Vijaya Lakshmi
Published on Oct 02 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?మన దేశం ఎన్నో చారిత్రక, మార్మిక, రహస్య ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. ఎప్పటికప్పుడు ఆలయాలలో అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రహస్యాలను ఛేదిస్తూనే ఉన్నారు. ఐతే... ఇప్పటికీ కొన్ని ఆలయాలలో అంతుబట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిశోధనకందని మిస్టరీ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాన బద్రీనాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు మనం ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం. భక్తీ, శ్రద్ధలతో దైవ దర్శనం చేసుకుంటాం. తెలిసీ తెలియక చేసిన తప్పులు మన్నించమని లెంపలు వేసుకొని ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతాం. మహా అయితే ఆలయంలోని కళాత్మకత, రాతి చెక్కడాలు, ఆలయ నిర్మాణ పనితనం పరిశీలించి చూస్తాం అంతే.
అయితే కాస్త ఆలోచిస్తే కొన్ని టెంపుల్స్ వెనక అంతుచిక్కని రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఆలయాలు వైవిధ్యంగా ఉండి ఆశ్చర్యం కలిగిస్తే కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు. అసలు ఇలాంటి ఆలయాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది. ఇంకొన్ని గుళ్లైతే... వాటిలో జరిగే ఆచారాలు, సంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే... వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న... పురాతన ఆలయాల ప్రాశస్థ్యం అంతా ఇంతా కాదు. మరి అలాంటి కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా, కొడంగల్లూర్ వద్ద ఉన్నభద్రకాళి అమ్మవారి ఆలయం ఇది. ఈ దేవతను శ్రీ కురుంబ, కొడంగల్లూర్ అమ్మ, మలయాళ భగవతి అన్న పేర్లతో ఆరాధిస్తారు. ఎనిమిది చేతులను కలిగి ఉన్న అమ్మవారు భయంకరమైన ఉగ్ర రూపంలో ఉంటుంది.
కేరళలోని అత్యంత ధనిక దేవాలయాలలో భగవతీ దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారిని పరశురాముడు ప్రతిష్టించాడని చెప్తారు. విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు.
పరశురాముడు కేరళను సృష్టించిన తర్వాత, దారుకుడు అనే రాక్షసుడు అతన్ని వేధించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాక్షసుడిని చంపడానికి, పరశురాముడు సహాయం కోసం శివుడిని ప్రార్థించాడు. ఆ రాక్షసుడిపై విజయం సాధించడానికి శక్తిని పూజించమని శివుడు అతనికి సలహా ఇచ్చాడు. శివుని సూచన మేరకు పరశురాముడు భద్రకాళి అమ్మవారికి ఒక మందిరాన్ని నిర్మించాడు. ఆలయంలోని దేవత పరాశక్తి అని నమ్ముతారు. పరశురాముని ప్రార్ధన మేరకు చివరికి దారుకుడిని చంపింది భద్రకాళి.
సాధారణంగా మనం దేవుణ్ని కీర్తిస్తాం. మంచి మంచి పదాలతో, అందమైన పదాలతో ప్రార్దిస్తాం. కాని ఈ టెంపుల్‌కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయం ప్రత్యేకతే ఇది. ఏటా మార్చి ఏప్రిల్ నెలల్లో ఇక్కడ 7 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో లో భక్తులు... కత్తులతో వస్తారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్లోకి వెళ్తారు. భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. భక్తీ గీతాలు కూడా తిట్ల రూపంలోనే ఉంటాయి. తిట్లతోనే భక్తిగీతాలు పాడతారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ... గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా-కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత... వారం పాటూ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో ఉత్సవంలో అయిన రక్తపు మరకల్ని, ఆలయమంతా శుభ్రం చేస్తారు.
హిందూ పురాణాల ప్రకారం... త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు... ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం అని చెప్తారు. ఇది తప్ప బ్రహ్మకు ఇంక్కెక్కడా చెప్పుకోదగ్గ ఆలయాలుండవు. ఆ ఏకైక బ్రహ్మ ఆలయం రాజస్థాన్... పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం. సాధారణ శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు. మహమ్మదీయులు ముఖ్యంగా ఔరంగజేబు... మన దేశాన్ని పాలించిన సమయంలో... చాలా హిందూ ఆలయాలు ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అందులో భాగంగా పుష్కర్‌లో కూడా ఆలయాలు పూర్తిగా నాశనం చేసారు.
ఐతే... ఈ బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చెయ్యకపోవడం విశేషమైన విషయంగా చెబుతారు. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు... భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన... వెండి నాణేలు అమర్చారు. ఈ టెంపుల్, దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
కోల్‌కతాలోని తాంగ్రా అనే ప్రాంతంలో... చైనాటౌన్ ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన చైనీయులు తోలు వ్యాపారాలు చేస్తుంటారు. ఇక్కడున్న కాళీమాత ఆలయానికి చైనీస్ కాళీమాత ఆలయం అని రావడానికి కారణం వారు ఆ దేవిని పూజించడమే.
సుమారు అరవై ఏళ్ల క్రితం ఇక్కడ రాళ్ళను బెంగాలీలు కాళీమాతగా పూజించేవారట. ఒకసారి అక్కడున్న చైనీస్ వారి చిన్నపిల్లాడికి బాగా జబ్బు చేసిందట. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా ఎవ్వరూ కూడా ఆ పిల్లాడి జబ్బు నయం చెయ్యలేకపోతారట. ఇక ఆశలు వదిలేసుకున్న దశలో ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఇక్కడికొచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు. అమ్మవారి కరుణతో అసలు వదులుకున్న పిల్లవాడు బాగుపడి లేచాడట అప్పటినుంచి అమ్మవారి మీద నమ్మకంతో వారంతా కాళీమాతకు గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారని అందుకే ఈ ఆలయాన్ని చైనీస్ కాళీ టెంపుల్ అని పిలుస్తారని చెబుతారు.
సాధారణంగా అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో, పండో, తీపి పదార్ధమో పెడతాం కదా. కానీ ఇక్కడ చైనీయులు... నూడుల్స్, చాప్‌సుయ్ లాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాలన్నీ పాటిస్తారు.
మంచుకురిసే మనాలీలో ఉన్న ప్రత్యేక ఆలయం హిడింబా టెంపుల్. ఇది ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్ అయిన మనాలిలో ఉంది. స్థానికులు ఈ ఆలయాన్ని దుంగారి ఆలయంగా పిలుస్తారు. అమ్మవారిని దుంగారి దేవతగా పిలుస్తారు. 4 అంతస్థుల ఈ ఆలయం... పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడా... ఆ మాటకొస్తే... మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి... ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబా దేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబ చెల్లెలు ఈమె. కుల్లు రాజులు... హడింబా దేవిని ఇష్టదైవంగా, తమ కులదేవతగా పూజించేవాళ్లు. నిజానికి ... అమ్మవారి కంటే... విభిన్నమైన ఆలయ నిర్మాణశైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇదొక గుహాలయంగా చెప్పొచ్చు. ఈ పురాతన గుహ ఆలయం 1553 నాటిది. అప్పటి ఈ ప్రాంత రాజు రాజా బహదూర్ సింగ్ నిర్మించాడు. పురాణాల ప్రకారం, ఈ ఆలయ దేవత హిడింబి, పాండవులలో ఒకరైన భీముడి భార్య. పాండవులు తమ వనవాస సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో నివసించారని, వారిలో బలవంతుడైన భీముడు హిడింబ అనే రాక్షసుడిని చంపిన తర్వాత అతని సోదరిని వివాహం చేసుకున్నాడని పురాణ కథనం. భీముడు హిడింబ లకు ఘటోత్కచుడు జన్మించిన తరువాత, పాండవులు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోయిన అనంతరం, హిడింబాదేవి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే తపస్సు చేసిందని స్థానికులు చెబుతారు.
అద్భుత కళా నైపుణ్యం... తమిళనాడులో తంజావూర్‌లో ఉన్న ఈ బృహదీశ్వరాలయం సొంతం. ఈ టెంపుల్‌లో ఎక్కువ భాగం... శుద్ధమైన గ్రానైట్‌తో నిర్మించారు. నిజానికి ఈ విషయమే సైంటిస్టులకు సవాలుగా నిలిచింది. ఎందుకంటే... ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకూ... గ్రానైట్ నిక్షేపాలు గాని అవి ఉన్న ఆనవాళ్లూ గాని లేవు. మరి ఎప్పుడో వెయ్యేళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు గ్రానైట్ ఎక్కడి నుంచీ తీసుకొచ్చారు? ఎలా తెచ్చారు? అన్నది పరిశోధకులకు అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.
ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లూ లేకుండా.... ఆ భారీ శిలను, అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది మరో అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది.
ఇలా తరచి చూడాలే గాని మనదేశంలో వింతలకు, అంతుచిక్కని రహస్యాలకు నిలయమైన ఆలయాలు ఎన్నో.