Vijaya Lakshmi
Published on Nov 05 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?పండరీపురం పాండురంగని భక్తుల గురించి వింటున్నపుడు, ఆ భక్తుల పట్ల ఆ పాండురంగ విఠలుడు చూపించిన మహత్యాలు వింటున్నపుడు కలిగే తన్మయత్వం తాదాత్మ్యం స్వయంగా అనుభవించవలసిందే తప్ప మాటలతో చెప్పడానికి చాలదు. ఒక సక్కుబాయి... ఒక జానాబాయి... ఒక జ్ఞాన్ దేవ్, ఒక నామదేవ్, ఒక చోకమేలుడు, ఒక గోమాబాయి... ఇలా ఎంతోమంది భక్తులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఒక్కొక్కరి విషయంలో పాండురంగ విఠలుడు చూపిన ఒక్కో లీల అద్భుతం.. పరమాద్భుతం. అలాంటి భక్తులలో పాండురంగని పరమభక్తురాలు గోమాబాయి.
చాలాకాలం క్రితం, మహారాష్ట్రలో గోమాబాయి అనే పేదరాలు ఉండేది. పండరీనాథునికి మహాభక్తురాలు. ఎప్పుడూ హరినామ సంకీర్తనమే ఊపిరిగా జీవించేది. చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో జీవించే అత్యంత పేదరాలు. వితంతువు. తనకు వచ్చే అంతంత మాత్రం సంపాదనలోనే తన పొట్ట పోసుకుంటూ, తనకు అవసరమయినంత మాత్రమె ఉంచుకొని మిగిలినది ఇతరులకు పంచిపెట్టేది. రొట్టెపిండి, బియ్యంలాంటివి దాచి, ఆ గ్రామానికి వచ్చేపోయే భాగవతులకు, భక్త బృందాలకు వండి పెట్టేది. భాగవతుల సేవే భగవత్ సేవగా భావించి జీవిస్తూ ఉండేది.
ఇలా ఉండగా మహారాష్ట్ర లోని పండరీపురంలో పాండురంగని ఏకాదశి ఉత్సవాలు జరిగే సమయం వచ్చింది. పండరీపురంలో తొలి ఏకాదశి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున, అత్యంత వైభవంగా జరుగుతాయి. పండరినాథుని ఏకాదశి ఉత్సవాలు చూడాలని గ్రామం నుండి ఎంతో మంది భక్తులు పండరీపురం బయలుదేరి వెళుతున్నారు. అది చూసిన గోమాబాయి తాను కూడా పండరీపురం వెళ్లి పాండురంగని ఉత్సవాలను చూడాలని ఆశపడింది. తన దగ్గరనున్న కొంచెం సత్తు పిండిని మూటకట్టుకుని పాండురంగా, పండరీనాతా అని రంగాని స్మరించుకుంటూ కాలినడకన బయలుదేరింది. అలా నడుస్తూ నడుస్తూ మార్గమధ్యంలో తన దగ్గరున్న పిండిలో కొద్దిగా పిండి తీసుకొని రొట్టెలు చేసుకుని తిని మళ్ళీ నడక మొదలుపెట్టీది. అలా నడుస్తూ చంద్రభాగా నది దగ్గరకు చేరింది. ఆమె అక్కడికి చేరుకున్న మరునాడే పండరీపురంలో ఉత్సవం జరుగుతుంది. అయితే చంద్రభాగ ఉధృతంగా ఉంది. దాంతో కచ్చితంగా పడవ మీదే తీరం దాటాలి తప్ప నడిచి వెళ్ళే మార్గం లేదు. పోనీ పడవ ఎక్కి వెళదామంటే గోమాబాయి దగ్గర సత్తుపిండి తప్ప ఇక డబ్బులు లేవు. ఒక్క నయాపైసా కూడాలేదు. దాంతో అయ్యో నా దగ్గర పైసలు లేవే ఇప్పుడు పండరీపురం ఎలా వెళ్ళాలి అని బాధపడుతూ నిలబడింది.
చేతిలో డబ్బు ఉన్నవాళ్లు పడవలు ఎక్కి తీరం దాటి పండరీపురానికి వెళ్తున్నారు. గోమాబాయి మాత్రం తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో పడవ నడిపే వాళ్ళు ఈమెను పడవ ఎక్కనివ్వలేదు. పాపం తనను కూడా పడవ ఎక్కనివ్వమని పడవ వాళ్ళని ఎంతో బతిమాలింది గోమాబాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఒక్క పడవవాడయినా ఆమె మీద కనికరించి పడవ ఎక్కనివ్వలేదు. ఇలా నది ఒడ్డున ఎదురుచూస్తున్న తనను చూసి జాలిపడి అయినా కనీసం చివరిసారిగా అయినా తీసుకువెళ్తారని ఆశపడింది. కాని ఎవ్వరూ గోమాబాయిని తీసుకెళ్ళలేదు.
దాంతో అయ్యో పాండురంగని, పాండురంగని ఉత్సవం చూడలేకపోతున్నానని బాధపడుతూ అక్కడే నది గట్టు మీద కూర్చుని పాండురంగ విఠలుని తలచుకుంటూ సంకీర్తనలు పాడుకుంటూ కూర్చుంది గోమాబాయి. “పండరీనాథా, నీ పండుగ చూడాలన్న ఆశతో వచ్చాను. నీ ఉత్సవం చూసే అదృష్టం నాకు లేదేమో అందుకే రాలేకపోతున్నాను. నాకు నీ వైభవాన్ని చూసే ప్రాప్తం లేదేమో అనుకోని బాధపడుతూ కూర్చుంది.
గోమాబాయి అలా నిరాశతో కృంగిపోతున్న సమయంలోనే ఉదయం నుంచి పడవ నడుపుతూ తాను అడిగినా కూడా తనను పడవ ఎక్కనివ్వని ఒక పడవవాడు వచ్చాడు. నిరాశగా కూర్చొని ఉన్న గోమాబాయిని చూసాడు. ఏమమ్మా రా నిన్ను ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్తాను అన్నాడు. తనను ఆత్మీయంగా పలకరించిన ఆ పడవవానితో తన కష్టాన్ని చెప్పుకున్న గోమాబాయి, నీకు పుణ్యం ఉంటుంది. రంగడి ఉత్సవం చూడాలని చాలా ఆశగా ఉంది. నన్ను అవతలి గట్టుకు చేర్చు నాయనా నీకు పుణ్యముంటుంది, అని వేడుకుంది.
ఆ పడవవాడు, అయ్యో బాధపదకమ్మా... నిన్ను పండరీపురానికి నేను నా పడవలో తీసుకెళ్తాను అని చెప్పి, ఉదయం నుంచి వేచి ఉండి నీరసంతో నడవలేకుండా ఉన్న గోమాబాయిని జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి పడవలో కూర్చోబెట్టి అవతలి వడ్డుకు తీసుకెళ్లాడు. నదిలో పడవ నడుపుతు అవతలి ఒడ్డుకు చేరుకునేంతవరకు పడవనడిపే యువకుడు గోమాబాయితో మాట్లాడుతూ ఆమె కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నాడు. నాకేం కష్టం నాయనా, ఏదో ఒక రకంగా నాకు ఆహారం అందేలా చేస్తున్నాడు ఆ పాండురంగడు. ఇక పాండురంగని పండుగ చూడాలని ఆశతో వచ్చి పడవకు డబ్బులు లేకపోవడంతో ఇక విఠలుని ఉత్సవాన్ని చూడలేనేమో అని బాధపడుతున్న సమయంలో సరిగ్గా సమయానికి సాక్షాత్తూ ఆ పాండురంగడిలా వచ్చి నన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తున్నావు. ఆ రంగడి వైభవం చూడబోతున్నాను, ఇక నాకు కష్టాలేముంటాయి నాయనా అంది గోమాబాయి. జాగ్రత్తగా అవతలి తీరానికి చేర్చి అవతలి తీరంలో దించాడు పడవ నడిపే యువకుడు.
నాయనా! నాకు ఇంత సహాయం చేసావు. కాని నీకివ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇదిగో ఈ పిండి మాత్రమె ఉంది తీసుకో అంటూ తన దగ్గరున్న పిండిని ఇవ్వబొయింది గోమాబాయి. వద్దమ్మా... పొద్దుటి నుండి పడవ నడిపి బాగానే సంపాదించాను. అందుకే ఈ పిండి నాకవసరం లేదు. ఈ పిండితో రొట్టెలు చేసి ఎవరైనా భక్తులకు పెట్టమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు పడవ మనిషి. ఇక్కడ గోమాబాయి పాండురంగని ఉత్సవం చూడడంలోమునిగిపోయింది. ఆనందంగా ఉత్సవం చూస్తూ రంగాని ప్రార్థనలో మునిగిపోయింది. ఉత్సవమంతా తృప్తిగా చూసింది. మర్నాడు నదిలో స్నానంచేసి, గుడికెళ్లి స్వామిని సేవించుకుంది గోమాబాయి. ఆలయం దగ్గర దయగల వారు ఆమెకు సహాయం చెయ్యడంతో కొంత డబ్బు సమకూడింది. ఇంతలో ముందురోజు తనను నది దాటించిన పడవవాడు కనబడ్డాడు. గోమాబాయి వెంటనే వెళ్లి అయ్యా నిన్న నీ సహాయానికి మూల్యం చేల్లిన్చాలేకపోయాను. ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు సమకూడింది. ఇదిగో తీసుకో అంటూ కొంత డబ్బు అతని చేతిలో పెట్టబోయింది. ఆ పడవవాడు విచిత్రంగా చూస్తూ, అదేంటి నేను నిన్ను నా పడవలో తీసుకురాలేదే. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు. అని చెప్పి వెళ్ళిపోయాడు. అయోమయంగా చూసింది గోమాబాయి. అదేంటి నిన్న ఇతనే కదా నన్ను పడవలో నది దాటించింది ఇప్పుడిలా అంటాదేందిఅనుకుంది.
సరేలే అనిచెప్పి తన దగ్గరవున్న పిండిలో సగభాగం రొట్టెలు చేసి ఎవరైనా భాగవతులకు ఇవ్వాలని ఎదురు చూస్తోంది. గోమాబాయికి, భగవద్బుక్తులకు ఆహారం పెడితే తప్ప తాను తినకూడదని నియమం ఉంది. అందుకే నియమం ప్రకారం రొట్టెలు చేసి భాగవతుల కోసం ఎదురుచూస్తూ ఉంది. కాని ఏ భక్తులు కనబడలేదు. ఒకవైపు భాగవతులేవరికీ ఆహారం పెట్టలేక, తాను తినకపోవడంతో గోమాబాయి చాలా నీరసపడిపోయింది. చివరికి నీరసంతో తెలివితప్పి పడిపోయేలా ఉంది.
సరిగ్గా అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ”అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం పెట్టగలవా ?” అని అడిగాడు గోమాబాయిని. తన దగ్గరున్న రెండు రొట్టెలలో ఒక రొట్టెను ఆ బ్రాహ్మణ వృద్ధుడికి ఇచ్చింది. ఆ వృద్ధుడు తృప్తిగా ఆ రొట్టె తిని, దీవిం చాడు. తన వెంట ఉన్న వృద్ధురాలికి కూడా తినడానికి ఏదైనా పెట్టమని అడిగాడు. గోమాబాయి దగ్గర తనకోసమని ఉంచుకున్న ఒక్క రొట్టె మాత్రమె ఉంది. ఆ రొట్టెను ఆమె కిచ్చేస్తే ఇక తనకు తినడానికి ఏమీ ఉండదు. ఇప్పటికే తిండి లేక నీరసంతో శోష వచ్చేట్టుగా ఉంది. ఆ బ్రాహ్మనుదేమో తన భార్యకు కూడా తినదానికి ఏదైనా ఇవ్వమని అడుగుతున్నాడు. దాంతో ఆకలితో నకనకలాడుతున్న ఆ పరిస్తితిలో కూడా తనకోసమని ఉంచుకున్న రొట్టె ఇచ్చేసింది గోమాబాయి. వెంటనే వృద్ధ దంపతులు పాండురంగడు, రుక్మిణీ మాతగా దర్శనం ఇచ్చారు.
అనుకోని ఈ అదృష్టానికి గోమాబాయి సంతోషంతో కళ్ళలో నీళ్లుధారగా కారిపోతుండగా వారి పాదాలపై పడిపోయింది.
రుక్మిణీదేవి, పాండురంగడు గోమాబాయిని లేవనెత్తి నీ నిస్వార్ధ భక్తితో, ఎప్పుడో మాకు దగ్గరయ్యావు. అందుకే, రాత్రి పడవ వానిగా, కొద్దిసేపటి క్రితం బ్రాహ్మణ దంపతులుగా, నీ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు నువ్వు చూడాలనుకునే మా యదార్థ రూపాల్లో నీకు దర్శనమిచ్చాము. అతి త్వరలోనే నీకు ముక్తి లభిస్తుంది. అంతవరకూ ఇదే నిస్వార్థ బుద్ధితో నన్ను సేవిస్తూ ఉండు అని సెలవిచ్చాడు విఠలుడు. రంగడు వరమిచ్చినట్టుగానే కొంతకాలం రంగడి ధ్యానంలో గడిపి అంత్యకాలంలో కృష్ణునిలో ఐక్యమయిపోయింది గోమాబాయి. ఇలా తన భక్తుల పట్ల పాండురంగడు చూపిన లీలలు ఎన్నో...
ఇవి కూడా చదవండి