Vijaya Lakshmi
Published on Jul 23 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఎత్తైన కొండపై వెలసిన వైభవం విశాఖపట్నం పద్మనాభం పద్మనాభస్వామి దేవాలయం. విశాఖపట్నం జిల్లాలో రేవడి పద్మనాభంలో, పచ్చటి పచ్చదనంతో నిండిన ఎత్తైన కొండమీద కొలువై ఉంది. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం. పాండవులు ప్రతిష్టించిన పద్మనాభస్వామి.
ఒక చారిత్రిక యుద్ధానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. అదే పద్మనాభం యుద్ధం. విజయనగర రాజులకు ఆంగ్లేయులకు మధ్య జరిగిన పద్మనాభం యుద్ధం, విజయనగరాధీశుల పౌరుషానికి, తెలుగువారి పోరాటానికి, ఉత్తరాంధ్ర వీరోచిత పోరుకు ప్రతీకగా నిలిచిన చారిత్రిక ఘట్టానికి వేదికగా నిలచిన పద్మనాభం. కొండ దిగువన ఉన్న కుంతీమాధవస్వామి ఆలయంలోనే యుద్ధఏర్పాట్లు , చర్చలు జరిగాయి.
పద్మనాభస్వామి దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, ప్రకృతి శోభతో ఆధ్యాత్మికత మేళవించిన ఒక అద్భుత సమ్మేళనం. ఆలయానికి వెళ్లే ప్రతి అడుగు, చుట్టూ అలుముకున్న ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, మనసుకు హాయినిచ్చే పచ్చదనం... ఎత్తైన కొండమీద నుంచి చూస్తే ఆహ్లాదకరమైన పచ్చదనంతో పాటు ఒళ్ళు గగుర్పిడిచే లోతైన లోయ, వాహనంలో వెళుతున్నపుడు అతి చిన్న మలుపులతో ఉత్కంఠభరితమైన ప్రయాణం అన్నీ కలిసి మరో లోకాన్ని కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తుంది.
అనంత పద్మనాభస్వామి దర్శనంతో పాటు, ప్రకృతి ఒడిలో దాగిన అపురూప సౌందర్యాన్ని ఆస్వాదించడం ఒక మధురానుభూతి. కొండల ఒడిలో, పచ్చదనాల మధ్య ప్రశాంత నిలయం. విశాఖపట్నం జిల్లా పద్మనాభం పద్మనాభస్వామి దేవాలయం చరిత్ర విశేషాలు తెలుసుకుందాం...
అనంత పద్మనాభ స్వామి అనగానే మొట్టమొదటగా కేరళ రాజధాని తిరువనంతపురంలోని భారీ నిధి నిక్షేపాలు కలిగిన అనంత పద్మనాభుడే గుర్తుకొస్తాడు. అయితే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా రేవడి పద్మనాభంలో కూడా అనంత పద్మనాభుడు స్వయంభువుగా వెలిసాడు. పాండవుల కోరికపై ఒక శిలమీద పూర్తిగా అవ్యక్యం కాని రూపంలో వెలిసాడు అనంత పద్మనాభుడు.
కొండమీద అనంతపద్మనాభుడుంటే కొండ దిగువన పాండవుల తల్లి కుంతీదేవి ప్రతిష్టించిన కుంతీమాధవస్వామి కొలువుతీరి ఉన్నాడు.
విశాఖపట్నం జిల్లాలో, ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాల గలగలలు, వాటిని ఆనుకొని నిలిచిన పచ్చని కొండ శ్రేణులు... ఈ విశాల ప్రకృతి సౌందర్యం నడుమ, ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న దివ్య క్షేత్రం పద్మనాభం శ్రీ పద్మనాభస్వామి దేవాలయం. ఎత్తైన కొండపై కొలువుదీరిన స్వామివారి ఆలయం, క్రింద విస్తరించిన లోయల అద్భుత దృశ్యాలు, చుట్టూ అలుముకున్న పచ్చదనం – ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని కేవలం ఒక పుణ్యక్షేత్రంగానే కాకుండా, ప్రకృతి ఆరాధకులకు ఒక స్వర్గధామంగా మారుస్తాయి.
ఆలయానికి చేరుకునే మార్గంలో సాగే ప్రయాణమే ఒక విజువల్ ట్రీట్. ఇక్కడ అడుగు పెడితే, దైవ దర్శనంతో పాటు, ప్రకృతి ఒడిలో లభించే ప్రశాంతత మీ మనసుకు కొత్త శక్తినిస్తుంది. విశాఖ జిల్లా, సింహాచలం నకు ఈశాన్యంగా సుమారు 30 కీ.మీ దూరాన ఉంది పద్మనాభం. స్ధానికులు రేవడి పద్మనాభం గా పిలుస్తారు.
పద్మనాభంలో ఇక్కడ రెండు ఆలయాలుంటాయి. కొండమీద అనంత పద్మనాభస్వామి ఆలయం. కొండ దిగువన కుంతీమాధవస్వామి ఆలయం.
ఆలయ స్థలపురాణం విషయానికి వస్తే మహా భారత సమయంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తు ఇక్కడ తిరుగాడుతున్నప్పుడు శ్రీకృష్ణుని ప్రార్థించి, తమకు కర్తవ్య బోధ చేయమని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తాను ఇక్కడ పద్మనాభునిగా కొలువై కర్తవ్య బోధ చేస్తానని, చెప్పి ఇక్కడ వ్యక్తావ్యక్త రూపంలో అంటే పూర్తిగా కనపడీ కనపడని విధంగా కొలువైనట్లు స్థలపురాణం చెబుతోంది. అనంత పద్మనాభునికి వ్యక్తావ్యక్తరూపం, స్వయంభువు. ఆదిశేషునిపై పద్మ నాభుడు శంఖు చక్రధారియై, లక్ష్మీదేవి సహితంగా కొలువైయ్యాడు. అయితే ఈ విశేషాలన్నీ అవ్యక్తంగా పూర్తిగా కనబడకుండా లీలామాత్రంగా దర్శనమిస్తాయి.
అలాగే కొండ దిగువన ఉన్న కుంతి మాధవ స్వామి ఆలయానికి సంబంధించీ ఓ స్థలపురాణం ఉంది. కుంతీ దేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ట చేసినందువల్ల స్వామికి కుంతీమాధవస్వామి అనే పేరు వచ్చినట్లు చెబు తారు. శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయంలో శ్రీ దేవి సమేతంగా శ్రీ మాధవస్వామి కొలువైనాడు. శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ రుక్మీణి సత్యభామల సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సీతా సమేతంగా శ్రీ రామచంద్రుల ఉత్సవ మూర్తులకు ప్రత్యెక సన్నిధి ఉంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నది ఉత్సవమూర్తులే. ముఖ మండపం నందు శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యేక సన్నిధి ఉంది. భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం వైభవంగా జరుపుతారు.
ఈ కుంతీమాధవస్వామి ఆలయానికి చారిత్రకంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. బ్రిటిష్ వారితో ఉత్తరాంధ్ర సంష్టాదీషుడు విజయరామరాజు గజపతి యుద్ధం చేయడానికి ముందు ఈ ఆలయంలోనే కార్యాచారణ ప్రణాళిక తయారుచేసాదని చరిత్ర చెబుతోంది. బ్రిటిష్ నిరంకుశ ధోరణులు సహించలేక విజయనగరం సంస్ధానాదీశుల రెండో విజయరామ గజపతి రాజు యుద్ధం సన్నాహాలు ప్రారభించాడు. బ్రిటిష్ పాలకులు విజయనగరం కోటను ముట్టడించగా, రాజ కుటుంబం గుట్టుగా సింహాచలం చేరుకున్నారు. పిమ్మట యుద్ధ సైన్యాని సేకరించని విజయరామ గజపతి రాజు, 1794 జూలై 9వ తేది రాత్రి సమయంలో యుద్ధ కార్యాచరణ ప్రణాలికను శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంలో తయారు చేశాడు. ఒక రాజద్రోహి ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ సైన్యం పద్మనాభం చేరుకుంది. 10వ తేది తెల్లవార జామున శ్రీ పద్మనాభస్వామి ఆలయ సాక్షిగా బ్రిటిష్ సైన్యంతో జరిగిన యుద్ధంలో విజయరామ గజపతి రాజు మృతి చెందాడు.
నాగుల చవితి సందర్భముగా పద్మనాభం లో జాతరోత్సవాలు పెద్జ ఎత్తున జరుగుతాయి. భక్తులు ముందుగా కుంతీ మాధవస్వామిని దర్శించుకుని, అనంతరం కొండపైనున్న అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. ఇది అనాదిగా కొనసాగుతున్న ఆచారం.
కొండపైనున్న అనంత పద్మనాభస్వామి సన్నిధికి చేరుకోవాలంటే 1278 మెట్లను ఎక్కాలి. దారిలో 423 మెట్లు వద్ద, 850 మెట్టు వద్ద విశ్రాంతి పందిళ్ళున్నాయి. మెట్లు మాత్రం అంత పక్కాగా అయితే ఉండవు. ఇన్ని మెట్లెక్కి వెళ్ళడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అయినా మెట్లెక్కుతూన్నప్పుడు కనబడే ప్రకృతి అందాలు చూసి తీరవలసిందే తప్ప మాటలతో చెప్పలేం.
పైన చూడండి… ఈ మెట్లదారి ఎంత అద్భుతంగా ఉందొ. కార్తిక మాసంలో దీపోత్సవం సమయంలో ఈ మెట్లన్నీ దీపాలతో అలంకరిస్తారు. ఆ దీపాల వెలుగులతో ఈ మెట్లదారి ఒక అద్భుతంలా, అత్యంత శోభాయమానంగా, కనువిందు చేస్తుంది. యాదవ రాజులు ఈ కార్యక్రమానికి నాంది పలికారని చారిత్రిక కథనాలు చెబుతున్నాయి. 1983 సంవత్సరం నుండి నేటివరకు కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమానికి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల తో పాటు రాయగడ విజయవాడ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళా భక్తులు వస్టారు. కార్తీకమాసంలో దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం దీపోత్సవం సందర్భంగా కోలాటాలు వ్యాసాలు కవితా సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు
కొండ దిగువన మెట్లమార్గం ప్రారంభంలోనే శివాలయం ఉంటుంది. శివకేశవులు కొలువైన పుణ్యక్షేత్రంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయం విలసిల్లుతోంది
ఇక మెట్లెక్కలేనివారు కొండమీదికి వాహనాల మీద వెళ్ళడానికి చక్కటి రోడ్డుమార్గం ఉంది. అయితే ఎత్తైన కొండమీదికి ఉన్న ఆ రోడ్డు మార్గం చాలా చిన్న చిన్న మలుపులతో కాస్త టెన్షన్ పెట్టేదిగానే ఉంటుంది.
కొండపై నుంచి చూస్తున్నప్పుడు, చుట్టుపక్కలనున్న పచ్చని ప్రకృతి సౌందర్యం మనసులను ఆహ్లాద పరుస్తుంటుంది.
స్వామి వారికి నిత్య అర్చనలు, నైవేద్యం సేవలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణం నిర్వహించుతారు. భాద్రపద శుద్ధ చతుర్ధశి నాడు శ్రీ అనంత జయంతి ఉత్సవం జరుగుతుంది. కార్తీక అమావాస్య రాత్రి కొండ మెట్లుకు దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు. నాటి జ్యోతుల వెలుగు చాల దూరం వరకు కనిపిస్తాయి. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు రాష్ట్ర నలుదిశల నుంచి సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఇక్కడ జరిగే కోటి దీపోత్సవంలో పద్మనాభుడి నామస్మరణతో గిరి పరిసరాలు మారుమోగిపోతాయి. ఆ ప్రాంతమంతా భక్త జనసాగారంగా మారిపోతుంది.
ఆధ్యాత్మిక అనుభూతిని, ప్రకృతి సౌందర్యాన్ని ఒకే చోట ఆస్వాదించాలనుకుంటే, మాత్రం పద్మనాభం పద్మనాభస్వామి దేవాలయాన్ని తప్పకుండా దర్శించాల్సిందే..
ఈ పురాతన ఆలయానికి ఎలా వెళ్ళాలో చూద్దాం…
రేవిడి పద్మనాభం గ్రామం చేరుకోవాలంటే... ఇది విశాఖపట్నం నగరం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి సిట్టి బస్సలు, షేరింగ్ ఆటోలు/వేన్లు దొరుకుతాయి. సింహాచలం RTC బస్ స్టాండ్ నుంచి విజయనగరం శొంఠ్యాం, పద్మనాభం, జామి మీదగా తరచుగా . బస్సులుంటాయి. అలాగే విశాఖపట్నం సమీపంలోనే ఉన్న తగరపువలస నుంచి కూడా బస్సులుంటాయి.