ఉగాది కథ ఇదే... | 2026 ఉగాది ఎప్పుడు వస్తోంది? ఎలా జరుపుకోవాలి? | how perform telugu new year ugadi

Vijaya Lakshmi

Published on Mar 17 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ఉగాది కథ ఇదే... | 2026 ఉగాది ఎప్పుడు వస్తోంది? ఎలా జరుపుకోవాలి?

ఉగాది నాడు ఎవరిని పూజించాలి? ఏం చెయ్యాలి?                                  

2026 పరాభవ నామ ఉగాది

శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు...! అవతార పురుషుడు శ్రీరాముడు, శక కర్తలుగా భాసిల్లిన చక్రవర్తులు విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైన రోజు! వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు! ఇన్ని విశిష్టతలు కలిగిన రోజు ఉగాది! ...

అంతేనా... కాదు చాలా ఉంది. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాది అని ఎందుకు అంటారు? ఈ పండుగ కథేంటి? ఉగాది ని విశిష్టత ఏంటి? ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఉగాదిని తెలుగు వారి నూతన సంవత్సరంగా ఎందుకు పరిగణిస్తారు? ఈ పండుగను దేశంలోని మిగిలిన ప్రాంతాలవారు ఎవరు ఎలా జరుపుకుంటారు... ఇలాంటి పూర్తి వివరాలన్నీ ఈ బ్లాగ్ లో...

ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో సరికొత్త శుభాలను తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 

తెలుగు వారికి ఉత్సాహం ఉరకలేసే పండుగ... తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ... అచ్చమైన, అసలు సిసలైన  తెలుగువారి పండుగ ఉగాది. ప్రతి పండగకి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక చరిత్ర ఉంటుంది. ఒక విశిష్టత ఉంటుంది. మరి ఉగాది పండుగకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఉగాది పండుగగా ఎందుకు జరుపుకుంటాం...? చూద్దాం...


ఉగాది? యుగాది?       

 బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించిన రోజు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి. ప్రళయం పూర్తయిన తర్వాత బ్రహ్మ సృష్టిని తిరిగి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలో మొదట వచ్చే రోజునే యుగానికి ఆదిగా యుగాది అని ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అదే ఉగాదిగా వ్యవహరిస్తున్నాము.

ప్రభవతో మొదలై, క్షయతో పూర్తయే అరవై తెలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ప్రారంభమైన రోజు చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటాం. ఆ రోజును తెలుగు సంవత్సరపు మొదటి రోజుగా పరిగణిస్తాం. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు. అందుకనే ఆ రోజుని యుగాది లేక ఉగాదిగా వ్యవహరిస్తారు.

ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు...

ఈ నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. ఈ 2026 పరాభవ నామ సంవత్సర ఉగాది మార్చి 19, గురువారం వస్తోంది. 19 తేదీ ఉదయం 6:53 గంటలకు పాడ్యమి తిథి ఉదయం మొదలై, మర్నాడు అంటే  మార్చి 20 శుక్రవారం రోజు ఉదయం 4:52 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మార్చ్ 19 గురువారం ఉగాది జరుపుకోవాలి. 

ఉగాదిని ఎలా జరుపుకోవాలి...

సంవత్సరానికి తొలిరోజైన ఉగాదినాడు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేసి తీరాలని చెప్తారు పెద్దలు. ఒంటికి నువ్వులనూనెని పట్టించి చేసే శిరః స్నానమే తైలాభ్యంగనం. సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా, ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది ఇందులో ఆంతర్యం. ఈ రోజు సూర్యోదయం కంటే ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవండి. గోరువెచ్చని నువ్వుల నూనెతో తల నుంచి పాదాల వరకు నెమ్మదిగా మర్దనా చేసుకోండి. అయితే ఈసారి దాన్ని ఒక ధ్యానంలా చేయండి. నూనె రాసుకుంటున్నప్పుడు, లాస్ట్ ఇయర్ టెన్షన్స్, నిరాశ, నెగటివిటీ అన్నీ మీ శరీరం నుండి బయటకు వెళ్లిపోతున్నాయని బలంగా ఫీల్ అవ్వండి. ఈ ఆయిల్ మీ స్కిన్‌కే కాదు, మీ సోల్‌కి కూడా హీలింగ్ ఇస్తోందని అనుకోండి. అభ్యంగన స్నానం వెనుక ఉన్న సైన్స్ కూడా ఇదే: ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది.

స్నానం చేసే నీళ్ళలో కొంచెం పసుపు, కొన్ని వేపాకులు, మీకు నచ్చిన మంచి వాసన వచ్చే పూల రెక్కలు వేయండి. వేపాకు క్రిములను నాశనం చేస్తే, పసుపు శుభాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ నీటితో స్నానం చేస్తున్నప్పుడు, కేవలం శరీరం శుభ్రం అవ్వడమే కాదు, మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ షీల్డ్ తయారవుతోందని ఊహించుకోండి. తర్వాత కొత్త బట్టలు వేసుకోవడం అంటే పాతను వదిలేసి, కొత్తదనాన్ని ఆహ్వానించడమే. ఈ స్నానం ఉద్దేశ్యం. ఆ రోజుకే కాదు, రాబోయే ఏడాది మొత్తానికి మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేస్తుందిది. మొదటి అడుగే ఇంత బలంగా పడితే, సక్సెస్ మీ వెంటే ఉంటుంది.

ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలి?

         సరే ఉగాది నాడు ఎవరిని పూజించాలి? ఒక్కో పండుగకు ఒక్కో దైవాన్ని ప్రత్యకంగా ఆరాధించడం అనేది మనకు తెలిసిందే! అయితే అసలు ఉగాదిరోజు ఏ దైవాన్ని పూజించాలి? ఇది చాలామందికి వచ్చే సందేహం. దానికి పెద్దలిచ్చిన సూచన ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు ఇలా మన ఇష్టదైవాన్ని కాలపురుషునిగా తల్చుకుని పూజించుకోవాలి. అనంతరం పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే ఆరురుచుల కలయికగా, మామిడి, బెల్లం, చింతపండు, వేపపువ్వు, ఉప్పు, కారం కలిపిన ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యం సమర్పించాలి.

వైద్యపరంగా చూస్తే ఈ ఉగాది పచ్చడి వేసవిలో సహజంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ఆధ్మాత్మికంగా చూస్తే అన్ని రుచుల మిశ్రమమైన ఉగాది పచ్చడి, జీవితం సుఖదుఖాల మిశ్రమం అని చెబుతుంది.

పంచాంగ శ్రవణం

         ఉగాది అనగానే అందరి కళ్ళముందు మెదిలే ప్రధాన అంకం, తెలుగువారి సంప్రదాయాల్లో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.

         ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని నమ్ముతారు. జీవితం శుభాశుభాల మిశ్రమం అని గ్రహిస్తూ రాబోయే రోజులకి సిద్ధపడాలని చెప్పేదే పంచాంగం. అందుకే ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు.

ఉగాది రోజు ఏం చెయ్యాలి?

ఎండలు మొదలయ్యే సమయం కాబట్టి బాటసారుల దాహం తీర్చడం కోసం, ఉగాది రోజున ‘ప్రపాదానం’ అంటే చలివేంద్రాన్ని పెట్టాలని చెప్తారు పెద్దలు. చలివేంద్రం పెట్టలేకపోతే ఒక నీటి కుండనైనా దానం చేయమని చెప్తారు. ఉగాదినాడు చెప్పులూ, గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగాది

         మనలాగే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది జరుపుకుంటారు. వారు సంవత్సరాదిని ‘గుడి పడ్వా’గా పిలుస్తారు. తమిళుల ఉగాదిని (తమిళ) పుత్తాండు అంటారు. సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటారు. వీరు దీనిని వైశాఖి గా వ్యవహరిస్తారు. మన సంక్రాంతి లాగా వీరు దీనిని పంటల పండుగగా జరుపుకుంటారు. బెంగాలీలు బైసాఖ్ అని, అస్సాం లో బిహు అని, కేరళలో కొళ్ళ వర్షం అని పిలుస్తారు. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల మాదిరిగానే కర్నాటక లో కూడా ఉగాది అన్న పేరుతోనే జరుపుకుంటారు.


youtube play button



youtube play button


Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...