Vijaya Lakshmi
Published on Jul 21 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?విశాఖపట్నం, విశాఖపట్నంలో ఆలయాలు అనగానే వెంటనే సింహాచలం నరసింహస్వామి, బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారు అనుకుంటాం. వాటితో పాటు తప్పక చూడాల్సిన ఆలయాలు ఇంకా ఉన్నాయి.
విశాఖపట్నంలో సంపత్ వినాయకుడు, బెల్లం వినాయకుడు, అప్పికొండ సోమేశ్వర స్వామి, ఇసుకకొండ సత్యనారాయణ స్వామి, భావతారిణి మాత, పోర్ట్ శ్రీ వెంకటేశ్వరస్వామి, ఇలా ప్రసిద్ధి చెందిన, మహిమాన్వితమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి.
విశాఖలో వినాయకుని ఆలయల్లో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం శ్రీ సంపత్ వినాయక దేవాలయం. విశాఖపట్నంలో చాలామంది ప్రజలు ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా ముందుగా సంపత్ వినాయకుని దర్శించుకొని తమ సంకల్పం చెప్పుకొని మొక్కుకుంటారు. ప్రతిరోజూ సంపత్ వినాయకుని దర్శించుకునే తమ వృత్తి వ్యాపారాలకు ముందుకెళతారు. విశాఖ నగర నడిబొడ్డున, RTC కాంప్లెక్స్ సమీపంలో వెలసిన శ్రీసంపత్ వినాయకునికి పెద్ద చరిత్రే ఉంది.
దాదాపు అయిదు దశాబ్దాలుగా విశాఖవాసుల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన ఈ సంపత్ వినాయక దేవాలయం, మొదట ఒక కుటుంబంవారు స్థాపించినా, తరువాతి కాలంలో అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. 1962లో ‘మెసర్స్ ఎస్‌జి సంబంధన్ అండ్ కో’ ఆవరణంలో ఎస్‌జి సంబంధన్, టిఎస్ సెల్వగణేశన్, టి.ఎస్ రాజేశ్వరన్ కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలో ఆశీలుమెట్టలో... తమకు సంబంధించిన ఒక భవనంలో వాస్తుదోష పరిహారం కోసం శ్రీ సంపత్ వినాయకుని స్థాపించారు.
ఈ దేవాలయం స్థాపించిన కొత్తలో, అక్కడికి దగ్గరలోనే ఉన్న జాలర్లు ప్రతిరోజు స్వామిని అర్చించి, నమస్కరించి వారి వృత్తిని మొదలుపెట్టేవారట. కాలక్రమేణా స్వామిని మొక్కుకోవడం వలన తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలను కథలు... కథలుగా చెప్పుకునేవారు జాలర్లు. అలా సంపత్ వినాయకుని మహిమ ఆ నోటా ఈ నోటా ప్రజలందరికీ చేరింది. అలా సంపత్ వినాయక దేవాలయం ప్రజలకు చేరువైంది. ఆ తరువాత ఐదు సంవత్సరాలకు నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వహస్తాలతో ఇక్కడ ‘గణపతి యంత్రం’ స్థాపించారు.
విశాఖపట్టణం నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈస్వామి ఆలయం వైశాల్యంలో చాలా చిన్నది...అయినా వేలాదిమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. సంపత్ వినాయకుని మహిమకు సంబంధించిన ఒక సంఘటన ప్రముఖంగా చెప్పుకోవాలి.
1971లో ఇండో...పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాక్ యుద్ధనౌకలు భారత సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చినప్పుడు రేవు పట్టణమైన విశాఖను కాపాడాల్సిందిగా ప్రార్ధిస్తూ తూర్పునావికాదళం ఇన్‌చార్జి అడ్మిరల్ కృష్ణన్ సంపత్ వినాయగర్ ఆలయంలో 1,101 కొబ్బరికాయలను స్వామివిగ్రహం ముందు కొట్టారట. ఇది జరిగిన కొద్దిరోజులకే పాకిస్తాన్ సబ్‌మెరైన్ పిఎన్‌ఎస్ ఘాజీ సముద్రజలాల్లో మన యుద్ధనౌకలపై దాడిచేసేందుకు వచ్చి బాంబులు అమర్చి తిరిగివెళ్తూ అవే బాంబులు పేలి సముద్రంలో మునిగిపోయింది. దీంతో విశాఖనగరానికి పెద్దప్రమాదం తప్పింది. ఇదంతా వినాయగర్ మహిమేనని భావించిన అడ్మిరల్ కృష్ణన్ తాను ఇక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజూ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకునేవారట.
ఇప్పటికి కూడా విశాఖలో కొత్తగా ఎవరు ఏ వాహనం కొనుక్కున్నా ముందుగా ఆ వాహనాలను సంపత్ వినాయగర్ ఆలయానికి తీసుకువచ్చి పూజలుచేయించిన తర్వాతనే వాటిని వినియోగిస్తారు. అలా చేస్తే భవిష్యత్‌లో ఎటువంటి ప్రమాదాలు సంభవించవని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకం సంప్రదాయం గత 50 ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది.
విశాఖపట్నంలో మరో చారిత్రిక, పురాతన, మహిమాన్విత ఆలయం “బెల్లం వినాయకుని” ఆలయం. ఈ ప్రాంతంలో వైశాఖేశ్వర స్వామి ఆలయం ఉండటంతో ఈ ప్రాంతానికి విశాఖపట్నంగా పేరు వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. అయితే కాలక్రమేణా ఆ వైశాఖేశ్వరుని ఆలయం సముద్ర గర్భంలో కలిసి పోగా ఆ ఆలయానికి ప్రతిగా విశాఖ తీరంలో మరో ఆలయం నిర్మించారట. అదే ప్రస్తుతం కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న అఫీషియల్ కాలనీలో కొలువుదీరిన బెల్లం గణపతి ఆలయం.
నిజానికిది ఆనంద గణపతి ఆలయం. అయితే భక్తులు స్వామికి తమ కోర్కెలు చెప్పుకొని ఆ కోరిన కోరికలు తీరినప్పుడు స్వామికి బెల్లం అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అలా బెల్లం సమర్పించడం ఆనవాయితీగా మారి, ఆనందగణపతి కాస్తా బెల్లం గణపతిగా ప్రసిద్ధి చెందాడు.
ఈ స్వామిని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించినట్టుగా స్థలపురాణం చెప్తోంది. ప్రతీ నిత్యం పూజలు అందుకునే ఆనంద గణపతిని బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంని బెల్లం సమర్పిస్తారు. పావుకిలో బెల్లం ముక్క దగ్గరనుంచి పెద్ద పెద్ద బెల్లం దిమ్మలు కూడా స్వామికి సమర్పించడం ఇక్కడ కనబడుతుంది. ఈ ఆలయ సముదాయంలోనే వైశాఖేశ్వర స్వామికి ప్రతిగా చెప్పుకునే బుచ్చి రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది.
వైజాగ్ లో దర్శించవలసిన మరో ప్రముఖ మహిమాన్వితమైన ఆలయం సత్యనారాయణ స్వామి ఆలయం. భక్తుల ఆపదలు గట్టెక్కించి కోర్కెలు తీర్చడంలో సత్యదేవుడిది పెద్ద పేరే. ఆయన కథ చెప్పుకుని కాస్త ప్రసాదం సేవిస్తేచాలు ఎంతటి అడ్డంకులైనా తొలగిపోతాయట. ఇంటి ఇలవేలుపుగా ఏ దేవుడ్ని, దేవతను కొలుచుకున్నా, వాళ్లతో పాటూ సత్యనారాయణుడికీ మొక్కులు చెల్లించుకోవాల్సిందే. సకల శుభాలకూ కారకుడైన స్వామి ఇంట్లో అడుగుపెడితే చాలు సుఖసంతోషాలు వర్థిల్లుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ఏ ఇంట్లో పెళ్లి, పేరంటం గృహప్రవేశం ఏ శుభకారయం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగితీరాల్సిందే.
సత్యనారాయణ స్వామి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అన్నవరం. అయితే అన్నవరం తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన క్షేత్రం విశాఖపట్నం లో కొలువుతీరిన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి.
ఆనందం, ఆధ్యాత్మికతను పoచే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానానికి విశాఖనగర చరిత్రలో విశేష స్థానం ఉంది. కోరిన కోర్కెలు తీర్చే భక్తవల్లభుడిగా ఇక్కడి స్వామివారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
ఇసుకకొండ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ సత్యనారాయణ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రితం సుందర సాగరతీరం విశాఖపట్నంలోని ఇసుకకొండమీద సీతారాంబాబాజీ అనే సాధువు ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు. అందుకే ఈ కొండను బాబాజీ కొండ అని కూడా పిలుస్తారు.
అన్నవరంలో సత్యదేవుని వ్రతాలకు ఎంత ప్రసిద్ధి ఉందో ఇక్కడ పౌర్ణమి పూజలకు అంత ప్రాశస్త్యం ఉంది. ప్రతి పౌర్ణమికి ఆలయానికి వచ్చి తమ మనసులో కోరికను చెప్పుకొని ధ్వజస్థంభం చూట్టూ 5 ప్రదక్షిణాలు చేసి తరువాత స్వామిని దర్శించుకొని తమ కోరికను చెప్పుకొని వెళ్ళాలి. ఇలా 5 పౌర్ణమిల పూజ చేస్తే తమ కోరికలు నేరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పౌర్ణమి రోజు తెల్లవారుఝామున మూడు గంటలనుంచే ఎక్కడెక్కడినుంచో, ఎంతో శ్రమపడి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.
ఏ ఆలయంలోను లేని ఒక అద్భుత దృశ్యం ఇక్కడ గర్భాలయంలో కనబడుతుంది. సాదారణంగా ఏ ఆలయంలోనైన మూలవరులు ఒక్కరే కనబడతారు. కానీ ఈ ఇసుకకొండ ఆలయంలో మాత్రం రెండు జతల మూలవరుల విగ్రహాలు కనబడతాయి.అలా ఎందుకంటే మొదట ఇక్కడ పాలరాతి విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ తరువాత నల్లరాతి విగ్రహాలను ప్రతిష్టించారు. దక్షిణ భారతదేశంలో గర్భాలయంలో నల్లరాతి విగ్రహాలను మూలవరులుగా ప్రతిష్టించే ఆనవాయితీ కనబడుతుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా నల్లరాతి విగ్రహాలను ప్రతిష్టించారు. దాంతో పై వరుసలో తొలుత ప్రతిష్టించిన పాలరాతి విగ్రహాలు, మధ్య వరుసలో తరువాతి కాలంలో నెలకొల్పిన నల్లరాతి విగ్రహాలు, తరువాత ఉత్సవిగ్రహాలు. అన్నిటికన్నా దిగువన నమస్కార భంగిమలో కూర్చొనివున్న గరుత్మంతుడు తన రెక్కలను విప్పుకొని పైన ఉన్న శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణస్వామిని తన భుజాలమీద మోస్తున్నట్టుగా మనకు దర్శనమిస్తారు. ఇలాంటి అమరిక ఓ అద్భుతం. ఇలాంటి సుందర దృశ్యం మరే ఆలయం లోనూ కనపడదు. అంచెలంచెలుగా అమర్చిన మూలవిరాట్టులు దృష్టి మరల్చుకోలేనంత అద్భుతంగా దర్శనమిస్తాయ్.
బాబాజీ నిర్మించిన ఈ ఆలయాన్ని సుమారు ముప్పై సంవత్సరాల క్రిందట పునఃనిర్మించారు.
ఇసుక కొండ అని, బాబాజీ కొండ అని పిలుచుకునే ఈ కొండమీద ఉన్న ఈ ఆలయానికి మెట్లమార్గం ఉంది. అదేవిధంగా kgh కింగ్ జార్జ్ ఆస్పత్రి లోనుండి కూడా మార్గం ఉంది.
.
ఈ ఆలయంలో మరో విశేషం గరుడవాహన శ్రీ మహావిష్ణువు దర్శనం. గరుడ వాహన శ్రీ హరి సందర్శనం అత్యంత పుణ్య ప్రదంగా చెప్తారు పెద్దలు. మిగిలిన ఆలయాలలో ఆ గరుడవాహన దర్శనం కేవలం పర్వదినాలలోనే దొరుకుతుంది. కాని ఈ ఇసుకకొండ ఆలయంలో మాత్రం ప్రతి నిత్యం గరుడ వాహన సత్య దేవుని దర్శనం లభిస్తుంది.
విశాఖపట్నంలో మరో దర్శనీయ స్థలం వెంకటేశ్వరకొండ. తూర్పుతీరం గోవా నగరంగా పిలుచుకునే విశాఖపట్నంలో ఆ ప్రాంతం మతసామరస్యానికి చిహ్నం. అక్కడ కొలువు తీరిన మూడు కొండలు మూడు మతాలకు చెందిన చిహ్నాలు కొలువున్నా, అన్నీ కలిసి భిన్నత్వంలో ఏకత్వానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అవే శ్రీ వేంకటేశ్వర కొండ, రాస్ కొండ, దర్గా కొండ. ఈ మూడు కొండల మీద మూడు విభిన్న మతాలకు చెందిన విగ్రహాలు ఉన్నాయి. వేంకటేశ్వర కొండ మీద వెంకటేశ్వర దేవాలయం, రాస్ హిల్ మీద వర్జిన్ మేరీ చర్చి, దర్గా కొండ మీద ఇస్లామిక్ సెయింట్, బాబా ఇషాక్ మదీనా యొక్క సమాధి ఉన్నాయి.
మూడు కొండలలో దక్షిణాన ఉన్న కొండ వెంకటేశ్వర కొండగా పిలుస్తారు. ఇది 1866 లో ఒక యూరోపియన్ కెప్టెన్ బ్లాక్మూర్ చేత నిర్మించబడినదని చెప్తారు. సుమారు రెండు శతాబ్దాల పురాతనమైన ఆలయం అని ఒక నమ్మకం. 17 వ శతాబ్దం చివర్లో ఒక తీవ్రమైన తుఫాన్లో బ్లాక్మూర్ కెప్టెన్ గా వస్తున్నా ఒక నౌక సరిగ్గా హార్బర్ కు చేరే సమయానికి తీవ్రమైన తుఫాన్ లో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందట. అయితే అక్కడ ఉన్న ఒక పెద్ద శిల నౌకను సముద్రంలో మునిగిపోకుండా అడ్డుగా నిలిచిందని దాంతో ఆ నౌక, నౌకలోనివారు పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. తుఫాన్ తీవ్రత తగ్గింతరువాత అక్కడ పరిశీలిస్తే నౌక మునిగి పోకుండా కాపాడిన శిలా వెంకటేశ్వరస్వామి విగ్రహంగా తెలిసిందట. దాంతో స్వామికి కొండమీద గుడికట్టి ప్రతిష్టించినట్టు ఒక కథనం.
ఆర్టిసి కాంప్లెక్స్ నుండి 5 కిలోమీటర్ల దూరంలోని పోర్ట్ ఏరియాలో ఉన్నాయి ఈ మూడు కొండలు. విశాఖ ఆర్టీసి కాంప్లెక్స్ నుండి బస్సుల్లోను లేదంటే ఆటల్లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ కు చేరుకొని అక్కడి నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ మూడు ఆలయాలకు చేరుకోవచ్చు.
ఇక విశాఖపట్నంలో దర్శించవలసిన అతి పురాతన ఆలయం అప్పికొండ. విశాఖపట్నంలోనే కాదు దక్షిణ భారతదేశంలో అతి పురాతన శైవ క్షేతాల్లో అప్పికొండ ఒకటి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుక సముద్ర తీరాన ఉంది ఈ ఆలయం. నిత్యం భక్తుల పూజలను అందుకునే ఈ ఆలయ ప్రాంగణలో అత్యంత పురాతన శివలింగాలు చూడొచ్చు. విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోను, గాజువాక కు 20 కిలోమీటర్ల దూరంలోను ఉన్న ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది.
ఈ క్షేత్రానికి కపిల మహార్షి శ్రీకారం చుట్టినట్టు స్థలపురాణం చెప్తోంది. ఓసారి కపిల మహర్షి ఈ భూమినంతటిని ప్రదక్షిణగా చుట్టిరావాలని సంకల్పించాడు. ప్రదక్షిణలో భాగంగా ఈ సముద్ర తీరానికి వచ్చిన కపిల మహర్షి 101 శివలింగాలను ప్రతిష్టాంచాలని సంకల్పించి ఆదివారం రాత్రి తపస్సు మొదలుపెట్టారట. సోమవారం ఉదయానికి మహర్షి దీక్ష పూర్తయ్యే సరికి 100లింగాలు ఉద్భవించాయి. తాను సంకల్పించిన దానికి ఒక లింగం అప్పుగా మిగిలిపోయింది. దాంతో ఆ ప్రాంతం అప్పుకొండగా ప్రసిద్ధి చెందిందని ఓ కథనం. ఆ అప్పుకొండే కాలక్రమంలో అప్పికొండగా మారిపోయిందని చెప్తారు.
కపిలముని సంకల్పంతో శివలింగాలు సోమవారం వెలియడంతో సోమేశ్వరస్వామి ఆలయంగా నామకరణం చేశారని, ఈ కొండకు కపిల కొండ అన్న పేరు స్తిర పడిపోయిందని స్థల పురాణం చెప్తోంది.
తరువాత కాలంలో సముద్ర అలల తాకిడితో చాలా కాలం ఈ ఆలయం ప్రాంగణం సముద్రపు ఇసుకలో కప్పబడిపోయిందట. రెండు దశాబ్ధాల క్రితం ఆర్కియాలజీ విభాగం పరిశోధనల్లో తవ్వకాల్లో అప్పికొండ బయటపడింది.
ఈ అప్పికొండ సోమేశ్వర ఆలయం క్రీస్తు పూర్వ 6, 11వ శతాబ్ధాల్లో చోళులు, విజయనగర రాజులు ఆదరణతో ఎంతో అభివృద్ధి చెందిందని ఇక్కడ లభించిన శిలాశాసనాలు చెప్తున్నాయి. అప్పట్లో కపిలముని సంకల్పంతో వెలిసిన శివలింగాలన్నీ సముద్రంలో కలిసిపోగా కేవలం నాలుగు మాత్రం మిగిలాయని వాటికే ఇప్పుడు పూజలు జరుగుతున్నాయని పూజారులు చెప్తారు. ఆ నాలుగు శివలింగాల్లో ప్రధానమైనది ప్రధాన గర్భాలయంలో పూజలందుకుంటోంది.
ఇంకా ఇవే కాకుండా చాలా శివలింగాలు ఆలయ పరిసరాల్లో సముద్రపు ఇసుకలో ఉన్నట్టు అక్కడున్న మత్య్సకారులు చెబుతుంటారు.
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి గాజువాకకు ప్రతి నిత్యం సిటీ బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి అప్పికొండకు ప్రత్యేకసర్వీసులు నిరంతరాయంగా నడుస్తుంటాయి. అలాగే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి నేరుగా అప్పికొండుకు సిటీ సదుపాయం కూడా ఉంది. స్వంత వాహనాల్లో వెళ్ళేవారు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ లో నుంచి నేరుగా అప్పికొండ చేరుకోవచ్చు.
కొన్ని కట్టడాలు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొదట అలవోకగా మొదలయినా తరువాత అవే చరిత్రగా మారిపోతాయి. అలాంటిదే విశాఖ ఆర్కే బీచ్‌లో ఉన్న భావతారిణి ఆలయం. విశాఖ సాగరతీరాన్ని చూడాలని ఉత్సాహపడేవారికి సాగర తీరంలో ఓ మధుర జ్ఞాపకం ఆధ్యాత్మిక వైభవం ఈ భవతారిని ఆలయం. సాగర తీరంలో నిర్మించిన కాళీ (భవతారిణి) మాత ఆలయం సుందర విశాఖ నగరానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయం మెట్టమీద కూచుని ఎగిసిపడే సాగర అలల్ని చూడడం ఓ అందమైన అనుభవం.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ నుంచి ఉపాధి వెతుక్కుంటూ విశాఖకు వచ్చి 19 ఏళ్ల వయసులో ఓ షిప్పింగ్ కంపెనీలో కెరీర్‌ను ప్రారంభించి, పనిచేసే సంస్థలో మేనేజింగ్ పార్టనర్ స్థాయికి ఎదిగిన దయానంద్ బెనర్జీ, రామకృష్ణ బీచ్ ఎదురుగా సొంత ఇంటి నిర్మాణం కోసం సమకూర్చుకున్న స్థలంలో ఓ కాళీ మందిరాన్ని నిర్మించాలని భావించారు. భార్య, పిల్లల సహకారంతో యావదాస్తిని వెచ్చించి రెండేళ్లలో ఆలయాన్ని నిర్మించారు.
తొమ్మిది మంది సభ్యులతో కూడిన భవతారిణి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని 1984 అక్టోబరు 18న ప్రారంభించారు. ఈ ఆలయంలో పూజా విధానం బెంగాలీ పద్ధతిలో ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ ఆలయ నిర్మాణం గానీ, ఆలయంలోని కాలీమాత విగ్రహం గానీ అన్నీ అచ్చంగా కలకత్తా కాళీమాత ఆలయం మాదిరిగానే ఉంటాయి.
ఆ తరువాత భక్తుల కోరిక మేరకు ఈ ప్రాంగణంలోనే ఒక శివాలయాన్ని నిర్మించారు. అందులో పాదరసంతో తయారు చేసిన శివలింగాన్ని ఆలయ ప్రతిష్టించారు.