Vijaya Lakshmi
Published on Oct 08 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
ఆరోజు చివరి ఎగ్జామ్. ఆనాటితో మూడేళ్ల నుంచి కలిసి మెలిసి స్నేహంగా ఉంటున్న వారంతా దూరమైపోతారు అన్న బాధతో ప్రతి ఒక్కరి మనసు మూగబోయింది. ముందుగా అనుకున్న ప్రకారం తార స్నేహ బృందమంతా ఒక చెట్టు కింద చేరి, ఇంకా రావాల్సిన వారి కోసం ఎదురుచూస్తున్నారు. అందరి మొహాల్లోనూ పరీక్షలు బాగా వ్రాసినందుకు సంతోషం... స్నేహితులకు దూరమవుతున్నందుకు విచారం కలగలుపుగా కనిపిస్తున్నాయి. చాలాసేపు తాము చేసిన అల్లరి పనులు, చిలిపి చేష్టలు మరీమరీ తలుచుకుని నవ్వుకున్నారు. బయటకు నవ్వుతున్నా... అందరి హృదయాల్లోనూ ఒకటే ఆలోచన. మళ్లీ ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామో... అసలు కలుస్తామో లేదో? అని ఒకరికొకరు బెస్ట్ విషెస్ చెప్పుకొని, దగ్గర్లో ఉన్న వారు మాత్రం అప్పుడప్పుడు కలుసుకోవాలని వాగ్దానాలు చేసుకొని, అతి కష్టం మీద ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు.
*************
ఆ మర్నాడు ఉదయం నుంచి కంగారుగా ఉంది తారకు. సాయంత్రం నాలుగు ఎప్పుడు అవుతుందా... అని ఆరాటంగా ఎదురుచూస్తోంది. ఈరోజు నుంచి డ్రామా రిహార్సల్స్ కు వస్తానని చెప్పింది రామారావు గారితో. అక్కడి వాతావరణ అంతా తనకు కొత్త. కనీసం ఎప్పుడు చూడను కూడా చూడలేదు. ఎలా ఉంటుందో! అందులోనూ... అమ్మను ఎదిరించి మరీ వెళ్లబోతోంది. హృదయం ఉద్వేగంతో నిండిపోయింది. ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గడియారం నాలుగు గంటలకు కొట్టింది. గడియారం గంటలలాగే తార గుండెలు కూడా దడదడలాడాయి.
నిర్ణయమయితే ధైర్యంగా తీసుకుంది. కానీ ఇప్పుడు తల్లికి చెప్పాలంటే నోరు తడారి పోతోంది. ఎలాగో ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా తల్లి దగ్గరకు నడిచింది. కూతురిని చూసి కూడా చూడనట్టే ఊరుకుంది పార్వతి. ఆరోజు ఘర్షణ జరిగినప్పటి నుండి కోపంగానే ఉందావిడ.
నిజానికి కోపంగా ఉంది! అనడం కంటే కోపం నటిస్తోందడం సబబు. తను ఏ కాస్త మెత్తబడినట్టు కనబడినా తార మళ్లీ నటిస్తానంటుందని ఆవిడ భయం. అందుకే... అలా బింకంగా ఉండిపోయింది.
“అమ్మా!” పిలిచింది తార.
పిలుపు విని కూడా ఇటు తిరగలేదు అలాగే కూర్చుంది పార్వతి.
“అమ్మా! నేను రిహార్సల్స్ కు వెళ్తున్నాను.” గబగబా చెప్పి, మరో మాటకు ఆస్కారం లేకుండా, తల్లి తేరుకునే లోగానే బయటపడింది.
నిర్ఘాంతపోయి నోట మాట రానట్టు అయిపోయింది పార్వతి. ‘తానంత గట్టిగా వ్యతిరేకించిన తర్వాత కూడా అది తన నిర్ణయం మార్చుకోలేదన్నమాట! మొక్కుబడిగా ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నా సుమా!’ అన్నట్టున్న ఆ పిల్ల ప్రవర్తన చూస్తే మింగుడు పడడం లేదు పార్వతికి. తను కోపంగా చూస్తేనే భయంతో ముడుచుకుపోయే కూతురు, అంత గట్టిగా తన నిర్ణయం చెప్పిన తర్వాత కూడా ఇలా ఎదురుతిరుగుతుంది అనుకోలేదు. ఉన్నచోటే నిస్సత్తుగా గోడకి చేరబడిపోయింది.
*********************
చేతిలో అడ్రస్ కాగితం మరోసారి చూసుకొని ఆ ఇంటి గేటు తీసింది తార. అక్కడ చాలామంది ఉన్నారు. కొందరి చేతుల్లో ఏవో కాగితాలు ఉన్నాయి. బహుశా నాటకం తాలూకా స్క్రిప్ట్ అయి ఉంటుంది. ఒకామె చేతులు తిప్పుకుంటూ తనలో తానే డైలాగ్స్ చెప్పుకుంటుంది. ఇంకోవైపు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రామారావు గారు అటు తిరిగి ఒకతనికి యాక్షన్ చేసి చూపిస్తున్నారు. మొత్తానికి అక్కడ అంతా చాలా సందడిగా హడావిడిగా ఉంది.
తార లోపలికి అడుగుపెట్టగానే అందరూ తమ తమ పనులు మానుకొని ఇటు తిరిగారు. ఈ కొత్త వ్యక్తి ఎవరా! అని చూడసాగారు. అప్పుడే అటు చూసిన రామారావు గారు ఈమెను చూసి, “రామ్మా! తారా!” అని ఆహ్వానించి, “మన నాటకంలో హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయి వెయ్యబోతుందని చెప్పాను కదా! ఈ అమ్మాయే తార!” అంటూ మిగిలిన వాళ్లకు పరిచయం చేశారు. టేబుల్ మీద ఉన్న పేపర్ల కట్టల నుంచి ఒకదాన్ని తీసి తారకి ఇచ్చి, “ఇది మన వెయ్యబోయే నాటకం స్క్రిప్ట్. దీన్ని చదువు. రేపటి నుంచి నువ్వు కూడా ప్రాక్టీస్ మొదలు పెడుదువు గాని... ఈరోజుకి వీళ్ళ యాక్షన్ ని మూమెంట్స్ ని గమనిస్తూ ఉండు” అని చెప్పి తన పనిలో మునిగిపోయారాయన.
వాళ్ళు చేసేది చూస్తూ కూర్చుంది తార. తన కాలేజీ నాటకం రిహార్సల్ట్స్ గుర్తొచ్చాయామెకి. దానికి దీనికి చాలా తేడా ఉందనిపించింది. అప్పుడు చాలా సరదాగా ఉండేది. జోక్స్ తో, అల్లరి కబుర్లతో, చిలిపి తగాదాలతో చాలా సందడిగా ఆహ్లాదంగా సాగేది. ఇక్కడంతా ప్రొఫెషనల్ గా ఉంది. అందర్లోనూ సీరియస్ నెస్ కనబడుతోంది. ‘ప్రజల మధ్యకు వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరమే!’ అనిపించింది ఆమెకు. మొత్తానికి ఆ సాయంత్రం ఓ కొత్త అనుభవంతో గడిచిపోయింది.
ఇంటిదారి పట్టిన తార కళ్ళకు, నిప్పులు కురిపిస్తున్న తల్లి ముఖమే పదేపదే కనిపించసాగింది. అయితే... ఆమె అనుకున్నట్టు తల్లి ఎగిరిపడలేదు. కానీ ఆమెతో మాట్లాడ్డం పూర్తిగా మానేసింది. తుఫాను ముందు ప్రశాంతత అలముకుందా ఇంట్లో.
*****************
క్రమం తప్పకుండా నాటక సమాజానికి వెళ్లి వస్తోంది తార. ఇప్పుడిప్పుడే అక్కడి పద్ధతులకు నెమ్మదిగా అలవాటు పడసాగింది. కొత్తదనం పోయి సాటి నటీనటులతో కొద్దిగా పరిచయాలు, స్నేహాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తనకు చెల్లెలి వేషం వేస్తున్న జ్యోత్స్న మంచి నేస్తమయింది.
జ్యోత్స్న కూడా ఈ మధ్యే నటించడం మొదలుపెట్టింది. ఆ పిల్లకు కూడా ఇంకా వృత్తిపరమైన అనుభవం వచ్చినట్టు లేదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అందుకే కూతుర్ని కూడా బాగా చదివించి, గొప్ప ఉద్యోగస్తురాలిని చెయ్యాలని ఆశ పడ్డారట. ఈ పిల్లకేమో చదువు వంటబట్టక ఇంటర్ తో ఆపేసి, నటన మీద ఆసక్తితో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వాళ్లను ఒప్పించి, ఇందులో ప్రవేశించింది. చాలా అందంగా ఉంటుంది. నాటకాల ద్వారా నటనలో బాగా అనుభవం సంపాదించి, టీవీలోకి అక్కడి నుంచి అలా సినిమాల్లోకి అంచలంచలుగా ఎదగాలని ఆమె కోరిక. ఇద్దరి ఆశలు, ఆశయాలు, లక్ష్యం ఒకటే కావడంతో పాటు ఇద్దరూ ఇంచుమించుగా ఒకేసారి ఈ రంగంలో అడుగుపెట్టడం కూడా వారిద్దరూ మంచి స్నేహితులు కావడానికి కారణమైంది. ముఖ్యంగా ఆమెలో తనను ఆకట్టుకున్న లక్షణాలు... స్వచ్ఛమైన ఆమె ప్రవర్తన. అమాయకంగా ఉండే ఆ ముఖం.
నాటకంలో తన చెల్లెలు పోర్షన్ వేసినా, బయట కూడా అక్కా! అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. గొప్పవారైన అమ్మానాన్నలకు ముద్దులకూతురిగా పెరిగినా ఆ భేషజం ఎక్కడా కనబడేది కాదామెలో. ఇలాంటి మిత్రురాలు దొరకడంతో రోజులు తొందరగానే గడుస్తున్నాయి తారకు. ఎటొచ్చి తల్లి గురించే దిగులు. తనతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. ఈ మధ్య ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. ముందే అంతంతమాత్రంగా ఉండే ఆరోగ్యం ఈ ఆలోచనలతో మరీ అధ్వాన్నంగా తయారయింది. నెమ్మదిమీద తల్లిని మార్చుకోగలనని, ఆమె కోపాన్ని పోగొట్టగలనని నమ్మకంతో ఉంది ఇంతవరకు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో మరి!
***********************
“హమ్మయ్య! ఇంట్లోనే ఉన్నావా తల్లి!” ఆ పలకరింపుకు, ఆలోచనల్లో నుంచి బయటపడి తలెత్తి చూసింది తార. ఎదురుగా ప్రియ మిత్రురాలు అనిత. స్నేహితురాలిని చూడగానే తార ముఖంలోకి సంతోషం పొంగి వచ్చింది ఒక్కసారిగా.
“రావే... అనూ! రా... కూర్చో” ఆనందంగా ఆహ్వానించింది. “ఇప్పుడు చెప్పు! ఏంటి సంగతులు? అయినా ఇన్నాళ్లకు జ్ఞాపకం వచ్చానన్నమాట!” నిష్ఠూరంగా అంది తార.
“సరేలే! ఆ మాట మళ్ళీ అన్నావంటే పట్టుకుని బాధేస్తాను. రెండుసార్లు నీకోసం వచ్చాను. తమరు ఇంట్లో ఉంటేగా! నువ్వు ఎంత కళాకారిణివి అయిపోయినా... అప్పుడప్పుడు మాక్కూడా నీ దర్శన భాగ్యం కలిగించవే తల్లి!” హాస్యంగా అంది అనిత.
ఓ అరగంట వరకు కాలేజీ కబుర్లు, స్నేహితుల గురించి మాట్లాడుకున్నారు. ఇంతలో పార్వతి ఇద్దరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది.
“బాగున్నారా ఆంటీ!” పలకరించింది అనిత పార్వతిని చూడగానే.
“బాగానే ఉన్నానమ్మా! నువ్వు బాగున్నావా? అన్నట్టు మీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సరే... టీ తాగమ్మా చల్లారిపోతుంది” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిందావిడ.
ఆవిడ లోపలికి వెళ్లే వరకు ఆగి, అనిత ఒక కవర్ అందించింది. “అవునూ... నీ ఉత్తరకుమారుడికి నా అడ్రస్ ఇచ్చావా ఏంటి? ఈ లెటర్ నీ పేరుతో, కేరాఫ్ నా అడ్రెస్ కొచ్చింది.
“నేను ఎవరికీ అడ్రస్ ఇవ్వలేదు అనూ! అయినా ఇంతవరకు ఈ అజ్ఞాత ఉత్తరాల రచయిత పరిచయమే కాలేదు. అడ్రస్ ఎలా ఇస్తాను?” అంది తార.
సంభ్రమంగా చూసింది అనిత. “నువ్వు ఇవ్వకుండానే అతడికి నా అడ్రస్ తెలిసిందంటే, అతనెవరో మన ఇద్దరికీ తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. ఎవరబ్బా! ఆ మనిషి!?” కాసేపు ఆ విషయం గురించే తర్జనభజన పడ్డాక “వెళ్తాను...” అంటూ లేచింది అనిత. లోపలికి వెళ్లి పార్వతికి కూడా చెప్పి వెళ్ళిపోయింది.
స్నేహితురాలిని పంపించి వచ్చి, కవర్ తెరిచి చూసింది తార. అదే లేతగులాబీ రంగు కాగితం. మేటర్ చాలా క్లుప్తంగా ఉంది. ఆమె కళ్ళు ఆ ఉత్తరంలోని అక్షరాల వెంట పరుగులు తీసాయి.
“తారా! ఇంతవరకు నన్ను నీకు పరిచయం చేసుకోలేదు కదూ... నిన్ను సస్పెన్స్ లో పెట్టినందుకు ఐయాం వెరీసారీ. ఇంకా నిన్ను ఇలా సస్పెన్స్ లో ఉంచదల్చుకోలేదు. అందుకే... నేనెవరో నీకు తెలియాలంటే తప్పకుండా నేను చెప్పిన చోటికి రావాలి. తప్పకుండా వస్తావు కదూ! నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వివరాలన్నీ సమక్షంలోనే! ఇక సెలవు తీసుకోనా!” అంతే... క్రింద సంతకం లేదు. కలుసుకోవలసిన స్థలం పేరు వివరాలు మాత్రం ఉన్నాయి.
కాగితం పట్టుకుని చాలా సేపు అలాగే కూర్చుండిపోయింది. కాలేజీ వదిలేసిన తర్వాత ఈ ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. ఇంట్లో చికాకులతో, నాటకం గొడవలతో, తను కూడా తాత్కాలికంగా వీటి గురించి మరిచిపోయింది.
ఇన్నాళ్లకు మళ్ళీ అనిత అడ్రస్ కు వచ్చిన ఈ సందేశం! ఏం చేయాలి? వెళ్లాలా? వద్దా? ఇంత ఉత్కంఠను కొనసాగించిన వ్యక్తి ఎవరో చూడాలని బలంగా అనిపిస్తోంది. మరో వంక ఇదే పరిణామాలకు దారితీస్తుందో అని భయంగా కూడా ఉంది. ఇప్పటికే ఈ నాటకాల గొడవతో తల్లికి తనకు దూరం పెరిగిపోయింది. మళ్లీ ఇది ఇంకో కొత్త సమస్యను సృష్టించదు కదా! ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉంది. కుతూహలం భయాన్ని జయించింది. వెళ్లడానికే సిద్ధపడింది.
అనుకున్న సమయానికి ఉత్తరంలో సూచించిన స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని చూసిన తర్వాత షాక్ కొట్టినట్టు అయింది. చేష్టనుడిగినట్టు నిలబడిపోయింది తార.
*******************