Vijaya Lakshmi
Published on Dec 24 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలు సప్తమోక్షదాయక క్షేత్రాలలో ఒకటి. కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం మరొక్కటి లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సంబంధించిన రహస్యాలు మీకు తెలుసా? కాశీ విశ్వనాథుని ఈ రహస్యాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. అతి పురాతన చరిత్ర ఉన్న ఈ ఆలయం.. వారణాసి నగరంలో గంగా నది ఒడ్డున ఉంది. అలాంటి పుణ్యక్షేత్రం కాశీకి వెళ్లాలని తపించని హిందువు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలా తపించేవారికి అన్నిచోట్లా ఆ కాశీ విశ్వేశ్వరుడు, విశాలక్షమ్మే దర్శనమిస్తారు. నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తలుచుకుంటే... మనస్సు భక్తి భావంతో పులకించిపోతుంది. మనసునిండా ఉన్న ఆ భక్తి భావంతో కాశీని ఒక్కసారైనా మా మనస్సుతో దర్శించడానికి ప్రయత్నించండి. పురాణ ప్రాశస్త్యం పొందిన ఆ కాశీ నగరం కళ్లముందు కనిపిస్తుంది.
పురాణాల ప్రకారం ప్రళయం వచ్చినా నశించని నగరం ఒక్కటే… కాశీ. శివుడు ఈ నగరాన్ని తన శూలంపై నిలుపుతాడని స్కంద పురాణం చెబుతోంది. అందుకే కాశీని అవిముక్త క్షేత్రం అంటారు. అంటే… శివుడు ఎప్పటికీ వదలని స్థలం.
ఇదే కాశీ విశ్వనాథ ఆలయం వెనుక అత్యంత గంభీరమైన రహస్యం… కాశీలో ఎవరు ప్రాణాలు విడిచినా శివుడు స్వయంగా ఆ వ్యక్తి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడట. దాని ఫలితం… వారికి పునర్జన్మ ఉండదు. మోక్షం లభిస్తుంది. అందుకే కాశీలో మరణం కూడా ఒక వరం అంటారు.
కాశీలో గంగానది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది చాలా అరుదైన భౌగోళిక విశేషం.
మరియు… కాశీ విశ్వనాథ లింగం భూమి మధ్యబిందువుకు దగ్గరగా ఉందని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. అంటే… కాశీ ఒక ఆధ్యాత్మిక ఎనర్జీ సెంటర్.
ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం. హిందువులకు అత్యంత పవిత్రమైన ఆలయం. వారణాసిలో పవిత్ర గంగానది ఎడమ గట్టువైపున ఉంది కాశీ విశ్వేశ్వరుని ఆలయం. దేశంలోని 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇదీ ఒకటి. శైవక్షేత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు.
కాశీ విశ్వనాథ స్వామి పేరుకి ఓ ప్రత్యేక అర్ధాన్ని చెబుతారు. పరమేశ్వరుడిని ఆది, అంతం లేనివాడిగా చెబుతారు. కాశీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆయన ఈ విశ్వానికే ఈశ్వరుడిగా చెబుతారు. అంటే విశ్వం మొత్తానికీ ఆయన పెద్ద, ఆయనే దైవంగా నమ్ముతారు. అందుకే ఇక్కడ శివుడు విశ్వేశ్వరుడు.
మన దేశంలో ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఇతర మతాల వారు దండయాత్రలు, హిందువుల ఆలయాలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలాసార్లు నాశనం చేశారు. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు... కాశీ క్షేత్రాన్ని నాశనం చేశాడు. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా... ఆ క్షేత్రం తట్టుకొని నిలబడింది. ఆశ్చర్యం ఏమిటంటే… ఇన్ని దాడులు జరిగినా శివలింగం చెక్కుచెదరలేదు. పూజ ఆగలేదు. అందుకే శివుడు ఉన్న చోట ఆలయం మళ్లీ పుడుతుంది. అంటారు భక్తులు.
విశ్వనాథుని దర్శనం ఎంత పుణ్యప్రదమో, గంగాస్నానం కూడా అంతే పుణ్యప్రదం. స్నానం ఒక్కటే కాదు, ఇక్కడున్న ఘాట్ లలో దహన సంస్కారాలు, పితృకార్యాలు, అస్తికల నిమజ్జనం వంటివి నిత్యం గంగానదీతీరంలో చోటు చేసుకునే కార్యక్రమాలు. పర, అపర కర్మలు రెండింటికీ సమానమైన ప్రాతినిథ్యం కలది గంగాతీరం.
గంగానది హిమాలయాలలో పుట్టినది మొదలు ఎన్నో ప్రదేశాలలో ప్రవహిస్తున్నప్పటికీ, ఇక్కడ మాత్రమే కాశీగంగ అని పిలువబడటానికి కారణం, విశ్వనాథుడు కొలువై ఉండటం ఒక్కటే కాదు, అప్పటి వరకూ దక్షిణాభిముఖంగా ప్రవహిస్తున్న గంగ ఇక్కడనుండి తన దిశ మార్చుకుని, ఉత్తరాభిముఖంగా పయనమౌతుంది.
వరుణ, అసి అనే రెండు నదులు గంగానదితో సంగమించే మధ్య ప్రదేశమే వారణాసి. ఈ రెండు నదుల సంగమ స్థానం మధ్య ఉన్న ఐదు క్రోసుల దూరాన్ని భక్తులు “పంచక్రోస యాత్ర” గా పిలుచుకుని ఈ వారణాసి యాత్ర ఎంతో సంతోషంతో చేస్తారు.
వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున 'వారణాసి' అనే పేరువచ్చింటారు. వారణాసి పేరును పాళీభాషలో బారణాసిగా రాసేవారు. అది తర్వాత బనారాస్ గా మారింది. వారణాసి నగరాన్ని పురాణ ఇతిహాసాల్లో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం.
🔹 కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోది కాదు. సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ఆధ్యాత్మిక రాజధాని. స్వయంగా శివుడు నివాసం ఉండే నగరమని పురాణాలు చెబుతున్నాయి.
🔹 ప్రళయ కాలంలో కూడా నీట మునగని ప్రాచీన పట్టణం కాశీ. ఎందుకంటే ప్రళకాలంలో కూడా శివడు తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడాడని చెబుతారు.
🔹 కాశీలో విశ్వేశ్వరుని దర్శనంతో పాటు గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాశీ అన్నపూర్ణమ్మ, కాలభైరవ దర్శనం ముఖ్యంగా చెప్తారు.
🔹 కాశీలో అడుగు పెట్టాలంటే కాలభైరవుని అనుమతి కావాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు భైరవుడు, జీవిని కాశీ లోకి అనుమతించడని చెబుతారు. కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదంటారు
🔹 కాశీలో ప్రవేశించిన జీవికి సంబంధించిన పాపపుణ్యాలు చిత్రగుప్తుడి చిట్టానుంచి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుందట. అందుకే కాల భైరవ ఆలయంలో స్వామి దర్శనం తరవాత అక్కడున్న పూజారులు వీపు పై కర్రతో కొట్టి నల్లని దారం కడతారని చెబుతారు.
🔹 కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది జీవిత చరమాంకాన్ని కాశీలో గడపాలని, అక్కడే మరణించాలని కోరుకుంటారు. కాని అదృష్టం, ఆ కాశీ విశ్వేశ్వరుని కరుణ ఉంటే తప్ప, కాశీలో మరణం రాదనీ కూడా చెబుతారు.
🔹 ఎవరి అస్తికలు అయితే గంగలో కలుపుతామో వారు మళ్లీ కాశీలోనే జన్మించి విశ్వనాథుడి కరుణాకటాక్షాలకు పాత్రులవుతారట
🔹 మరొక ముఖ్యమైన విషయం ఎంత కరువు వచ్చినా గంగమ్మతల్లి మాత్రం నిండుగా ప్రవహిస్తూ, కాశీ ఘాట్లను వదిలి వెళ్లలేదంటే అదంతా కాశీ విశ్వనాథుడి మహిమే అంటారు.
కాశీలో మరో పుణ్యస్థలం ఆలయం పక్కన ఉన్న జ్ఞానవాపి కూపం… గ్రందాల ప్రకారం విదేశీ దాడులలో శివలింగాన్ని రక్షించేందుకు దానిని ఆ బావిలోనే ఉంచారట. అందుకే ఆ ప్రాంతం ఇప్పటికీ శక్తివంతంగా ఉందని భక్తుల నమ్మకం.
కాశీ దేవాలయం కాదు
కాశీ విశ్వనాథ ఆలయం ఒక దేవాలయం కాదు… అది ఒక మోక్ష ద్వారం. జీవితం–మరణం మధ్య ఉన్న సత్యం. అందుకే అంటారు… “కాశీకి వెళితే శివుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు.”
A: పురాణాల ప్రకారం, కాశీలో మరణించిన వారికి శివుడు తారక మంత్రం ఉపదేశించి మోక్షం ఇస్తాడని నమ్మకం.
A: శివుడు ఎప్పటికీ వదలని నగరం కావడంతో కాశీని అవిముక్త క్షేత్రం అంటారు.
A: ఇది అరుదైన భౌగోళిక విశేషం, ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు.
A: శివలింగాన్ని రక్షించిన స్థలంగా పురాణాల్లో పేర్కొనబడింది.