అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya

Vijaya Lakshmi

Published on Apr 14 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ఒకవైపు... అడవుల్లో ఆకలితో అలమటిస్తున్న పాండవులు. వారికి ఆ శ్రీకృష్ణుడి దయతో అడిగినవన్నీ వండిపెట్టే ఓ అద్భుత పాత్ర దొరికింది. మరోవైపు... కటిక పేదరికంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడు, ఆ ద్వారకాధీశుడిని కలవడానికి వస్తే, శ్రీకృష్ణుడు ఆ స్నేహితుడిని రాత్రికి రాత్రే కుబేరుణ్ణి ఎలా చేశాడు? ఈ రెండు సంఘటనలకూ అక్షయ తృతీయకూ విడదీయలేని బంధం ఉంది.

అక్షయ తృతీయ... ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? బంగారం షాపుల ముందు సందడి, కొత్త నగలు కొనాలనే ఆరాటం, ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలనే ఆశ. కదూ? కానీ ఒక్కసారి ఆలోచించండి, వేల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ పవిత్రమైన రోజుకి అర్థం కేవలం బంగారం కొనడమేనా? అప్పు చేసైనా సరే ఆ రోజు ఓ చిన్న బంగారు ముక్కైనా కొనాలని ఎందుకు అంతలా తాపత్రయపడతాం? ఒకవేళ కొనలేకపోతే ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణించదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన పురాణాల్లోనే ఉంది. అక్షయ తృతీయ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడంలో ఉన్న గొప్పతనాన్ని, ఆనందాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రోజు అక్షయతృతీయ. అసలు ఈ రోజుకు ఆ పేరు, ఆ మహత్యం ఎలా వచ్చాయో చెప్పే అద్భుతమైన కథలున్నాయి.

క్షయం లేనిది అక్షయ

అక్షయ తృతీయ అంటే తరగని సంపదనే కాదు, తరగని పుణ్యాన్ని కూడా ఇచ్చే రోజని మన శాస్త్రాలు ఎందుకు అంత గట్టిగా చెబుతున్నాయో వివరంగా చూద్దాం.

అక్షయ తృతీయ విశిష్టతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, మనం మన పురాణాల పుటల్లోకి ప్రయాణించాలి. 'అక్షయ' అంటే 'క్షయం లేనిది', అంటే తరగనిది. అందుకే ఈ రోజున మనం చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, దానమైనా, జపమైనా దాని ఫలితం తరగనిదిగా, శాశ్వతంగా మనతో ఉండిపోతుంది. అందుకే ఈ తిథికి అంతటి శక్తి.

పాండవులు - అక్షయపాత్ర కథ

ముందుగా మహాభారతంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తు చేసుకుందాం. పాండవులు జూదంలో సర్వం కోల్పోయి, ద్రౌపదితో కలిసి అరణ్యవాసం చేస్తున్న రోజులవి. రోజూ ఎందరో ఋషులు, మునులు వారి ఆశ్రమానికి అతిథులుగా వచ్చేవారు. వచ్చినవారికి భోజనం పెట్టడం ధర్మరాజుకు పెద్ద పరీక్షగా మారింది. తన దగ్గరకు వచ్చిన వారికి అన్నం పెట్టలేని నిస్సహాయతను చూసి ఆయన ఎంతో కుమిలిపోయాడు. అప్పుడు ధర్మరాజు, తన పురోహితుడైన ధౌమ్య మహర్షి దగ్గరకు వెళ్లి, దీనికో పరిష్కారం చూపమని వేడుకున్నాడు.

ధౌమ్య మహర్షి, ధర్మరాజుకు సూర్య భగవానుడిని గురించి తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. ఆయన చెప్పినట్టే, ధర్మరాజు గంగా నదిలో నిలబడి సూర్యుడిని ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన సూర్యదేవుడు ప్రత్యక్షమై, "ధర్మనందనా, నీ భక్తికి ప్రసన్నుడనయ్యాను. ఏం వరం కావాలో కోరుకో" అన్నాడు. అప్పుడు ధర్మరాజు, "సూర్యదేవా, మా ఆశ్రమానికి వచ్చే అతిథులకు, ఋషులకు నేను కడుపునిండా అన్నం పెట్టలేకపోతున్నాను. నాకు అపరిమితంగా అన్నాన్ని ప్రసాదించే శక్తిని ప్రసాదించు" అని కోరాడు.

సూర్య భగవానుడు ధర్మరాజుకి అక్షయపాత్ర ప్రసాదించడం

సూర్య భగవానుడు చిరునవ్వు నవ్వి, ఒక రాగి పాత్రను అనుగ్రహించి, "ధర్మరాజా, ఇదిగో ఇది అక్షయపాత్ర. దీనితో నీ భార్య ద్రౌపది కోరినన్ని వంటకాలను వండగలదు. ఎంతమంది వచ్చినా, అందరికీ కడుపునిండా భోజనం పెట్టగలదు. కానీ ఒక్క నియమం ఉంది. ఆ రోజు అందరి భోజనాలు అయ్యాక, చివరగా ద్రౌపది భోజనం చేసేంత వరకే ఈ పాత్ర ఆహారాన్ని అందిస్తుంది. ఆమె భోజనం పూర్తి చేయగానే, ఆ రోజుకు పాత్ర ఖాళీ అవుతుంది, మళ్ళీ మరుసటి రోజే ఆహారాన్ని అందిస్తుంది" అని చెప్పి అదృశ్యమయ్యాడు. పాండవులు ఆ అక్షయపాత్రను పొందిన ఆ శుభదినమే ఈ పవిత్రమైన అక్షయ తృతీయ. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, నిస్వార్థంగా సేవ చేయాలనే తపన, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలనే ఆర్తి ఉంటే, భగవంతుడే మనకు తరగని సంపదను అందిస్తాడు.

కుచేలుని కథ

ఇక రెండో కథ, స్నేహానికి, భక్తికి నిలువుటద్దంలా నిలిచే శ్రీకృష్ణుడు, సుదాముడి అనే కుచేలుడు) కథ. శ్రీకృష్ణుడు, సుధాముడు ప్రాణ స్నేహితులు. కాలక్రమంలో శ్రీకృష్ణుడు ద్వారకకు అధిపతి అయ్యాడు, కానీ సుధాముడు మాత్రం ఓ సాధారణ బ్రాహ్మణుడిగా ఉంటూ తీవ్రమైన పేదరికంలో మగ్గిపోయేవాడు. ఇంట్లో పిల్లలు పస్తులుండడం తట్టుకోలేని ఆయన భార్య, "స్వామీ, మీ స్నేహితుడు కృష్ణుడు ద్వారకాధీశుడు కదా. ఆయన్ని కలిసి మన కష్టాలు చెప్పుకుంటే తప్పక సాయం చేస్తాడు" అని పదే పదే పోరు పెట్టింది. మొదట చాలా సంకోచించినా, భార్య మాట కాదనలేక సుధాముడు ద్వారకకు బయలుదేరాడు. స్నేహితుడి దగ్గరికి వెళ్తూ, ఖాళీ చేతులతో ఎలా వెళ్ళాలని, ఆయన భార్య పక్కింట్లో కొన్ని అటుకులు అడిగి తెచ్చి, ఒక పాత గుడ్డలో మూటకట్టి ఇచ్చింది.

ఎన్నో కష్టాలు పడి సుధాముడు ద్వారకకు చేరుకున్నాడు. ఆ రాజ భవనాల వైభవం చూసి నోటమాట రాలేదు. లోపలికి వెళ్లడానికి సంకోచిస్తుండగా, సుధాముడు వచ్చాడని తెలిసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగున వచ్చి తన స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. స్వయంగా ఆయన పాదాలు కడిగి, రాజ సింహాసనంపై కూర్చోబెట్టి ఉచారం చేశాడు. పాత కబుర్లన్నీ మాట్లాడుకున్నారు. కృష్ణుడు చిలిపిగా నవ్వుతూ, "మిత్రమా, నాకోసం ఏం తెచ్చావు?" అని అడిగాడు. సుధాముడు సిగ్గుతో, తన పేదరికాన్ని ఎత్తిచూపే ఆ అటుకుల మూటను దాచడానికి ప్రయత్నించాడు. కానీ సర్వాంతర్యామి అయిన కృష్ణుడు ఆ మూటను ప్రేమగా లాక్కొని, ఎంతో ఇష్టంగా ఆ అటుకులను నోట్లో వేసుకున్నాడు. "ఆహా, ఈ అటుకులు ఎంత అమృతంలా ఉన్నాయి!" అంటూ ఒక పిడికెడు తిన్నాడు. రెండో పిడికెడు తినబోతుంటే, రుక్మిణీ దేవి ఆయన చేతిని పట్టుకుని, "స్వామీ, ఒక్క పిడికెడుతోనే మీ స్నేహితుడికి తరగని ఐశ్వర్యాన్ని ఇచ్చారు. రెండోది కూడా తింటే మేమంతా ఆయనకు దాస్యం చేయాల్సి వస్తుందేమో" అని ప్రేమగా వారించింది. సుధాముడు తన పేదరికం గురించి ఏమీ అడగలేకపోయాడు. కృష్ణుడి ఆదరణకు పొంగిపోయి, తిరిగి ఇంటికి బయలుదేరాడు. తీరా వచ్చి చూసేసరికి, తన గుడిసె స్థానంలో ఓ పెద్ద భవనం, సిరిసంపదలు వెల్లివిరుస్తున్నాయి. ఇదంతా కృష్ణ లీల అని గ్రహించాడు. సుధాముడు ప్రేమతో తెచ్చిన అటుకులను కృష్ణుడు స్వీకరించి, ఆయన దారిద్ర్యాన్ని శాశ్వతంగా తొలగించిన ఆ శుభదినం కూడా అక్షయ తృతీయే.

ఈ కథల సారాంశం ఒక్కటే. పాండవులకు అక్షయపాత్ర దక్కింది దానం చేయడానికి. సుధాముడికి సంపదలు దక్కాయి ఆయన నిష్కల్మషమైన భక్తికి, స్నేహానికి. అంతే కాదు, సంపదలకు అధిపతి అయిన కుబేరుడు, పరమశివుడిని మెప్పించి లక్ష్మీదేవితో పాటు సంపదలకు సంరక్షకుడిగా నియమించబడింది కూడా ఇదే రోజు. ఈ కథలన్నీ చెప్పేది ఒకటే: అక్షయ తృతీయ మన సంపదను ప్రదర్శించే రోజు కాదు, మనలోని దాన గుణాన్ని, భక్తిని, సేవాభావాన్ని రెట్టింపు చేసుకునే రోజు.

అక్షయతృతీయ పూజ ఎలా చేయాలి?

మరి ఇంత గొప్ప రోజైన అక్షయ తృతీయ నాడు, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందడానికి మనం ఎలాంటి పూజలు చేయాలి? శాస్త్ర ప్రకారం సరైన పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు చేసే పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి, చాలా శ్రద్ధగా, భక్తితో చేసుకోవాలి.

ముందుగా, ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శ్రేష్ఠం. పూజ చేసే చోట ఒక పీఠం వేసి, దానిపై పసుపు వస్త్రం పరవాలి. దానిపై లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, గణపతి విగ్రహాలను లేదా చిత్రపటాలను ఉంచాలి. పూజకు ముందు, విఘ్నాలు తొలగించమని వినాయకుడిని ప్రార్థించాలి. 'ఓం గం గణపతయే నమః' అని జపిస్తే మంచిది.

ఆ తర్వాత, శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని మనసులో తలుచుకుని పూజలోకి ఆవాహన చేయాలి. శుద్ధజలంతో విగ్రహాలకు అభిషేకం చేసి, చందనం, పసుపు, కుంకుమ, అక్షతలతో అలంకరించాలి. విష్ణుమూర్తికి తులసి దళాలు, లక్ష్మీదేవికి తామరపువ్వులు సమర్పిస్తే చాలా విశేషం. 'విష్ణు సహస్రనామం' లేదా 'లక్ష్మీ అష్టోత్తర శతనామావళి' చదవడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది.

ఈ రోజు పూజలో ముఖ్యంగా గమనించాల్సింది అక్షతలు. 'అక్షతలు' అంటేనే క్షతం కానివి, అంటే విరగని బియ్యం. పసుపు కలిపిన ఈ అక్షతలను దేవతల పాదాల దగ్గర ఉంచి పూజించి, వాటినే ప్రసాదంగా తీసుకోవడం వల్ల వ్రత ఫలం సంపూర్ణంగా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

అక్షయతృతీయ నైవేద్యం

ఇక నైవేద్యం విషయానికి వస్తే, లక్ష్మీదేవికి ఇష్టమైన పాలు, బియ్యంతో చేసిన పాయసం లేదా తెల్లని రంగులో ఉండే మిఠాయిలను పెట్టడం మంచిది. పూజ పూర్తయ్యాక, కుటుంబమంతా కలిసి హారతి ఇచ్చి, ప్రసాదాన్ని స్వీకరించాలి. ఒకవేళ మీరు బంగారం కొని ఉంటే, దాన్ని కూడా పూజలో ఉంచి, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే ఆ సంపద వృద్ధి చెందుతుందని ఒక నమ్మకం. అయితే, అప్పు చేసి కొనడం మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే, ఈ రోజున చేసే పుణ్యం ఎలాగైతే అక్షయం అవుతుందో, చేసే అప్పు కూడా అక్షయం అవుతుందని పెద్దలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన శక్తికి మించి ఆడంబరాలకు పోకుండా, భక్తితో పూజ చేయడం అన్నిటికన్నా ముఖ్యం.

అక్షయతృతీయ నాడు బంగారం ఖచ్చితంగా కొనాలా?

అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం కన్నా వెయ్యి రెట్లు గొప్పది దానం చేయడం. ఈ రోజు చేసే దానం యొక్క ఫలితం అక్షయమైనది, తరగనిదని సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడే చెప్పాడు. నారద పురాణం ప్రకారం, ఈ రోజు చేసే దానాలు అనంతకోటి పుణ్యఫలితాన్ని అందిస్తాయి. మరి ఈ రోజు ఏయే దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దామా?

అక్షయ తృతీయ నాడు చేయవలసిన దానాలు

అన్నదానం

అన్ని దానాలలోకెల్లా గొప్పది అన్నదానం. అక్షయ తృతీయ నాడు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వల్ల కలిగే పుణ్యాన్ని మాటల్లో చెప్పలేం. ఇది మన పాపాలను హరించి, ఎన్నో జన్మల పుణ్యాన్ని మన ఖాతాలో జమ చేస్తుంది.

జలదానం

రెండవది జలదానం. వైశాఖ మాసం ఎండలు మండిపోతుంటాయి. ఈ సమయంలో బాటసారుల దాహం తీర్చడానికి ఓ చలివేంద్రం పెట్టడం, లేదా కనీసం ఒక కుండలో చల్లటి నీటిని దానం చేయడం వల్ల స్వర్గంలో ఉన్న మన పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు. రాగి లేదా వెండి కలశంలో సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటిని దానం చేయడం (ఉదకుంభ దానం) వల్ల పెళ్లి కాని వారికి త్వరగా వివాహం, పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని శాస్త్ర వచనం.

గొడుగు, పాదరక్షల దానం

అలాగే, ఎండ వేడి నుండి కాపాడే గొడుగు, కాళ్లకు రక్షణనిచ్చే పాదరక్షల (చెప్పులు) దానం కూడా ఎంతో విశిష్టమైనది. గొడుగు దానం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, పాదరక్షల దానం వల్ల నరకలోక భయాలు తొలగిపోతాయని నమ్మకం.

వస్త్రదానం

ఇవే కాకుండా, వస్త్ర దానం చేస్తే జీవితంలో అన్నవస్త్రాలకు లోటుండదు. శక్తి కొలది గోదానం, భూదానం, సువర్ణదానం వంటివి గొప్ప ఫలితాలనిస్తాయి. కుంకుమ దానం సౌభాగ్యాన్ని, చందనం దానం కీర్తిని, కొబ్బరికాయ దానం వంశాభివృద్ధిని కలిగిస్తాయి. అయితే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. దానం అనేది "నేను చేస్తున్నాను" అనే అహం లేకుండా, మనస్ఫూర్తిగా, భక్తితో చేయాలి. భగవంతుడే తన ద్వారా మరొకరికి సహాయం చేయిస్తున్నాడనే భావనతో చేయాలి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం చేయవలసిన దానాలు

మీ రాశి ప్రకారం కూడా కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఉదాహరణకు, మేష రాశి వారు కందిపప్పు, సింహ రాశి వారు గోధుమలు, కుంభ రాశి వారు నల్ల గొడుగు దానం చేయడం మంచిది.

కాబట్టి, ఈ అక్షయ తృతీయ నాడు మన శక్తి మేరకు ఎంతో కొంత దానం చేసి, తరగని పుణ్యం అనే అసలైన బంగారాన్ని కూడబెట్టుకుందాం.

మిత్రులారా, చూశారు కదా! అక్షయ తృతీయ పర్వదినం వెనుక ఎంత అద్భుతమైన అర్థం దాగి ఉందో. ఇది కేవలం బంగారం కొనే పండగ కాదు. ఇది మనలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని మేల్కొలిపే పవిత్రమైన రోజు. దానం, ధర్మం, భక్తి, సేవ... ఇలాంటి మంచి పనుల ద్వారా మన పుణ్య ఫలాన్ని అక్షయం చేసుకునే రోజు. పాండవుల అక్షయపాత్రలా మన ఇల్లు ఎప్పుడూ ధాన్యంతో, సుధాముడి ఇల్లులా మన జీవితం సిరిసంపదలతో నిండిపోవాలంటే, మనం చేయాల్సింది ఒక్కటే - ఇవ్వడం నేర్చుకోవడం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంలో, దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇవ్వడంలో దొరికే ఆనందాన్ని, పుణ్యాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ అక్షయ తృతీయ నాడు, ఆ లక్ష్మీనారాయణుల కరుణాకటాక్షాలతో మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో అక్షయంగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు.

Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...