జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్న క్షేత్రం శ్రీశైలం | హిరణ్యకశిపుడి పూజామందిరం | Shri Sailam full story

Vijaya Lakshmi

Published on Dec 09 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

శ్రీశైలం...

ఎన్నో విశిష్టతల సమాహారం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్న క్షేత్రం శ్రీశైలం.  ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి శ్రీశైలంలోనే ఉన్నాయి.  

ఈ క్షేత్రం ఒకప్పటి హిరణ్యకశిపుడి పూజామందిరంగా చెప్తారు. ఈ ప్రాంతం భూమి మొత్తానికి నాభిప్రాంతంగా చెప్తారు. అధ్యాత్మికంగానే కాదు, చారిత్రాత్మకంగాను, పర్యాటకంగాను, కూడా విశేష ప్రాధాన్యత సంతరించుకున్న క్షేత్రం. తెలుగువారితో పాటు అటు మహారాష్ట్రులతోను ఇటు కన్నడ ప్రజలతోను కూడా అనుబంధమున్న క్షేత్రం. ఆ ఆలయంలో స్వామికి జరిగే పూజలు, ఉత్సవాలయితే ఇంకెక్కడా లేనివిధంగా విలక్షణతకు నిలువుటద్దంగా ఉంటాయి. దట్టమైన అడవుల్లో నెలకొన్న యుగయుగాల చరిత్ర కలిగిన శైవ క్షేత్రం. దివ్యశిలలకు, దివ్యౌషధులకు ఆటపట్టు. ఎన్నో రహస్యాలకు మరెన్నో అద్భుతాలు నెలవైన క్షేత్రం శ్రీశైలం.

పరమేశ్వరుడు లింగరూపంలో స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది.. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి శ్రీశైల క్షేత్రం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలు రెండే. అందులో ఒకటి కాశీ అయితే మరొకటి శ్రీశైలం. మరే క్షేత్రానికీ లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానికి ఉంది. పూజారంభంలో సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చొని తాము భగవదారాధనచేస్తున్నదీ విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. కురుక్షేత్రంలో లక్షలకొద్దీ దానాలు చేస్తే, గంగలో రెండువేల సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సుచేస్తే, కాశీక్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యం శ్రీశైలం క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని పురాణాలు చెప్తున్నాయి. ఈ భూమ్మీద వెలసిన కైలాశం శ్రీశైలం అని చెప్తారు.



కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దరుణాచలే

దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు

అతి ప్రాచీన క్షేత్రం

దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని సిరిగిరి,శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడు,ద్వాపరయుగం నాటి పాండవుల దగ్గర్నుంచి  కలియుగంలో ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, మరాఠా వీరుడు శివాజీ వరకు ఎంతోమంది ప్రముఖులు సేవించి సేవలు చేసిన మహాక్షేత్రం శ్రీశైలం.

 స్కాందపురాణంలోని శ్రీశైల ఖండంలోను, అష్టాదశ పురాణాల్లోనూ, రామాయణ, భారతది ఇతిహాసాల్లోనూ శ్రీశైల ప్రస్తావన కనబడుతుంది. ఎన్నో  సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్ర వర్ణనలున్నాయి.

ఎప్పటిదీ క్షేత్రం

 శ్రీశైలం ఎప్పుడు వెలసిందీ స్పష్టంగా తెలియజేసే ఆధారాల్లేకపోయినా ఈ క్షేత్రం వయసు...మాత్రం రెండు వేల ఏళ్ల పైమాటే అని చెప్తారు.

క్రీ.శ. ఒకటో శతాబ్దం నాటికే శ్రీశైల క్షేత్రం నిర్మించబడిందని, ప్రసిద్ధిలోకీ వచ్చిందని కొన్ని శాసనాలు చెప్తున్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతుడైన మల్లికార్జునుణ్ణి దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించి, అశేష వస్తుసంపదలు సమర్పించినట్లు ఆధారాలున్నా

యి.



కాకతీయుల కాలంలో శ్రీశైల ప్రభ అఖండంగా వెలిగిపోయింది. గణపతి దేవుడు, రుద్రమాంబ, ప్రతాపరుద్రుల కాలంలోను, వారి తరువాత, రెడ్డి రాజుల కాలంలో పోలయ వేమారెడ్డి ప్రాభవంలో శ్రీశైలం మరింత అభివృద్ధిని చవిచూసింది. ఇక శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాలయ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. కృష్ణదేవరాయలు శ్రీశెలాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచాడు. ప్రధాన గోపురాన్ని నిర్మించాడు. గజపతులను జయించి వచ్చేటప్పుడు తన భార్యలతో (తిరుమలదేవి, చిన్నమదేవి) సహా స్వామిని దర్శించుకున్నాడు.

రాక్షస తంగడి యుద్ధంలో రామరాజు ఓటమి శ్రీశైలం మీద కూడా ప్రభావం చూపించింది. తరువాత  గోల్కొండ, బీజాపూర్‌ సుల్తానులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 1618 ప్రాంతంలో అబ్దుల్‌ వహాబ్, అబ్దుల్‌ మహ్మద్‌ అనే వ్యక్తులు కర్నూలును చేజిక్కించుకున్నారు. శ్రీశైలంలోని వ్యక్తులకు దానంగా వచ్చిన గ్రామాలను తమ రాజ్యంలో కలుపుకున్నారు. ఫలితంగా దేవాలయంలో అన్ని కార్యక్రమాలు, ఉత్సవాలు ఆగిపోయిన పరిస్తితి ఏర్పడింది.

అలా చాలా కాలం  శ్రీశైలం ఇబ్బందులకు గురైంది. కొంతకాలానికి  మరాఠా వీరుడు శివాజీ  శ్రీశైలానికి వచ్చాడు. మల్లికార్జునుడు, భ్రమరాంబలకు పూజలు చేసి, ప్రాకారం గోడకు ఉత్తరాన గోపురం నిర్మింపజేశాడు. ఆ సందర్భంలోనే అమ్మవారు శివాజీకి వీరఖద్గాన్నిచ్చిమ్దని చెప్తారు. అలా శివాజీ శ్రీశైలం రక్షణ బాధ్యత స్వీకరించి, కొందరు మరాఠా సైనికులను ఇక్కడ నియమించాడు. శివాజీతో అనుబంధమున్న పుణ్యక్షేత్రం కాబట్టే మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక స్వామి భక్తురాలు, రచయిత్రి అయిన అక్కమహాదేవి అనే కన్నడ వనిత ప్రభావంతో కన్నడిగులూ శ్రీశైల మల్లన్న భక్తులయ్యారు. 



ఎంతోమంది ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి , మల్లికార్జునుడికి మడి,మాన్యాలూ, ఆస్తులూ సమర్పించడం విశేషమైన విషయంగా చెప్పుకోవాలి. ఔరంగజేబు కాలంలో దావుద్‌ ఖాన్‌ అనే సేనాని కర్నూలు జిల్లాను జాగీరుగా పొందాడు. అతని సోదరుడు ఇబ్రహీం ఖాన్‌ పరమత సహనం కలిగినవాడు కావడంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు. అంతకు ముందు పాలకులు హస్తగతం చేసుకున్న  దేవాలయ . గ్రామాలు, ఆస్తులను తిరిగి ఇచ్చివేయడంతో పాటు శ్రీశైల ధర్మకర్తల సంస్థలను పునరుద్ధరించాడు. ఆ తరువాతి కాలంలో రెండో అసఫ్ జా పరిపాలనలో శ్రీశైల పరిపాలనా బాధ్యతలు శృంగేరీ పీఠానికి అప్పగించాడు.ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ వారి అధికార కాలంలో ఈ ఆలయ నిర్వహణను పుష్పగిరిమఠం స్వీకరించింది.

శ్రీశైలం లో కుల, మత, జాతి తేడాలు లేకుండా, గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది.  భక్తులందరూ గర్భాలయంలోనికి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలుకు తూర్పుదిశలో సుమారు 70 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో సముద్రమట్టానికి 1500అడుగుల ఎత్తున కొండపైన వెలసిన అతి పురాణ ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి, ‘శివానంద లహరి’ని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలుగా  అర్పించారు. భ్రమరాంబదేవి  సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు.

ఇక అపర దత్తావతారుడుగా భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామివారు తన అవతాశ్రీశైలంలోని రాన్ని ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించినట్టు , ఇప్పటికి కూడా కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తుల నమ్మకం.

శిలాదుని కథ

ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదయిన శ్రీశైలం లో పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఎలా ఆవిర్భావిన్చాడో చూద్దాం.

పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు. ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ, నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి, నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరిక ప్రకారం శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు. ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు నంది. తరువాత నంది సోదరుదయిన పర్వతుడు వరం కోరుతూ నీవు నా మీద వేలియాల్సిందని కోరాడు. ఆ కోరిక మేరకు పర్వతుడు శ్రీ పర్వతమ్ గా మారగా ఆ పర్వతమ్ మీద జ్యోతిర్లిమ్హంగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. ఒకసారి శివపార్వతుల పుత్రుడైన కుమారస్వామి తల్లిదండ్రులపై అలిగి క్రౌంచ పర్వతం చేరాడు. పార్వతిమాత  పుత్ర వియోగం భరించలేక పోయింది. కుమారుని చూడాలని శివుని కోరింది. శివపార్వతులిద్దరూ కలిసి పుత్రుని కోసం క్రౌంచ పర్వతం చేరారు. ఆ క్రౌంచ పర్వటమే ఈ శ్రీపర్వతం. ఆ పర్వతం మీద శివుడు మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అమ్మవారు భ్రమరాంబగా మారింది. పుత్రప్రేమతో ఇద్దరూ చాలాకాలం అక్కడే వున్నారని పురాణ కథనం.



మల్లిఖార్జునుడు అని పేరెందుకు వచ్చింది?

ఇక శివుడికి మల్లికార్జున స్వామి అనే పేరు రావడానికి ఒక పురాణం ఉంది. పూర్వం శ్రీశైలానికి దగ్గరలోనే కృష్ణానది తీరాన చంద్రాపురన్ని పరిపాలిస్తున్న రాజుకి చంద్రవతి అనే అందమైన కుమార్తె ఉంది. కుమార్తె పుట్టగానే దండయాత్రలకు వెళ్ళిపోయిన రాజు తిరిగి వచ్చేసరికి తన అంతఃపురంలో తిరుగాడుతున్న అందమైన ఆ కన్యను చూసి బలాత్కారం చేయబోయాడు. ఆమె నేను కూతురినే అని చెప్పినా వినిపించుకోకపోవడంతో అతని నుంచి తప్పించుకోడానికి శ్రీశైలం అడవుల్లోకి పరుగుతీసిన చంద్రావతి అక్కడే ఒక గుహలో తలదాచుకుంది. ఆమెను వెంబడిస్తూ వచ్చాడు రాజు. శివ భక్తురాలైన చంద్రమతి మరోదారిలేక.. తండ్రి నుంచి తనను కాపాడమని శివుడిని ప్రార్థించింది. ఆమె మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చటి శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడిందట. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. 

గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి.. అక్కడో అద్భుతాన్ని చూస్తుంది. ఓ గోవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో అభిషిక్తమవుతున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దీంతో అక్కడే ఆమె శివాలయాన్ని నిర్మించి స్వామివారిని నిత్యం మల్లె పూలతో అర్చించేది. ఆమె భక్తిని మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడిగాడు. అప్పుడు చంద్రావతి స్వామీ! నేను మీ శిరస్సుపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను పరమేశ్వరుడు తన శిరస్సుపైనున్న గంగమ్మతల్లి,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కాబట్టి స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని, ఆ ఆలయానికి మల్లిఖార్జున స్వామి ఆలయంగా పేరొందిందని పురాణ కథనం.

భిన్నత్వంలో ఏకత్వం

శ్రీ శైల క్షేత్రం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరశైవులకు ఈ ఆలయం  అత్యంత ప్రధానమయిన ఆరాధ్యనీయ స్థలం. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన లింగధారులు ఇక్కడి ఈ స్వామిని అత్యంత భక్తీ శ్రద్ధలతో అర్చిస్తారు. ఇక ఏ ఆలయంలోనూ ఒక  ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజాదికాలు నిర్వహంచే పవిత్ర బాధ్యతను వీరశైవార్చకులు, భ్రమరాంబను అర్చించే బాధ్యతను బ్రాహ్మణులు నిర్వర్తిస్టారు. శివపార్వతుల కల్యాణాన్ని ఆరాధ్యులు జరిపిస్తే పరివార దేవతలకూ, ఉత్సవమూర్తులకూ వస్త్రాలంకరణ చేసే పనిని విధిని చెంచులు నిర్వహిస్తారు.  శ్రీ  శైలంలో మరో ప్రత్యేకత ‘ధూళి దర్శనం’. ఏ ఆలయానికి వెళ్ళినా కాళ్ళు కడుక్కొని స్వామి దర్శనానికి వెళతాం. కాని శ్రీశైలంలో మాత్రం పాదప్రక్షాళనతో పనిలేకుండా ఆలయంలోకి నేరుగా ప్రవేశించి, శివ దర్శనం చేసుకోవచ్చు.



మల్లన్న తలపాగా

ఇక శ్రీశైల మల్లన్నకు శివరాత్రి రోజు జరిగే ఒక ఉత్సవం స్వామి కల్యాణం అందులో శ్రీశైల మల్లన్నకు తలపాగా చుట్టే వేడుక. మహా శివరాత్రిన జరిగే శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవంలో శివుణ్ని వరుడిగా అలంకరణ చేస్తారు. అలా అలంకరించిన తరువాత 150 గజాలు ఉండే పాగావస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చుడతారు. ఇదే స్వామి తలపాగా. ఈ పాగా చుట్టే ఉత్సవాన్ని చూడ్డానికే లక్షలాదిఎంతోమంది ప్రజలు తహతహలాడతారు. ఈ తలపాగా చుట్టడం పూర్తయిన తరువాతే స్వామి కల్యాణం ప్రారంభిస్తారు.

విభిన్న క్షేత్రాల సమాహారం

శ్రీశైలం విభిన్న క్షేత్రాల సమాహారం అని చెప్పొచ్చు. అందులో ప్రధానమైనవి పాతాల గంగ, మనం శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి దేవాలయం , హటకేశ్వర స్వామి దేవాలయం,పాలధార పంచదార, శిఖర దర్శనం, కైలాసద్వారం, భీముని కొలను, ఇష్టకామేశ్వరి దేవాలయం ఇలా ఎన్నో ప్రధాన ఆలయాలున్నాయి.

వసతి...

శ్రీశైలంలో వసతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ హోటల్స్ లో కూడా రూమ్స్ తీసుకోవచ్చు. దేవస్థానం వసతి గృహాలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన దేవాంగ సత్రం, వైశ్య సత్రం ఇలా ప్రత్యేక వసతి గృహాలు కూడా ఉంటాయి.

ఎలా వెళ్ళాలి

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.

రైల్లో వెళ్ళాలంటే మార్కాపురం వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి శ్రీశైలం కొండమీదికి బస్సులో వెళ్ళాలి.

హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. అలాగే అన్ని పెద్ద పెద్ద నగరాలనుంచి బస్సులుంటాయి.


ఇవి కూడా చదవండి

Recent Posts