Vijaya Lakshmi
Published on Dec 08 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్. విశాఖపట్నం ఇస్కాన్ మందిరం. ఆధ్యాత్మిక ఆనందానికి మారుపేరు. శ్రీకృష్ణ ఆరాధనకు అత్యంత అనువైన వాతావరణం. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి ప్రకృతి, ఎదురుగా విశాల సాగరతీరం, ప్రశాంతమైన, నిర్మలమైన నిశ్శబ్దం... ప్రార్థనా స్థలంగా, ఆకర్షణీయమైన సాంస్కృతిక, విద్యా కేంద్రంగా, యోగా తరగతుల నుండి భారతీయ సంస్కృతి మరియు విలువలను లోతుగా పరిశీలించడానికి రూపొందించబడిన ఆధ్యాత్మిక ప్రసంగాలు, కుల, మతాలకు అతీతంగా ఐక్యతతో ప్రశాంత వాతావరణం, ధ్యానానికనువైన, ఎలాంటి ఆటంకం లేని పరిసరాలు వాట్ నాట్ ఏ విధంగా చూసినా అద్భుతమైన వాతావరణంలో తప్పక చూడాల్సిన శ్రీకృష్ణ మందిరం విశాఖపట్నం సాగర్ నగర్ లో భీమిలి వెళ్ళే మార్గంలో కొలువుతీరిన ఇస్కాన్ మందిరం. వైజాగ్ ఇస్కాన్ మందిరం ఎప్పుడు ఎలా ఏర్పాటైంది, ఎవరి కృషి ఫలితం ఈ వైజాగ్ ఇస్కాన్ టెంపుల్, వీళ్ళు చేసే ధార్మిక, సేవా కార్యక్రమాలేంటి, విశాఖపట్నం ఇస్కాన్ మందిర్ కి సంబంధించి ఇంకా చాలా చాలా విశేషాలు...
1999 సంవత్సరం మే నెలలో, ఇస్కాన్ భక్త దంపతులు శ్రీ సాంబదాస్ గారు వారి శ్రీమతి నితైసేవిని, గురువుగారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో ఇస్కాన్ కేంద్రాన్ని ప్రారంభించడానికి వైజాగ్ చేరుకున్నారు. ఎలాంటి నిధులు గాని, ఎటువంటి మద్దతు లేకుండానే, రాధా కృష్ణుడి లామినేటెడ్ ఫోటో, కేవలం ఐదు వేల రూపాయలతో, విలువైన శ్రీల ప్రభుపాదుల పుస్తకాలతో వైజాగ్ చేరుకున్నారు. వారి ముందున్నది కృష్ణుడి కోసం ఒక గొప్ప ఆలయ సముదాయాన్ని నిర్మించాలనే మహోన్నత ఆశయం మాత్రమే. ఈ మందిరానికి అప్పట్లో "ఆంధ్ర మహిమ" అని పేరు పెట్టారు.
ప్రారంభంలో సీతమ్మధారలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని, ఆంధ్రప్రదేశ్ అంతటా గీతా ప్రచారం చేస్తూ, శ్రీల ప్రభుపాద పుస్తకాలను పంపిణీ చేస్తూ, గీత, సంకీర్తన, హరే కృష్ణ మహా మంత్రం యొక్క సందేశాన్ని చురుకుగా వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారు వారితో పాటు తోటి ఇస్కాన్ భక్తులు కూడా చాలా ఆటంకాలు ఎదుర్కొన్నా ఎక్కడా వెనుకడుగు వెయ్యక ముందుకు సాగిపోయారు. ఒక సంవత్సరం తరువాత పాండురంగాపురంకు మారారు. చివరికి తమ కృషితో సాగర్ నగర్ లో శ్రీ శ్రీ రాధా దామోదర కోసం ఒక గొప్ప ఆలయ సముదాయాన్ని నిర్మించడం ప్రారంభించారు.
2005లో, సాగర్ నగర్ ప్రక్కనే ఉన్న ప్రశాంతమైన పరిసరాల్లో, సముద్రానికి సరిగ్గా ఎదురుగా ఉన్న అందమైన భూమిలో కృష్ణ మందిరం ఏర్పాటైంది. ఆశ్రమ భవనం నిర్మాణం మొదటి దశ అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు భూమి పూజ కోసం వచ్చారు. ప్రముఖ నాయకులు, అనేక మంది ఇస్కాన్ సన్యాసులు, గురువులు ఎంతోమంది ఈ ప్రాజెక్టును సందర్శించారు.
2014లో హుధుద్ తుఫాను సమయంలో ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం అంతా తుడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే. విశాఖనగరంతో పాటు ఇస్కాన్ మందిరం కూడా ఎంతో నష్టాన్ని చవి చూసింది. అయినా కూడా ఆ శిథిలాల నుండి ఆలయాన్ని మళ్ళీ పూర్తిగా పునరుజ్జీవింపబడింది.
ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీకృష్ణుడు కాగా ప్రధాన దేవత రాధ. రాధాకృష్ణులుతో పాటు, సుభద్ర, బలభద్ర జగన్నాథస్వామి, సీతారామలక్ష్మణ, హనుమంతుడు తదితర మూర్తులు కూడా ఉన్నాయి. ఒక పెద్ద విశాలమైన హాలులో దేవతా మూర్తులను ప్రతిష్టించారు, పక్కనే ఒక చిన్న వంటగది, ప్రసాద హాల్, కార్యాలయాలు, భక్తుల కోసం గదులు ఉన్నాయి. ఆలయం వెనుక ఉన్న సముదాయంలో సెమినార్ హాల్, ఇస్కాన్ జీవిత సభ్యుల కోసం అతిథి గదులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా... విశాలమైన వేదిక మీద రాధాకృష్ణులు, పక్కనే సుభద్రా,బలభద్ర సమేత జాగాన్నాత స్వామి కొలువుతీరి ఉన్నారు. వారికి ముందు చిన్న చిన్న మూర్తులను కూడా ఏర్పాటు చేసారు. ప్రస్తుత ప్రధాన మందిరం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో దశావతారాలకు సంబంధించిన చిత్రాలు అలంకరించబడి ఉంటాయి. చుట్టు ప్రక్కల భక్తులే కాక చాలామంది ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ధ్యానంలో మునిగిపోతారు.
ఆలయంలో కృష్ణయ్యకెంతో ఇష్టమైన గోవులసేవ కూడా జరుగుతుంది. ప్రత్యేకమైన గోశాల ఉంది. ఆలయంలో అద్భుతమైన మైమరచిపోయే పరిసరాలున్నాయి...
మొత్తం స్థలం ఆవరణలో మరో పెద్ద మందిరం నిర్మాణంలో ఉంది. తూర్పుతీరరత్నం విశాఖపట్నానికే మణిమకుటంలా ఒక అద్భుతమైన రత్నం లాంటి, రాజభవనం లాంటి ఆలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనతో సాగుతోంది నాలుగు అంతస్తుల ఎత్తైన భవనంలో ఆలయ నిర్మాణం.
ఇస్కాన్ మందిరంలో అనేకమైన పర్వదినాలు అద్భుతంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కృష్ణయ్యకు సంబంధించిన ఉత్సవాలు ఎన్నో జరుగుతాయి. ఇస్కాన్ మందిరంలో జరిగే ఉత్సవాలలో ప్రధానంగా చెప్పుకోవలసినవి పాణిహతి చిద దహి ఉత్సవం, జగన్నాథ రథయాత్ర,వ్యాస పూజ, శ్రీ పురుషోత్తమ మాస్, దీపోత్సవం, గోవర్ధన పూజ, శ్రీ వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి, నిత్యానంద త్రయోదశి, శ్రీ గౌర పూర్ణిమ, శ్రీరామనవమి, శ్రీ నరసింహ చతుర్దశి,ఝాలన్ ఉత్సవ్, శ్రీ బలరామ పూర్ణిమ, శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
విశాఖపట్నం ఇస్కాన్ మందిరంలో వసతి సౌకర్యం కూడా ఉంది. ఇస్కాన్ ఆశ్రమం అతిథి గృహం కూడా నిర్వహిస్తున్నారు. AC నాన్-AC గదులతో సకల సదుపాయాలతో, భోజన సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ బస చేసి విశాఖపట్నం పరిసర క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను కూడా చూసి రావచ్చు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 13 కి.మీ లోపు దూరంలో ఉన్న ఇస్కాన్ దేవాలయం చేరుకోవడానికి ఆటో రిక్షా, టాక్షీ, సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక విశాఖపట్నం ఆర్టీసి కాంప్లెక్స్ నుండి ఇస్కాన్ దేవాలయం 10 కి.మీ, విమానాశ్రయం నుండి 20 కి.మీ. దూరంలో ఉంటుంది.
ఉదయం 7:30 AM నుంచి 12:30 PM వరకు, తిరిగి సాయంత్రం 4:00 PM నుంచి 8:30 PM వరకు ఆలయంలో స్వామిని దర్శించుకోవచ్చు. దర్శనానికి ఎలాంటి రుసుము లేదు.
ఎలా వెళ్ళాలి
వాయు మార్గం ద్వారా వెళ్ళాలంటే విశాఖపట్నం వరకు వెళ్లి అక్కడి నుండి 20 కి.మీ దూరంలో ఉన్న విశాఖపట్నం ఇస్కాన్ మందిరానికి కేబ్ లలో చేరుకోవచ్చు. లేదా బస్ లలో కూడా చేరుకోవచ్చు. అక్కడినుంచి డైరెక్ట్ బస్ లు లేవు. వైజాగ్ rtc కాంప్లెక్స్, లేదా రైల్వే స్టేషన్ వరకు బస్ లో చేరుకొని అక్కడి నుంచి మరో బస్ లో ఇస్కాన్ మందిర్ కి వెళ్ళొచ్చు.
వైజాగ్ RTC కాంప్లెక్స్ నుండి ఇస్కాన్ ఆలయానికి సుమారు పది పదకొండు కి.మీ దూరం ఉంటుంది. Rtc కాంప్లెక్స్ నుంచి 900K బస్సులో ఇక్కడికి వెళ్ళొచ్చు. సుమారు ప్రతి అరగంటకో బస్సు ఉంటుంది.
రైల్వే స్టేషన్ నుండి
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి డ్రైవింగ్ దాదాపు 12.5 కి.మీ..
రైల్వే స్టేషన్ నుండి నేరుగా బస్సు అందుబాటులో లేదు. మేము కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న RTC కాంప్లెక్స్ కి వెళ్ళాలి, అక్కడి నుండి సిటీ బస్సు ఎక్కవచ్చు.
బస్సు నంబర్: 900K
బస్సుల ఫ్రీక్వెన్సీ: ప్రతి 30 నిమిషాలకు ఒకసారి
ఇవి కూడా చదవండి