Vijaya Lakshmi
Published on Jul 26 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?"చైతన్య మహాప్రభు"
శ్రీకృష్ణుని ఇష్టసఖి రాధమ్మ అపరావతారం. రాధాకృష్ణుల సంయుక్తావతారం. కృష్ణ భక్తుల గురించి ప్రస్తావన వస్తే, మొదటి వరుసలో చెప్పుకోవలసినవారు. భక్తి ఉద్యమానికి జీవం పోసిన ఆధ్యాత్మిక గురువు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు.'గౌడియ వైష్ణవం', 'హరే కృష్ణ' భక్తి ఉద్యమ స్థాపకుడిగా ఆయన పేరు చిరస్మరణీయం. భక్తి యోగం' ద్వారా మోక్షసాధన సులభతరం అని చాటి చెప్పిన చైతన్య మహాప్రభు, 'సంకీర్తన', 'హరినామ జపం' ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని నిరూపించారు.
సా.శ. 15వ శతాబ్దంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలోని నవద్వీపం', అలాగే ఓడిశాలోని పూరీ క్షేత్రం' కేంద్రాలుగా ఆయన ప్రారంభించిన ఈ ఆధ్యాత్మిక విప్లవం, భక్తిఉద్యమం జాతి, మత, లింగ భేదాలను అధిగమించి, కోట్లాది మంది హృదయాలను స్పృశించింది.
శ్రీ చైతన్య మహాప్రభు క్రీ.శ. 1486లో పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీపంలో శచీదేవి, జగన్నాథ్ మిశ్రా. దంపతుల పుత్రుడుగా జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు చుట్టుపక్కల స్త్రీలు ఆయన బంగారు రంగును చూసి గౌర్ హరి గౌరాంగుడు అని పిలిచేవారట. ఇంట్లో ముద్దుగా నిమాయి అని పిలిచేవారు. చిన్ననాటి నుంచే నిమాయి అద్భుతమైన తెలివితేటలతో ఉండేవారు. సంస్కృత వ్యాకరణంలో, తర్క శాస్త్రంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించి, పిన్న వయస్సులోనే "నిమాయి పండిత్" గా పేరు గాంచారు చైతన్య మహాప్రభు. ఆ రోజుల్లో ఇప్పుడు నాడియా అని పిలువబడే నవద్వీపం ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండేది. నిమాయి అనేక మంది విద్యార్థులకు పాఠాలు బోధించేవారు.
పదిహేను సంవత్సరాల వయసులో చైతన్య మహాప్రభు, నాదియాలో న్యాయ తత్వశాస్త్రం, సంస్కృత విద్యలలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పండితుడు వల్లభాచార్య కుమార్తె లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ చిన్న వయస్సులోనే చైతన్య ప్రభు ప్రముఖ పండితులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. సాహిత్య చర్చలలో ఆయనను ఎదుర్కోవడానికి మిగిలిన పండితులందరూ భయపడేవారట. వివాహం తరువాత సంపాదన కోసం తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ కు వెళ్లారు. అక్కడ తన పాండిత్యంతో పేరు ప్రతిష్టలు కూడా సాధించారు.
ఈ సమయంలో చైతన్య మహాప్రభుగా ప్రసిద్ధి చెందిన గౌరాంగుడు వైష్ణవ మత బోధనలు కూడా ప్రారంభించారు. తూర్పు బెంగాల్‌లో ఉన్నప్పుడే, గోరాంగుని భార్య లక్ష్మీదేవి పాముకాటుతో మరణించింది. ఒంటరిగా తన ఇంటికి తిరిగి వచ్చిన గౌరాంగుడు తల్లి కోరిక మేరకు రాజపండితుడు సనాతన మిశ్ర కుమార్తె విష్ణుప్రియను ద్వితీయ వివాహం చేసుకున్నారు. కొద్దికాలంలోనే ఆయన నదియాలో అత్యుత్తమ పండితుడిగా ప్రఖ్యాతి చెందాడు. ఆ సమయంలోనే కాశ్మీర్‌కు చెందిన కేశవ్ మిశ్రా, ఆ ప్రాంత పండితులతో చర్చించడానికి నాడియాకు వచ్చారు. ఆ పండితుడితో వాదనకు భయపడి, నాడియాలోని పండితులు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా పరిస్తితి ఏర్పడింది. అంత మహా మహా పండితులనే భయపెట్టిన ఆ కాశ్మీరీ పండితుడు పిన్న వయస్కుడైన గౌరాన్గుని చేతిలో ఓటమి పాలయ్యాడు .
తండ్రి మరణం చైతన్యప్రభు జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. మరణించిన తన తండ్రికి కర్మకాండలు నిర్వహించడానికి పాతికేళ్చైళ వయసులో చైతన్యప్రభు గయ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఈశ్వరపురి అనే గురువు గౌరాంగుని కి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశంతో నిమాయి జీవితంలో పెద్ద మార్పే వచ్చింది. ఒక్కసారిగా ఆయన జీవన గమనమే మారిపోయింది. కృష్ణ నామాన్ని జపించగానే ఆయనలో తెలియని తన్మయంలో పడిపోయారు. ప్రేమ పారవశ్యంలో మునిగిపోయేవారు. గయ నుండి తిరిగి వచ్చిన తర్వాత, అప్పటివరకు తన పండిత్య చర్చలనే ప్రధానంగా భావించే చైతన్యప్రభు వాటన్నిటినీ పక్కన పెట్టి, పూర్తిగా కృష్ణ భక్తిలో లీనమయ్యారు.
ఈ మార్పు నవద్వీపంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. పండిత శిఖామణి అయిన నిమాయి తన పాండితీ ప్రదర్శనను పక్కన పెట్టి భక్తిలో మునిగి, కృష్ణ నామాన్ని జపిస్తూ, నృత్యం చేస్తూ, కీర్తనలు పాడుతూ తిరుగుతుంటే ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అతడి స్నేహితులు, ముఖ్యంగా నిత్యానంద ప్రభు, అద్వైత ఆచార్య ఆయనతో కలిసి కీర్తనలు పాడేవారు. ఈ కీర్తనలు, నృత్యాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేవి.
గంగా నది ప్రవహించే పుణ్యభూమిలో, వేద ఘోషలు మార్మోగే విద్యా కేంద్రంలో... పండితుల చర్చలతో వేడెక్కిన సభల్లో, అద్భుత ప్రతిభతో వాదించే యువ పండితుడతను. కానీ, ఒక్క మలుపుతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తర్కం, జ్ఞానం పక్కనపెట్టి, ప్రేమ, కరుణ, భక్తిని తన జీవిత సూత్రాలుగా స్వీకరించాడు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరినీ ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణ నామాన్ని, ప్రేమ తత్త్వాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లి, కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మహనీయుడు - **శ్రీ చైతన్య మహాప్రభు**. భక్తి ఉద్యమానికి సరికొత్త జీవం పోసిన ఆ ఆధ్యాత్మిక గురువు, అతని జీవితమే మహిమాన్వితమ్.
గురువుగారు ఉపదేశించిన కృష్ణ మంత్రంతో భక్తిమార్గంలో మునిగిపోయిన గౌరాంగుడు 24 సంవత్సరాల పిన్న వయస్సులో, కుటుంబ జీవితాన్ని త్యజించి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. భార్యను తల్లి శచీదేవిని విడిచిపెట్టి, కేశఖండనం చేయించుకొని కేశవ భారతి అనే గురువు వద్ద సన్యాసం తీసుకున్నారు. అప్పుడు వారికిచ్చిన సన్యాస నామమే చైతన్యప్రభు. అప్పటి నుండి గౌరాంగుడు, నిమాయి అని పిలువబడిన చైతన్య మహాప్రభుగా ప్రసిద్ధి చెందారు. సన్యాసం స్వీకరించిన తర్వాత, చైతన్య మహాప్రభు పురుషోత్తమ క్షేత్రమైన పూరీకి చేరుకున్నారు.
పూరీలో చైతన్య మహాప్రభు పూర్తిగా జగన్నాథ స్వామి భక్తిలో మునిగిపోయారు. ఆయన సామూహిక గీతాలాపనకు ప్రాధాన్యత ఇచ్చి సామూహికంగా తన అనుయాయులతో కలిసి భక్తీగీతాలాపనతో నృత్యాలు చేస్తూ ఉండేవారు.
ఈ కలియుగంలో మోక్షానికి నామస్మరణ మాత్రమే మార్గం అని స్పష్టంగా చెప్పేవారు చైతన్యమహాప్రభు.
"హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే,
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే"
అనే మహామంత్రాన్ని జపిస్తూ, నృత్యం చేస్తూ, ప్రజలను కూడా అందులో భాగం చేశారు. ఆయన ప్రేమ, కరుణ, ఆప్యాయత ప్రజలను అపారంగా ఆకర్షించాయి.
చైతన్య మహాప్రభు వివిధ ప్రదేశాలకు వెళ్లి సంకీర్తన యాత్రలు జరిపారు, అందులో పాడటమే కాదు, నాట్యంతో కృష్ణుని భక్తి లో మైమరచియేవారు..
వెళ్లిన ప్రతి ఊర్లో ఆయన ప్రజల మధ్య క్షమ, ప్రేమ, వినయం, భక్తి భావాలను నింపేవారు.భగవంతుని స్వార్ధం లేకుండా ప్రేమించాలి. కుల, మత, జాతి, విద్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సామాన్యులకూ మోక్షం అందుకోవచ్చు.హరినామ నామస్మరణే కలియుగంలో పరమమార్గం. ప్రతి భక్తుడు తల్లిని, తండ్రిని, దేవుణ్ని ఒకే దృష్టితో చూడాలి.ఇలాంటి విషయాలు ఎక్కువగా బోధించేవారు.
చైతన్య మహాప్రభు జాతి, మత, లింగ భేదాలు లేకుండా అందరినీ కృష్ణ భక్తిని బోధించారు. చైతన్య మహాప్రభు కేవలం భక్తుడే కాదు. సంఘ సంస్కర్త అని కూడా చెప్పాలి. ఆనాడు సంఘాన్ని పట్టి పీడిస్తున్న అంటరానితనం, సామాజిక వివక్షలను పూర్తిగా వ్యతిరేకించారు. చైతన్యుని దృష్టిలో అందరూ కృష్ణుని బిడ్డలే. పేదలు, ధనవంతులు, విద్యావంతులు, నిరక్షరాస్యులు అందరూ సమానమే. కేవలం హరి నామాన్ని జపించడం ద్వారానే మోక్షం పొందవచ్చని బోధించారు.
చైతన్య మహాప్రభు పూరీ క్షేత్రం నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా తిరుపతి, శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి, అక్కడ భక్తిని ప్రచారం చేశారు. తన పర్యటనల ద్వారా అనేక మందిని కృష్ణ భక్తి వైపు మళ్లించారు.
చైతన్య మహాప్రభుకు అనేక మంది శిష్యులు, అనుచరులు ఉన్నారు. వారిలో ప్రముఖుడు నిత్యానంద ప్రభు. ఇతడు చైతన్యుని అత్యంత ప్రియమైన శిష్యుడు, స్నేహితుడు. నిత్యానంద ప్రభుని బలరాముని అవతారంగా భావిస్తారు అలాగే అద్వైత ఆచార్య: రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి, హరిదాస్ ఠాకూర్: ఇలా ఎంతోమంది చైతన్య మహాప్రభు చూపిన మార్గంలో భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
చైతన్య మహాప్రభు తన జీవితపు చివరి 18 సంవత్సరాలు పూరీలోనే గడిపారు. ఆయన జగన్నాథ స్వామి భక్తిలో పూర్తిగా లీనమై, గంటల తరబడి శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, భావ సమాధిలో ఉండేవారు. ఆయన తరచుగా కృష్ణుడిని తలచుకుంటూ, భక్తి పారవశ్యంలో కన్నీరు మున్నీరుగా విలపించేవారు.
చైతన్య మహాప్రభు అదృశ్యం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. క్రీ.శ. 1534లో, తన 48 సంవత్సరాల వయస్సులో జగన్నాథ ఆలయంలోనే అదృశ్యమయ్యారని చెబుతారు. ఆయన జగన్నాథ స్వామి విగ్రహంలో లీనమైపోయారని, కృష్ణ భక్తిలో లీనమైపోయి కృష్ణ గీతాలు పాడుతూ సముద్రంలోకి నడుస్తూ వెళ్లి అదృశ్యమయ్యారని వివిధ కథలు వినబడతాయి.
చైతన్య మహాప్రభు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రపై అపారమైన ప్రభావాన్ని చూపారు. ఆయన స్థాపించిన గౌడియ వైష్ణవ సంప్రదాయం నేటికీ లక్షలాది మంది భక్తులకు మార్గదర్శకంగా ఉంది. ఆయన బోధించిన కీర్తన సంకీర్తన, హరి నామ సంకీర్తన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్) వంటి సంస్థలు చైతన్యుని బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నాయి.
చైతన్యుని జీవితం, బోధనలు భక్తికి, ప్రేమకు, కరుణకు, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆయన కేవలం ఒక మత గురువుగా కాకుండా, మానవత్వానికి, ఐక్యతకు ప్రచారకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. భక్తి మార్గం ద్వారా ఎవరైనా మోక్షం పొందవచ్చని నిరూపించి, కోట్లాది మందికి ఆశను, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన మహానుభావుడు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు జన్మదినాన్ని గౌర పూర్ణిమ గా పరిగణిస్తారు
చైతన్య మహాప్రభు బోధన ఈరోజుకి కూడా అతి ముఖ్యమైన ఆచరణీయ సిద్ధాంతం.
హింసాత్మక ప్రపంచంలో ప్రేమతత్వం అవసరం
ఆంతర్యాన్వేషణకు నామస్మరణ మార్గం
సమాజం లో వర్ణ Vyavastha కంటే మానవత్వం గొప్పది
భక్తి అంటే కేవలం పూజలు కాదు, జీవన శైలి ఇవే చైతన్య మహాప్రభు చెప్పిన ఆచరణలు. మరి ప్రస్తుత కాలంలో ఇవి మరింత ఆచరణీయమే కదా!