ధన్వంతరి జయంతి 2025 | ధన్వంతరి ఎవరు? దేవుడా? వైద్యుడా?విష్ణుమూర్తి అవతారమా? | Who is Lord Dhanvantari? God, Physician or Vishnu Avatar?

Vijaya Lakshmi

Published on Oct 14 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ధన్వంతరి జయంతి – ఆరోగ్య దేవుడి అవతారం కథ

ఒకప్పుడు దేవతలు – దానవులు కలిసి క్షీరసాగరాన్ని మథించారు. ఆ సముద్రం నుండి వజ్రాలు, రత్నాలు, కామధేను, లక్ష్మీ దేవి… ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అంతలో చివరగా, ఒక ప్రకాశవంతమైన దేవుడు అమృతకలశం చేత పట్టుకుని వెలువడాడు. ఆయనే ధన్వంతరి దేవుడు — దేవతల వైద్యుడు, ఆరోగ్యానికి ప్రతీక.

ఎవరు ఈ ధన్వంతరి? దేవుడా? వైద్యుడా?

ధన్వంతరి అంటే — “ధనం (ఆరోగ్యం, జీవశక్తి) అందించే వాడు” అనే అర్థం. ఆయనను విష్ణుమూర్తి యొక్క అవతారంగా కూడా పూజిస్తారు. అయితే ఆయుర్వేదం అనే వైద్య శాస్త్రానికి పితామహుడు కూడా ఆయనే. అందుకే ఆయనను దేవ వైద్యుడు, ఆరోగ్య దైవం, ఆయుర్వేద స్థాపకుడు అని పిలుస్తారు.పురాణాల ప్రకారం, ధన్వంతరి అమృతాన్ని దేవతలకు అందించి, రోగాలనుండి రక్షించమని వాగ్దానం చేశాడు. తరువాత ఆయన మానవ లోకానికి వచ్చి ఆయుర్వేద జ్ఞానాన్ని భరద్వాజ మహర్షికి ఉపదేశించాడు. ఆ జ్ఞానం ద్వారానే మనకు ఈ రోజు “ఆయుర్వేదం” అందింది.


ధన్వంతరి జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి సంవత్సరం దీపావళికి రెండు రోజులు ముందు, అంటే కార్తీక మాసం కృష్ణ త్రయోదశి రోజున ధన్వంతరి జయంతి జరుపుకుంటారు. ఈ రోజునే ధన్తరేస్ (Dhanteras) అని కూడా పిలుస్తారు.

ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి అంకితమైన ఈ రోజున వైద్యులు, ఆయుర్వేద ఆసుపత్రులు ప్రత్యేక పూజలు చేస్తారు. భారత ప్రభుత్వం కూడా ఈ రోజునే "జాతీయ ఆయుర్వేద దినం" (National Ayurveda Day)

గా ప్రకటించింది.


ధన్వంతరి దేవుని రూపం

ధన్వంతరి విగ్రహం చూడగానే మనసు ప్రశాంతమవుతుంది. ఆయనకు నాలుగు చేతులు ... ఒకదానిలో అమృతకలశం,మరోదానిలో శంఖం, మూడో దానిలో చక్రం,నాలుగో చేతిలో ఔషధ మొక్కలు లేదా గ్రంథం ఉంటాయి. ఆయన శరీరం బంగారు కాంతితో మెరిసిపోతుంది. పద్మపుష్పంపై నిలబడి ఉంటారు. ఆ రూపం మనలో ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

పూజా విధానం

ధన్వంతరి జయంతి ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ప్రదేశంలో ధన్వంతరి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పెట్టాలి. దీపం వెలిగించి, తులసి, పువ్వులు, పండ్లు సమర్పించాలి. అనంతరం ఈ మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం –“ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ - సర్వామయ వినాశనాయ శ్రీ మహావిష్ణవే నమః”

ఈ జపం ఆరోగ్యాన్ని కాపాడుతుందని, రోగనివారణ కలిగిస్తుందని విశ్వాసం.

ధన్వంతరి జయంతి ప్రాముఖ్యత

ఈ రోజు కేవలం పూజకే కాదు, ఆరోగ్య అవగాహనకూ గుర్తుగా జరుపుకుంటారు. అనేక చోట్ల ఉచిత వైద్య శిబిరాలు, ఆయుర్వేద మందుల పంపిణీ జరుగుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారు ఈ రోజును “వైద్యుల దినం”లా జరుపుకుంటారు.ఆరోగ్యమే మహాభాగ్యం — అని అందరూ చెబుతాం. కానీ దానిని గుర్తుచేసే దినం ధన్వంతరి జయంతి. ఈ రోజున ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి కృతజ్ఞత చెప్పడం మనందరి బాధ్యత.

ధన్వంతరి దేవుడు మనకు నేర్పినది

“ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదు, మనసు ప్రశాంతంగా, ఆహారం సాత్వికంగా, జీవితం సమతుల్యంగా ఉండటం.”కాబట్టి, ధన్వంతరి జయంతి రోజున మనం ఆరోగ్యానికి ప్రార్థన చేసి, ఆయుర్వేద సూత్రాలను అనుసరిస్తే ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది.



ధన్వంతరి గూర్చి పూర్తి కథనాలు

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఖచ్చితంగా ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. ఇంతకీ ధన్వంతరి ఎవరు? దేవుడా? వైద్యుడా? సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అపరావతారమే ధన్వంతరి అంటారు. అయితే కాదు ధన్వంతరి మానవమాత్రుడే... కాశీరాజు దివోదాసే ఈ ధన్వంతరి అని మరి కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఇంతకీ ఎవరీ ధన్వంతరి. రాజా... దేవుడా... వైద్యుడా... తెలుసుకుందాం...


ధనత్రయోదశి... ధన్వంతరి... జాతీయ ఆయుర్వేద దినోత్సవం... క్షీర సాగర మధనం... ఈ అన్నిటికి ఒక సంబంధముంది. ధనత్రయోదశి... హిందువులకు అతి ముఖ్యమైన పండుగ. ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి కరుణ కోసం ప్రత్యెక పూజలు చేసే  రోజు. ధనత్రయోదశి రోజే ధన్వంతరి జయంతి. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి రోజు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మధనం చేస్తున్నపుడు హాలాహలం... ఐరావతం.. కామధేనువు, కల్పవృక్షం... శ్రీమహలక్ష్మిదేవి, ఇలా చాల ఉద్భవించాయని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆక్షీరసాగర మథనం లోనే చిట్టచివరకు చేతిలో అమృత కలశంతో ఓషధులతో ఆవిర్భవించాడు ధన్వంతరి. విష్ణువు అంశతో ఉద్భవించిన ధన్వంతరి. దేవవైద్యుడు. అని చెప్తున్నాయి పురాణ కథనాలు. శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని , ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , హరివంశంలోనూ ధన్వంతరి చరిత్ర కనబడుతుంది.


నాలుగు చేతులున్న ధన్వంతరి ఒక చేతిలో ‘అమృత కలశము’, మిగిలిన చేతులలో సకల మానసిక, శారీరక రోగాలను నయం చేసే ఓషధులతో క్షీర సాగరం నుంచి ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి`ని ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.



అలా ఆవిర్భవించిన ధన్వంతరి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను ప్రపంచానికి అందించారు. ధన్వంతరి అన్న మాటకు చికిత్సకు లొంగని వ్యాధులను న శింపచేయువాడు అని అర్థము.



ఈ ప్రపంచంలో తోలి వైద్యుడు, తొలి శస్త్రచికిత్స చేసినవాడు సుశ్రుతుడు. ఎన్నో రకాల రోగాలు, మూలికలు, మానవ శరీర లక్షణాలు, శస్త్రచికిత్సలు ఇలా ఎన్నో వైద్య సంబంధ విషయాలు వివరిస్తూ ఒక అద్భుతమైన గ్రంధం సుశ్రుతసంహిత రచించాడు. ఆ తోలి వైద్యుడు సుశ్రుతునికి  గురువు ధన్వంతరి. తాను ఆవిష్కరించిన ఎన్నో వైద్య విధానాలకు కారణం ధన్వంతరి అని, ధన్వంతరి లక్షశ్లోకాల ఆయుర్వేద శాస్త్రాన్ని తనకు ఉపదేశించాడని, ఆ ఉపదేశంతోనే ఇదంతా సాధ్యమయిందని, ధన్వంతరి ఆయుర్వేద మూలపురుషుడని తన గ్రంధంలో ప్రస్తావించాడు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి చరకచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడు. ఇప్పటికీ మన దేశంలో ఆయుర్వేద సంప్రదాయం చెక్కు చెదరకుండా ఉందంటే.. దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా వైద్యుడి హస్తవాసి బాగుంటే అతను ధన్వంతరి అంతటివాడు అంటూ ఉంటాం. అలాంటి ధన్వంతరిని కృతజ్ఞాపూర్వకంగా తల్చుకునేందుకు ధన్వంతరి జయంతిని పండుగ గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

క్షీరసాగరమధన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. గరళం, లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం.. ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువుని చేపట్టసాగారో, ఆ సమయం రానే వచ్చింది. పట్టుపీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ అమృతకలశాన్ని చేతపట్టి సాగరంనుంచి వెలుపలికి వచ్చాడు ఓ దివ్యమూర్తి. ఆయనే ధన్వంతరి! ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని కొన్ని పురాణ కథనాలు చెప్తున్నాయి. ధన్వంతరి అన్న శబ్దానికి  బాధలను తొలగించేవాడు అని అర్థాన్ని చెప్తారు. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నింటినీ ఒక్కపెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయన దేవవైద్యుడు అయ్యాడు.


సర్పరాజు వాసుకి, ధన్వంతరి కథ

వైద్యుడిగా ధన్వంతరి హస్తవాసి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం  ప్రకారం ధన్వంతరి ఎంతటి పాముకాటు నుంచైనా దేవ, దానవ, మానవులను రక్షించసాగాడు. తమ కాటునుంచి అంతా తప్పించుకోవడాన్ని సర్పారాజైన `వాసుకి` సహించలేకపోయాడు. అలా కనుక జరిగితే తనకు ఎవరూ భయపడరనీ, తన ప్రాభవానికే భంగం వాటిల్లుతుందనీ భావించాడు వాసుకి. అందుకని ధన్వంతరిని అంతమొందించేందుకు ఒక మహాసర్పాన్ని పురమాయించాడు. కానీ సాక్షాత్తూ ఆ శివుడే అడ్డుపడి బుద్ధి చెప్పడంతో, ధన్వంతరి కాళ్ల మీద పడ్డాడట వాసుకి. పూర్వం ప్రతిభావంతులైన ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" బిరుదుతో సత్కరించేవారు.


సూర్య భగవానుని శిష్యుడు ధన్వంతరి

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ధన్వంతరి ఆయుర్వేద వైద్య విద్యనూ సూర్యుని దగ్గర నేర్చుకున్నాడని, సూర్య భగవానుని 16 మంది శిష్యులలో ధన్వంతరి ఒకరని చెప్తారు. ధన్వంతరి ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎనిమిది విభాగాలుగా విభజించినట్టు గ్రంధాలు చెబుతున్నాయి. అవే అష్టాంగాలు. ఈ అష్టాంగ వైద్యవిధానం కేరళలో సిద్ధ, ఆయుర్వేద విద్యావిధానంలో అష్టవైద్యం గా బాగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల తరబడి ఆ వైద్య విధానం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంది. కేరళలో ఇలా అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వైద్యులంతా కూడా ధన్వంతరిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.   


విష్ణుమూర్తి అవతారం ధన్వంతరి

ఇక ధన్వంతరి విష్ణ్వంశతో పాలకడలి నుంచి ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి.  అందుకే శ్రీమహావిష్ణువు లాగానే ధన్వంతరి ఆరాధన కూడా జరుగుతుంది. ధన్వంతరికి ప్రత్యేకించిన ఆలయాలు కాస్త తక్కువగానే ఉన్నా చాలా రాష్ట్రాల్లో ధన్వంతరి కి ఆలయాలున్నాయి.



ధన్వంతరి ఆలయాలు

గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ధన్వంతరికి ఆలయాలున్నాయి. కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు ఉన్నాయి. అలాగే తమిళనాడులోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో, ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యులవారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. రామానుజాచార్యులవారు, రంగనాధస్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు, ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూలవిరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట. కేరళలోని ‘‘నెల్లవాయ’’ అనే గ్రామంలో అలాగే ‘‘కాలికట్‌’’‌లో కూడా పురాతన ఆలయాలున్నాయి. ఇక మనరాష్ట్రంలో  తూర్పు గోదావరి జిల్లాలోని చింత లూరులో ఒక ధన్వంతరి మందిరం ఉంది.

 

శరీరాన్ని అంతుచిక్కిన వ్యాధి పీడిస్తున్నప్పుడూ, దీర్ఘకాలిక రోగాలు పట్టివిడవనప్పుడూ ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందంటారు పెద్దలు. ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏదీ లేకపోతే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి ప్రతిమనే ధన్వంతరిగా భావించవచ్చు.

`ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే

అమృతకలశ హస్తాయ

సర్వామయ వినాశనాయ

త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమః`అన్న ధన్వంతరి మంత్రాన్ని అనారోగ్యంతో ఉన్నవారు ప్రతినిత్యం 108 సార్లు పఠిస్తే ఉపశమనం లభిస్తుందని  చెప్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.


విదేశాలలో కూడా ధన్వంతరి పూజలు

కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని జర్మనీ, అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేటికీ మనలో చాలా మంది వైద్యులు తమకు వైద్యం చేసే శక్తిని పెంచమని ధన్వంతరికి ధన త్రయోదశి రోజున అంటే ధన్వంతరికి ప్రత్యేక పూజలు చేస్తారు.


·        సరే ఈ విషయాలన్నీ అలా ఉంచితే ఒకప్పటి కాశీరాజు దేవోదాసే ధన్వంతరి అని కూడా కొన్ని కథనాలున్నాయి. భాగవతంలోని నవమ స్కండంలో కాశీరాజు ధన్వంతరి గురించిన వంశక్రమం కనబడుతుంది. పురూరవుని క్షత్రవుద్ధుడు, అతనికి సుహోత్రుడు సుహూత్రునికి కాశ్యుడు, కాశ్యునికి కాశి, కాశికి దీర్ఘతపుడు ఆ దీర్ఘతపునికి ధన్వంతరి జన్మించారని వంశక్రమం చెప్పబడింది. విశ్నుపురానంలో కూడా ఈ వంశక్రమం ఉన్నట్టు పెద్దలు చెప్తారు. దాని ప్రాకారం ధన్వంతరికి మూడవ తరం వాడే ఈ కాశీరాజు దివోదాస ధన్వంతరి అని చెప్తారు.

అంటే పాలకడలి నుంచి అమృతభాండం తో ఉద్బవించిన విష్ణ్వంశ సంభూతుడైన ధన్వంతరే కాశీరాజు దివోదాసుగా ప్రభావిన్చాడని పురాణ గ్రంధాలు చెపుతున్నాయి. అలా భూలోకంలో జన్మించిన దివోదాస ధన్వంతరి ఆయుర్వేదాన్ని సంపూర్ణ శాస్త్రంగా రూపొందించి మానవలోకానికి అందించాడని గ్రంధాలు చెబుతున్నాయి. ధన్వంతరి సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడని, సూర్యుని వద్ద ఆయుర్వేద శాస్త్రాన్ని అభ్యసిన్చాడని చెప్తారు.ఈ దివోదాస ధన్వంతరే ఆయుర్వేద పితామహుడుగా చెప్పబడే శుశ్రుతునికి ఆయుర్వేద, శస్త్రచికిత్స విధానం నేర్పాడని చెప్తారు. అందుకే ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటారు. సో దీన్నిబట్టి మనకర్ధమవుతోంది కదా శ్రీ మహావిష్ణువు అంశతో ఉద్బవించిన ధన్వంతరి అటు దేవుడు ఇటు వైద్యుడు అలాగే  అలాగే దేవతల వైద్యుడు భూలోకంలో వైద్యుడుగా ఎలా మారాడు అన్న విషయం కూడా స్పష్టమవుతోంది కదా.



ఇవి కూడా చదవండి



Recent Posts