Vijaya Lakshmi
Published on Sep 03 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అష్టాదశ శక్తిపీఠాలు... శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు ఎన్నో, ఎన్నెన్నో... ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు.
ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినబడతాయి. 18 అనీ, 52 అనీ, 108 అనీ ఇలా విభిన్న సంఖ్యను చెప్తుంటారు. అయితే వీటిలో 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలుగా పరిగణిస్తాం. సతీదేవి మిగిలిన శరీర భాగాలు పడిన స్థలాలను ఉప శక్తిపీఠాలుగా పరిగణిస్తాం. అసలు ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి?,ఎప్పుడు ఏర్పడ్డాయి చూద్దాం.
“లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే,
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే,
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా,
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా,
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా,
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే,
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ,
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా,
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ,
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్”
అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నాం.
వీటిలో పన్నెండు శక్తి పీఠాలు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా, శ్రీలంకలో ఒకటి, మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉన్నాయి.
ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో గయ, పిఠాపురం, జాజ్ పూర్ అనే మూడూ గయాక్షేత్రాలూగానూ, శ్రీశైలం, ఉజ్జయిని అనే రెండూ జ్యోతిర్లింగ క్షేత్రాలూ గానూ ఉండటం మరో విశేషం.
ఖండించబడిన సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా మారి భక్తులకు, ముఖ్యంగా సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. సాక్షాతూ శివుని అర్ధాంగి... జగజ్జనని అయిన సతీదేవి శరీరం ఖండించబడడమేంటి? దీనివెనక పెద్ద పురాణ కథనమే ఉంది.
బ్రహ్మ బొటనవేలునుండి ఆవిర్భవించిన దక్షప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునకు ఇచ్చి వివాహం చేశారు. ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘసత్రయాగం చేశారు. సమస్త దేవతలు హాజరయిన ఆ యజ్ఞానికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. ఆయనను చూసీ చూడడంతోనే అందరూ లేచినిలబడ్డారు. కానీ బ్రహ్మదేవుడు, శివుడు మాత్రం లేవలేదు. బ్రహ్మ పెద్దవాడు. కనుక ఆయన లేవనవసరం లేదు. కానీ శివుడు వరసకు దక్షప్రజాపతికి అల్లుడు. మామగారు పితృ సమానుడు. కాబట్టి దక్షప్రజాపతి తాను లోపలి వచ్చినపుడు అల్లుడయిన శివుడు లేచి నిలబడి గౌరవించకపోవడం చూసి, తనను అవమానించినట్టుగా భావించాడు. కోపోద్రిక్తుడయ్యాడు. పెద్దలను గౌరవించడం తెలియనివాడని, మర్యాద లేనివాడని, అనేక విధాలుగా శివుడిని నిందించాడు దక్షప్రజాపతి. ఆ వైరం అక్కడితో ఆగిపోలేదు. అలా కొనసాగుతూనే ఉంది.
ఆ తరువాత ఒకసారి దక్షప్రజాపతి బృహస్పతియాగం చేసాడు. ఆ యాగానికి సమస్త దేవతల్నీ, ప్రముఖుల్నీ ఆహ్వానించాడు. గాని కూతురు సతీదేవిని, అల్లుడు శివుడ్ని పిలవలేదు. యాగానికి తరలి వెళుతున్న వారిద్వారా విషయం తెలుసుకున్న దాక్షాయణి దేవి, భర్త శివుడి దగ్గరకు వెళ్లి సంగతి చెప్పి యాగానికి మనము వెళదాం అంది.
కాని ఆహ్వానం లేని చోటుకో వెళ్ళడం మంచిది కాదని చెప్పాడు శివుడు. అయితే పుట్టింటికి వెళ్ళడానికి ఆడపిల్లకు ఎలాంటి ఆహ్వానం అక్కరలేదు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు కాబట్టి తన తండ్రి ఘనంగా చేస్తున్న యాగానికి వెళదాం అంది అమ్మవారు. శివుడు వారిస్తున్నా ఆగకుండా తన పుట్టింటికి వెళ్ళడానికి తనకు ఆహ్వానం ఎందుకు? ఎప్పుడైనా, ఎలాగనైన వెళ్ళవచ్చు అనుకుంటూ ప్రమధగణాలను వెంటబెట్టుకొని దక్షప్రజాపతి చేస్తున్న యాగానికి బయలుదేరింది.
అయితే పిలవని పేరంటానికి వచ్చిన కూతుర్ని ఆదరించడం కాదు కదా కనీసం పలకరించనైనా లేదు దక్ష ప్రజాపతి. పైగా అందర్లో అవమానించడమే కాకుండా అల్లుడయిన శివుడ్ని కూడా నిందించాడు దక్షప్రజాపతి. తండ్రి చేస్తున్న శివనిందను, పుట్టినింటిలో తనకు జరుగుతున్నా అవమానాన్ని, ఇంత జరుగుతున్నా... సర్వదేవతలు అక్కడుండి కూడా తన తండ్రి దక్షప్రజాపతి చేస్తున్న అకృత్యాన్ని ఆపలేని వారి అసమర్ధతను సహించలేక, సతీదేవి అక్కడే యోగాగ్నిలో తనువు చాలించింది.
ఈ విషయం తెలుసుకున్న శివుడు క్రోధంతో తాండవం చేసాడు. అసలే రుద్రుడు. తన అర్ధాంగికి జరిగిన అనర్ధాన్ని విని భరించలేకపోయాడు. వీరభద్రుణ్ని సృష్టించి, దక్షునికి బుద్ధి చెప్పమని యాగశాలకు పంపాడు. వీరభద్రుడు దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు.
దాక్షాయణిదేవి సూక్ష్మదేహాన్ని పరమేశ్వరుడు తన భుజంపై వేసుకుని విలయతాండవం చేస్తాడు. శివుడి రుద్రతాండవానికి బ్రహ్మాది దేవతలు భయంతో కంపించిపోయారు. శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి, శివుని ఈ ఉన్మత్త వేషం నుంచి బయటకు రప్పించవలసిందిగా వేడుకున్నారు.
సతీదేవి శరీరం ఎదురుగా ఉన్నంతవరకు శివుడి శివుడి ఆగ్రహం చల్లారదు అని యోచించి, పరమేశ్వరుని ఆ ప్రళయ తాండవానికి అడ్డుకట్టవేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా విభజించి శివుడిని మామూలు స్తితికి వచ్చేలా చేసి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. అలా ఖండించబడిన సతీదేవి శరీర ఖండాలు, ఆభరణాలు పడిన ప్రదేశాలు శక్తి క్షేత్రాలుగా వెలిశాయి. వాటిలో ప్రధాన శరీర భాగాలు పడ్డ ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా, మిగిలిన శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రదేశాలు 52 శక్తిపీఠాలుగా, 108 శక్తి క్షేత్రాలు ప్రసిద్ధిగాంచాయి.
ప్రతి శక్తి పీఠంలోను అమ్మవారు శివునితో కలిసి దర్శనమిస్తుంది. వాటిలో ప్రధానంగా చెప్పుకునే ఆ అష్టాదశ శక్తిపీఠాల విశేషాలేంటో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.
అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా చెప్పుకోవలసినది శక్తి స్వరూపిణి శాంకరీదేవి. ఇది అమ్మవారి "తొడభాగం" పడిన స్థలమని, కొన్ని కథనాల ప్రకారం అమ్మవారి కాలి గజ్జెలు ఇక్కడ పడ్డాయని చెప్తారు. నేటి శ్రీలంకలోని ట్రింకోమలి పట్టణానికి సమీపంలో, సముద్రంలోకి చొచ్చుకుని వచ్చినట్లున్న కొండపైన ఉన్న శిధిలాలయమే శాంకరీ దేవి ఆలయంగా చెప్పబడుతుంది. ప్రస్తుతం అక్కడ స్తంభం మాత్రమే ఉంటుంది.
త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం. ధర్మం తప్పనంత వరకు అక్కడ కొలువై ఉంటానని రావణాసురునికి మాట ఇచ్చిందట శాంకరీదేవి. ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారు చాలాకాలం అక్కడ ఉన్నది. కొంతకాలానికి రావణుడు సీతమ్మవార్ని చెరబట్టినందువల్ల, రావణుడు ధర్మం తప్పినా కారణంగా, లంక నుంచి శాంకరీదేవి అంతర్ధానమైపొయిందని, రావణ సంహారం తరువాత మళ్ళీఅమ్మవారు లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడిందని ఒక కథనం.
నేటి శ్రీలంకలో పశ్చిమ సముద్ర తీరానగల ట్రింకోమలైలో గల దేవియే శాంకరీదేవి. జాఫ్నా తీర ప్రాంతంలో ట్రింకోమలై పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లు ఉన్న కొండపై శాంకరీదేవి ఆలయం, శక్తిపీఠం ఉంది. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం, త్రికోణమలై అని పిలుస్తారు. ఆ త్రికోణమలై నే ఇప్పుడు ట్రిన్కోమలై గా పిలుస్తున్నారు. దానినే కోనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు.
పదిహేడో శతాబ్దంలో పోర్చుగీసువారి దాడిలో ఇక్కడి ఆలయం ధ్వంసం అయింది. శతాబ్దాల తరబడి ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2005లో శ్రీలంక ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మింపజేసింది. అప్పటి నుంచి శాంకరీదేవి ఆలయం ప్రముఖ సందర్శనీయ కేంద్రంగా నిలుస్తోంది.
సతీదేవి "వీపుభాగం" పడిన ప్రదేశం కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువు తీరింది. ఈ క్షేత్రం తమిళనాడులోని చెన్నై పట్టణం నుండి 75కి.మీ దూరంలో ఉన్నది. ‘కా’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం.
కంచిలో అమ్మవారు... సరస్వతి, లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారు పద్మాసనంపై కూర్చొని చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
ఒకప్పుడు ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్రరూపంలో రాత్రివేళల్లో నగరంలో తిరుగుతూ బలి కోరుతుండటంతో.. అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతిస్వరూపిణిగా మార్చినట్టు చెబుతారు. ఆ శ్రీచక్రానికి ఇక్కడ పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా అమ్మవారు, ఉత్సవాలకు మాత్రం, ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శంకరులవారి అనుమతి తీసుకుని దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
కామాక్షి దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేస్తూ ఆరాధించేదట. అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. కామాక్షి దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని ఇంకా ఇంకా పెంచేసాడు శివుడు. అప్పుడు కామాక్షీదేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని పట్టుకొని అలల నుంచి కాపాడిందని, కామాక్షీదేవి దీక్షకు సంతసించిన శివుడు అమ్మవారిని ఇక్కడ వివాహం చేసుకున్నాడని స్థల పురాణం.
దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి.
ఇక్కడి వరకు తెలుసుకున్నాం కదా! మిగిలిన శక్తిపీఠాల విశేషాలు తరువాతి బ్లాగ్ లో వివరిస్తాను.