు దేవ గురవు బృహస్పతి. దాంతో దేవతలంతా స్వర్గం విడిచి వెళ్ళిపోయారు.
ఇంద్రుని పరిస్థితిని చూసిన దేవమాత అదితి ఏంతో బాధపడింది. తన కుమారునికి కలిగిన దుర్ధశకు చింతించింది. తన పుత్రుల దీనావస్థను పోగొట్టమని శ్రీమన్నారాయణుని వేడుకొంది. భర్త అయిన కశ్యప ముని సలహాతో పయోభక్షణ వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతం చివరిరోజున శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై "దేవీ చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూరుస్తానని అభయమిచ్చాడు.
అదితి గర్భాన వామనుడిగా
అన్నట్టుగానే అదితి గర్భంలో శ్రీమన్నారాయణుడు వామన రూపంలో భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నమున జన్మించాడు. భగవంతుణ్ణి పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడిగా బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించారు. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. బలిని అణచివేసే రోజు కోసం ఎదురుచూడసాగాడు వామనుడు.
బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేస్తున్నాడని, తెలుసుకొని వామనుడు అక్కడికి వెళ్ళాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి వచ్చిన ఆ బాల వటువును చూసి ముచ్చటపడిన బలి చక్రవర్తి వామనున్ని సాదరంగా ఆహ్వానించాడు. వస్తూనే ‘స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...’ అంటూ బలిని ఆశీర్వదించాడు వామనుడు. ఆ బాల వటువు తేజస్సుకు, అతడి వాక్చాతుర్యానికి ముగ్ధుడైన బలి చక్రవర్తి “మణి మానిక్యాలా, వజ్రవైడూర్యములా, ఏం కావాలో” కోరుకొమ్మన్నాడు.
“బ్రాహ్మణ వటువునయిన నాకేం కావాలి? మడిమాణిక్యాలు, భోగాలు నేనేం చేసుకుంటాను... యజ్ఞం చేసుకోడానికి ఓ మూడడుగుల నేల ఇస్తే చాలు” అన్నాడు వామనుడు. “ఓస్ ఇంతేనా తప్పకుండా ఇస్తాను” అన్నాడు బలిచక్రవర్తి.
అయితే ఇదంతా చూస్తున్న రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చిన వాడు సామాన్యుడు కాదని దేవతల మేలుకోరి వచ్చిన శ్రీమహావిష్ణువే అని గ్రహించాడు. తన శిష్యుడైన బలిని పక్కకు పిలిచి విషయం చెప్పి, వచ్చినవాడు నిన్ను పతనం చేసి స్వర్గాన్ని దేవతలకు అప్పగించడానికి వచ్చిన శ్రీమన్నారాయణుడేనని, దానం ఇవ్వవద్దని చెప్తాడు.
అయితే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే తన దగ్గరకు వచ్చి తనను దానం కోరితే తను దానం ఇవ్వగలిగితే అంతకంటే కావలసింది ఇంకేముంది. ఏదేమైనా ఆడినమాట తప్పను అంటాడు బలి చక్రవర్తి. ఇచ్చిన మాట ప్రకారం దానమివ్వడానికి సిద్ధపడతాడు.
వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదగా వామనుని చేతిలోకి నీళ్ళు ధారగా పోస్తుంటాడు బలి చక్రవర్తి. శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానిమిస్తారు. దీన్నే ధారాదత్తం అంటాము. అలా జలం విడుస్తున్నపుడు, బలిచక్రవర్తి మీద ప్రేమతో, అయ్యో! తన శిష్యుడు మోసపోతున్నాడే అన్న బాధతో రాక్షసగురువు శుక్రాచార్యుడు, కమండలంలోని నీరు చేతిలో పడకుండా ఒక చిన్న పురుగు రూపంలో అడ్డుపడ్డాడు. ఇది గ్రహించిన వామనుడు ఆ రంధ్రాన్ని దర్భతో పొడిచాడు. దీంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది.
పాతాళానికి బలి చక్రవర్తి
ఆటంకం తొలగిపోయి దాన జలధార వామనుడి చేతిలో పడటంతో వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంత ఆక్రమించి ఒక పాదంతో భూమిని, రెండో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో పాదం ఎక్కడ వెయ్యాలని బలిని అడుగుతాడు. అప్పుడు బలి తన తలను చూపించి ‘నా నెత్తి మీద వెయ్యి’ అంటాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి పాతాళానికి తొక్కేస్తాడు. నేను ప్రభువును, నేను దాతను’ అని గర్విస్తే ఫలితమిదేనని భగవద్గీతా మనకు చెబుతుంది. ఎదుటివారిని చులకనగా చూసే అహంకారపూరితులకు తగిన గుణపాఠం నేర్పి, వారికి సక్రమ మార్గ నిర్దేశనం చేయడమే వామనావతార రహస్యం! బలి తలపై వామనుడిగా ఉన్న విష్ణుమూర్తి పాదం మోపి తొక్కడం, అహంకారాన్ని అధఃపాతాళానికి అణిచివేయడానికి చిహ్నం. వామనజయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువును పూజించి అహంకారన్ని జయించాలని..బాధల నుంచి విముక్తి కలగాలని ప్రార్థిస్తారు..
అయితే బలి దాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కూడా బలి చక్రవర్తి రాజ్యంగా చెప్పే కేరళలో అతని రాకకు గుర్తుగా ఓనం పండగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
అలా బలిని పాతాళానికి తోక్కేస్తున్న సమయంలో నీ దానగుణానికి ఎంతో సంతోషిస్తున్నాను. సావర్ణి మన్వంతరంలో నేనే నిన్ను ఇండ్రుణ్ణి చేసి తరువాత మోక్షమిస్తాను అప్పటి దాకా విశ్వకర్మ నిర్మితమైన సుతలానికి అధిపతిగా ఉండు, నా సుదర్శన చక్రం నీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది అని అనుగ్రహించాడు.
అలా వామనుడు రాక్షస రాజైన బలికి సుతలలోక రాజ్యాన్ని, ఇంద్రునికి ఇంద్ర పదవి అప్పగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాంటి మహిమాన్వితమైన వామనుడు ప్రభవించిన పుణ్యదినాన శ్రీ మహావిష్ణువును నిష్టతో ప్రార్థించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తారు. వామన జయంతి రోజున విష్ణుమూర్తిని ఆరాధించి, వైష్ణవ దేవాలయాలను సందర్శింఛి, ఆయన లీలావిలాస రూపాలలో ఒకటైన వామనుని గురించి తలచుకునేవారికి సకల సంపదలూ, అంతకు మించిన జ్ఞానసిద్ధి లభిస్తుందని చెబుతారు.