Vijaya Lakshmi
Published on Oct 17 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ఎన్నో రహస్యాలకు, అద్భుతాలకు, నమ్మలేని నిజాలకు నిలయం. మానవ బాలికగా ఉద్భవించి, రాజ్యాన్ని కూడా పరిపాలించిన మీనాక్షిదేవి అమ్మవారిగా ఎలా మారింది?
ఒక మామూలు బాలికకు భిన్నంగా మూడు స్తనాలతో ఆవిర్భవించిన మీనాక్షిదేవి మళ్ళీ మామూలు బాలికగా ఎలా మారింది?
తన రాజ్య విస్తరణలో భాగంగా రాణి మీనాక్షీదేవి కైలాసం మీదికి దండెత్తి, శివుడితో యుద్ధానికి సిద్ధపడినపుడు ఏంజరిగింది?
మీనాక్షి అమ్మవారి ఆలయం కింద రహస్య సొరంగాలు, రహస్య మార్గాలు ఉన్నాయా? ఉంటే అవి ఎందుకు ఏర్పరచారు? ఆ రహస్యమార్గాలు ఎక్కడికి దారితీస్తాయి...
ఈ ఆలయంలో స్తంభాలను ముట్టుకుంటే నిజంగానే సంగీతం వినిపిస్తుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం గురించి విన్నప్పుడు.
దక్షిణ భారతదేశంలో మణిలాంటి నగరం మదురై… అంటారు. ప్రతీ వీధి గోపురాల కాంతితో మెరిసిపోయే ఈ నగరం, భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రతీక.ఈ నగరానికి ఆత్మ, హృదయం, గౌరవం అన్నీ ఒక్కటే అదే... మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం. మదురై అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది మీనాక్షి అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయం కలైవేగాయి నది ఒడ్డున ఉంది. ఎన్నో అద్భుతాలకు, అంతకుమించిన రహస్యాలకు, ఎన్నో విచిత్ర కథనాలకు నిలయం మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం.
మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ, వారసత్వాలకు మదురై చిహ్నంగా చెప్తారు. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటి మదురై. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, ఈ నగరాన్ని అభివృద్ధి పరచినట్టు చరిత్ర చెబుతోంది. భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలకు ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటిగా చెప్తారు.
పురాణాల ప్రకారం మీనాక్షీదేవి అవతారం ఎలా జరిగిందంటే... పాండ్యరాజు మలయధ్వజపాండ్యుడు రాణి కాంచనమాలకు సంతానం లేదు. సంతానం కోరుతూ వారు శివపార్వతులను ప్రార్థిస్తూ యజ్ఞం చేశారు. ఆ యజ్ఞాగ్నిలోంచి వెలువడింది ఒక శిశువు. కాని అలా ఉద్భవించిన ఆ బిడ్డకు అసాధారణ లక్షణాలు ఉన్నాయి. ఆమె కళ్ళు చేపలవలె మెరిసేవి. అందుకే ఆమెను ‘మీనాక్షి’ అని పిలిచారు. ఆమె చేతుల్లో త్రిశూలం, సింహాసనం, దివ్య కాంతి ఉండేవట. ఆమె ఉద్భవించే సమయంలోనే మూడు స్థనాలతో ఆవిర్భవించింది. ఇది గమనించిన తల్లిదండ్రులు... లేక లేక కలిగిన బిడ్డ ఇలా ఆసాధారణ లక్షణంతో పుట్టిందేంటా? అని విచారంలో మునిగిపోయారు. అయితే ఆమెను వివాహం చేసుకోబోయేవాడు ఎదురవగానే ఆ బాలిక మామూలు రూపంలోకి మారిపోతుందని, ఆమె శరీరం నుంచి ఈ అసాధారణ లక్షణం పోతుందని అశరీరవాణి చెప్పడంతో రాజు, రాజు భార్య విచారంలోనుంచి బయటపడ్డారు.
మీనాక్షిదేవి చిన్న వయసులోనే యుద్ధ విద్యలో నిపుణురాలైంది. రాజ్యాన్ని పాలించే శక్తివంతమైన రాణిగా ఎదిగింది. ఒకసారి ఆమె విజయయాత్రలో కైలాసం మీదకు దండెత్తి వెళ్ళింది. అక్కడ ఆమెకు శివుడి దర్శనం కలిగింది. శివుడి దర్శనం కలగడంతోనే ఆమెలో ఉన్న అసాధారణ లక్షణం మూడవస్థనం మాయమైంది. దాంతో ఆమెకు, తాను సాక్షాత్ పార్వతీదేవి అవతారం అన్న జ్ఞానం తెలిసింది.
ఆ తర్వాత, శివుడు సుందరేశ్వరుడిగా అవతరించి, మదురైకి వచ్చి మీనాక్షిదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని దేవతలంతా ప్రత్యక్షంగా చూశారని అదే రోజు నుంచి ఈ ఆలయం దంపతులు మీనాక్షీ సుందరేశ్వరులకు శాశ్వత నివాసమైందని చెబుతారు.”
“మదురై మీనాక్షి దేవాలయంలో జరిగే దివ్య కల్యాణోత్సవం, ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు పాల్గొనే మహోత్సవం. దేవతల మధ్య జరిగిన ఈ దివ్య వివాహం, ‘శివ–శక్తి’ సమైక్యతకు ప్రతీకగా భావిస్తారు.
ఇది కేవలం భక్తి వేడుక కాదు ప్రపంచ సృష్టి శక్తుల కలయికకు సూచకంగా భావిస్తారు. ఆ రోజు మదురై మొత్తం వెలుగులతో, పూలతో, భక్తిగీతాలతో కళకళలాడుతుంది.”
మదురై మీనాక్షి ఆలయ చరిత్ర
“మదురై మీనాక్షి ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిదని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశ ఆలయాల చరిత్రలోనే ఒక అద్భుతం మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు ద్రావిడ శిల్పకళా చరిత్రలో ఒక అపూర్వ అద్భుతం.
2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవనవిధానానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. పురాతన తమిళ సాహిత్యంలో కూడా మదురై మీనాక్షి ఆలయ ప్రస్తావన కనబడుతుంది.
చరిత్రకారులు చెప్పినదాని ప్రకారం ఈ ఆలయం మొదట సాధారణ శకానికి పూర్వం 6వ శతాబ్దంలో పాండ్య రాజవంశం కాలంలో నిర్మించబడింది. తరువాత మాలవర్మన్ సుందర పాండ్యుడు ఈ ఆలయాన్ని విస్తరించాడు.
14వ శతాబ్దంలో మదురైపై దాడి చేసిన ముస్లిం సైన్యాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాయి. కానీ భక్తుల శ్రద్ధ, కళాకారుల నిబద్ధతతో నాయక రాజులు తిరిగి ఈ దేవాలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. ప్రస్తుత గోపురాలు, ప్రాంగణాలు, శిల్పాలు అన్నీ 16వ శతాబ్దంలో తిరుమల నాయకుడు కాలంలో నిర్మించబడ్డవి. ఆయనే ఈ దేవాలయానికి నేటి రూపాన్ని ఇచ్చిన గొప్ప పాలకుడు.
“మదురై మీనాక్షి ఆలయం ద్రావిడ శిల్పకళకు అత్యుత్తమమైన ఉదాహరణ. ఇది సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 14 గోపురాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ఎత్తైనది దక్షిణ గోపురం, దాని ఎత్తు 170 అడుగులు.
ప్రతి గోపురం మీద అద్భుతమైన శిల్పాలు, దేవతా మూర్తులు, యక్షిణీలు, గంధర్వుల రూపాలు చెక్కబడ్డాయి. వివిధ వర్ణాలతో ఆకర్షనీయంగా చిత్రించబడిన మూర్తులతో దేవాలయం అద్భుత లోకంలా దర్శనమిస్తుంది. ఆలయంలో సుమారు 33000 శిల్పాలు ఉండటం విశేషంగా చెబుతారు. ఈ ఆలయం వెండి బలిపీఠంపై నిర్మించిన నటరాజ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. 14 కి పైగా గోపురాలు, రెండు అందంగా అలంకరించబడిన బంగారు విమానాలు ఇక్కడ ప్రత్యేకత.
మీనాక్షి దేవి విగ్రహం పచ్చ ఎమరాల్డ్ కాంతిలా మెరిసే కళ్ళతో, సింహాసనంపై కూర్చుని ఉన్న శక్తి రూపంతో దర్శనమిస్తుంది. కుడి చేతిలో పుష్పం, ఎడమ చేతిలో త్రిశూలంతో ఉంటుంది.
ఇక్కడ సుందరేశ్వర స్వామిగా కొలువైన శివుడు సౌమ్య రూపంతో దర్శనమిస్తారు.
స్వామి ఇక్కడ భక్తులకు సౌందర్యం, జ్ఞానం ప్రసాదిస్తాడు. శివ పార్వతులు, మీనాక్షీ సుందరేశ్వరులుగా ఆరాధించబడే ఈ ఆలయం ‘శివ–శకక్తుల సమైక్యత’కు చిహ్నంగా చెప్తారు.”
సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా స్వామివారిని దర్శించుకుని, తర్వాత అమ్మ వారిని దర్శించుకోవడం సాంప్రదాయం. అయితే మధురైలో ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలన్నది ఆచారం. ఇక్కడి ఆలయంలో ప్రధాన స్థానం మీనాక్షి అమ్మవారిదే. మొదట పూజ మీనాక్షి దేవికి, ఆ తర్వాతే సుందరేశ్వరుడికి. అదే అమ్మ భక్తి పరాకాష్ట.
గర్భాలయంలో మీనాక్షి అమ్మవారు నిలబడి ఉన్న భంగిమలో కొలువుదీరి దర్శనమిస్తారు. ద్విభుజాలతో ఒక చేతిలో చిలుకను ధరించి, మరో చేయి వయ్యారంగా కిందకు జార విడిచి దర్శనమిస్తారు.
అమ్మవారి దర్శనం అనంతరం స్వామివారి ఆలయానికి వెళ్ళే దారిలో సుమారు ఎనిమిది అడుగుల ఎత్తున్న వినాయకుడిని దర్శించు కోవచ్చు. అనంతరం కంబత్తడి మండపం ఉంది. ఈ మండపం మధ్యలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం, నందీశ్వరులను దర్శించుకోవచ్చు. ఈ మండపంలోని ఎనిమిది స్తంభాలపై అద్భుతమైన దేవతా శిల్పాలు ఉన్నాయి.
సుందరేశ్వరస్వామి వారి ఆలయానికి వెళ్లే ద్వారానికి ఇరువైపులా సుమారు 12 అడుగుల ఎత్తున్న ద్వారపాలకులు కొలువుదీరి దర్శనమిస్తారు. ప్రధాన ఆలయంలో సుందరేశ్వరస్వామి లింగ రూపంలో ఉంటారు. ఈ ఆలయానికి ఉత్తరభాగంలో కదంబవృక్షం, యాగశాలలున్నాయి. అక్కడికి సమీపంలో కాశీవిశ్వనాథ స్వామి, సరస్వతీ దేవి, ఇతర దేవతలుంటారు.
మీనాక్షి అమ్మన్ ఆలయం కింద రహస్య సొరంగాలు, రహస్య మార్గాలు ఉన్నాయని అనేకమైన కథలున్నాయి. ఈ సొరంగాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు దారితీస్తాయని, యుద్ధాల సమయంలో వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పురాతన రాజులు ఈ సొరంగాలు, రహస్య మార్గాలు ఉపయోగించారని నమ్ముతారు.
దండయాత్రల సమయంలో ఈ సొరంగాలను తప్పించుకునే మార్గాలుగా ఉపయోగించారని కొందరు నమ్ముతారు, మరికొందరు మీనాక్షి అమ్మన్ ఆలయ పూజారులు రహస్య ఆచారాలు నిర్వహించే కోసం వీటిని ఉద్దేశించారని చెబుతారు. ప్రస్తుతం ఈ సొరంగాలు, ఈ మార్గాలు ప్రజలకు కనిపించకుండా ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన కథలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసినది అయ్యర్ మండు హాల్’ అని పిలువబడే సహస్ర స్తంభాల మండపం, ఇది ఒక శిల్పకళా అద్భుతం.
ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది, సంగీతం పాడుతుంది. ఇందులోని రాతి స్తంభాలను తడితే స్వరాలు వినిపిస్తాయి. అందుకే వీటిని “సంగీత స్తంభాలు” అంటారు. ఇది ఆలయ నిర్మాణ కళాకారుల ప్రతిభకు నిదర్శనం.”
మీనాక్షి అమ్మన్ ఆలయం యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి దాని నిర్మాణ వైభవం. వెయ్యి స్తంభాల మంటపం. పురాతన చేతిపనుల కళాఖండం. నిజానికి మండపంలో 985 స్తంభాలే ఉంటాయి. కానీ అది అంతులేనిది అనే భ్రమను కలగచేస్తుంది. అందుకే ఆ పేరు వచ్చిందని చెప్తారు. ప్రతి స్తంభం వివిధ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, చారిత్రక సంఘటనలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది.
ఈ మండపానికి మరింత విశిష్టత తెచ్చిపెట్టేవి సంగీత స్తంభాలు. కొన్ని స్తంభాలు చేత్తో తట్టినపుడు విభిన్న సంగీత స్వరాలు వినబడతాయి. రాతి నుండి సింఫొనీని సృష్టిస్తాయి. ఈ వింత... ఆధునిక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అబ్బురపరుస్తుంది, ఎందుకంటే ఇది పురాతన భారతీయ కళాకారుల ధ్వనిశాస్త్రం, రాతి పనితనం యొక్క గొప్పతనం తేటతెల్లం చేస్తుంది.
మీనాక్షి అమ్మవారి ఆలయం 14 ఎత్తైన గోపురాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కటి ద్రావిడ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణగా ఉంటుంది. గోపురాల నిండా దేవతలు, జంతువులు, పౌరాణిక సంఘటనలకు సంబంధించిన వేలకొద్దీ చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ గోపురాలలో ఎత్తైనది, దక్షిణ గోపురం, 170 అడుగుల ఎత్తుతో మైళ్ల దూరం నుండి కనిపిస్తుంది, ఇది మధురైలో ఒక మైలురాయిగా నిలబడుతుంది.
ఆలయంలో మరో విశేషం పొట్రమరై కులం లేదా పవిత్ర బంగారు లోటస్ పాండ్. బంగారు లోటస్ ట్యాంక్, మీనాక్షి అమ్మవారి ఆలయ సముదాయంలో అంతర్భాగంగా ఉంటుంది.
ఈ చెరువు కేవలం నీటి వనరు మాత్రమే కాదు; దీనికి లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ నీటిలో వైద్యం చేసే లక్షణాలు ఉన్నాయని, ఆత్మను శుద్ధి చేయగల శక్తి గలవని నమ్ముతారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ చెరువులో స్నానం చేసి వెళతారు. అలా చేస్తే మీనాక్షి సుందరేశ్వరుల ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతారు.
నీరు స్పష్టంగా ఉంటుంది, ఆలయ గోపురాలను, మధ్యలో ఉన్న బంగారు కమల విగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది.
పురాతన కాలంలో ఈ చెరువును సాహిత్య రచనలకు పరీక్షా స్థలంగా ఉపయోగించారని కూడా నమ్ముతారు. చెరువు ఉపరితలంపై తేలియాడే రచనలు మాత్రమే పండిత గుర్తింపుకు అర్హమైనవిగా పరిగణించబడేవట.
మీనాక్షి అమ్మవారి ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి రాత్రిపూట జరిగే సుందరేశ్వరుడి ఊరేగింపు. ఇక్కడ సుందరేశ్వరుడిని మీనాక్షి అమ్మవారి గదికి ఉత్సవంగా తీసుకువస్తారు. ఈ ఆచారం శతాబ్దాలుగా ప్రతి రాత్రి నిర్వహించబడుతోంది.
సంగీతం, కీర్తనలు మరియు నైవేద్యాలతో ఊరేగింపు జరుగుతుంది, ఈ వేడుకను చూడటం వల్ల జీవితంలో శాంతి మరియు సామరస్యం లభిస్తుందని నమ్ముతారు.
మధుర మీనాక్షి ఆలయంలో ప్రతిరోజూ నిత్యపూజలు విశేషంగా జరుగుతాయి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఆలయంలో ఉంజల్ సేవ జరుగుతుంది. ఆ రోజు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
ఇక్కడ ప్రతి ఏటా చిత్రై మాసంలో ‘మీనాక్షి తిరుకల్యాణ మహోత్సవం’ జరుగుతుంది. ఈ కల్యాణం ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
ఈ ఉత్సవం 10 రోజులపాటు సాగుతుంది. ఆ సమయాల్లో మదురైలో భక్తజనుల సందడి సముద్రఘోషను తలపింపచేస్తుందని చెబుతారు.
దేవీ నవరాత్రులు, పంగుని ఉత్సవం, కార్తిక దీపోత్సవం వంటి పండుగలు కూడా ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుతారు.”
మదురై మీనాక్షి ఆలయం కేవలం దేవాలయం కాదు… అది ఒక జీవ శక్తి కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతీ భక్తుడికి ఒక అనుభూతి కలుగుతుంది. ఇక్కడ అడుగుపెట్టినవారు దేవతా శక్తి నేరుగా మనసును తాకినట్టుగా ఆనుభూతి కలుగుతుంది.
మీనాక్షి అంటే ‘చేప కళ్ళు కలదీ’ అని చెబుతారు... అయితే అది మాత్రమె కాదు ‘ఎప్పుడూ జాగ్రత్తగా తన భక్తులపై కళ్ళు ఉంచే తల్లి’ అనే అర్థం.అందుకే ఈ అమ్మవారిని ‘మదురై తల్లి’ అని పిలుస్తారు.
ఆమె అనుగ్రహం కలిగినవారికి జ్ఞానం, ఆరోగ్యం, సమృద్ధి లభిస్తుందని విశ్వాసం.”
“మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం మన సంస్కృతి, శిల్పకళ, భక్తి, ప్రేమల కలయిక. ఇక్కడ ప్రతీ రాయి, ప్రతీ గోపురం, ప్రతీ స్తంభం ఎదో ఒక కథ చెబుతుంది. అందుకే మదురై దర్శించినపుడు కేవలం ఒక గుడిని చూడడమే కాదు ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అనుభూతి చెందుతాం.
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మదురైకు రైలు సౌకర్యం ఉంది.