Vijaya Lakshmi
Published on Aug 20 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అది శ్రీమహావిష్ణువు యొక్క ప్రధానమైన ఆయుధాలలో అతి శక్తివంతమైన ఆయుధంగా చెప్తారు. నిజానికది ఆయుధం కాదు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ప్రతిరూపం. కళ్లు మూసి తెరిచే లోపే అనేక మిలియన్ల యోజనాలు తిరిగి రాగల శక్తి. సెకనుకు మిలియన్ల సార్లు తిరిగే చక్రాయుధం.
పాశ్చాత్య దేశాలలో ప్రయోగించబడిన నిన్న మొన్నటి శక్తివంతమైన ఆయుధాలకు స్పూర్తి... పోలిక. సుదర్శనచక్రానికి సంబంధించి బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో ఏం చెప్పారు?
త్రిశూలంతో పాటు సృష్టించబడిన ఓ మహాశక్తి.
అగ్నిదేవుని ద్వారా శ్రీకృష్ణునికి చేరిన ఆయుధం.
విశ్వకర్మ సృష్టించిన మహత్తర శక్తి.
సూర్య రజను ద్వారా తయారు కాబడిన చక్రం.
నూరు తప్పులు ముగియగానే శిశుపాలుని ఉసురు తీసిన ఆయుధం.
పరమ భక్తుడు, అందరినీ భయపెట్టే దూర్వాసమునిని కూడా భయపెట్టి పరుగులెత్తించిన చక్రం.
సాక్షాతూ పరమేశ్వరుడే శ్రీమహావిష్ణువుకిచ్చిన శక్తి. అదే సుదర్శన చక్రం.
శ్రీకృష్ణుని తలచుకోగానే స్వామి ముగ్దమనోహర రూపంతో పాటు నిరంతరం కృష్ణయ్య వేలిని అలంకరించి ఉండే పదునైన ఆ చక్రం శ్రీకృష్ణుని అవతార సమాప్తి తరువాత ఏమయింది? ఇప్పుడేక్కడుంది? దాని చరిత్రేంటి?
సుదర్శన చక్రానికి భద్రాచలం కోదండరామాలయానికి భక్తరామదాసుకు సంబంధం ఉంది. ఆ సంబంధమేంటి? ఆయుధంగానే కాదు సాక్షాత్తూ స్వామి ప్రతిరూపంగా ఆలయాలు కూడా ఉన్నాయి. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలలో సుదర్శనచక్రం స్థానం మహత్తరమైనది. తిరుమల మొదలుకొని శ్రీరంగం వరకు ఎన్నో వైష్ణవాలయాలలో ప్రత్యేకమైన కైంకర్యాలు సేవలు పొందే చక్రాయుధం సుదర్శన చక్రం వెనక ఒకటా రెండా ఎన్నో కథనాలున్నాయి.
ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు. అలాంటి కొన్ని మిలియన్ యోజనాల దూరాన్ని కొన్ని క్షణాలలోనే చుట్టి రాగల అద్భుతం సుదర్శన చక్రం. సాక్షాతూ నారాయణ స్వరూపమే సుదర్శన చక్రం. స్వామి ఆయుధాలలో మూర్తిమంతంగా, దేవతగా, ఆళ్వార్‌గా, యంత్రరూపంగా, యంత్రాధిష్ఠానదేవతగా, దుష్టశిక్షణలో ప్రముఖాయుధంగా కీర్తింపబడేది సుదర్శనచక్రం. సుదర్శన చక్రాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్త్యాయుధంగా విశ్వసించి, పూజించడం ఒక ప్రత్యేకత.
దుష్టశిక్షణకు శ్రీ మహావిష్ణువు ప్రయోగించే ఆయుధాన్ని సుదర్శనచక్రం లేదా చక్రత్తాళ్వార్ అంటారు. సుదర్శన చక్రానికి 108 పదునైన అంచులుంటాయి. 2కోట్ల చురకత్తుల పదును ఈ సుదర్శన చక్రం సొంతం. ఆ చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను, అగ్నిని, సోముడు, మిత్రవరుణులు, ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి, హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని సాక్షాతూ పరమేశ్వరుడే చెప్పినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి.
శ్రీమహావిష్ణువు చేతిలోని ఈ సుదర్శన చక్రం దుష్టులను దునుమాడే మహాశక్తి. ఏ దేవతలూ కాని, శివబ్రహ్మాదులు కాని నివారించలేని విష్ణ్వాయుధం సుదర్శనచక్రం. ఎందుకంటే అది కేవలం స్వామివారి ఆయుధం కాదు. సాక్షాత్తూ నారాయణ స్వరూపం. అందుకే సుదర్శన చక్రం స్వామి ఆయుధంగానే కాకుండా సాక్షాత్తూ స్వామి స్వరూపంగా భావిస్తూ ప్రత్యెక ఆలయాలున్నాయి... ఆరాధనలున్నాయి.
కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన స్వామికి మందిరాలున్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహీంద్రపురం, తిరుక్కుడందై (కుంభకోణం), కందియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుక్కురునంగుడి, శ్రీరంగము, వరదరాజపెరుమాళ్ కోయిల్, కాంచీపురం తిరుమోగూర్ లలోని దేవస్థానాలలో ప్రత్యేకంగా సుదర్శన సన్నిధులు ఉన్నాయి. 16 భుజాలతో సుదర్శనుడు పూజలు, ఆరాధనలు అందుకుంటాడు. అందుకే సుదర్శన చక్రం ఆయుధంగా కంటే శ్రీచక్రత్తాళ్వార్ గానే ఎక్కువగా పూజలందుకుంటోంది.
శ్రీ చక్రత్తాళ్వార్ సర్వకాల సర్వావస్థలలోను ప్రతి అవతారంలోను కూడా స్వామిని అనుసరించే ఉంటారు.
శ్రీమహావిష్ణువు వరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలో చక్రత్తాళ్వార్లు వరహాస్వామివారి కోరల రూపంలో ఉన్నారని చెప్తారు.
ఇక ఉగ్రనరసింహునిగా హిరణ్యాక్షుని చీల్చిన సందర్భంలో స్వామి వేళ్ళకు ఉండే నఖాలు అంటే గోళ్ళ రూపంలో ఉన్నాడట సుదర్శనుడు.
పరశురామావతారంలో సుదర్శనుడు పరశువుగా మారితే,
రామావతారంలో ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకొని ఉండేదని రాముని విల్లు, అంబులుగా అవతరించిందని కూడా చెప్తారు.
వామనావతారంలో సైతం సుదర్శనం స్వామికి సహాయంగా ఉందని చెప్తారు. పెరియాళ్వార్లు రచించిన ఓ పాశురంలో ఈ విషయం వర్ణించబడింది. బలి చక్రవర్తి వామనునికి భూమిని దానం చేస్తున్న సందర్భంలో వచ్చన వాడు వటువు కాదు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు అని గ్రహించిన రాక్షసగురువు శుక్రాచార్యుడు కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డుపడగా సుదర్శనుల వారు దర్భరూపంలో ఉండి వామనుడి ద్వారా ఆ పురుగును తొలగించినట్లు వర్ణించారు పెరియాళ్వార్.
ఇక కృష్ణావతారంలో ఈ సుదర్శన చక్రం పెద్ద పాత్రనే పోషించింది. శ్రీకృష్ణుని తలచుకోగానే కృష్ణయ్య ముగ్దమనోహర రూపంతో పాటు నిరంతరం స్వామి వేలిని అలంకరించి ఉండే చక్రం కూడా కళ్ళముందు కదులుతుంది.
శ్రీమన్నారాయణుని ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడితో విడదీయలేని సంబంధమే కనబడుతుంది పురాణాల్లో. గజేంద్రమోక్షంలో మకర సంహారం చేసి కరిరాజును రక్షించిన సందర్భంలోనూ, నూరుతప్పుల వరకు సహనం చూపించినా హద్దు దాటిన శిశుపాలుని శిరస్సు ఖండించిన ఘటనలోనూ, సూర్యునికి అడ్డంపడి జయద్రధుని అజ్ఞాతం నుంచి బయటకు రప్పించి, అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చి అర్జునుని అగ్నికి ఆహుతి కాకుండా కాపాడిన సందర్భంలోనూ, భక్తుడైన అంబరీషుని మీద అహంకారంతో విరుచుకుపడిన దూర్వాసునికి బుద్ధి చెప్పిన ఉదంతం, నేనే వాసుదేవుడ్ని అంటూ అహంకరించిన పౌండ్రక వాసుదేవుని అహంకారం అణచిన సందర్భం ఇలా ఒకటా రెండా ఎన్నో సందర్భాల్లో శ్రీకృష్ణుని చేతి వేలినుండి దూసుకుపోయింది సుదర్శనచక్రం.
ఇక తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో సుదర్శనచక్రం శ్రీచక్రత్తాళ్వార్ ది ప్రముఖస్థానం. బ్రహ్మోత్సవాల ప్రారంభం ధ్వజారోహణం నాడు గరుత్మంతునితోబాటు చక్రత్తాళ్వార్‌నీ ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవ సేవలలో తక్కినవన్నీ ఒక ఎత్తు... చక్రస్నానం ఒక ఎత్తు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్పస్వామి వారిని సుదర్శన చక్రత్తాళ్వార్‌తో వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీచక్రత్తాళ్వార్‌ను అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి, పవిత్రస్నానం చేయిస్తారు. దీనికే అవభృథస్నానమని కూడా పేరు. ఆ సమయంలో శ్రీవారి శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధశక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో నిక్షిప్తమై ఉంటాయని చెప్తారు. అందుకే ఈ చక్రస్నానం అత్యంత పవిత్రమైనదని భావించి ఆ సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో పుష్కరిణిలో స్నానం చేస్తారు.
తిరుమల క్షేత్రంలో స్వామివారి చక్రాయుధం స్వామికి కుడిభుజంగా, ఆయన కుడిభుజం మీద దర్శ నమిస్తుంది. తిరుమలకు వెళ్లే యాత్రికులను, ఇల్లు వదిలినప్పట్నుంచీ యాత్ర ముగించుకుని మళ్లీ ఇల్లు చేరేవరకూ సురక్షితంగా ఉంచే బాధ్యత సుదర్శన చక్రం నిర్వహిస్తుందట.
ఈ చక్రాయుధం ఎంత శక్తివంతమైనదంటే ఇది స్వామి వారి సంకల్ప మాత్రం చేతనే కార్యం చక్కబెట్టే ఆయుధం. ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణయినా తరిమి, సంహరించి, తిరిగి స్వస్థానానికి వస్తుంది. ఈ చక్రాయుధం వల్ల మృతినొందినవారు విష్ణుదేవుని దివ్యతేజంలో లీనమవుతారని పురాణ కథనాలు చెబుతున్నాయి.
శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనం అంటారు.
సుదర్శన చక్ర ఆవిర్భావానికి సంబంధించి చాల కథనాలే ఉన్నాయి. పూర్వం ‘శ్రీదాముడు’ అనే రాక్షసుడు అపారమైన తన శక్తిసామర్థ్యాలతో సమస్త లోకాలలోని ప్రజలను దేవ, యక్ష, గంధర్వాది సమస్త లోకవాసులను భయభ్రాంతులకు గురి చేసేవాడు. దీంతో దేవతలు, మానవులు కలిసి తమని రక్షించవలసిందిగా శ్రీహరిని ప్రార్థిస్తారు.
అప్పుడు ఆ అసురుడిని అంతమందించేందుకు సమాయత్తమయ్యాడు శ్రీమహావిష్ణువు. అయితే అంత శక్తివంతుడైన రాక్షసుణ్ణి మట్టుపెట్టాలంటే అంతకు మించిన శక్తివంతమైన ఆయుధం అవసరం. అందుకే ఆ ఆయుధాన్ని ప్రసాదించమని శివుడి కోసం వెయ్యేళ్ళు తపస్సు చేసాడు. వెయ్యి కమల పుష్పాలతో శివుడ్ని ఆరాధించదానికి పూనుకున్నాడు. పుష్పాలను సిద్ధం చేసుకున్నాడు. అయితే విష్ణువును పరీక్షించడం కోసం శివుడు ఒక పుష్పాన్ని మాయం చేసాడు. అప్పుడు అందరూ తనను కమలాక్షుడని పిలుస్తారు కాబట్టి కమలం లాంటి తన కన్నును పెకలించి కమల పుష్పంగా సమర్పించడానికి పూనుకున్నాడు విష్ణువు. ఇది చూసి శివుడు వారించి తన శక్తితో పాటు, సకల దేవతల శక్తి నిక్షిప్తం చేసిన సుదర్శనచక్రాన్ని విష్ణువుకిచ్చాడన్నది ఓ కథనం. సుదర్శనచక్రాన్ని శివుడు విష్ణువుకిచ్చాడు సరే. అసలు చక్రం ఆవిర్భావం ఎలా జరిగింది?
సుదర్శనోపనిషత్తు ప్రకారం, సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారు చేయబడినది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని విపరీతమైన తేజస్సు కారణంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడట. అప్పుడు రాలిన పొడితో మూడు వస్తువులను తయారుచేశాడు విశ్వకర్మ. అందులో ఒకటి పుష్పక విమానం, రెండవది త్రిశూలం, మూడవది సుదర్శన చక్రం. త్రిశూలం శివుని దగ్గరకు చేరితే, సుదర్శనం విష్ణువును చేరింది. పుష్పకం కుబేరుడ్ని చేరింది.
శ్రీకృష్ణుడి దగ్గరకు సుదర్శనం చేరిన కథనం ఎలా ఉందంటే, ఖాండవ వనాన్ని యథేచ్ఛగా దహించి, భుజించమని కృష్ణార్జునులు అగ్నిదేవుడికి అభయం ఇచ్చిన సందర్భంలో, అగ్నిదేవుడు ఈ సుదర్శన చక్రాన్ని కృతజ్ఞతాపూర్వకంగా కృష్ణుడికి బహూకరించాడని మహాభారతం ఆది పర్వంలో ఒక కథ చెపుతోంది. తనకు వర సకు మేనత్త కొడుకూ, ఛేది రాజు అయిన శిశుపాలుడు రాజసభలో తనను నిష్కారణంగా నిందిస్తుంటే, నూరు అపరాధాలు దాటే దాకా వేచి ఉన్న శ్రీకృష్ణుడు, తన సుదర్శనం ప్రయోగించి, అక్కడికక్కడే అతగాడి శిరస్సు ఖండించాడని సభాపర్వంలో కనిపిస్తుంది. భాగవత పురాణంలో, కరిని మకరి నుండి రక్షించి గజేంద్రమోక్షం కలిగించటానికి హరి వాడిన ఆయుధం ఈ సుదర్శనమే.
ఇక తెలుగునాట శ్రీరాముని తలచుకోగానే వెంటనే జ్ఞాపాకం వచ్చే క్షేత్రం భద్రాచలం. భద్రాచలం అనగానే గుర్తొచ్చే భక్తుడు భక్తరామదాసు. భద్రాచలంకి, భాక్తరామదాసుకి, సుదర్శనచక్రానికి ఒక సంబంధం ఉంది అదేంటో చూద్దాం. భద్రాచలం ఆలయ శిఖరంమీద సుదర్శనపెరుమాల్ అంటే సుదర్శన చక్రం దర్శనమిస్తుంది.
చాలా ఆలయాలలో శిఖరం మీద చక్రాలు దర్శనమిస్తాయి ఇక్కడ కూడా అంతే కదా అంత ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఏమున్నది అని మీరనుకోవచ్చు. మిగిలిన ఆలయ శిఖరాల మీద చక్రాలవలె ఇది మానవులు తయారుచేసి అక్కడ అమర్చినది కాదు. అది దేవతా నిర్మితమైనది.
శ్రీ రామదాసు ఈ ఆలయాన్ని నిర్మించిన వైనం, ఇది తెలిసి అప్పటి పాలకులు ప్రభుత్వ ఖజానా ప్రభువుల అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి వాడాడన్న అభియోగంతో రామదాసును ఖైదు చెయ్యడం మనందరం విన్నదే కదా. ఎప్పుడైతే రామదాసు చెరసాల పాలయ్యాడో అప్పుడు ఈ ఆలయంలో చివరి భాగం అంటే ఈ సుదర్శన_చక్రం స్థానం ఖాళీగా ఉండి పోయింది. శ్రీ రామదాసు కారాగారం లో ఉన్న సమయంలో అక్కడ ఉన్న ఆనాటి ఆలయ పర్యవేక్షకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి క్రింద పడిపోతు అస్తమాను అపచారం జరిగేది. ఈ సంఘటతో కలత చెందిన స్థానికులు ఈ విషయాన్ని కారాగారం లో ఉన్న రామదాసుకు కూడా చెప్పారు.
దీంతో రామదాసు జరుగుతున్న సంఘటనలకు బాధపడుతూ ఉండేవారు. చివరకు కారాగారం నుంచి బయటకు వచ్చాక కూడా అదే ధ్యాసతో ఉండేవారట. అలాంటి సమయంలోనే ఒక రోజు ఆయనకు స్వప్నములో శ్రీరాముల వారు ప్రత్యక్షమై పవిత్ర గోదావరినదిలో వెతుకు, ఆ ఆలయశిఖరంపై పెట్టవలసిన సుదర్శన చక్రం దొరుకుతుందని చెప్పారు.
రామదాసు తెల్లవారుజామున గోదావరిలో స్నానాకి వెళ్లి నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మనం చూస్తున్న సుదర్శన పెరుమాళ్లు అంటే సుదర్శనచక్రం రామదాసు రెండు చేతులపై తెలియాడుతూ కనబడింది. ఆనందంతో ఆ సుదర్శనాన్ని, వేద మంత్రాలతో శ్రీవారి ఆలయ శిఖరం పై ప్రతిష్ట చెయ్యటం జరిగింది.
ఆనాడు ప్రతిష్టించిన ఆ సుదర్శనం ఈనాటికి అలాగే వుంది.మళ్ళీ శిఖరానికి అపశృతి అన్న మాట వినపడలేదు. ఈ విషయం తురుష్కుల హుకుమత్ కి కూడా తెలిసి ఆయన కూడా సీతారాములవారిని దర్శించుకుని కానుకలు మొక్కులు చెల్లించుకొని. శ్రీ.రామదాసుని బంధించి వుంచినందుకు క్షమాపణ చెప్పి వెళ్లారట.
అప్పటి నుంచి భద్రాచల దేవాలయం గోపురం పై ఉన్న సుదర్శన చక్రం మహత్తు గురించి అనేక కథలు వినిపిస్తూనే ఉన్నాయి. భద్రాచల క్షేత్రంలోని సుదర్శనచక్ర దర్శనం శ్రీ సీతారాముల వారి కృపా కటాక్షములను అందిస్తుందని నమ్ముతారు.
ఈ సుదర్శన చక్రం గురించి నమ్మశక్యం కాని కథనాలు వినబడతాయి. పరమశివుడు సుదర్శన చక్రాన్ని విష్ణువుకిచ్చినపుడు విష్ణువు దాని శక్తిని నీ మీదనే ప్రయోగం చేయాలనున్నదని చెప్పాడట శివునితో. అందుకు శివుడు అంగీకరిస్తాడు, అలా సుదర్శనం శివుని మీద ప్రయోగించగా పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని మూడు ఖండాలుగా ఖండించిందట. ఆ మూడు ఖండాలే విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు. జరిగిన దానిని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. శివుడు విష్ణువును ఓదార్చి, సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది, కాని తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, అలా ఖండించబడిన ఆ మూడు ఖండాలు హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరుపాక్ష లుగా పూజింపడుతాయని, ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీదాముడిని సంహరించమని చెబుతాడు.
ఇంతటి శక్తివంతమైన సుదర్శనచక్రం శ్రీ మహావిష్ణువు పంచాయుధాలలో ప్రధానమైనది. అసలు ఇది ఆయుధం అనడం కంటే శ్రీమహావిష్ణువు శక్తిగా చెప్పుకోవాలి. అందుకే సుదర్శనుడికి అర్చనలు, ఆరాధనలు, స్తోత్రాలు విరివిగా జరుగుతాయి. పంచాయుధ స్తోత్రమ్. సుదర్శన స్తోత్రం నిత్యం పారాయణ చేయడం వలన ఆర్థిక బాధలు, శత్రు బాధలు , అనారోగ్య బాధలు, గొప్ప ఆపదలు తొలగిపోతాయని భక్తుల నమ్మక.
స్ఫురత్ సహస్రార శిఖా తీవ్రం, సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్|
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:, చక్రం సదాహం శరణం ప్రపద్యే||
రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్ని శిఖలను క్రక్కుచూ మిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా !” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళ విగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ హస్తతలము నలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణువేడుచున్నాను అన్నది ఈ స్తోత్ర అర్థం.
సర్వపీడలను నివారించి, సర్వకార్యసిద్ధికి సుదర్శనమంత్రం అమోఘమైన ఫలితాన్నిస్తుందని పండితులు చెప్తారు. పీడానివారనే కాదు మనలో కలిగే చెడుఆలోచనలను దూరం చెయ్యడానికి కూడా సుదర్శన మంత్ర పఠనం ఉత్తమమైనదిగా చెప్తారు. సుదర్శన చక్రతాళ్వార్‌ను ఆయుధపురుషుడు అనికూడా అంటారు.
ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహీ, తన్నో చక్ర ప్రచోదయాత్
సుఖ సంతోషాల కోసం ఇంటిలో కాని, గుడిలోకాని సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమంలో భాగంగా సుదర్శనుని, అతడి భార్య విజయవల్లిని పవిత్ర జలం ఉన్న కుండలోకి ఆహ్వానిస్తూ పూజ చేస్తారు. సుదర్శనుని స్తుతిస్తూ మంత్రాలు పఠిస్తారు. ఈ హోమం పూర్తయ్యే సరికి హోమకర్త సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో తుల తూగుతాడని విశ్వాసం.
బుధవారం, శనివారం వచ్చిన ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులు ఈ హోమం చేయడానికి అను కూలంగా చెప్తారు. అయితే ఈ హోమం చాలా నియమ నిష్టలతో చేయాలనీ,మంత్రాలు చక్కని ఉచ్ఛారణతో పల కాలి. శరీరం, మనసు, మనం చేసే పనులు అన్నీ శుద్ధంగా ఉండాలని చెప్తారు. అలా నియమబద్దంగా హోమం చేస్తే చెడును నాశనం చేసి, పాపాలను నిర్మూలించి, ఆరోగ్యాన్ని పెంపొందించడం, మానసిక స్థయిర్యాన్ని ఇస్తుందని చెప్తారు.
విష్ణుమూర్తిని, స్వామి అవతారమైన శ్రీక్రిష్ణుడ్ని తలచుకోగానే ఆ దివ్యమంగళ స్వరూపం తో పాటు స్వామి వేలిని అలంకరించి ఉండే సుదర్శనచక్రం ప్రస్పుటంగా కనబడుతుంది. అన్ని యుగాలలోను ఒక్కో రూపంలో స్వామిని అనుసరించి ఉన్న చక్రాయుధం ద్వాపరయుగం తరువాత అంటే శ్రీకృష్ణుని అవతార సమాప్తి తరువాత ఈ కలియుగంలో ఎక్కడ ఉంది ఏమయింది? పురాణ కాలంలో వాడిన చక్రాయుధం కలియుగంలో కూడా వాడారా? అంటే వాడారనే చెప్తున్నాయి కొన్ని చారిత్రిక ఆధారాలు.
మధ్యయుగం నాటికి యుద్ధాలలో చక్రాయుధాన్ని వాడేవారని పరిశోధకులు చెప్తారు. అయితే అవి ఒకటి కాదు అనేక రకాలైన చక్రాలుండేవట. అవి మిగిలిన ఆయుధాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన ఒడుపుతో తిప్పితిప్పి శత్రువులమీదికి విసిరే విధంగా ఉండేవని చెప్తారు చారిత్రిక పరిశోధకులు.
మిగిలిన శక్తివంతమైన ఆయుధాల కన్నా ఈ చక్రాయుధం చాలా ప్రభావవంతంగా ఉండేదని కూడా చెప్తారు. అయితే ఈ చక్రాలు ఎంత ప్రభావవంతమైనా, శక్తివంతమైనా ఇవి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శనచక్రాన్ని పోలినవి మాత్రమే. మధ్యయుగంలో వాడబడిన ఈ చక్రాలు పదునైన సన్నని ఇనుముతో చేసిన చక్రాలు .
కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం యూరోపియన్లు ఈ విధమైన చక్రాయుదాలను పరిచయం చేశారని చెప్తుంటే మరికొందరు మాత్రం యూరోపియన్ చరిత్రలో వీటికి సంబంధించిన ఆనవాళ్ళు అంతగా కనబడడంలేదని వీటిని 1500 adలో సిక్కు యోధులు శత్రువుల మీద ప్రయోగించేవారని, అలా సిక్కుల చేత ఈవిధమైన చక్రాయుధాలు పరిచయం చేయబడ్డాయని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే అక్బరునామా లో చక్రాయుధం, అవి ప్రయోగించబడిన విధానానికి సంబంధించిన తైలవర్ణ చిత్రాలు కూడా చూడొచ్చని, ఆ చిత్రాల్లో కృష్ణుడు తిప్పినట్టు వేలితో చక్రాన్ని తిప్పి విసరడాన్నిగమనించొచ్చు అని కూడా చెప్తారు చారిత్రక పరిశోధకులు .
దీన్ని బట్టి ఈ చక్రఆవిర్భం 1500 AD కి ముందర సిక్కుల చేత జరిగిందని ఒక వాదన ఉంది. అయితే 2014లో దక్షిణ భారత దేశంలో ఒక హిందూ దేవాలయంలో బయటపడిన ఒక శిలా శాసనం ఈ చక్రాయుధానికి సిక్కుల కంటే ముండే అత్యంత ప్రాచీన చరిత్రే ఉందని, సిక్కుమతం పుట్టే నాటికే చక్రాలని యుద్దాలలో వాడడం మన దేశంలో ఉండేదని చెప్తోంది సిక్కు మతం కంటే పురాతనమైనదయినా ఆ శాసనం. సిక్కుమతం పుట్టుక కంటే ఈ శాసనం పురాతనమైనదని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా. అంటే ఈ శాసనం దాదాపుగా 12 లేదా 13 AD శతాబ్దాలకి చెందినదిగా చరిత్రకారులు చెప్తున్నారు .
దీనిని బట్టి అప్పటి హిందూ రాజులు వీటిని వాడేవారని పరిశోధకుల అభిప్రాయం . 11 వ శతాబ్దంలో తయారుచేయ్యబడినట్టు భావిస్తున్న ఈ చక్రం శత్రువుపై ప్రయోగించిన తరువాత శత్రువును మట్టుపెట్టి తిరిగి ప్రయోగించిన వారి చేతికి వచ్చి చేరేవిదంగా రూపొందించబడిందని పరిశోధకుల మాట. నిజానికి ఈ చక్రాయుధం ఈ నాటిది కాదు పురాణకాలం నాటిదని హిందూ పురాణాలు ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అదే శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శనచక్రం. తరువాత మధ్యయుగం కాలంలో ప్రయోగించబడిన చక్రాయుదాలన్నీ సుదర్శన చక్రాన్ని పోలినవి. కేవలం నమూనాలు మాత్రమే అన్నది మన పురాణ, ఆధ్యాత్మిక గ్రంధాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఒకప్పుడు అఖండ హిందూ సామ్రాజ్యంగా ప్రస్తుతం భారతదేశానికి పొరుగు దేశాలుగా చెప్పబడుతున్న కొన్ని దేశాలలో చూస్తే ఈ సుదర్శనచక్రానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు కనబడతాయి. ఒకప్పటి గాంధార రాజ్యంగా చెప్పే ఆఫ్గనిస్తాన్ లో నాల్గవ శతాబ్దానికి చెందిన చెందిన బ్యాక్ట్రిన్ వంశానికి చెందిన రాజు విష్ణుమూర్తికి ప్రణామం చేస్తున్న విగ్రహంలో చక్రాయుధాలు ధరించిన విష్ణుమూర్తి దర్శనమిస్తారు . అనేక ప్రాచీన కాలం నాటి విదేశీ నాణేల మీద కూడా ఈ చక్రాల రూపాలు కనబడతాయి. అవి సుదర్శన చక్ర ప్రతిరూపాలేనని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నిర్థారించారు.
థాయిలాండ్ ని పరిపాలిస్తున్న చక్ర వంశ రాజుల రాజచిహ్నం సైతం చక్రాన్ని దాని మధ్యలో ఒక త్రిశూలాన్ని కల్గి ఉండడం విశేషం. ఈ రాజ వంశీకులు దైవలోకం నుండీ దిగివచ్చారని,ఇప్పటికీ సుదర్శన చక్రం ఈ రాజవంశీకుల దగ్గర సురక్షితంగా ఉందని థాయ్లాండ్ ప్రజలు నమ్ముతారు.
ప్రస్తుత కాలానికి వస్తే కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడానికి అగ్ర రాజ్యంగా చెప్పబడుతున్న ఒక దేశం ప్రయోగించే అస్త్రాలు అచ్చంగా సుదర్శన చక్రాన్ని పోలి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. చుట్టుపక్కల వారికి గాని, పరిసరాలకు గాని ఏమాత్రం హాని చెయ్యకుండా కేవలం నిర్దేశిత టార్గెట్ ని మాత్రమె మట్టుపెట్టే పవర్ ఫుల్ ఆయుధం ఇది. చాలా లైట్ వెయిట్ తో ఖచ్చితత్వంతో వేగంతో ఎలాంటి పేలుడు విధ్వంసం లేకుండానే టార్గెట్ ను మట్టుపెట్టగల సామర్ధ్యం కలిగిన ఈ అస్త్రం పౌరాణిక అస్త్రాలను తలపించేలా ఉందని ఆ అస్త్రానికి అమర్చిన బ్లేడ్లు ఇతర కొన్ని పరికరాలు సుదర్శన చక్రం మాదిరిగానే ఉందని మన పురాణాలలో వర్ణించిన సుదర్శనచక్రం ఇతరులకు ఎలాంటి హాని చెయ్యకుండా శత్రువును వెంటాడి వేటాడి చంపగల అస్త్రమని భావించారు పరిశోధకులు.
ఇదంతా సరే అసలు సుదర్శనచక్రం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని తరువాత ఏమయింది? ఇప్పుడేక్కడుంది ఈ విషయానికి వస్తే, శ్రీ కృష్ణుడి మనోవేగంతో ప్రయోగించే ఈ సుదర్శన చక్రం ఎలా ప్రయోగించాలో కేవల దేవతలకు మాత్రమే తెలుసు. రాక్షసులకు ఈ ఆయుధ రహస్యమ్ తెలిస్తే లోకానికి మంచిదికాదని రహస్యంగా ఉంచబడిందని చెప్తారు. అందుకే శ్రీకృష్ణుడు అవతార సమాప్తి జరిగినపుడు ఈ సుదర్శన చక్రం కూడా అంతర్దానమయిపోయిందని మళ్ళీ మహావిష్ణువు కలియుగం అంతమయ్యే సమయంలో స్వామి చివరి అవతారమయిన కల్కి గా అవతరించి భూమ్మీదకు వచ్చినపుడు కల్కి భగవానుడు మళ్ళీ సుదర్హ్సనచాక్రాన్ని ఉపయోగిస్తారని చెప్తారు.
ఇక చివరిగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు ఈ సుదర్శన చక్రం గురించి తన కాలజ్ఞానంలో ఏం చెప్పారో చూద్దాం, నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిచెందిన ఉదయగిరి కొండపై కలియుగాంతం ముందు ఒక అద్భుతం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు చెప్తారు. ఆ అద్భుతం ఈ సుదర్శన చక్రానికి సంబంధించినదే.
ఇంకో 20 ఏళ్లలో కలియుగం అంతం అయిపోతుందనగా అప్పుడు ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఉదయగిరి కొండపై శ్రీ మహావిష్ణువు చక్రం దర్శనం ఇస్తుందని బ్రహ్మంగారు చెప్పారట. పట్టపగలు సూర్య గ్రహణం పట్టిన మధ్య సమయంలో సూర్యగోళం చుట్టూ ప్రకాశించే దృశ్యం ఎంత అద్భుతంగా వుంటుందో ఇదీ అంత వింతగా వుంటుందని, ఇంద్రధనుస్సు రంగును పోలి వెన్నెల రాత్రిలో కనిపించే ఈ చక్రం ఉదయగిరి కొండపై కనిపించే ఈ సుదర్శన చక్రం కొద్ది సేపే వుంటుందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారట. అంటే కలియుగం అంతానికి ఇది కూడా ఓ సూచన అని చెప్పుకోవచ్చు.