Vijaya Lakshmi
Published on Nov 03 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?నిజానికి ఇది పరశురామ క్షేత్రం. పరశురామ క్షేత్రం శైవ క్షేత్రంగా ఎలా మారింది? వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివుణ్ణి నంజుండేశ్వర అని ఎందుకు పిలుస్తారు. ఈ నంజుండేశ్వరునికి ఒక ముస్లిం రాజుకు ఒక అవినాభావ సంబంధం ఉందంటారు ఏంటా కథ?
అసలు నంజుండేశ్వరుడు అంటే అర్థమేంటి? కన్నడ భాషలో నంజ అంటే విషం, ఉండ... విషపు ఉండను నంజుండ అంటే విషాన్ని స్వీకరించిన వాడు అనే అర్థం చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని గరళపురి అని పిలుస్తారు. క్షీర సాగర మధనంలో వెలువడిన కాలకూట విషాన్ని స్వీకరించి, ఆ విషాన్ని తన కంఠంలోనే నిలుపుకొని శివుడు గరళకంఠుడయ్యాడు. ఆ నీలకంఠ శివుడే ఇక్కడ నంజుండేశ్వరుడిగా, విషాన్ని కంఠంలోనే దాచుకున్నాడు కాబట్టి శ్రీకంఠీశ్వరుడు గా భక్తుల పూజలందుకున్నాడు.
నంజుండేశ్వరడుని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులే కాదు మొండి రోగాలు కూడా నయమవుతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి నంజుండేశ్వరునికి 'ఉరుల్' అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుందని భక్తుల విశ్వాసం. నది నీతితో పాటు మట్టిలో కూడా వ్యాధులను నయం చేసే ఔషదగుణాలు ఉన్నయని చెబుతారు.
పూర్వం కర్ణాటకను పాలించిన టిప్పుసుల్తాన్ కు ఎంతో ప్రీతిపాత్రమైన ఏనుగుకు కళ్ల సంబందిత వ్యాధి వచ్చిందట. ఈ వ్యాధి చాలా కాలంపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకుండా ఇబ్బంది పెట్టిందట. అప్పుడు నంజుండేశ్వరుని మహిమలు విని టిప్పుసుల్తాన్ ఆలయ పూజారిని సంప్రదించాడని, పూజారి చెప్పిన ప్రకారం ఆలయ సమీపంలో కపిల నదిలో ఏనుగుకు స్నానం చేయింది నంజుండేశ్వర స్వామి ని అభిషేకించిన తీర్తజలంతో ఒక మండలం రోజులు దాని కన్ను తుడిచి స్వామిని ప్రార్దిన్చాడని, నంజుండేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయించాదాని, దాంతో ఆశ్చర్యంగా ఏనుగు పూర్తి స్వస్తత పొందిందని, అందుకు కృతజ్ఞతగా టిప్పు సుల్తాన్ నంజుండేశ్వరుడికి పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించాడని ఓ కథనం ప్రచారంలో ఉంద. ఆ సందర్భంలోనే టిప్పుసుల్తాన్ హకీమ్ నంజుండ అని పిలిచాడట స్వామిని. అందుకే ఈ స్వామిని హకీమ్ నంజుండ, వైద్య నంజుండేశ్వర అని కూడా పిలుస్తారు.ఉర్దూలో హకీమ్ అంటే వైద్యుడు అని అర్థం.
ఈ ఆలయానికి సంబంధించి, మరో స్థలపురాణం కూడా చెబుతారు. ఒక సందర్భంలో కేశి అనే అసురుడు దేవతలను అనేక విధాలుగా ఇబ్బందిపెట్టేవాడని, వారు సహాయం చేయమని శివుడిని వేడుకోగా, కేశి అనేది విషం యొక్క పూర్తి రూపం. కపిల, కౌండిన్య నది మరియు మణికర్ణిక నదులు సంగమంగా ఉన్న ఈ సంగమ ప్రదేశంలో యజ్ఞం చేయమని శివుడు దేవతలకు చెప్పాడు. కేశి వారిని ఇబ్బంది పెట్టడానికి అక్కడికి వచ్చినప్పుడు, అతన్ని యాగ కుండంలో పడవేయమని చెప్పాడు. శివుడు చెప్పినట్లుగానే దేవతలు చేసారు, శివుడు యాగ కుండంలో అగ్ని రూపంలో ఉండి యజ్ఞకుండంలో పడిన కేశిని నాశనం చేశాడు. దేవతలు సంతోషించి, "లోకకల్యాణం" కోసం ఆ ప్రదేశంలోనే ఉండమని శివుడిని అభ్యర్థించారు. అసురుడైన కేశి నంజు అంటే విష స్వరూపుడు. ఆ విష స్వరూపాన్ని శివుడు నాశనం చేశాడు కాబట్టి అక్కడ శివుడు స్వయంబు లింగమూర్తిగా కనిపించినప్పుడు, ఆయనను నంజుండేశ్వరర్ అని కీర్తిన్చారట.
పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సు ఖండించడం తరువాత మళ్ళీ తండ్రి ద్వారానే తల్లిని బతికిన్చుకోడం ఈ కథను మనం పురాణాల్లో వింటాం. అయితే ఈ సంఘటన తరువాత జరిగిన దానికి మానసిక వ్యాధితో ఆసేతు హిమాచలం పర్యటించాడట పరశురాముడు. సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చేసరికి పరశురామునికి మనఃశాంతి కలిగిందట. అక్కడ ఆది కేశవుని ఆలయం ఉందట. దాంతో ఇక్కడే కొంతకాలం తపస్సు చేసుకుందామని నిర్ణయించుకొని, అక్కడ పొదలు, తుప్పలతో ఉన్న స్థలాన్ని తన గొడ్డలితో శుభ్రం చేయడానికి పూనుకున్నాడు. ఈ ప్రక్రియలో ఒక దగ్గర గొడ్డలి తగిలి, ఒక దగ్గర రక్తం బయటికి చిమ్మింది. చూస్తె అక్కడ శివలింగం కనిపించింది. దాంతో అయ్యయ్యో ఎంత ఘోరం జరిగింది. అని తన వలన జరిగిన తప్పిదానికి పరిపరి విధాల పరితపించాడు పరశురాముడు. శివుడు అతని ముందు ప్రత్యక్షమై, అతన్ని ఊరడించి ఆ ప్రాంతం నుండి తడి మట్టిని లింగంపై పూయమని ఆదేశించాడు. పరశురాముడు అలాగే చేసాడు. ఆశ్చర్యకరంగా అద్భుతంలా, రక్తస్రావం ఆగిపోయింది.
అప్పుడు శివుడు ప్రత్యక్షమయి... అతడిని ఊరడించి, కేశవుని ఆలయానికి సమీపంలోనే తనకూ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. అలా అక్కడ పరశురాముడు శివునికి ఆలయం నిర్మింపచేసాడని ఓ కథనం. అక్కడే పరశురాముడు చాలాకాలం తపస్సు చేసాడని, ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఈ క్షేత్రాన్ని, తనను దర్శించిన భక్తులు తప్పకుండా పరశురాముడిని దర్శించుకుంటేనే యాత్రా ఫలితం వారికి కలుగుతుందని పరశురామునికి వరమిచ్చాదట. అందుకే భక్తులు తప్పనిసరిగా ఇక్కడ చిన్న ఆలయంలో కొలువైన పరశురాముని కూడా దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నదిలో ఉప్పు, బెల్లం వేసి ప్రార్ధిస్తారు. అలా చేస్తే వ్యాధులు నయమయి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఈ ఆలయాన్ని మొదట 9వ శతాబ్దంలో పశ్చిమ గంగ రాజులు నిర్మించారు మరియు తరువాత దీనిని చోళ, హోయసాల, విజయనగర మరియు వడయార్ రాజవంశాలకు చెందిన వివిధ రాజులు అభివృద్ధి చేసి విస్తరించారు. స్థూపాకార స్తంభాలతో కూడిన చిన్న చతురస్రాకార గర్భ గృహం (లోపలి గర్భగుడి) గంగా కాలంలో నిర్మించబడింది. అసలు గర్భగుడి ముందు ఉన్న మంటపాన్ని 13వ శతాబ్దంలో హోయసాల కాలంలో నిర్మించారు. శ్రీ కంఠేశ్వర, విష్ణు, పార్వతి మరియు చండికేశ్వరలపై ఉన్న నాలుగు స్టక్కో శిఖరాలు (పుణ్యక్షేత్రాలపై ఉన్న చిన్న గోపురాలు) విజయనగర రాజులు నిర్మించారు.
లోపలి గర్భగుడిలో శ్రీ కంఠేశ్వరుడు ఒక మీటరు పొడవున్న ఆకుపచ్చ బూడిద రంగు రాతి శివలింగ రూపంలో కనిపిస్తాడు. ప్రధాన మందిరం యొక్క ఎడమ వైపున శ్రీ దేవి మరియు భూదేవితో కూడిన విష్ణువు మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం వెనుక చండికేశ్వర స్వామి మందిరం ఉంది. వాయువ్య దిశలో పార్వతి మందిరం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే ఎనిమిది అడుగుల ఎత్తైన రాతి నందిని 1644లో దళవోయ్ (చీఫ్ సైన్యాధిపతి) విక్రమరాయ ప్రతిష్టించారు.
ఇది కర్ణాటకలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి, కర్నాటక లో ఇలాంటి అద్భుత, ఆలయాలు చాలానే ఉన్నాయి మరి కర్నాటక లో మీరే క్షేత్రాలు చూసారో కామెంట్స్ లో తప్ప్పకుండా చెప్పండి. అలాగే ఇక్కడ రోగాలను నయం చేసే శివుని మహిమల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సరే
ఇది 385”x165” అడుగుల కొలతలు మరియు 50,000 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంది. ఏడు అంతస్తులు మరియు ఏడు బంగారు పూత పూసిన కలశాలతో ప్రధాన ద్వారం వద్ద ఉన్న టవర్‌ను 1845లో శ్రీ కృష్ణ రాజ వడయార్ భార్య రాణి దేవజమ్మమి నిర్మించారు. వివిధ అంతస్తులపై రాతి విగ్రహాలతో ఉన్న పసుపు రాతి నిర్మాణం చాలా ఆకర్షణీయంగా మరియు ఆకట్టుకునేలా కనిపిస్తుంది.
నంజనగూడులోని ప్రధాన ఆలయానికి 500 మీటర్ల దూరంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఉంది. ఈ మఠంలో రాతి విగ్రహం రూపంలో రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకోవచ్చు.
నంజనగూడు వద్ద కబిలి నది పై 1735లో నిర్మించిన రైల్ కం రోడ్ వంతెన కూడా చూడదగినదిగా చెప్తారు. దీనిని హెరిటేజ్ మాన్యుమెంట్గా ప్రకటించారు.
నంజనగూడు అక్కడ పండే ప్రత్యేక రకం అరటి పళ్లకు ప్రసిద్ధి. ఈ రకం అరటి పళ్లను స్థానికులు నంజనగూడు రసబాళె అని పిలుస్తారు. ఈ జాతి అరటిపళ్లకు కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ భౌగోళిక గుర్తింపు నిచ్చింది
నంజనగూడు ఆయుర్వేద వైద్యానికి కూడా ప్రసిద్ధి. 1950- 60 దశకాలలో కీ.శే.బి.వి.పండిట్ సద్వైద్యశాల పేరుతో తయారు చేసిన అనేక ఆయుర్వేద మందులకు దేశమంతటా గిరాకీ ఉండేదని చెబుతారు. ప్రముఖ కర్ణాటక సంగీతవిద్వాంసురాలు బెంగుళూరు నాగరత్నమ్మ ఈ పట్టణంలోనే జన్మించింది.
ఈ ఆలయంలో జులైలో నెలలో గిరిజా కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో అద్భుతమైన చెక్కడం పనితో చేసిన 5 చెక్క రధాలున్నాయి. వీటినే పంచరధాలు అంటారు.
వీటితో ఏప్రిల్ నెలలో పది రోజులపాటు జరిగే పంచ మహారథోత్సవంలో గణపతి, శ్రీకంతేశ్వరుడు, చండికేశ్వరుడు,సుబ్రహ్మణ్యస్వామి, పార్వతీదేవి మూర్తులను ఊరేగిస్తారు. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ దర్శనం చేసుకోవచ్చు.
నంజన్‌గూడ్‌కు సమీప విమానాశ్రయం మైసూర్, ఇక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి కేబ్ లలో వెళ్ళవచ్చు.
నంజనగూడులో రైల్వే స్టేషన్ ఉంది. మైసూరు నుంచి వివిధ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ పట్టణానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇది బెంగళూరు నుండి 163 కి.మీ మరియు మైసూర్ నుండి 23 కి.మీ దూరంలో ఉంది. మైసూర్ మరియు చామరాజనగర్ నుండి బస్సులు నడుస్తాయి.