శ్రీశైలంలో మారిన కొత్త నియమాలు ఇవే | Srisailam Complete Tour Guide & New Rules 2026 | Srisailam Visiting Places

Vijaya Lakshmi

Published on Jun 05 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే! ఇటీవల శ్రీశైల దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం దర్శన వేళల్లో, టికెట్ల బుకింగ్స్ లో కొన్ని ముఖ్యమైన నియమాలను మార్చారు. ఆ మారిన కొత్త నియమాలు ఏంటి? శ్రీశైలంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏంటి? వసతి (Accommodation) ఎలా పొందాలి? ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన పవిత్రమైన శ్రీశైలం దేవస్థానం గురించి పూర్తి సమాచారం, శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనం కోసం శ్రీశైలం వెళ్లే ప్రతి భక్తుడు తప్పక తప్పక తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో

శ్రీశైలంలో కొత్త నిబంధనలు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న మహా పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. శివుడు, శక్తి ఇద్దరూ ఒకే ప్రాంగణంలో కొలువైన అరుదైన, అద్భుతమైన క్షేత్రం ఇది. జ్యోతిర్లింగం, శక్తి పీఠం కలిసి ఉన్న క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. కాని జ్యోతిర్లింగం, శక్తిపీతం ఒకే ప్రాంగణంలో ఉన్న ఏకైక క్షేత్రం మాత్రం శ్రీశైలమే. ప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకుని తరిస్తుంటారు. మీలో కూడా చాలామంది ఈ మధ్య శ్రీశైలం యాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉండవచ్చు. అయితే ఒక్క విషయం. !

శ్రీశైలం క్షేత్రానికి వెళ్లేముందు తప్పకుండా ఈ వివరాలు తెలుసుకోవాలి! ఎందుకంటే, ఈమధ్య కాలంలో శ్రీశైలం దేవస్థానం దర్శనం, సేవల విషయంలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు కొన్ని కొత్త నియమాలు తీసుకొచ్చారు. ఈ మార్పుల గురించి తెలుసుకోకుండా వెళితే, మీ యాత్రలో ఇబ్బందులు పడవచ్చు. మీ ప్రయాణం సాఫీగా, సుఖంగా సాగాలంటే ఆ మార్పులు ఏమిటో, మీ యాత్రను ఎలా ప్లాన్ చేసుకోవాలో వివరంగా ఈ బ్లాగ్ లో చూద్దాం.

శ్రీశైలంలో మార్పులు ఎందుకు?

శ్రీశైలం క్షేత్రానికి నిత్యం సుదూరాల నుంచి లక్షలాదిమంది భక్తులు శ్రీశైల మల్లన్న, భ్రమరాంబాదేవి దర్శనం కోసం వస్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణా నుంచి అపరిమిత సంఖ్యలో భక్తులు వస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర పండుగల సమయంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ ఊహించలేనంతగా పెరుగుతోంది. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడటం వల్ల సామాన్య భక్తులు చాలా ఇబ్బందులు పడే పరిస్తితి. ఈ నేపథ్యంలో, భక్తులకు మెరుగైన, ప్రశాంతమైన దర్శన అనుభూతిని అందించడానికే దేవస్థానం అధికారులు కొన్ని కీలక మార్పులు చేసారు. ఇందులో భాగంగానే దర్శన వేళలు, సేవల విధానాలలో కొన్ని మార్పులు జరిగాయి.

ముందుగా దర్శనవేళలలో వచ్చిన మార్పుల గురించి చూద్దాం...

శ్రీశైలంలో ప్రధానంగా ఉచిత సర్వదర్శనం, శీఘ్రదర్శనం, స్పర్శ దర్శనం అనే మూడు ముఖ్యమైన దర్శనాలు ఉంటాయని తెలుసు కదా!

స్పర్శ దర్శనం (Touch Darshan):

భక్తులందరూ కోరుకునేది మల్లికార్జున స్వామిని స్వయంగా స్పృశించి, ఆశీస్సులు పొందడమే. అయితే, విపరీతమైన రద్దీ కారణంగా, ఈ స్పర్శ దర్శనాన్ని కొన్ని పరిమిత వేళలకు మార్చారు. సాధారణ రోజుల్లో (మంగళవారం నుండి శుక్రవారం వరకు) పరిమిత సంఖ్యలో భక్తులకు ఉచిత స్పర్శ దర్శనాన్ని అనుమతిస్తున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 1:45 నుండి 3:45 గంటల మధ్య ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఉచిత స్పర్శ దర్శనానికి కూడా ఆన్‌లైన్‌లో ముందుగానే టోకెన్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వారాంతాలు మరియు సెలవు రోజులు అంటే శని, ఆది, సోమవారాలు... ఈ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్పర్శ దర్శనం కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ టిక్కెట్‌ ధర ₹500 ఉంటుంది. ఇటీవల భక్తుల కోరిక మేరకు, వారాంతాల్లో కూడా స్పర్శ దర్శన స్లాట్లను పెంచారు. ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి త్వరగా అయిపోతాయి.

అయితే ఇక్కడొక విషయం ఖచ్చితంగా గమనించాలి. మహాశివరాత్రి, ఉగాది, దసరా బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసం, శ్రావణ మాసం వంటి పండుగల సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి,ఆ సమయంలో భక్తులందరికీ దర్శనం కల్పించడం కోసం స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తారు. కాబట్టి, మీరు పండుగ రోజుల్లో వెళుతున్నట్లయితే మాత్రం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

శీఘ్ర మరియు అతిశీఘ్ర దర్శనం

ఎక్కువసేపు క్యూలో నిలబడలేని వారి కోసం శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు అందుబాటులో ఉన్నాయి.

శీఘ్ర దర్శనం టిక్కెట్ ధర: ₹150.

అతిశీఘ్ర దర్శనం టిక్కెట్ ధర: ₹300.

ప్రత్యేక అతిశీఘ్ర దర్శనం: గర్భాలయానికి మరింత దగ్గరగా వెళ్లేందుకు ₹500 టిక్కెట్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ టిక్కెట్ల ధరలు, దర్శన సమయాలు రద్దీని బట్టి మారే అవకాశం ఉంది.

ఆర్జిత సేవలు (Arjita Sevas):

అభిషేకం, కుంకుమార్చన వంటి ఆర్జిత సేవలు చేయించుకోవాలనుకునే భక్తులు కూడా ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించే నిమిత్తం కొన్ని సామూహిక ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది.

యాత్రను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆన్‌లైన్ బుకింగ్ గైడ్

ప్రత్యేకమైన, పండుగల రోజుల్లో జరిగే కొన్ని మార్పుల నేపథ్యంలో, మీ శ్రీశైలం యాత్రను సుఖమయం చేసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఆన్‌లైన్ బుకింగ్ అని చెప్పాలి. దీనివల్ల గంటల తరబడి క్యూలలో నిలబడే శ్రమ, సమయం ఆదా అవుతాయి.

ఆన్‌లైన్ బుకింగ్ కోసం శ్రీశైలం అధికారిక వెబ్‌సైట్: `srisailadevasthanam.org`

ఈ మధ్యకాలంలో క్షేత్రాలలో, దైవ సన్నిధానంలో కూడా, మోసం, దళారుల బెడద ఎక్కువగా ఉంటోంది. కాబట్టి అలాంటి వారు చెప్పే మాటలు నమ్మకుండా యాత్రను ప్లాన్ చేసుకోండి..

1. రిజిస్ట్రేషన్: వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోండి.

2. సేవను ఎంచుకోండి: మీకు దర్శనం టిక్కెట్ కావాలా, వసతి కావాలా, లేదా ఏదైనా సేవ కావాలా అనేది ఎంచుకోండి.

3. తేదీ మరియు సమయం: అందుబాటులో ఉన్న తేదీ, టైమ్ స్లాట్‌ను జాగ్రత్తగా ఎంచుకోండి. పండుగ రోజులు లేదా వారాంతాల్లో వెళ్లాలనుకుంటే, కనీసం నెల రోజుల ముందే బుక్ చేసుకోవడం చాలా మంచిది.

4. వివరాలు నింపండి: మీ పేరు, ఆధార్ కార్డు నంబర్ వంటి వివరాలను తప్పులు లేకుండా నింపండి.

5. చెల్లింపు: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా సులభంగా పేమెంట్ చేయవచ్చు.

6. కన్ఫర్మేషన్: బుకింగ్ పూర్తయ్యాక, మీకు ఒక రసీదు వస్తుంది. దానిని ప్రింట్ తీసుకోండి లేదా మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. దర్శనానికి వెళ్ళినప్పుడు, ఈ రసీదుతో పాటు మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.

వసతి మరియు భోజన సౌకర్యాలు

వసతి (Accommodation):

దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అనేక సత్రాలు, కాటేజీలు అందుబాటులో ఉంటాయి. ఇవి తక్కువ ధరలకే లభిస్తాయి. ఉదాహరణకు, గంగా సదన్, గౌరీ సదన్ వంటివి బస్ స్టాండ్‌కు దగ్గరగా ఉంటాయి. ఈ గదులను కూడా మీరు ఆన్‌లైన్‌లోనే ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ దేవస్థానం గదులు దొరకకపోతే, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నడిచే సత్రాలలో కూడా తక్కువ ధరకే వసతి లభిస్తుంది. ఉదాహరణకు దేవాంగ సత్రం, కర్నాభత్తుల, బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ ఇలా కుల సంఘాల సత్రాలుంటాయి. అక్కడికి వెళితే వసతి దొరుకుంతుంది.

నిత్యాన్నదానం (Free Meals):

శ్రీశైలంలో ఉచిత భోజన సదుపాయం కూడా ఉంది. శ్రీశైలం దేవస్థానం ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు ఉచితంగా రుచికరమైన, శుభ్రమైన అన్నప్రసాదాన్ని అందిస్తుంది. ఆలయానికి సమీపంలోనే ఈ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది.

ఆలయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే... లేదంటే దర్శనం కూడా దొరకదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ నియమాలేంటో తెలుసుకునేముందు అసలు శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం

శ్రీశైలంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు

శ్రీశైలంలో దర్శంచవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే అన్ని ప్రదేశాలు చూడాలంటే సమయాభావం, ఓపిక కూడా అవసరం కాబట్టి తప్పనిసరిగా చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి చెప్తాను. శ్రీశైల మల్లన్న, భ్రమరాంబాదేవి దర్శనం అయిన తరువాత ఈ ప్రదేశాలను సందర్శించడం అస్సలు మర్చిపోకండి. ఈ ప్రదేశాలు చూడడానికి శ్రీశైలం ఆలయం నంది సర్కిల్ దగ్గరనుంచి, ఆ పరిసర ప్రాంతాలన్నిచోట్ల నుంచి ఆటోలు, జీపులు ఉంటాయి. వెళ్ళే ప్రదేశాలను బట్టి, మనిషికి 150 రూపాయిల నుంచి పేకేజ్ లు ఉంటాయి. మనం తీసుకెళ్ళే ప్రదేశాలు, చార్జ్ ముందే మాట్లాడుకుని వెళ్ళాలి. ఇక ఆ దర్శనీయప్రదేశాలు ఏంటో చూద్దాం.

1. **సాక్షి గణపతి ఆలయం:**

శ్రీశైలం యాత్రలో మొట్టమొదట దర్శించుకోవాల్సింది సాక్షి గణపతిని. మనం మల్లన్నను దర్శించుకున్నామని కైలాసంలో శివునికి సాక్ష్యం చెప్పేది ఈ గణపతే అని భక్తుల ప్రగాఢ నమ్మకం.

2. **పాలధార-పంచధార:**

సాక్షి గణపతి ఆలయం నుండి కొద్ది దూరంలో ఉన్న ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ శివుని నుదుటి భాగం నుండి ఉద్భవించిన జలధార, ఐదు పాయలుగా ప్రవహిస్తుందని చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే తపస్సు చేసి, శివానందలహరిని రచించారని ప్రతీతి. నిజానికి పాలధార, పంచదార అని వాడుకలో అనడం జరుగుతోంది. కాని శివుడి ఫాలము నుంచి అంటే నుదుటి నుంచి వచ్చిన జలధార కాబట్టి ఫాలధార అని, పంచ అంటే 5 ధారలుగా వస్తాయి కాబట్టి పంచధార అని అర్థం.

3. **హఠకేశ్వరం:**

ఇది కూడా ఒక పురాతన ఆలయం. ఇక్కడ ఒక అటికలో అంటే కుండ పెంకులో శివయ్య వెలిశారని, అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

4. **శిఖరేశ్వరం:**

శ్రీశైలంలో అత్యంత ఎత్తైన ప్రదేశం ఇది. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అన్న నానుడి ప్రకారం, ఈ శిఖరాన్ని దర్శించుకుంటే చాలు, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఇక్కడి నుండి చూస్తే మొత్తం శ్రీశైల క్షేత్రం, నల్లమల అడవుల అద్భుతమైన దృశ్యం కనువిందు చేస్తుంది. అయితే శిఖరాన్ని చూడడానికి కూడా ఒక పధ్ధతి ఉంది. దాని వెనక చరిత్ర ఉంది.

5. **పాతాళ గంగ:**

కృష్ణా నది ఇక్కడ పాతాళ గంగగా ప్రసిద్ధి చెందింది. ఆలయం నుండి ఇక్కడికి చేరుకోవడానికి మెట్ల మార్గంతో పాటు రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. గాలిలో తేలుతూ నల్లమల అడవుల అందాలను, డ్యామ్ బ్యాక్‌వాటర్‌ను చూడటం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇక్కడ బోటింగ్ కూడా చేయవచ్చు.

6. **శ్రీశైలం డ్యామ్:**

కృష్ణా నదిపై నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీనిని చూడటం కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

7. **చెంచు లక్ష్మి గిరిజన మ్యూజియం:**

నల్లమల అడవులలో నివసించే చెంచు గిరిజనుల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఇది మీకు ఒక విభిన్నమైన అనుభవాన్ని పంచుతుంది.

8. **నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్:**

శ్రీశైలం క్షేత్రం భారతదేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యంలో ఉంది. ప్రయాణ మార్గంలో జింకలు, నెమళ్లు వంటి వన్యప్రాణులను చూసే అవకాశం కూడా ఉంటుంది.

**యాత్రకు ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్య సూచనలు**

 **డ్రెస్ కోడ్:**

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి. పురుషులు పంచె, కండువా లేదా కుర్తా-పైజామా, మహిళలు చీర లేదా చుడీదార్ ధరించాలి. జీన్స్, షార్ట్స్ వంటి ఆధునిక దుస్తులను అనుమతించరు.

**ఘాట్ రోడ్ సమయాలు:**

ఇక  శ్రీశైలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నందున, భద్రతా కారణాల వల్ల ఘాట్ రోడ్లను సాధారణంగా రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. కాబట్టి మీ ప్రయాణాన్ని పగటిపూటనే ప్లాన్ చేసుకోండి. అయితే, మహాశివరాత్రి వంటి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల సౌకర్యార్థం ఈ నిబంధనను సడలించి, రాత్రిపూట కూడా అనుమతిస్తారు.

**నిషేధిత వస్తువులు:**

మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఆలయంలోకి ఖచ్చితంగా అనుమతించరు. ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీయడం లేదా రీల్స్ చేయడం కూడా నిషేధం. మీ వస్తువులను భద్రపరచడానికి బయట క్లాక్ రూమ్‌లు అందుబాటులో ఉంటాయి.

**ముగింపు (Conclusion)**

శ్రీశైలంలో వచ్చిన మార్పులు, మీ యాత్రను ఎలా సులభంగా ప్లాన్ చేసుకోవాలో. ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం భక్తులందరికీ ప్రశాంతమైన, దివ్యమైన దర్శన అనుభూతిని అందించడమే. కాబట్టి, ప్రయాణానికి ముందే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అన్ని వివరాలు సరిచూసుకుని, దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుంటే, మీ శ్రీశైలం మల్లన్న యాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది.



Recent Posts
తిరుమలలో జరిగిన అద్భుతం  |  అలిపిరి మెట్ల రహస్యం | shocking facts about tirumala Alipiri pathway
తిరుమలలో జరిగిన అద్భుతం | ...
సైన్స్ కే సవాల్ : పూరి గుడిలో అంతుచిక్కని 5 అద్భుతాలు | Puri Jagannath Temple Mysteries Explained  |  Science Failed?
సైన్స్ కే సవాల్ : పూరి గుడిలో...
హనుమంతుడికి కొడుకు ఉన్నాడా?  |  పంచముఖ ఆంజనేయుని అసలు రహస్యం | Mahiravana Story Telugu
హనుమంతుడికి కొడుకు ఉన్నాడా? | ...
300 ఏళ్ల రహస్యం! భీమవరం మావూళ్ళమ్మ అసలు కథ | Bhimavaram Mavullamma Temple Secrets
300 ఏళ్ల రహస్యం! భీమవరం మావూళ్ళమ్మ అసలు...
నరసింహావతారం 5 భయంకర రహస్యాలు    |    నరసింహుడి ఉగ్రరూపం వెనుక శాపం | Narasimha Avatar Mystery Telugu
నరసింహావతారం 5 భయంకర రహస్యాలు ...