Vijaya Lakshmi
Published on Jul 16 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?విదేశీ దండయాత్రలు, వలసవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధులలో రాణి అబ్బక్క ఒకరు. పోర్చుగీసువారిని వణికించిన గొప్ప వీరనారి…
**ఈ రాణి గురించి ఎంత మందికి తెలుసు?**
“రాణి అబ్బక్క" 1947 అంటే మన దేశం స్వాతంత్రం పొందడానికి 300 ఏళ్లకు ముందే అత్యాధునిక సైన్యంతో మన దేశాన్ని కబళించడానికి సిద్ధపడిన పోర్చుగీస్ వారిని గడగడలాడించి ముచ్చెమటలు పట్టించిన వీరనారి రాణి అబ్బక్క చౌతా.
మంగుళూర్ కి సమీపంలోని ఉల్లాల్ అనే చిన్న రాజ్యానికి రాణి. రాజ్యం చిన్నదే కాని పెద్ద పెద్ద రాజ్యాలు చెయ్యలేని ధైర్య, సాహసాలు ప్రదర్శించి, మన సంపదను కొల్లగొట్టాలని, మన దేశాన్ని కబళించాలని ప్రయత్నించిన విదేశీయులను ముప్పుతిప్పలు పెట్టిన వీరనారి అబ్బక్కరాణి.
విచారకరమైన విషయమేమిటంటే ఇంతటి ధీరవనిత, సాహసరాణి అబ్బక్క గురించి ఎక్కడో అడపా దడపా తప్ప పాఠ్యపుస్తకాలలో గాని, చరిత్ర పుస్తకాలలో గాని అంతగా కనబడదు.
మన చరిత్ర పుటలను తిరగేస్తే, పరాయి పాలనను అంగీకరించక, స్వరాజ్యరక్షణకు విజృంభించిన వీరనారీమణులు ఎందరో కనబడతారు అందులో అభయరాణి అబ్బక్క మహారాణి మొదటి వరుసలో నిలబడే ధీరవనిత.
ఆమె యోధురాలు. ఆమె ఒక శక్తి. ఆమె సహజ నామం ‘అబ్బక్క మహాదేవి’ అయినప్పటికీ, భయం అన్నది తెలియని ఆ ధీరురాలిని ఆ ప్రాంత ప్రజలు ‘అభయరాణి’ అని గౌరవంగా పిలుచుకునేవారట.
మన దేశానికి మొట్టమొదట వ్యాపారం కోసం వచ్చి ఇక్కడి సంపద, ఇక్కడి వనరులు చూసి, వాటిని స్వంతం చేసుకోవాలనే స్వార్థంతో, భారత సామ్రాజ్యంపై పెత్తనం చేయాలని చూసిన ఆక్రమణదారులైన, పోర్చుగీసు వారిని మట్టి కరిపించిన అబ్బక్కరాణి విదేశీ పెత్తనాన్ని ఎదిరించిన మొట్టమొదటి భారత స్వాతంత్ర పోరాట యోధురాలుగా చెప్తారు.
మంగుళూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్లాల్ దుర్గం ఆమె వీరగాధలకు నిలువెత్తు నిదర్శనం. ఎప్పుడో 16వ శతాబ్దంలో ఆమె రాజ్యం చేసినా, అరేబియా సముద్ర జలాల సాక్షిగా ఈనాటికి ఆమె వీర గాధలను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది తుడునాడు.
యక్షగానాల రూపంలో నేటికీ ఆమె ధీర గాధలను తలచుకుంటూనే ఉంటారు కన్నడిగులు. నిజానికి ఒక్క కన్నడ ప్రాంతంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన చరిత్ర. ఆమె సాహసం, వీరత్వం, ప్రతిభాపాటవాల గురించి, ఆనాడే విదేశీయులు కథలు కథలుగా చెప్పుకునే వారని గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
ఆనాటి యాత్రికుడు పిట్రోడెల్లా 1621 - 24 మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించాడు. ఈ పర్యటనకు ముందే అప్పటి పర్షియా చక్రవర్తిని సందర్శించినప్పుడు, తన భారతయాత్ర గురించి, చక్రవర్తికి చెప్పాడట పిట్రో. అప్పుడు పర్షియా చక్రవర్తి పిట్రోకు ఒక సలహా ఇస్తూ, ఉల్లాల్ రాణి సాహసాల గురించి మేము చాలా కథలు విన్నాం… ఆమెను దర్శించాలన్నా మాకు కుదరని పని. కాబట్టి నువ్వు భారతదేశం వెళితే తప్పకుండా ఉల్లాల్ రాజ్యానికి వెళ్లి ఆ రాజ్యరాణి అబ్బక్కదేవిని కలుసుకోమని చెప్పాడట. ఇలా ఆనాడే ఆమె వీరోచిత చరిత్ర గురించి విదేశీయులు కూడా గొప్పగా చెప్పుకునే వారట.
మూడబిద్రిలో చౌతా కుటుంబంలో జన్మించింది అబ్బక్కదేవి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అదే విధంగా పసిప్రాయంలోనే అబ్బక్క దేవి, ఎంతో ప్రతిభ, పాటవాలు ప్రదర్శించింది. ఇది గమనించిన తండ్రి ఆమెను అన్ని విధాల ప్రోత్సహించాడు. మేనమామ తిరుమలరాయలు ఆమెకు యుద్ధ విద్యలతో పాటు ఒక మహారాజ్ఞికి కావలసిన రాజనీతిజ్ఞత, పరిపాలన దక్షత వంటివన్నీ నేర్పించాడు.
ఈ తిరుమల రాయలు విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలకు సమీప బంధువు. తిరుమల రాయల నేతృత్వంలో, అబ్బక్క విలువిద్య, కత్తిసాము, కర్ర సాము వంటి యుద్ద విద్యలలో ఆరితేరింది ఆర్థిక అంశాలలో అవగాహన, పాలనాదక్షత, సైనిక దళ నిర్మాణం వంటి విషయాలలో చక్కటి అవగాహన సంపాదించుకుని, ఒక మహారాణికి కావలసిన అన్ని అంశాలను ఆకళింపు చేసుకుంది. తిరుమలరాయల శిష్యరికంలో దేశభక్తి నరనరాన జీర్ణించుకుంది. మూడబిద్రి రాజధానిగా ఉల్లాల్ రాజ్యానికి రాణి అయి పాలన మొదలుపెట్టింది.
తుళునాడు మహారాణిగా ఇటు ప్రజలకు కన్నతల్లిగా వారికి ఎటువంటి కష్టం కలగకుండా ప్రజారంజకంగా పాలిస్తూ, అటు మన దేశ సంపదను దోచుకోవాలనే కుతంత్రంతో, మన దేశాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న విదేశీయులకు సింహస్వప్నంగా పాలన చేసింది.
స్వతహాగా జైన సంప్రదాయాన్ని పాటిస్తున్నప్పటికీ, తన రాజ్యంలో తీర ప్రాంతంలో రంగులు మార్చే రుద్రశిలతో ఒక అద్భుతమైన శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని కట్టించింది. ఇది ఆమె మత సహనానికి మచ్చుతునక. ఉల్లాల్ రాణిగా పాలన మొదలు పెట్టిన కొన్నాళ్లకే మంగుళూరు రాజైన లక్ష్మణప్పతో ఆమెకు వివాహం చేశారు. లక్ష్మణప్ప పోర్చుగీసు వారి కుతంత్రాలకు లొంగిపోయి, వారికి అనుకూలంగా ఉండేవాడు. మాకు అనుకూలంగా ఉంటే భారత సామ్రాజ్యానికి నిన్ను చక్రవర్తిని చేస్తామన్న వారి ప్రలోభాలకు లోబడి పోయాడు. ఇది అబ్బక్కకు నచ్చలేదు.
విదేశీయుల కుట్రకు వారిచ్చే బహుమానాలకు లొంగిపోవద్దని, దేశభక్తిని విడనాడ వద్దని ఎంతగానో చెప్పి చూసింది. అయినా లక్ష్మణప్ప వినలేదు. దాంతో దేశభక్తి ముందు వైవాహిక సంబంధం నిలవలేకపోయింది. భర్తతో సంబంధాన్ని తెంచుకుంది. కవల పిల్లలైన తన ఇద్దరు కూతుళ్ళను తీసుకుని ఉల్లాల్ చేరుకుంది.
16వ శతాబ్ది ప్రారంభంలోనే భారత దేశ సంపదపై కన్ను పడిన పోర్చుగీసువారు ఇక్కడికి వచ్చి, ఈ దేశం మీద తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. 1503 వ సంవత్సరంలో ఆల్ఫోన్స్ డే
ఆల్బుకర్క్ భారతదేశం వచ్చి, గోవాను స్థావరంగా చేసుకుని తమ కార్యకలాపాలు ప్రారంభించారు. వీరి కార్యకలాపాలను గమనించిన అబ్బక్కరాణి, తమ దేశ సంపదను కొల్లగొడుతూ, మరోవైపు తమ దేశాన్ని ఆధిపత్యం కిందకు తీసుకుంటున్న వారిని ఎదిరించి, ఇరుగుపొరుగు రాజులను, నవాబులను కలుపుకుని ఒక పటిష్టమైన కూటమిని తయారు చేసింది. 1510 నాటికే పోర్చుగీసుల చేత ‘గోవా’ అని పిలువబడిన గోమాంతక్ ను వశం చేసుకున్న వారు, కొంకణ ప్రాంతాల మీద పట్టును సాధించారు.
ఇక వారి తర్వాతి లక్ష్యం కేరళ రాజ్యాన్ని వశపరచుకోవడం. కేరళ మీదకు వెళుతూ, మధ్యలో మంగుళూరును వశం చేసుకున్నారు. ఇక మధ్యలో ఉన్న అబ్బక్క దేవి రాజ్యం తుళునాడును వశపరచుకునేందుకు ప్రయత్నించారు. అయితే విదేశీ పెత్తనాన్ని ఎంత మాత్రం సహించని అబ్బక్క దెబ్బకు అల్లల్లాడిపోయారు.
తన వీరత్వంతో బుడత కీచులను పరుగులు పెట్టించింది అబ్బక్క రాణి. అయితే ఎలాగైనా సంపదకు, మసాలా దినుసులకు నెలవయిన ఉల్లాల్ ను చేజిక్కుంచుకోవాలన్న లక్ష్యంతో, మరోసారి 1555 లో అడ్మిరల్ డాంవారో సిల్వేనియా నేతృత్వంలో, అబ్బక్క దేవి రాజ్యంపై దండెత్తారు పోర్చుగీసులు. అయినా మళ్లీ పరాజయాన్నే
చవి చూడాల్సి వచ్చింది వారికి. అబ్బాక్కరాణి అపరకాళిలా మారి, వారిని మట్టికరిపించింది.
అయితే మళ్లీ మూడోసారి 1568లో పోర్చుగీసులు జరిపిన దాడిలో ఉల్లాల్ వారివశమైపోయింది. అబ్బక్క ఒక మసీదులో తలదాచుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఎంత మాత్రం ధైర్యాన్ని వీడలేదామె. రెండు వందల మంది సైనికులతో పోర్చుగీసు వారి మీదకు దండెత్తి వారిని ఊచకోత కోసింది.
ఇలా పలుమార్లు తన వీరోచిత పోరాటంతో విదేశీ దాడులను తిప్పి కొట్టిన అబ్బక్క దేవిని, చివరికి 1570లో ఆమె భర్త లక్ష్మణప్ప సహకారంతోనే పోర్చ్ గీసులు పట్టుకోగలిగారు. వైవాహిక బంధం విఫలమైన కారణంగా భర్త లక్ష్మణప్ప ఆమె మీద పగ పెంచుకున్నాడు. ప్రతీకారేచ్ఛతో, అవకాశం కోసం కాచుక్కూర్చున్నాడు. అదనుకోసం ఎదురుచూస్తున్న అతను, పోర్చుగీసు వారితో పొత్తు కుదుర్చుకున్నాడు. అబ్బక్కకు వ్యతిరేకంగా పావులు కదిపాడు. వారికి సమాచారం అందించడం మొదలు పెట్టాడు. ఇలా అబ్బక్కదేవి భర్త సహకారంతోనే, మాయోపాయాలతో పట్టుకోగలిగిన ఆ ధీరవనితను ఖైదు చేశారు పోర్చుగీసులు.
చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆమె తన స్వతంత్ర భావాలను విడనాడలేదు. పోరాడుతూనే ప్రాణాలు వదిలింది.
కన్నడ సాహిత్యంలోనూ, కన్నడ జానపద సాహిత్యంలోనూ అబ్బక్కరాణికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక తరం నుంచి మరో తరానికి ఆమె ధైర్య సాహసాలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. కన్నడ జానపదకళల్లో ప్రసిద్ధి చెందిన యక్షగానంలో ఒక ప్రత్యేక అంశంగా మహాదేవి కథను చెబుతుంటారు ఉల్లాల్లో.
ఆ వీరనారి గౌరవార్థం, ప్రతి సంవత్సరం వీరరాణి అబ్బక్క ఉత్సవం గొప్పగా జరుపుకుంటారు. ఆ ఉత్సవం సందర్భంగా పేరెన్నికగన్న మహిళకు, వీరనారి అబ్బక్క అవార్డును కూడా ఇస్తారు. దేశాన్ని పరాయిపాలన పాలు కాకుండా ఉంచడం కోసం చూపిన తెగువా, సాహసం, దేశభక్తికి గుర్తింపుగా ఆమె గౌరవార్థం 2003 జనవరి 15వ తేదీన భారతీయ తంతి తపాల శాఖ ఒక ప్రత్యేకమైన స్టాంప్ ను విడుదల చేసింది.
ఉల్లాల్ లోను, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఆమె నిలువెత్తు కాంస్య విగ్రహాలు సమున్నతంగా దర్శనమిస్తాయి. ఇక తీర ప్రాంతంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన గస్తీనౌక ఇన్ షోర్ పెట్రోల్ వెసల్ రాణి అబ్బక్కను జనవరి 20వ తేదీన ప్రారంభించారు. ఇలా ఒక గస్తీ నౌకకు ఒక మహిళ పేరు పెట్టడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అలాంటి అరుదైన గౌరవం ఉల్లాల్ రాణి అబ్బక్క మహాదేవికి దక్కింది.