Vijaya Lakshmi
Published on Apr 10 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?పురాణాల ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశిపుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తింది ఇక్కడే. ఆ ఉగ్ర రూపాన్ని చూసి దేవతలంతా "అహో! బలం!" అని ఆశ్చర్యపోయారట. ఆ మాటే కాలక్రమేణా "అహోబిలం"గా మారింది. ఇక్కడ విశేషం ఏంటంటే, స్వామి ఒక్క రూపంలో కాదు, ఏకంగా తొమ్మిది రూపాల్లో నవ నారసింహులుగా దర్శనమిస్తాడు.
అయితే అసలైన మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది! ఈ నవ నరసింహ క్షేత్రాలకు, మన జాతకాన్ని శాసించే నవగ్రహాలకు ఒక రహస్య సంబంధం ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఆలయం ఒక గ్రహ దోషాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఒక్క యాత్రతో సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని అంటారు.
అహోబిలం యాత్రను స్థూలంగా రెండు భాగాలుగా చూడొచ్చు: దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం. ముందుగా సులభంగా చేరుకోగలిగే దిగువ అహోబిలంలోని ఆలయాలను గురించి తెలుసుకుందాం.
దిగువ అహోబిలం - ప్రశాంతతకు తొలిమెట్టు అని చెప్పాలి. దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరద నరసింహ స్వామి ఆలయంతో యాత్ర మొదలవుతుంది. ఈ ఆలయం కేతు గ్రహ దోషాలు నివారించేదిగా చెబుతారు. విజయనగర రాజుల శిల్పకళకు ఇది ఒక సజీవ సాక్ష్యం. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. ఇక్కడ స్వామి, తన భక్తుడైన ప్రహ్లాదుడిని దీవిస్తున్నట్లు సౌమ్య రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల కేతు గ్రహ దోషాలు నివారణ అవుతాయని భక్తులు నమ్ముతారు.
దిగువ అహోబిలంలోనే ఒకదానికొకటి దగ్గరలో మరో రెండు ఆలయాలు ఉన్నాయి. అవే చత్రవట నరసింహ, యోగానంద నరసింహ ఆలయాలు. ఛత్రవత నరసింహస్వామి ఆలయం. ఇది రాహు గ్రహ దోషాల పరిహరించే ఆలయంగా చెబుతారు. ఒక పెద్ద వట వృక్షం అంటే మర్రి చెట్టు కింద వెలసినందున స్వామికి చత్రవట నరసింహ అని పేరు వచ్చిందని పురాణ కథనం. ఈ స్వామిని పూజిస్తే రాహు గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం.
ఆ తర్వాత, యోగానంద నరసింహ ఆలయం. హిరణ్యకశిపుని వధానంతరం, స్వామి ఇక్కడే ప్రహ్లాదుడికి యోగ విద్యను నేర్పించారని స్థల పురాణం. అందుకే ఇక్కడ స్వామి యోగ ముద్రలో ఉంటాడు. ఈ స్వామిని దర్శిస్తే శని గ్రహ ప్రభావంతో కలిగే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు.
ఈ మూడు ఆలయాల దర్శనం ప్రశాంతంగా పెద్దగా కష్టపడకుండానే ముగుస్తుంది. కానీ అసలైన సాహసం, అసలైన పరీక్ష ఇప్పుడు మొదలు కాబోతోంది. ఎగువ అహోబిలం ప్రయాణం ఇదే అసలు సిసలైన సాహసం అని చెప్పాలి. దట్టమైన అడవి, కఠినమైన కొండల మధ్య దాగి ఉన్న మిగతా ఆరు ఆలయాల వైపు సాగే ప్రయాణం.
దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం దాదాపు 8 కిలోమీటర్ల దూరం. కొంత దూరం జీపుల్లో ప్రయాణించి, ఆ తర్వాత కాలినడకన వెళ్ళాలి. దారి పొడవునా పక్షుల కిలకిలారావాలు, పచ్చని ప్రకృతి, పలకరించే జలపాతాలు... అదొక అద్భుతమైన అనుభవం.
ఎగువ అహోబిలంలోని ఆలయాల్లో మొదటిది, అన్నింటికన్నా పురాతనమైనది అహోబీల నరసింహ ఆలయం. రెండు కొండల మధ్య ఉన్న ఈ గుహాలయంలో స్వామి స్వయంభూవుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామిని పూజిస్తే గురు గ్రహ అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఇక్కడి నుండి తదుపరి గమ్యం క్రోడ నరసింహ ఆలయం. ఈ స్వామినే వరాహనరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి వెళ్ళే దారి కాస్త సవాలుగా ఉంటుంది. ఇక్కడ స్వామి వరాహ ముఖంతో, తన ఒడిలో భూదేవిని పెట్టుకొని కనిపిస్తాడు. ఈయన్ని దర్శించుకుంటే కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
ఆపై, కొండపై ప్రశాంత వాతావరణంలో ఉన్న మాలోల నరసింహ ఆలయానికి చేరుకుంటాం. 'మా' అంటే లక్ష్మీదేవి, 'లోల' అంటే ప్రియుడు. ఇక్కడ స్వామి, లక్ష్మీదేవితో కలిసి సౌమ్య రూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామిని దర్శించుకుంటే శుక్ర గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
ఇక యాత్రకే శిఖరం జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఇక్కడే స్వామి ఆవిర్భవించిన ఉగ్రస్థంభం ఉంది.
అహోబిల ఈ యాత్రలోనే అత్యంత కఠినమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘట్టం జ్వాలా నరసింహ స్వామి దర్శనం. భవనాశిని నది ఒడ్డున, కొండల మధ్య నడుస్తూ వెళ్తే ఒక గుహలో జ్వాలా నరసింహుడు కనిపిస్తాడు. పురాణాల ప్రకారం, స్వామి హిరణ్యకశిపుడిని సంహరించింది ఇక్కడే. అందుకే ఇక్కడ స్వామి ఎనిమిది చేతులతో, జ్వాలలు కక్కుతున్నంత ఉగ్రంగా దర్శనమిస్తాడు. ఆ రూపాన్ని చూడగానే భయంతో కూడిన భక్తితో శరీరం జలదరిస్తుంది. ఈ స్వామి ఆరాధనతో సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి.
జ్వాలా నరసింహ ఆలయం నుండే ఉగ్ర స్తంభానికి దారి ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ శిఖరాన్ని ఎక్కడం ఒక సాహసం. పురాణాల ప్రకారం నరసింహ స్వామి ఉద్భవించిన స్తంభం ఇదే. సాధారనంగా అందరూ ఇక్కడికి వెళ్ళరు. వెళ్ళలేరు.నిటారుగా ఉండే ఈ కొండను ఎక్కడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. సాహసికులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ, స్వామి నామాన్ని స్మరించుకుంటూ పైకి వెళతారు. అయితే ఇంత కష్టపడి అక్కడికి చేరుకున్న తరువాత, ఆ శిఖరంపై నిలబడితే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కింద లోయ, చుట్టూ అనంతమైన నల్లమల అడవి... ఆ ప్రదేశంలో ఏదో ఒక అతీతశక్తి ఉన్నట్లు స్పష్టంగా అనిపిస్తుంది. పడిన కష్టమంతా ఒక్క క్షణంలో మర్చిపోఎలా చేస్తుంది అంటారు అక్కడికి చేరుకున్న భక్తులు.
చంద్ర గ్రహ దోష నివారణకు కరంజ నరసింహ, బుధ గ్రహ దోష నివారణకు పావన నరసింహ ఆలయాలు కూడా అహోబిలంలో దర్శించుకోవచ్చు. ముఖ్యంగా పావన నరసింహ ఆలయం దట్టమైన అడవిలో ఉంటుంది. జీపుల సహాయంతో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ స్వామి దర్శనంతో యాత్రికుల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 9 నరసింహ రూపాలు. ప్రశాంతమైన ఆలయాల నుండి మొదలై, దట్టమైన అడవుల్లో, ప్రమాదకరమైన కొండ అంచులపై సాగిన ఈ యాత్ర జీవితాంతం గుర్తుండిపోయే యాత్ర. ఇది కేవలం దైవ దర్శనం కాదు, మనల్ని మనం తెలుసుకునే ఒక ఆత్మశోధన. మన సంకల్ప బలానికి, విశ్వాసానికి ఇదొక పరీక్ష అని చెప్పాలి.