దీపావళిని 5 రోజులు చేసుకోవాలా? | దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలి? | Diwali festival 2025 full details & mythology stories

Vijaya Lakshmi

Published on Oct 15 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

5 రోజుల పండుగ

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటాం ఈ పండుగ వెనకున్న పురాణ కథనం ఏంటన్న విషయానికి వస్తే భూదేవికి -వరహా స్వామికి జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుని శరణువేడుతారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో కలిసి వెళ్లి నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఒక దుర్మార్గుడు మరణించిన సంతోషంతో దేదీప్యమానంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారట. అప్పటి నుంచి దీపావళి చెడుపై మంచి గెలిచినా దానికి సూచనగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. ప్రధానంగా చెప్పుకునే పండుగ ఇదే అయినా అంతకు ముందే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుడిని హతమార్చి లంక నుంచి సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని కూడా మరో కథనం. ఈ  పండుగను కొన్ని ప్రాంతాల్లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకూ ఐదురోజుల పాటూ జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిలో దీపావళిని 5 రోజుల పండుగగా చేసుకుంటారు.



ధన త్రయోదశి, నరక చతుర్థశి, దీపావళి, బలి పాడ్యమి, యమ విదియ... మొత్తం 5 రోజుల పాటు వేడుకగా పండుగ చేసుకుంటారు.

మొదటి రోజు ధన త్రయోదశి

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఈ రోజు కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఇదే రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం  సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.  ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి.  ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం  ధన్వంతరిని కూడా పూజిస్తారు. 



రెండో రోజు నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు అంటే దీపావళి ముందు రోజు అన్నమాట. ఈ రోజే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్లి నరకుడిని సంహరించి సాదు సజ్జనులను రక్షించాడు. అయితే ఈ ఏడాది నరక చతుర్ధశి, దీపావళి ఒకే రోజు వచ్చాయి. సూర్యోదయానికి చతుర్థశి, సాయంత్రానికి అమావాస్య ఉండడంతో ఇలా జరిగింది. ఈ రోజు నువ్వుల నూనె వంటికి పట్టించుకుని  తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతారు.

మూడో రోజు దీపావళి అమావాస్య

ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగ. సంధ్యా సమయంలో లక్ష్మీపూజ చేస్తారు. అనంతరం తీపి పదార్ధాలు తిని తరువాత  దీపాల వెలుగులతో ఇంటిని నింపేసి బాణసంచా వెలిగిస్తారు. ఈ రోజు లక్ష్మీపూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తారు. 



నాలుగో రోజు బలి పాడ్యమి

దీపావళి మర్నాడు అంటే కార్తీకమాసం మొదటి రోజుని బలిపాడ్యమి అని అంటారు. చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువుని పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమ్మీదకి వచ్చిన రోజు అని చెబుతారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మరోవైపు శ్రీకృష్ణుడు గోవర్థనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడినదీ ఇదే రోజు అని చెబుతారు.

ఐదో రోజు యమ విదియ లేదా యమ ద్వితీయ లేదా భగినీ హస్తభోజనం 

దీపావళి నుంచి రెండోరోజు అంటే..కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే విదియను యమవిదియ అంటారు. దీన్నే యమద్వితీయ అనికూడా అంటారు. ఈ రోజున స్త్రీలు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తార. భోజనం పెట్టిన తర్వాత సోదరుడికి తన శక్తికొలది నూతన వస్త్రాలు అందించి ఆశీర్వదిస్తారు. దీనివెనుక పురాణ కథనం ఉంది. సూర్యభగవానుడి కుమారుడు యముడు, యముడి  సోదరి యమున. యమునకు సోదరుడంటే అంతో అభిమానం. ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించినా యముడు మాత్రం క్షణం తీరికలేకుండా ఉండేవాడు. అయితే కార్తీక విదియ రోజు తప్పకుండా రావాలని చెప్పి వాగ్ధానం తీసుకుంటుంది యమున. సోదరి కోరిక ప్రకారం యముడు తన సోదరి ఇంటికి వెళతాడు. . యముడిని చూసి సంతోషించిన యమున అభ్యంగన స్నానం చేయించి , తిలకం దిద్ది, స్వయంగా వంట చేసి  ప్రేమగా వడ్డిస్తుంది. ఆమె ప్రేమకు సంతోషించిన యముడు సోదరిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ప్రతి సంవత్సరం ఇదే రోజున తన ఇంటికీ విందుకి రావాలని కోరుతుంది. సరే అని మాట ఇచ్చిన యముడు ఈ రోజు సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతకు నిదర్శనగా ఉంటుందని చెప్తాడు. ఆ రోజు నుంచి ఏటా కార్తీకమాసంలో రెండో రోజు విదియ రోజు సోదరులు సోదరిల ఇంటికెళ్లి భోజనం చేయడం విధిగా వస్తోంది. దీనిని భగినీహస్త భోజనం అని కూడా పిలుస్తారు. 

పంచ మహాపర్వ

ఇలా దీపావళి పండుగను అయిదు రోజులు జరుపుకుంటారు. అందుకే దీనిని పంచమహాపర్వ అని పిలుస్తారు.హిందువులకే కాదు బౌద్ధ జైన మతాలలో కూడా ఈ దీపావళి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది.

 గౌతమ బుద్ధుడు 18 సంవత్సరాల తర్వాత తన జన్మస్థలమైన కపిల్వాస్తుకు తిరిగి ఈ రోజే వచ్చాడట. అప్పుడు  బుద్ధుని అనుచరులు దీపాలు వెలిగించి అతడికి స్వాగతం పలికారని ప్రతీతి. అప్పటి నుండి భౌద్ధమతానికి చెందిన ప్రజలు ఈ రోజున తమ ఇళ్లలో దీపాలు వెలిగించి  పండుగను జరుపుకుంటారు.ఇక జైనులకు కూడా ఈ పండుక ప్రధానమైనదే ...జైనుల 24వ తీర్థంకరుడైన మహావీరుడు బీహార్‌లోని పావపురిలో దీపావళి రోజున మోక్షం పొందాడని నమ్ముతారు. ఈ ఆనందంలో  జైనులు దీపాలు వెలిగించి భగవంతుడిని పూజిస్తారు.


ఇవి కూడా చదవండి

 

Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...