900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story

Vijaya Lakshmi

Published on Apr 18 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

కరకచెట్టు పోలమాంబ దేవి… విశాఖపట్నంలో కొలువైన ఈ మహాశక్తి చరిత్ర దాదాపు 900 సంవత్సరాల నాటి. సముద్రంలో జాలర్ల వలకు చిక్కిన ఓ విగ్రహం, ఈ రోజు లక్షలాది భక్తుల ఆరాధ్యదేవతగా ఎలా మారింది?

ఈ బ్లాగ్ లో మీరు తెలుసుకోబోయేది...

పోలమాంబ దేవి ఆవిర్భావం ఎలా జరిగింది?

జాలర్లు, మద్ది వంశీయుల మధ్య ఉన్న బంధం

కరకచెట్టు కింద ప్రతిష్ట వెనుక రహస్యం

అమ్మవారి విభిన్న రూపాలు (సముద్ర దేవత, సర్ప దేవత, జీడిపళ్ల అమ్మవారు)

పోలమాంబ జాతర 2026 పూర్తి వివరాలు

భక్తులు నమ్మే అద్భుతాలు & మహిమలు మొదలైన వివరాలు


విశాఖ సంస్కృతికి అద్దం పట్టే ఈ గొప్ప కథను తప్పకుండా పూర్తిగా చూడండివైజాగ్... ఈ పేరు చెప్పగానే మీకేం గుర్తొస్తుంది? అందమైన బీచ్‌లు, పెద్ద ఓడరేవు, చుట్టూ పచ్చని కొండలు... అవునా? కానీ, ఇదే నగర నడిబొడ్డున, ఈ ఆధునికత మధ్యలో దాదాపు 900 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక మహాశక్తి కొలువై ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఎప్పుడో సముద్రంలో జాలర్ల వలకు చిక్కిన ఓ అమ్మవారి విగ్రహం... ఈ రోజు యావత్ విశాఖను కాపాడే శక్తిగా, గ్రామదేవతగా లక్షలాది మందికి కొంగుబంగారంగా ఎలా మారిందో తెలుసా? ఆ అద్భుతమైన గాథే, పెదవాల్తేరులో కొలువైన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి చరిత్ర.

సుమారు తొమ్మిది శతాబ్దాల కిందట మొదలైన ప్రయాణం ఇది. జాలర్ల భక్తితో మొదలై, మద్ది వంశీయుల సేవతో కొనసాగి, కరకచెట్టు నీడన శక్తి స్వరూపిణిగా వెలసిన అద్భుతమైన గాథ. ఇంతకీ, అమ్మవారిని సముద్ర దేవత అని, సర్ప దేవత అని, "జీడిపళ్ల అమ్మవారు" అని రకరకాల పేర్లతో ఎందుకు పిలుస్తారు? అమ్మను నమ్మిన భక్తులకు జరిగిన అద్భుతాలు ఏంటి? అసలు ఈ అమ్మవారికి పోలమాంబ అన్న పేరు ఎందుకు స్తిరపడింది? తెలుసుకుందాం,

పోలమాంబ ఆవిర్భావం - సముద్రంలో దొరికిన విగ్రహం

ఈ అద్భుత కథ దాదాపు 900 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో విశాఖ తీరంలోని పెదజాలరి పేట జాలర్లు రోజూలాగే వేటకు వెళ్లారు. వలలు వేశాక, ఆ రోజు వాళ్లకు ఓ వింత అనుభవం ఎదురైంది. వాళ్ళ వలలు ఉన్నట్టుండి విపరీతంగా బరువెక్కాయి. ఏదో పెద్ద చేప పడిందని సంబరపడి, అతి కష్టం మీద వలను ఒడ్డుకు లాగారు. తీరా చూస్తే, వలలో ఉన్నది చేప కాదు... చెప్పలేని తేజస్సుతో వెలిగిపోతున్న ఓ అమ్మవారి విగ్రహం.

ఆ విగ్రహాన్ని చూసి జాలర్లంతా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తూ అమ్మవారే తమను కరుణించిందని భావించి, ఆ విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి పూజలు చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత, ఆ గ్రామ పెద్దల కలలో అమ్మవారు కనిపించి, తన విగ్రహాన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్లి పెదవాల్తేరులో ఉండే మద్ది వంశీయులకు అప్పగించమని చెప్పింది.

అమ్మవారి ఆజ్ఞను తలదాల్చిన జాలర్లు, విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఊరేగింపుగా పెదవాల్తేరుకు బయలుదేరారు. విషయం తెలిసిన మద్ది వంశీయులు ఆనందంతో ఉప్పొంగిపోయి, అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. జాలర్ల నుండి ఆ విగ్రహాన్ని ఎంతో భక్తితో స్వీకరించారు. ఆ రోజు నుండి, ఈ రెండు వర్గాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. అందుకే ఇప్పటికీ అమ్మవారి జాతరలో జాలర్లకు, మద్ది వంశీయులకు ప్రత్యేక గౌరవం ఇస్తారు.

కరకచెట్టు కింద కొలువైన తల్లి

మద్ది వంశీయులు విగ్రహాన్ని స్వీకరించాక, ఎక్కడ ప్రతిష్టించాలా అని ఆలోచిస్తుండగా, వాళ్ల కలలో కూడా అమ్మవారు కనిపించి దారి చూపింది. పెదవాల్తేరులోని జీడితోటల మధ్య ఉన్న ఒక కరకచెట్టు కింద తనను ప్రతిష్టించమని ఆదేశించింది. అమ్మవారి ఆదేశంతో, మద్ది వంశీయులు ఆ చెట్టు కిందే విగ్రహాన్ని ప్రతిష్టించి, ఒక చిన్న ఆలయాన్ని కట్టారు. కరకచెట్టు కింద కొలువుతీరింది కాబట్టి, అమ్మవారికి "కరకచెట్టు పోలమాంబ" అనే పేరు స్థిరపడింది.

అప్పటి నుండి, ఆ తల్లి విశాఖ చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకు గ్రామదేవతగా మారింది. పొలాలను కాపాడే తల్లిగా, పంటలను, సిరిసంపదలను ఇచ్చే దేవతగా పేరుగాంచింది. 'పొలాలను అంబలా కాపాడుతుంది' కాబట్టి, 'పోలమాంబ' అనే పేరు ఎంత కరెక్ట్ గా సరిపోయిందో కదా! చరిత్రకారుల అంచనా ప్రకారం, ఈ విగ్రహం 12వ శతాబ్దపు చాళుక్య-చోళుల కాలం నాటిది. దీన్నిబట్టి అమ్మవారి చరిత్ర ఎంత పురాతనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న గుడిగా మొదలై, భక్తుల సహకారంతో నేడు మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది.

కరకచెట్టు పోలమాంబ విభిన్న రూపాలు, భక్తుల నమ్మకాలు

కరకచెట్టు పోలమాంబను భక్తులు ఎన్నో రూపాల్లో కొలుస్తారు. ఆమెకున్న పేర్లు, వాటి వెనుక ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

సముద్ర దేవత

కరకచెట్టు పోలమాంబ తల్లిని సముద్ర దేవతగా కోలుతారు. అమ్మవారి విగ్రహం సముద్రంలో దొరికింది కాబట్టి, జాలర్లు ఆ దేవిని తమను కాపాడే సముద్ర దేవతగా ఆరాధిస్తారు. ఇప్పటికీ వేటకు వెళ్లే ముందు అమ్మవారిని తలుచుకోవడం వారి ఆనవాయితీ.

సర్ప దేవత

అమ్మను సర్పదేవతగా కూడా కొలుస్తారు. అమ్మవారి విగ్రహాన్ని మీరు దగ్గరగా చూస్తే, ఆమె తలపై, చేతిలో సర్పం కనిపిస్తుంది. అందుకే అమ్మవారిని సర్ప దేవతగా కూడా పూజిస్తారు.

జీడిపళ్ల అమ్మవారు

పోలమాంబ అమ్మవారిని జీడిపళ్ళ అమ్మవారుగా కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఆలయం చుట్టూ జీడి తోటలు ఉండేవట. పండుగ రోజున భక్తులు మొక్కుగా జీడిపళ్లను గుడి పైకప్పు మీదకు విసిరే సంప్రదాయం ఉండేది. అందుకే అమ్మవారికి "జీడిపళ్ల అమ్మవారు" అనే పేరు కూడా వచ్చింది.

శక్తి స్వరూపిణి

అమ్మవారిని దుర్గాదేవి అవతారంగా, ప్రకృతిని రక్షించే తల్లిగా భావిస్తారు. ఆమె చేతుల్లో ఖడ్గం, కుంకుమ భరిణె, నిమ్మకాయల దండతో దర్శనమిస్తుంది. ఇది ఆమె శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం మూడింటినీ ఒకేసారి ప్రసాదిస్తుందన్న నమ్మకానికి ప్రతీక.

వివాహం కాని యువతీయువకులు, పిల్లలు లేని దంపతులు, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు, వ్యాపారాల్లో ఉన్నవారు... ఇలా ఎంతోమంది అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటారు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

2026 జాతర షెడ్యూల్ మరియు వైభవం

ప్రతి ఏటా అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కేవలం ఉత్తరాంధ్ర నుంచే కాదు, పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుండి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఇది ఒక సువర్ణావకాశంగా భావిస్తారు భక్తులు.

కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు జనవరిలో మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. "తొలేళ్లు" కార్యక్రమంతో పండుగ మొదలయి, అదేరోజు సాయంత్రం, పోలమాంబ చదురుగుడి నుండి ఘటాలతో సాగే అమ్మవారి తిరువీధి ఉత్సవం, "సిరిమానోత్సవం" లేదా "అనుపు" ఉత్సవాలు కన్నులపండుగగా, అద్భుతంగా నిర్వహిస్తారు. మూడవ రోజు "అంపకోత్సవం" జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని తిరిగి ఆలయంలోకి తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుంది. ఆ రోజు సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని చూసేందుకు భక్తులు సముద్రంలా పోటెత్తుతారు.

ఈ జాతర కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, వైద్య శిబిరాలు వంటివి ఉంటాయి. జాతరలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. వైజాగ్ సంస్కృతికి అద్దంపట్టే ఈ గొప్ప ఉత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.

సముద్రంలో దొరికిన ఒక విగ్రహం, పద్నాలుగు గ్రామాలకు కొంగుబంగారమై, విశాఖ నగరానికే రక్షణ కవచంగా మారిన కరకచెట్టు పోలమాంబ దేవి కథ ఇది. ఆమె చరిత్ర మన భక్తికి, నమ్మకానికి, సంప్రదాయానికి నిలువుటద్దం.

Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...