Vijaya Lakshmi
Published on Aug 25 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?గణపతి బప్పా మోరియా వెనక...
మోరియా గోసాని ఇంత పని చేసాడా?
సింధురాసురుడు ఉదరంలో అమృతంతో శివుడినే కైలాసం వదిలిపెట్టేలా చేసి...
ఆసుర రాణి ఉగ్ర, గర్భంలో పిండం విపరీతమైన వేడితో ఉండడం వలన ఆమె ఆ వేడిని భరించలేక ఆ గర్భస్థ పిండాన్ని...
మేరు పర్వతముపై ఉన్న పార్వతీదేవి పరమేశ్వరుని ఉపదేశంతో 12 సంవత్సరములు గణేశ మంత్రమును జపింఛి గణపతిని పుత్రుడుగా పొంది...
గుజ్జు రూపంతో మహాకాయుడైన మహాగణపతి అతి తేలికైన పక్షి నెమలి నెక్కి....
మోరియా అంటే...
వినాయకుడు ఆదిపూజితుడు. మనం ఏ పని ప్రారంభించినా తొలిపూజ వినాయకుడిదే. ప్రత్యేకంగా వినాయకుడిని ఆరాధించే వినాయకచవితి పండుగకు ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటుతాయి. ఆ ఉత్సవాల్లో చిన్న, పెద్ద అందరూ ఉత్సాహంగా గొంతెత్తి పలికే నినాదం గణపతి బప్పా మోరియా అని. అసలింతకీ ఈ గణపతి బప్పా మోరియా అంటే ఏంటి?
గణపతి భగవానుని నినాద స్మరణ లో ఈ మోరియా అనే పదానికి సంబంధించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
పూర్వము చక్రపాణి అను రాక్షసరాజు ఉండేవాడు. అతని భార్య ఉగ్ర. వారికి పిల్లలు లేకపోవడంతో ఒక ముని సూచనమేరకు భార్యాభర్తలిద్దరూ సూర్యారాధన చేసి తమకు సంతాన భాగ్యం కలిగించమని వేడుకున్నారు. సూర్యభగవానుని కరుణతో రాణి గర్భము దాల్చింది. అయితే సూర్యుని వరంతో ఆ పిల్లవాడు ఉగ్ర గర్భంలో విపరీతమైన వేడితో ఉండడం వలన ఆమె ఆ వేడిని భరించలేక ఆ గర్భస్థ పిండాన్ని సముద్రంలో వదిలిపెట్టేసింది.
సముద్రంలో బాలుని రూపంలో ఉద్భవించిన ఆ పిల్లవానిని సముద్రుడు బ్రాహ్మణరూపంలో వచ్చి, చక్రపాణి దంపతులకు ఇచ్చాడు. సముద్రములో పుట్టాడు కాబట్టి ఆపిల్లవానికి, వారు సింధు అని నామకరణము చేసారు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడై, 2000 సంవత్సరములు తపస్సుచేసి, సూర్యుని నుండి అమృతమును పొందాడు.
ఉదరంలో అమృతం ఉందన్న ధైర్యముతో సింధురాసురుడు విజ్రుంభించి, దేవతలను జయించి కారాగారములో బంధించాడు. తరువాత కైలాసము మీద ,వైకుంఠమ మీద కూడా దండెత్తాడు. చివరికి పార్వతీపరమేశ్వరులు కూడా, వర ప్రభావంతో ఉన్న సింధురాసుని ఏం చెయ్యలేని పరిస్తితిలో కైలాసమును వదలి, మేరు పర్వతంపై ఉన్నారు. సింధురాసురుడు శ్రీ మహావిష్ణువును తన గండకి రాజ్యములో ఉండుమని ఆజ్ఞాపించెను.
ఈ పరిస్థితులలో దేవగురువైన బృహస్పతి, సింహారూఢుడు, పది చేతులు కలవాడు అయిన మహాగణపతిని ప్రార్ధించి ఆయన శరణు కోరమని దేవతలకు సలహా ఇస్తాడు. అలా దేవతల ప్రార్థనలను మన్నించి, సాక్షాత్కరించిన మహాగణపతి , తాను పార్వతీదేవికి కుమారుడుగా జన్మించి, సింధురాసురుని సంహరిస్తానని మాట ఇస్తాడు.
ఇక్కడ మేరు పర్వతముపై ఉన్న పార్వతీదేవి పరమేశ్వరుని ఉపదేశంతో, 12 సంవత్సరములు గణేశ మంత్రమును జపించి గణపతిని పుత్రుడుగా పొందింది. భాద్రపద శుద్ధ చతుర్థినాడు మహాగణపతి పార్వతీమాతకు పుత్రుడుగా జన్మించాడు. ఆ పుత్రునకు గణేశుడు అని నామకరణము చేసిరి.
కొంతకాలమునకు సింధురాసురుని మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్దమునకు వెళ్ళాడు. అప్పడు గణపతి నెమలి వాహనారూఢుడై కమలాసురునితో ఘోరయుద్ధము చేసాడు. ఆ యుద్ధంలో కమలాసురుని ప్రతి రక్తపు బిందువు నుంచి మరో రాక్షసుడు రావడం మొదలయింది. అప్పడు గణపతి బ్రహ్మదేవుని పుత్రికలైన బుద్ధి, సిద్దులను స్మరించి, వారిని కమలాసురుని నెత్తురు నుండి పుట్టుచున్న రాక్షసులను మ్రింగివేయమని కోరాడు. వారు ఆ విధంగానే చేయడంతో గణపతి, కమలాసురుని ఎదుర్కొని వాని శిరస్సును ఖండించెను. ఆ శిరస్సు మోర్గాం ప్రాంతంలో పడింది. తరువాత, గణపతి పార్వతీ పరమేశ్వరులతో కలిసి సింధురాసురుని రాజ్యం గండకికి వెళ్ళి, దేవతలను చెరసాలనుండి విడిపించమని సింధురాసురుని ఆజ్ఞపించాడు.
అయితే వరగర్వంతో సింధురాసురుడు ఆ ఆజ్ఞను పాటించకపోవడంతో గణపతి 3 రోజులు ఘోరయుద్దము చేసాడు. ఆ సమయంలో గణపతి చిరు రూపము ధరించి, నెమలి వాహనమును వీడి, క్రింద నుండి సింధురాసురుని ఉదరముపై ఒక బాణము వేసాడు. అది అతని ఉదరమును చీల్చేసింది. వెంటనే ఉదరములో ఉన్న అమృతమంతా బయటకు వచ్చింది. దాంతో సింధురాసురుడు మరణించాడు. దేవతలు ఆనందించి గణపతిని పూజించారు.
అప్పడు మోర్గాం క్షేత్రమునందు దేవాలయమును నిర్మించి, గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విధముగా మోర్గాం, మోరేశ్వర్ గణపతి పుణ్యక్షేత్రంగా మారింది.
యుద్ధ సమయంలో గణపతి మయూర వాహనముపై వచ్చినందున, స్వామికి మయూరేశ్వర్ అనే పేరు వచ్చింది. ‘మోర్’ అంటే ‘నెమలి’. ఆ ప్రదేశమునందు నెమళ్ళు ఎక్కువగా ఉండుటచేత, ఆ గ్రామమునకు ‘మోర్గాం' అను పేరు వచ్చినది.
నెమలిని వాహనము చేసికొన్నందు వలన, గణపతి మోరేశ్వర్ అయినాడు. అందుకే ఉత్సాహంతో 'గణపతి బప్పా మోరియా' అని భక్తులు నినదిస్తారు.
ఈ మోర్గాం గణపతి క్షేత్రం మహారాష్ట్రలో పూణేకు 79 కిలోమీటర్ల దూరములో పూణే జిల్లాలో బారామతి తాలూకాలో ఉన్నది.
మరో కథనం ప్రకారం 15వ శతాబ్దంలో మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. మెలకువ వచ్చాక మోరియా గోసాని గణపతి కలలో కనిపించినందుకు ఎంతో సంతోషించి, గణపతి చెప్పినట్టు దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్లి, ఆ నదిలో దిగి గాలించాడు.
నిజంగానే మోరియా గోసాని కి గణపతి విగ్రహం లభించడంతో స్వామి అనుగ్రహానికి సంతోషించిన పరమానందభరితుడయ్యాడు. మోరియ గోసానికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసిన కొందరు ఆశ్చర్యపోయి, ఆ విషయాన్ని తెలిసిన అందరికి చెప్పారు. అలా ఆ నోటా, ఈ నోటా ఈ విషయం అందరికి తెలిసిపోయింది.
అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేసారు. మోరియా గోసాని గణపయ్య విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకెళ్లాడు. అలా అతను స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తుంటే అక్కడున్న అందరూ, "మోరియా గోసాని ఎంత గొప్ప భక్తుడొ కదా!! సాక్షాత్తు గణపతే తన గూర్చి చెప్పి దర్శనం ఇచ్చాడు" అనుకుంటూ గణపతి బప్పా మోరియా" అని గట్టిగా నినాదాలు చెయ్యడం మొదలుపెట్టారు.
మోరియా కు దొరికిన ఆ గణపతి విగ్రహానికి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ ఉత్సవాలలో భక్తులు అందరూ గణపతితో పాటు మోరియా గోసానిని కూడా స్తుతించారు.
గోసావి పాదాలను తాకి మోరియా అంటూ నినదించి మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. అలా గణపతి బప్పా మోరియా అన్న నినాదం ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నారు.