Vijaya Lakshmi
Published on Jul 21 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?హయగ్రీవుడు... చదువులదేవుడు…
విద్యార్ధులు చదువులలో రాణించాలంటే హయగ్రీవ ఆరాధన అద్భుతమైన ఫలితాన్నిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. హయగ్రీవుడ్ని ఆరాధిస్తే వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. శ్రీ లలితాసహస్రనామ స్తోత్రం లోకానికి అందించిన స్వామి.
శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ధరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. అందులో ఒకటి ‘హయగ్రీవావతారం’. గుర్రం తలతో విలక్షణమైన ఆకారంతో ఉన్న అవతారం హయగ్రీవావతారం. అసలీ హయగ్రీవుడెవరు? గుర్రం తలతో ఎందుకు అవతరించాడు... హయగ్రీవుడ్ని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆ స్వామిలోని అణువణువూ దేవతామయమని చెప్తారు. అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టె కదా!
దేవీ భాగవతంలోను, స్కంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో కూడా ఈ హయగ్రీవావతారానికి సంబధించిన కథనం కనబడుతుంది. హయగ్రీవుడు చదువులకు అధిదేవుడు. సృజనాత్మకత, సందర్భానుసారంగా నేర్చుకున్న విద్యలన్నీ గుర్తుకురావడం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి వృద్ధిచెందడంలాంటి వాటికోసం ఆ స్వామిని ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
హయగ్రీవుని ఆరాధన అత్యంత విశిష్టమైనది కనుకే కొందరు పండితులు ప్రత్యేకించి హయగ్రీవుని ఆరాధన చేస్తారు. ప్రతినిత్యం సాధ్యం కాకపోయినా కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలని చెప్తారు పెద్దలు. హయగ్రీవస్వామి లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం,
“జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే” ||అన్న శ్లోకం చదువుకొని స్వామిని ప్రార్ధించాలి.
చదువుల దేవుడు గా చెప్తున్నాయి పురాణాలు. చదువులకు తల్లియైన సరస్వతీ దేవికి గురువుగా హయగ్రీవుడిని గుర్తిస్తారని వేద పండితులు చెబుతారు. అందుకే వేద విద్యాభ్యాసాన్ని హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు. విద్యార్ధులు హయగ్రీవస్వామిని ఆరాధిస్తే చక్కటి విద్యను, తెలివితేటలను పొందుతారని చెప్తారు. ముఖ్యంగా విద్యార్ధులు, జ్ఞానాన్ని కోరేవారు, హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.
హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను నివేదించాలి. తెల్లటి పూలతో స్వామివారిని పూజించాలి, జ్ఞానానందమయం దేవం, నిర్మలా స్ఫటికా కృతిమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే”. అంటూ స్వామిని ఆరాధించాలని పెద్దలు చెప్తారు.
హయగ్రీవ జయంతిని అత్యంత శుభప్రదంగా భావించి, ఆ రోజున చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. హయగ్రీవజయంతి రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది.
ఇక హయగ్రీవస్వామి అవతారానికి సంబంధించిన కథనం విషయానికి వస్తే, సృష్టి ప్రారంభంలో ఓసారి, మధుకైటభులనే రాక్షసులు బ్రహ్మ దగ్గరనుంచి వేదాలను అపహరించారు. వేదాలు లేకపోతే సృష్టి చేయడం ఎలా అని విచారించసాగాడు బ్రహ్మ. ఈ సమయంలో ఆదుకొనేవాడు శ్రీమహావుష్ణువె అని శ్రీమహావుష్ణువు ను ప్రార్ధించాడు బ్రహ్మ. హయగ్రీవ రూపంతో అంటే గుర్రం తల కలిగిన ఆకారంతో వెళ్లి రాక్షసులను సంహరించి వేదాలను బ్రహ్మ కిచ్చాడు. అప్పుడే హయగ్రీవుడు బ్రహ్మకు వేదాధిపత్యాన్ని, సరస్వతీ దేవికి సకల విద్యాధిపత్యాన్ని అప్పగించాడు. అందుకే హయగ్రీవ ఉపాసన చేసినా హయగ్రీవ జయంతినాడు ఆస్వామిని స్మరించినా జ్ఞానానందాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.
పూర్వ హయగ్రీవుడనే పేరుతో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆదిపరాశక్తిని గురించి తపస్సుచేసి, తనకు మరణం లేకుండా వరం కోరుకొన్నాడు. అది సాధ్యం కాదండి అమ్మవారు. దాంతో హయగ్రీవ రాక్షసుడు కొంత తెలివిగా ఆలోచించి, గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇమ్మన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండడు కాబట్టి తనఇక మరణం ఉండదని హయగ్రీవుడి నమ్మకం. అతడి కోరికకు సరే అంది అమ్మవారు.
వరగర్వంతో హయగ్రీవుడు సర్వలోకాలను వేధించసాగాడు. ఈ పరిస్థితిలో దేవతలంతా విష్ణువును శరణు వేడారు. వారి కోరికను మన్నించిన విష్ణుమూర్తి చాలాకాలం నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు. ఒ రోజున ఎక్కుపెట్టిన ధనస్సుకు తల ఆనించి నిద్రిస్తున్నాడు. ఎన్నాళ్లకూ నిద్ర లేవకపోవడంతో శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు. ఎక్కుపెట్టిన ధనస్సుకు బిగించి అల్లెతాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలకువ వస్తుందన్నాడు. ఆ తాడును కొరకగల శక్తి ఒక వమ్రి అనే కీటకానికి మాత్రమే ఉందని తెలుసుకొని బ్రహ్మది దేవతలు వమ్రిని అల్లెతాడు తెంపమన్నారు.
చెదపురుగు తాడును కొరకడంతో, ధనస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకు తగిలింది. ఆ తల ఎటో ఎగిరి దూసుకు వెళ్లింది. దానికోసం అన్నిచోట్లా వెతికారు కాని ఫలితం లేదు. ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని ప్రార్ధించారు. ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు తలను తెచ్చి విష్ణువు శరీరానికి అతికించమంది. దేవతలు అలాగే చేశారు.
అలా హయగ్రీవ స్వామి అవతరించి తన పేరునే ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. దేవతలంతా హయగ్రీవస్వామిని స్తుతించారు. ఇది జరిగింది శ్రావణ పూర్ణిమనాడు. అప్పటినుంచి హయగ్రీవ జయంతిని జరుపుకోవటం ఆచారంగా వస్తుంది.
తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య – విజ్ఞానం, సంపద లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పార్వతీ, సరస్వతీ సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారని ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞానప్రదాతగా పూజలు అందుకుంటున్నాడని ప్రతీతి.
బ్రహ్మాండ పురాణంలో : హయగ్రీవస్వామికి సంబంధించిన మరొక పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి శ్రీ లక్ష్మీహయగ్రీవస్వామిని ఉపాసించాడు. ఆ స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అగస్త్యుడు జగజ్జనని శ్రీ లలితా పరమేశ్వరుని గూర్చి ఏమి ఉపదేశించినా సరే వింటాను అన్నాడు...
అప్పుడు హయగ్రీవస్వామి శ్రీ లలితా అమ్మవారి మంత్రాన్ని అంగన్యాస, కరన్యాస పూర్వకంగా ఉపదేశించడమే కాకుండా, లలితాదేవి మహత్యాన్ని గూర్చి విపులంగా చెప్పాడు. అమ్మలగన్న అమ్మను గూర్చి సర్వవిధాల ఉపదేశించా... ఉపదేశించడమే కాకుండా, లలితాదేవి మహత్యాన్ని గూర్చి విపులంగా చెప్పాడు.
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండసంభూతా దేవకార్య సముద్యతా...అంటూ మొదలై
ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః... ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరాఖండే శ్రీహయగ్రీవాగస్త్య... సంవాదే శ్రీ లలితాసహస్రనామ స్తోత్రకథనం సంపూర్ణం....... అంటూ జరిగిన శ్రీహయగ్రీవస్వామి, అగస్త్య మహర్షి వారల సంవాదం వల్ల అత్యంత రహస్యమైన మహిమగల లలితా సహస్రనామం లోకానికి అందింది.