అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర | Godavari Sangamam Mystery Temple Telugu

Vijaya Lakshmi

Published on Jan 26 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

సముద్రం… నది… దేవుడు…మూడు కలిసే చోటే ఒక అద్భుతం! ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో, గోదావరి నది – బంగాళాఖాతంలో కలిసే పుణ్యస్థలం… అంతర్వేది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్ర సంగమ స్థలాల్లో ఒకటి. అక్కడ కొలువయ్యాడు  ఉగ్ర రూప నరసింహుడు…  అదే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం!”


బ్రహ్మదేవుడు శివలింగాన్ని ప్రతిష్టించి రుద్రయాగం చేసిన పుణ్యస్థలం. త్రేతాయుగంలో రావణుడి సంహారం తరువాత ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో తనకంటిన దోష పరిహారార్థం తీర్థయాత్రలు చేస్తూ అర్జునుడు .. ఈ క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారని ప్రతీతి. బ్రహ్మదేవుడు సైతం తనకి అంటిన గోహత్య పాతకం నుంచి బయటపడటానికి ఈ క్షేత్ర దర్శనం చేశాడట. ప్రకృతి అందాలకు మారుపేరయిన ఉభయ గోదావరుల మధ్య గోదావరినది పాయ అయిన వశిష్ట గోదావరి బంగాళాఖాతంలో కలిసే అద్భుత ప్రదేశంలో వెలసిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి  ఆలయ చరిత్ర, విశేషాలు చూద్దాం



🕉️ అంతర్వేది

లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో 'అంతర్వేది' ప్రముఖమైనది. ఒకసారి బ్రహ్మదేవుడు తాను శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా రుద్రయాగం చేయదానికి నిర్ణయించుకున్నాడు. ఆ యాగానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతూ ఈ ప్రదేశం ఆ యాగానికి సరైనదని  భావించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ కారణంగానే  ఈ ప్రదేశానికి అంతర్ వేదిక అనే పేరు వచ్చింది అని చెబుతారు. అదే క్రమంగా అంతర్వేది అయింది. ఇంకో కథనం ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి హిరణ్యకశిపుడి శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడాచెప్తారు.



🕉️ పురాణ కథనాలు

ఇక లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువు తీరడానికి సంబంధించిన పురాణ కథనం విషయానికి వస్తే, వశిష్ఠ మహర్షి కోరికమేరకు లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువుదీరాడని స్థలపురాణం చెబుతోంది. అలాంటి ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు సమస్త పాపాలు .. దోషాలు నశిస్తాయని పురాణ కథనాలు చెప్తున్నాయి.


🦁 రక్తావలోచనుడి కథ – నరసింహావతారం 

హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. తన శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి ఒక్కొక్క ఇసుక రేణువు నుంచి ఒక్కొక్క రక్తావలోచనుడు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో తన సహజ స్వభావమైన రాక్షసత్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. అదేవిధంగా వశిష్టుని విషయంలో కూడా జరిగింది.



🕉️ విశ్వామిత్రుని కథ


విశ్వామిత్రుడు, వశిష్టుడు ఈ ఇద్దరు ఋషులకు ఎప్పుడు సఖ్యత ఉండేది కాదని, వశిష్టుడి మీద అసూయ ద్వేషాలతో ఉండేవాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ నేపధ్యంలోనే ఒకసారి విశ్వామిత్రుడు ఆజ్ఞాపించగా రక్తావలోచనుడు ఈ ప్రాంతంలోనే ఆశ్రమం ఏర్పరచుకొని ఉంటున్న వశిష్టుని ఆశ్రమానికి వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. జరిగిన దానికి బాధపడిన వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించాడు. వశిష్టుని ప్రార్ధనలకు కరిగిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరసింహ అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం క్రింద పడగా ఆ ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. నరశింహుడు ఈ విషయం గమనించి తన మాయాశక్తి నుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు.



ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.


🦁 రక్తావలోచనుడి కథ – నరసింహావతారం 

మరో కథనం ప్రకారం రెండవ కథనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరసింహస్వామి ఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరసింహస్వామి ఈ విషయం గ్రహించి, పార్వతిదేవి  అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం నేలపై పడకుండా పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.


🕯️ కలియుగంలో స్వామి ఆవిర్భావం

ఎప్పుడో యుగాల క్రితం ఇక్కడ వెలసిన నరసింహస్వామి ఈ కలియుగంలో ఒక పశువుల కాపరి ద్వారా బయటపడ్డాడు. ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారం పూర్వం మందపాటి కేశవదాసు అనే పశువుల కాపరి అంతర్వేది ప్రాంతంలో పశువులను  కాసుకుంటుంటే ఒక ఆవు అక్కడ పుట్టలో పాలు ధారలుగా విడవటం చూసి భయపడ్డాడు. ఆ రోజు రాత్రి నరసింహస్వామి అతని కలలో కనిపించే ఈ రోజు నీవు ఆవు పుట్టలో పాలు వదిలిన ప్రదేశం చూసావు కదా అక్కడే నేనున్నానని చెప్పాడట. దాంతో అతను గ్రామస్థుల్ని కూడగట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్లి  పుట్టను తవ్విచూడగా స్వామివారి విగ్రహం లభ్యమైంది. అప్పుడు కేశవదాసు స్వామికి చెక్కలు, కర్రలతో మందిరం నిర్మించాడట. ఆ తరువాతి కాలంలో రెడ్డిరాజులు జాతి దారువుతో ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని బెండమార్లంకకు చెందిన కొపనాతి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ క్రీ.శ.1823లో నిర్మించి నట్లు శాసనాలు చెబుతున్నాయి. తొలుత పెద్దాపురం సంస్థా నాధీశుల అధీనంలో ఉన్న ఆలయం తర్వాత మొగల్తూరు రాజుల అజమాయిషీలోకి వచ్చింది. నేడు ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది.



అంతర్వేది ఉత్సవం

 ఏటా మాఘమాసంలో అంతర్వేది నృసింహ స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్వామి వారి కల్యాణం అయిన తర్వాతనే ఇక్కడ  పెళ్లిళ్లు జరుగు తుంటాయి. మాఘ మాసంలో స్వామివారి కల్యాణానికి ముందు ఎంత మంచి ముహూ ర్తం ఉన్నా ఇక్కడ వివాహాలు చేయరు. ఇది ఇక్కడ అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం.

శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది.

ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాల విషయానికి వస్తే సముద్రతీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం వుంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో నాలుగు అంతస్థులుగా నిర్మించారు. చూట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో వుంది ఈ కట్టడం. దగ్గరలో ధ్యానమందిరం, యోగశాల మొదలైనవి వున్నాయి.


అన్నాచెల్లెళ్ళగట్టు

 అన్నాచెల్లెళ్ళగట్టు సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసేచోటును అన్నాచెల్లెళ్ళ గట్టు అంటారు. ఇక్కడు సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి వుంటుంది. దానికి అటు వైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలలో కూడా ఇలాగే వుంటుంది.


గుర్రాలక్క ఆలయం

మరొక చూడవలసిన ప్రదేశం. అళ్వరూడాంబిక ఆలయం దీనినే గుర్రాలక్క ఆలయం అని కూడా పిలుస్తారు. లక్ష్మీనృశింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూడాంబికాలయం ఉంది. నరసింహస్వామికి రక్తావలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తావలోచనుడి రక్తం భూమి మీద పడకుండా పీల్చేసి నరసింహస్వామి రాక్షసుణ్ణి సంహరించడంలో తన వంతు సహకారాన్నందించి తరువాత ఇక్కడే మాయాశక్తి అశ్వరూడాంబికగా వెలిసింది.


అంతర్వేది బ్రహ్మోత్సవాలు

 ప్రతి ఏటా మాఘమాసంశుద్ధ సప్తమి నుంచి బపుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశినాడు స్వామివారి రధోత్సవం జరుగుతాయి. వైశాఖమాసంలో శుద్ధ చతుర్దశినాడు లక్ష్మీనృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సంతానం లేని వారు ఈ ఆలయాన్ని ,స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. స్వామిని దర్శించి ఇక్కడే బసచేసి రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.



సఖినేటిపల్లి పేరు కథ

  అంతర్వేది  మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 12 కి. మీ. దూరం లో ఉంది.ఈ సఖినేటిపల్లి కి ఆ పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. త్రేతాయుగంలో శ్రీ రాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతమ్మవారితో "సఖీ !ఇదే నేటి పల్లి. మనం ఇక్కడే విశ్రమిద్దాం!" అని అన్నాడట. అప్పటి నుంచి ఆ వూరి వారు తమ వూరిని సఖినేటిపల్లిగా పిలుచుకునే వారని అంటారు.

అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు.


ఎలా వెళ్ళాలి?

రాజమండ్రి, కాకినాడల నుండి రావులపాలెం, రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరవచ్చు. అదేవిధంగా విజయవాడ, ఏలూరుల నుండి నరసాపురం మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులలో  అంతర్వేదికి చేరుకోవచ్చు. బస్సులో అంతర్వేదికి వెళ్లడం ఒక మరుపురాని మరచిపోలేని అనుభవం. చుట్టూ ఉన్న పంటపొలాలను చూసుకుంటూ, అచ్చమైన పల్లె వాతావరణాన్ని చూస్తూ పంట కాలువలు, పిల్ల కాలువల మధ్యనుంచి వెళుతూ ఉంటే మరో లోకంలో విహరిస్తున్నట్టే ఉంటుంది.

ట్రైన్ లో వెళ్ళాలంటే అంతర్వేది కి సమీపాన నరసాపూర్ రైల్వే స్టేషన్ కలదు. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ ల నుండి ఈ స్టేషన్ మీదుగా రైళ్ళు నడుస్తుంటాయి. హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా డైరెక్ట్ గా నరసాపురం చేరవచ్చు. నరసాపూర్ నుండి సఖినేటిపల్లికి అలాగే అంతర్వేది కి ప్రభుత్వ బస్సులుంటాయి.


వసతి

అంతర్వేదిలో వసతి కూడా ఉంటుంది. దేవస్థానం వారి వసతి గృహంలో రూమ్ లు దొరుకుతాయి.

 

Recent Posts