Vijaya Lakshmi
Published on Jul 25 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఈ పేరే ఒక ఆకర్షణ! అసలు “కృష్ణ” అన్న పేరుకి ఆకర్షణ అన్న అర్థాన్ని చెప్తారు. అందుకేనేమో క్రిష్ణయ్య రూపమే కాదు ఆ కథలు… కథలు చెప్పే లీలలు కూడా అంత ఆకర్షణీయంగా ఉంటాయి. లీలలే కాదు కృష్ణయ్య ఆలయాలు కూడా అంతే ఆకర్షణీయంగా, రమణీయంగా ఉంటాయి. అలాంటి సుందరమైన 5 శ్రీకృష్ణ ఆలయాల గురించి ఇప్పుడు చూద్దాం...
5 ప్రముఖ శ్రీ కృష్ణ దేవాలయాల్లో ముందుగా చెప్పుకోవలసినది ద్వారకలో ఉన్న ద్వారకాధీశుని ఆలయం గురించి. గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్రపు ఒడ్డున ఉంది ద్వారకా నగరం. ద్వారక లోని ఈ ద్వారకాధీశుని దేవాలయం జగత్ మందిర్ లేదా విశ్వ పుణ్యక్షేత్రం అని పిలుస్తారు. ఈ దేవాలయం 2,500 సంవత్సరాలకు పూర్వం శ్రీ కృష్ణుని ముని మనవడుగా చెప్పబడే వజ్రనాభుని చేత నిర్మించబడిందట.
ఈ దేవాలయం చుట్టు ఉన్న భవనాలు మాత్రం 16 వ శతాబ్దంలో నిర్మించబడినట్టు చెప్తారు. 43 మీటర్ల ఎత్తున్న దేవాలయ శిఖరం, దాని పైన సూర్య చంద్రుల చిత్రాలతో ఉన్న జండా 10 కిలో మీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయట. ఈ అలయంలో లోపలి వెళ్ళడానికి బయటకు రావడానికి ఉన్న రెండు ద్వారాలను “స్వర్గ ద్వార” మరియు “మోక్ష ద్వార” అని పిలుస్తారు. ఈ దేవాలయం భక్తులకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9.30 వరకు, భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.
శ్రీకృష్ణుడి రాజ్యమయిన అసలు ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోగా మిగిలిన భూభాగంలో నిర్మించిన ఆలయమిది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం.
ద్వారకలోని శ్రీకృష్ణ ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ద్వారకాపురి సమీపంలోనే జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఒకటి ఇక్కడే ఉంది. మిగిలినవి శృంగేరి,పూరి, జ్యోతిర్మఠం. ఈ ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు క్షత్రియ రాకుమార అలంకరణలో దర్శనం ఇస్తాడు.
శ్రీ కృష్ణ క్షేత్రాలలో మరో ప్రముఖమైన క్షేత్రం మధుర. ఇది శ్రీ కృష్ణుడు జన్మించిన ప్రదేశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పట్టణం మధుర. రాధామాధవులకు నెలవుగా వారి లీలా విలాసాలకు మధుర ప్రసిద్ధి చెందింది. ఇక్కడే శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల ఉంది. దానిని ‘వ్రజ్’ భూమి అని పిలుస్తారు.
మధురకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ‘గోకులం’ ఉంది. యశోదదేవి పొత్తిళ్లలో ఉండగానే పూతనను సంహరించిన ప్రదేశమూ ఇదేనట. గోకులంలో రాధాకృష్ణ, బలరామ మందిరాలున్నాయి. శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు సల్పిన ప్రాంతం బృందావనం కూడా ఇక్కడే ఉంది. ఇక శ్రీకృష్ణుడి రాసలీలలకు కేంద్రమైన బృందావనంలో తప్పక చూడవలసిన ప్రదేశం నిధివనం. గోపికలు శ్రీకృష్ణుడితో అచ్చికలాడిన ప్రాంతంగా నిధివనం పేరుగాంచింది.
విచిత్రమైన విషయం నమ్మలేని విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఇక్కడికి వస్తాడని రాత్రివేళ్లల్లో ఇక్కడ గోపికలు శ్రీకృష్ణుడితో నాట్యమాడుతారని చెబుతుంటారు. అందుకే రాత్రివేళల్లో ఈ ప్రాంతానికి ఎవరినీ అనుమతించరు. రాత్రంతా శ్రీకృష్ణునితో ఆదిపాడిన గోపికలు పగటిపూట ఇక్కడ చెట్ల రూపంలో ఉంటారని చెబుతారు. ప్రతిరోజూ రాత్రి గోపికలతో ఆదిపాడిన శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్న రంగ్ మహల్‌లో సేదతీరుడని భక్తులు నమ్ముతారు.
మధురలో ముఖ్యమైన మందిరం బాంకి బీహారిక మందిరం. శ్రీకృష్ణుడు రాసక్రీడలకు వేదిక అయిన ప్రాంతాన్ని నిజ బిహారి వనం అని చెప్తారు. ఈ మధురకు దగ్గరలోనే గోవర్ధనగిరి ఉంది. శ్రీకృష్ణుడు గోకులవాసులందర్నీ ఈ గోవర్ధనగిరి కిందకే తీసుకువచ్చి రక్షించాడట.
నాడు దేవకీవసుదేవులు నిర్బంధింపబడింది, కారాగారం గది నేడు సుందరమైన ఆలయంగా వెలుగొందుతున్నది. కృష్ణుడి బాల్యానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. భాగవతంలో చెప్పిన శ్రీ కృష్ణుడి జన్మస్థలం, చిన్ని కృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధన గిరి, కాళీయుడి పడగలపై నాట్యమాడిన.. కాళీయ ఘాట్, రాధాకృష్ణుల సమావేశ ప్రదేశం రాధా కుండ్, శ్యామ్ కుండ్, శ్రీకృష్ణుడు తన మేన మామ కంసుడిని వధించిన తర్వాత, విశ్రాంతి తీసుకున్నట్టు చెప్పే విశ్రాం ఘాట్, ఇలా శ్రీ కృష్ణని ఆనవాళ్ళు ఎన్నో కనబడతాయి.
శ్రీకృష్ణుని ఆలయాల్లో మరో ప్రముఖ ఆలయం గురువాయూర్. కేరళ రాష్ట్రంలో ప్రముఖ కృష్ణ దేవాలయం. ఆ ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. ఆయుర్వేద చికిత్సలకు నెలవు, అపురూపమైన ఆలయాలకు నిలయం. దేవభూమిగా పిలుచుకునే సుందర ప్రదేశంలో భూలోక వైకుంఠంలా అలరారే క్షేత్రం గురువాయూర్.
సాక్షాత్తు పరమేశ్వరుడే కుటుంబ సమేతంగా విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన ప్రదేశం . శాపగ్రస్తుడైన జనమేజయ మహారాజు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శాపవిమోచనం పొందిన ప్రదేశం. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలకు మరెన్నో పౌరాణిక కథనాలకు వేదిక గురువాయూర్. ఐదువేల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం గురువాయూర్ లో యుగాల చరిత్ర కలిగిన మూలవిరాట్టు. అసలు ఆ క్షేత్రం పేరు వినగానే శంఖచక్ర గదా పద్మాలతో అలరారే విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమంగళ స్వరూపం కనుల ముందు కదలాడుతుంది. కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన గురువాయూర్.
ఇది కూడా చదవండి : జమదగ్ని రుషి కోసం శివుడు సృష్టించిన రహస్య గ్రామంలో అలెగ్జాండర్ వారసులు
గురువాయూర్ ఆలయంలోని మూలవిరాట్టుకు యుగాల చరిత్ర ఉంది. ఈ విగ్రహాన్ని మొట్టవెుదట పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతికి చేరగా కశ్యప ప్రజాపతి దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడట., వసుదేవుడినుంచి ఆయన కొడుకైన శ్రీకృష్ణుడికి చేరింది ఆ విగ్రహం. దాన్ని శ్రీకృష్ణుడు ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి.
ఆ తరువాత శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించబోయే ముందు కృష్ణుడు తన స్నేహితుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారకానగరం సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి. అలా ఉద్ధవుని సందేశం ప్రకారం దేవగురువైన బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట.
అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు కుటుంబ సమేతంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన దేవగురువు బృహస్పతిని వాయు దేవుడ్ని చూసి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట పరమేశ్వరుడు. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. ఆ రుద్రతీర్థంలోని నీటితోనే నేటికి కూడా స్వామికి అభిషేకం చేస్తారు. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ స్వామి గురువాయూరప్పన్ గా ప్రసిద్ధి చెందాడని, ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందిందని చెప్తారు. గురువాయూర్ దక్షిణ ద్వారకగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోనే నాల్గవ అతి పెద్ద ధనిక దేవాలయం ఈ గురువాయూర్ దేవాలయం.
శ్రీకృష్ణ దేవాలయాల ప్రసక్తి రాగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది పూరి క్షేత్రం. ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ పూరీ క్షేత్రం. ఈ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నిలయం. మరెన్నో అద్భుతాలకు నెలవు. భారతదేశంలోని అద్భుత కట్టడాలలో ప్రముఖమైనది. ప్రళయకాలంలో కూడా చిరస్థాయిగా నిలిచి ఉండే క్షేత్రమ్ పూరి. పంచాద్వారకలలో ఒకటి. మర్త్యవైకుంఠం అని, మానవలోక వైకుంఠం అని పిలుచుకునే ఈ క్షేత్రం ప్రస్తావన స్కంద పురానంతో పాటు మత్స్యపురాణం, విష్ణుపురాణం, పద్మపురాణం, అగ్నిపురాణం, వామన పురాణాలలోను, అనేక తంత్ర గ్రంధాలలో కూడా ఈ క్షేత్ర వర్ణన ఉన్నట్టు పెద్దలు చెప్తారు. మొహమంతా కళ్ళేనా అన్నట్టు ఇంతలేసి గుండ్రని కళ్ళతో తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులతో జగన్నాధుడు వెలసిన పుణ్యక్షేత్రం .. పురుషోత్తమక్షేత్రం పూరి.
పూరీ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు మరెన్నో వింతలూ, విశేషాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. ఆలయం మీద ఎగిరే జెండా నుంచి ఆలయమో స్వామి సంపదను దాచి ఉంచే రత్నభాన్దార్ వరకు, స్వామికి పెట్టె నైవేద్యం నుండి ఆ జగన్నాధుడికి జరిగే ఉత్సవాల వరకు అన్నింటా మిస్టరీయే.ముఖ్యంగా ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచప్రసిద్ది చెందింది.
శ్రీకృష్ణ క్షేత్రాలలో మరో ప్రముఖ క్షేత్రం ఉడుపి. దక్షిణ కర్ణాటక ప్రాంతంలో బెంగుళూరుకు సుమారు 500 కి.మీ దూరంలో మంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉడిపి క్షేత్రం. ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయాలలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండే ఈ ఆలయశోభ వర్ణనాతీతం. 12వ శతాబ్దంలో శ్రీమధ్వాచార్యులవారు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. ఆ ఎనిమిది మఠాలలో శ్రీకృష్ణమఠంగా పేరుపొందిన మఠమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్రీ కృష్ణ ఆలయం.
విచిత్రమైన దర్శనం
ఒకప్పటి శ్రీకృష్ణమఠంగా, ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలుచుకుంటున్న ఈ ఆలయమంతా కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ఇక ఉడిపి ఆలయంలో శ్రీకృష్ణ దర్శనం విచిత్రంగా ఉంటుంది. దేశంలో ఎక్కడా, ఏ ఆలయంలోను లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని ఒక కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్రకిటికీ అంటారు. ఈ దేవాలయ సింహద్వారం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చెరియొక చేత ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది.
ఈ మందిరంలో అత్యంత సుందరంగా దర్శనమిచ్చే శ్రీకృష్ణభగవానుడి విగ్రహాన్ని సుమారు 800 ఏళ్ల క్రితం ద్వైతమత స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దంలో శ్రీమధ్వాచార్యులవారు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. ఆ ఎనిమిది మఠాలలో శ్రీకృష్ణమఠంగా పేరుపొందిన మఠమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్రీ కృష్ణ ఆలయం. ఉడిపి క్షేత్రం క్రిష్ణభాక్తులకు అత్యంత ప్రియమైన క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
ఇవి శ్రీ కృష్ణ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినా 5 క్షేత్రాల విశేషాలు.