త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ | Shocking Truth! Trishanku Swargam

Vijaya Lakshmi

Published on Apr 16 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

త్రిశంకు స్వర్గం కథ పూర్తి వివరంగా తెలుసుకోండి. ఒక రాజు, ఒక శాపం, ఒక మహర్షి… చివరకు కొత్త స్వర్గం ఎలా సృష్టించబడింది?

త్రిశంకు స్వర్గం... ఈ మాట పురాణ ప్రసంగాలలోను, నిత్య జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి వింటూనే ఉంటాం. అసలేంటీ త్రిశంకు స్వర్గం? దేవతలా నివాసం స్వర్గం గురించి మనందరం వింటూనే ఉంటాం. కాని ఈ త్రిశంకు స్వర్గమేంటి?

ఒక ముని ఒక ఛండాలుడి కోసం దేవతలనే ఎదిరించాడు. తన వేల సంవత్సరాల తపస్సును పణంగా పెట్టాడు. ఎందుకో తెలుసా? కేవలం తాను ఇచ్చిన మాట కోసం. ఆయనే విశ్వామిత్రుడు. స్వర్గం నుంచి ఇంద్రుడు తరిమేసిన ఒక రాజు కోసం, భూమికి, ఆకాశానికి మధ్యలో సరికొత్త స్వర్గాన్నే సృష్టిస్తానని విశ్వామిత్రుడు ఎందుకు శపథం చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇది కేవలం పట్టుదల కథ కాదు... అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరిగిన ఓ పెద్ద యుద్ధం. తన మాట కోసం సృష్టి నియమాల్నే మార్చేయాలనుకున్న విశ్వామిత్ర మహర్షి అద్భుత గాధ ఇది. పూర్తి కథ ఈ బ్లాగ్ లో ...


త్రిశంకుని అసాధ్యమైన కోరిక

మనందరికీ కోరికలు ఉంటాయి కదా? కానీ కొన్ని కోరికలు మాత్రం... కాస్త విచిత్రంగా, అసాధ్యంగా అనిపిస్తాయి. సూర్యవంశపు రాజైన త్రిశంకుడికి కూడా అలాంటి ఓ వింత కోరిక పుట్టింది. ఆయన చాలా ధర్మంగానే రాజ్యపాలన చేశాడు, కానీ ఆయన మనసులో మాత్రం ఎవరూ కోరని ఓ పిచ్చి ఆశ బలంగా పాతుకుపోయింది. అదేంటంటే... చనిపోయాక అందరూ స్వర్గానికో, నరకానికో పోతారని చెబుతారు. కాని  చనిపోయాక కాదు, బతికుండగానే, తన శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకున్నాడు త్రిశంకుడు.

త్రిశంకుడు ఎవరు?

సూర్యవంశపు రాజు త్రిశంకుడు, తన పూర్వీకుల్లా కాకుండా, చనిపోయాక ఆత్మ రూపంలో స్వర్గానికి వెళ్లడం కాదు, ఇదే మనిషి శరీరంతో స్వర్గ సుఖాలను అనుభవించాలని బలంగా కోరుకున్నాడు. కానీ ఇది ప్రకృతి ధర్మానికి పూర్తిగా విరుద్ధం. ఈ శరీరం మట్టితో తయారైంది, మట్టిలోనే కలిసిపోవాలి. ఆత్మ మాత్రమే పుణ్య పాపాలను బట్టి పై లోకాలకో, కింది లోకాలకో వెళ్తుంది. కానీ త్రిశంకుడికి ఇది నచ్చలేదు. తన కోరిక నెరవేరాలంటే ఒక పెద్ద యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కోరికను తీర్చగల ఒకే ఒక్క వ్యక్తి తన కులగురువైన వశిష్ఠ మహర్షే అని భావించి, ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడి పాదాల మీద పడి, "గురుదేవా! నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నాను. దయచేసి మీరొక యజ్ఞం చేసి నా కోరిక తీర్చండి" అని వేడుకున్నాడు.

వశిష్టుని తిరస్కరణ

దానికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు ప్రశాంతంగా నవ్వి, "రాజా! నువ్వు కోరుకున్నది అసాధ్యం, అధర్మం కూడా. ప్రకృతి నియమాలను ఎవ్వరూ మార్చలేరు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్లడం జరగని పని. కాబట్టి అలాంటి అధర్మమైన పనికోసం ఈ యాగం నేను చేయలేను" అని ఖరాఖండిగా చెప్పేశారు.

గురుశాపం మరియు త్రిశంకుని పతనం

వశిష్ఠుడు నో చెప్పడంతో త్రిశంకుడికి గుండె పగిలినంత పనైంది. కానీ అతని పట్టుదల చావలేదు, అహం దెబ్బతింది. గురువు కాదంటే ఏంటి, ఆయన కొడుకులైనా నా పని చేయరా? అనే దురాలోచనతో, వశిష్ఠుని నూరుగురు కుమారుల దగ్గరకు వెళ్ళాడు. "మీ నాన్నగారు కాదన్న పనిని మీరు చేసి, మీరేంటో నిరూపించుకోండి. నన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపండి" అని అడిగాడు.

తండ్రి మాటను కాదని తమ దగ్గరకు వచ్చిన త్రిశంకుడి పొగరుబోతుతనానికి వశిష్ఠ పుత్రులకు ఒళ్ళు మండిపోయింది. "ఓరి మూర్ఖుడా! మా తండ్రి, ఒక బ్రహ్మర్షి, అధర్మం అని చెప్పిన పనిని మమ్మల్ని చేయమని అడగడానికి నీకెంత ధైర్యం? గురువు మాటే వినని నువ్వు రాజుగా ఉండటానికి కూడా అనర్హుడివి. ఛండాలుడివి అయిపో!" అని ఘోరంగా శపించారు.

ఆ శాపం వెంటనే పనిచేసింది. తెల్లారేసరికి త్రిశంకుడి బతుకు తలకిందులైంది. రాజు వంటి రూపం పోయి, చూడ్డానికి అసహ్యంగా తయారయ్యాడు. ఒంటి మీద నగలన్నీ ఇనుప గొలుసులయ్యాయి. పట్టు వస్త్రాలు పోయి, మాసిన పీలికల దుస్తులు వచ్చాయి. ఒంటి నుంచి కంపు కొట్టడం మొదలైంది. ఒకప్పటి అందమైన రాజు, ఇప్పుడు ఛండాలుడిగా మారిపోయాడు. సొంత సైనికులే గుర్తుపట్టలేకపోయారు, ప్రజలు ఛీ కొట్టారు. రాజ్యం, కుటుంబం అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు.

విశ్వామిత్రుని అభయం

అవమానంతో, బాధతో కుమిలిపోతూ అడవుల్లో తిరుగుతుండగా, త్రిశంకుడికి ఒక ఆశాకిరణం కనిపించింది. ఆయనే కౌశికుడు, మనందరికీ తెలిసిన విశ్వామిత్రుడు. అప్పటికే విశ్వామిత్రుడుకి వశిష్ఠుడితో పెద్ద గొడవ ఉంది. వశిష్ఠుడి చేతిలో ఓడిపోయి, క్షత్రియ బలం కన్నా తపోబలమే గొప్పదని తెలుసుకున్నారు. ఎలాగైనా వశిష్ఠుడిని మించి 'బ్రహ్మర్షి' అనిపించుకోవాలనే కసితో రగిలిపోతూ తపస్సు చేసుకుంటున్నారు.

అలాంటి సమయంలో త్రిశంకుడు, అదే తన చివరి ఆశ అనుకుని విశ్వామిత్రుడి కాళ్ల మీద పడి, తన కథ మొత్తం చెప్పాడు. శరీరంతో స్వర్గానికి వెళ్ళాలన్న తన కోరిక, వశిష్ఠుడు కాదనడం, ఆయన కొడుకులు శపించడం, తన ప్రస్తుత దుస్థితి అంతా చెప్పుకుని ఏడ్చేశాడు.

అంతా విన్న విశ్వామిత్రుడి కళ్ళలో జాలి, దానికంటే ఎక్కువగా ఒక పట్టుదల కనిపించాయి. వశిష్ఠుడు అసాధ్యం అన్న పనిని తాను చేసి చూపించి, తన తపశ్శక్తి ఏంటో ప్రపంచానికి, దేవతలకు, ముఖ్యంగా తన ప్రత్యర్ధి అయిన వశిష్ఠుడికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. "రాజా! బాధపడకు. నువ్వు కోరినట్టే, నిన్ను ఇదే శరీరంతో, ఈ ఛండాల రూపంతోనే స్వర్గానికి పంపించే బాధ్యత నాది. ఇది కౌశికుని మాట! నా ప్రతిజ్ఞ!" అని అభయమిచ్చాడు.

మహా యాగం మరియు దేవతల తిరస్కారం

విశ్వామిత్రుడు మాట ఇచ్చాడంటే అది శాసనమే. వెంటనే తన శిష్యులను పిలిచి, ఒక పెద్ద యాగానికి ఏర్పాట్లు చేయమన్నాడు. భూమి మీద ఉన్న ఋషులందరినీ యజ్ఞానికి ఆహ్వానించమని పంపాడు. అయితే, వశిష్ఠుడికి భయపడి కొందరు, ఛండాలుడు యజమానిగా చేసే యజ్ఞానికి మేము రాము అని మరికొందరు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ముఖ్యంగా మహోదయుడు అనే బ్రాహ్మణుడైతే, "ఒక ఛండాలుడి కోసం ఒక క్షత్రియుడు యాగాన్ని చేస్తుంటే, దేవతలు వచ్చి హవిస్సు తీసుకుంటారా ఏంటి?" అని వెటకారంగా మాట్లాడాడు.

ఈ విషయం తెలిసిన విశ్వామిత్రుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. తనను అవమానించిన వాళ్లందరినీ శపించి, తన ఆజ్ఞను ధిక్కరించిన వారిని సైతం తన తపోశక్తితో యాగశాలకు లాక్కొచ్చాడు. యాగం మొదలైంది. విశ్వామిత్రుడు మంత్రాలు చదువుతూ, దేవతలను ఆహ్వానించాడు. "ఓ దేవతలారా! రండి, త్రిశంకుడు ఇచ్చే ఈ హవిస్సును స్వీకరించి, అతనికి స్వర్గ ప్రవేశం కల్పించండి"అని.

కానీ, ఎంతసేపటికీ దేవతలు రాలేదు. గురుశాపం ఉన్న ఛండాలుడి యజ్ఞంలో పాలుపంచుకోవడానికి ఇంద్రుడితో సహా ఏ దేవతా ముందుకు రాలేదు. యాగం విఫలం అవుతుందని అందరికీ అర్థమైపోయింది.

విశ్వామిత్రుని తపశ్శక్తి ప్రయోగం

దేవతల తీరు చూసి విశ్వామిత్రుడి అహం దెబ్బతింది. ఆయన కళ్ళు నిప్పుల్లా మారాయి. "దేవతలకు ఇంత అహంకారమా? నా మాటంటే లెక్కలేదా? మీరు రాకపోతే నాకేంటి? నా తపశ్శక్తితోనే ఇతడిని స్వర్గానికి పంపిస్తా! చూస్తూ ఉండండి నా శక్తి ఏంటో!" అని గర్జించాడు.

యజ్ఞగుండం ముందు కూర్చుని, కళ్ళు మూసుకొని, తన వేల సంవత్సరాల తపస్సుతో సంపాదించిన శక్తిని మొత్తాన్ని ప్రయోగించాడు. చేతిలోని నీటిని త్రిశంకుడిపై చల్లి, "ఓ త్రిశంకా! ఇదిగో, నా తపశ్శక్తిని నీకు ఇస్తున్నాను. దేవతలు అడ్డుపడ్డా, నా శక్తి నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తుంది. వెళ్ళు!" అని ఆజ్ఞాపించాడు.

వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఛండాల రూపంలో ఉన్న త్రిశంకుడి శరీరం మెల్లగా గాలిలోకి లేవడం మొదలుపెట్టింది. అక్కడున్న ఋషులందరూ నోరెళ్లబెట్టి చూస్తుండగా, అతను భూమిని వదిలి ఆకాశంలోకి దూసుకెళ్లాడు. ఏ దేవుడి సహాయం లేకుండా, కేవలం ఒక ఋషి సంకల్ప బలంతో ఒక మనిషి శరీరంతో స్వర్గానికి ప్రయాణిస్తున్నాడు.

స్వర్గంలో త్రిశంకుని సంఘర్షణ

త్రిశంకుడు వేగంగా ప్రయాణించి స్వర్గలోక ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. కానీ అక్కడ త్రిశంకుడిని చూడగానే ఇంద్రుడు కోపంతో, "ఆగు! గురుశాపానికి గురైన నీకు, ఈ ఛండాల రూపంతో స్వర్గంలో అడుగుపెట్టే అర్హత లేదు. నిన్ను పంపిన ఆ విశ్వామిత్రుడి శక్తి ఇక్కడ పనిచేయదు. వచ్చిన దారినే తలకిందులుగా వెనక్కిపో!" అని గద్దిస్తూ, తన పాదంతో ఒక్క తన్ను తన్నాడు.

ఇంద్రుని దెబ్బకు త్రిశంకుడు గిరగిరా తిరుగుతూ, తలకిందులుగా భూమి వైపు పడిపోవడం మొదలుపెట్టాడు. చనిపోతాననే భయంతో, "విశ్వామిత్రా! రక్షించు! కాపాడు!" అని గట్టిగా అరిచాడు.

విశ్వామిత్రుడు నూతన స్వర్గ సృష్టి త్రిశంకు స్వర్గం

భూమి మీద ఉన్న విశ్వామిత్రుడికి త్రిశంకుడి అరుపు వినపడింది. తన మాట గంగలో కలిసిపోతోందని, ఇంద్రుడు తనను అపహాస్యం చేశాడని గ్రహించి, ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ఆకాశం వైపు చూస్తూ, తన కుడి చేతిని పైకెత్తి, "తిష్ఠ! తిష్ఠ! అంటే ఆగు! ఆగు!" అని ముల్లోకాలూ దద్దరిల్లేలా అరిచాడు. అంతే! కింద పడిపోతున్న త్రిశంకుడు గాల్లోనే, భూమికి ఆకాశానికి మధ్యలో తలకిందులుగా ఆగిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. "ఏంటి ఇంద్రా! నీ స్వర్గంలో చోటివ్వవా? అయితే ఏంటి? నా స్నేహితుడి కోసం, నేను ఇచ్చిన మాట కోసం, ఇక్కడే ఒక కొత్త స్వర్గాన్నే సృష్టిస్తాను!" అని ప్రతిన పూనాడు.

ఆయన తన తపశ్శక్తినంతా ఉపయోగించి, బ్రహ్మ సృష్టికే పోటీగా మరో సృష్టిని మొదలుపెట్టాడు. శూన్యంలో త్రిశంకుడు ఉన్న చోట, దక్షిణ దిక్కున కొత్త సప్తర్షి మండలాన్ని, కొత్త నక్షత్రాలను, కొత్త గ్రహాలను... చివరికి ఇంకో ఇంద్రుడిని కూడా సృష్టించడం ప్రారంభించాడు. అసలు సృష్టికి పోటీగా ఇంకో సృష్టి జరుగుతుండటంతో విశ్వంలో సమతుల్యత దెబ్బతింది. లోకాలన్నీ గజగజ వణికిపోయాయి.

ఈ భయంకరమైన పరిణామానికి దేవతలు, గంధర్వులు, చివరికి సృష్టికర్త బ్రహ్మదేవుడు కూడా తల్లడిల్లిపోయారు. వాళ్లంతా హడావిడిగా విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, "మహర్షీ! శాంతించండి. బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం లోకవినాశనానికి దారితీస్తుంది. దయచేసి ఆపండి" అని వేడుకున్నారు.

వారి ప్రార్థనలకు విశ్వామిత్రుడి కోపం తగ్గింది. కానీ, "నా మాట నిలబడాలి. త్రిశంకుడికి స్వర్గ సుఖాలు దొరకాల్సిందే" అని ఖచ్చితంగా తేల్చిచెప్పాడు.

దానికి దేవతలు ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించారు. "మహర్షీ! మీరు సృష్టించిన ఈ నక్షత్ర మండలం ఇలాగే ఉంటుంది. త్రిశంకుడు కూడా మీరు ఆపిన చోటనే, ఈ కొత్త స్వర్గంలో తలకిందులుగా ఒక నక్షత్రంలా శాశ్వతంగా ఉంటాడు. అతనికి స్వర్గ సుఖాలు లభిస్తాయి. దయచేసి మిగిలిన సృష్టిని ఆపండి" అని వేడుకున్నారు.

విశ్వామిత్రుడు ఆ ఒప్పందానికి సరేనన్నాడు.

ఆ విధంగా, విశ్వామిత్రుడి పట్టుదల ముందు దేవతలే తలవంచాల్సి వచ్చింది. త్రిశంకుడి కోసం ఒక ప్రత్యేక స్వర్గం, 'త్రిశంకు స్వర్గం' ఏర్పడింది. అప్పటినుంచి త్రిశంకుడు ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ ఒక నక్షత్ర రాశిగా మిగిలిపోయాడు. ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఒకరి విపరీతమైన కోరిక, ఇంకొకరి అసాధారణమైన పట్టుదల, అహంకారానికి-ఆత్మాభిమానానికి మధ్య ఉండే సన్నని గీత... ఇలా ఎన్నో విషయాలను చూపిస్తుంది. అందుకే కదా, ఇప్పటికీ ఇప్పటికి కూడా జీవితంలో ఎటూ కాకుండా మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితిని "త్రిశంకు స్వర్గం" అని అంటుంటాం.

Recent Posts
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...
విశాఖపట్నం సింహాచలం క్షేత్రంలో చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తారు? | Interesting facts about simhachalam chandanotsavam
విశాఖపట్నం సింహాచలం క్షేత్రంలో చందనోత్సవానికి లక్షలాది మంది...
సింహాచలం చందనోత్సవానికి టిక్కెట్లు ఇలా బుక్ చేసుకోండి | Chandanotsavam date, darshan timings full details
సింహాచలం చందనోత్సవానికి టిక్కెట్లు ఇలా బుక్ చేసుకోండి...